గ్రౌండ్ రిపోర్ట్: అంకిత్ ఇంటి వద్ద పరిస్థితేంటి? షెహజాదీ ఇరుగుపొరుగు ఏమంటున్నారు?

  • 5 ఫిబ్రవరి 2018
అంకిత్ సక్సేనా Image copyright Ankit Saxena/FACEBOOK
చిత్రం శీర్షిక అంకిత్ సక్సేనా

''ఇక్కడ ఎన్నడూ హిందు-ముస్లిం సమస్య లేదు. ఇదంతా మీడియా సృష్టే. ఇక్కడ చాలా మంది సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు'' అంటున్నారు రఘుబీర్ నగర్ వాసులు.

గత గురువారం పశ్చిమ దిల్లీలోని రఘుబీర్ నగర్‌లో 23 ఏళ్ల అంకిత్ సక్సేనాను హత్య చేశారు. మూడేళ్లుగా అంకిత్ డేటింగ్ చేస్తున్న ఓ 20 ఏళ్ల ముస్లిం యువతి తల్లిదండ్రులు, మేనమామ, సోదరుడే ఈ హత్యకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మైనర్ అయిన ఆ బాలునితో సహా నలుగురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సంఘటన నేపథ్యంలో ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనిపై బీబీసీ ప్రతినిధులు సింధువాసిని, భూమికా రాయ్‌ల గ్రౌండ్ రిపోర్ట్...

ఆ మార్కెట్ ఎప్పటిలాగే ఎర్రని పూలతో, వాలెంటైన్ డే కు రెడీ అవుతున్న దుకాణాలతో ఆహ్వానం పలుకుతోంది. వాహనాలన్నీ కూడా ఎప్పటిలాగే పరుగులు పెడుతున్నాయి. తల్లులు తమ పిల్లలను జాగ్రత్తగా రోడ్డు దాటించి స్కూళ్లకు పంపుతున్నారు. ఆలయాలలోంచి కీర్తనలు వినిపిస్తున్నాయి.

రఘుబీర్ నగర్‌కు వెళ్లినపుడు అక్కడ మాకు కనిపించిన దృశ్యమిది. కానీ కొంచెం ముందుకు వెళ్లగానే పరిస్థితి మారింది. మైకులు, కెమెరాలు పట్టుకున్న జర్నలిస్టులను భద్రతా సిబ్బంది కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

కొంచెం ముందుకు వెళ్లగానే, 'అంకిత్ సక్సేనా దారుణహత్య', 'పరువు హత్య', 'ముస్లిం', 'మతపరమైన ఉద్రిక్తత' అన్న పదాలు మా చెవిన పడ్డాయి.

కొన్ని రోజుల క్రితం 'కత్తిపోట్ల'తో మరణించిన అంకిత్ సక్సేనా ఇక్కడివారికి సుపరిచతమే. అనేక సందులు దాటుకొని మేం అంకిత్ ఇంటికి చేరుకున్నాం. ఆ ఇంటి చుట్టూ ఉన్న దుకాణాలన్నీ మూతపడ్డాయి. కుమారుడి అంతిమ సంస్కారాల కోసం అంకిత్ తండ్రి హరిద్వార్‌కు వెళ్లగా, తల్లి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు.

చిత్రం శీర్షిక సంఘటన అనంతరం పోలీసుల బందోబస్తు

బంధువులు ఏమంటున్నారు?

అంకిత్ కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగువారు మీడియాపై ఆగ్రహంతో ఉన్నారు.

''ఇక్కడ ఎన్నడూ హిందు-ముస్లిం సమస్య లేదు. ఇదంతా మీడియా సృష్టే. ఇక్కడ చాలా మంది సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు'' అని వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

''ఒక వ్యక్తి ఇక్కడికొచ్చి, మేమంతా కలిసి మసీదు వద్దకు వెళ్లాలని, మా వెంట రావడానికి 100 మంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మేం పోలీసులను పిలుస్తాం అనేసరికి పారిపోయాడు'' అని మరో యువతి తెలిపారు.

ఇంతకూ ఎవరా వ్యక్తి?

''అతనెవరో మాకు తెలీదు. మనోజ్ తివారి (బీజేపీ దిల్లీ యూనిట్ అధ్యక్షుడు) వచ్చి వెళ్లిన వెంటనే అతను వచ్చాడు'' అని ఆ యువతి సమాధానం ఇచ్చింది.

అంకిత్ గురించి చెబుతుంటే కొంతమంది మహిళలు గద్గద స్వరంతో, ''ఆ అబ్బాయి ఎప్పుడూ నవ్వుతూ, జోకులేస్తూ ఉండేవాడు. చాలా టాలెంట్ కలిగిన కుర్రాడు'' అన్నారు.

''ఒక్కగానొక్క కొడుకు చనిపోతే అతని తల్లిదండ్రులు ఎలా జీవిస్తారు?'' అని అంకిత్ బంధువు ఒకామె రోదించారు.

చిత్రం శీర్షిక అంకిత్ ప్రేమించిన యువతి ఇల్లు.. ప్రస్తుతం దానికి తాళం వేసుంది

అంకిత్ స్నేహితులేం చెబుతున్నారు?

అంకిత్ ఇంటి వద్ద ఒక మొబైల్ షాపు ఉంది. అంకిత్ క్రమం తప్పకుండా అక్కడికి వచ్చేవాడు. ఆ షాపులో పని చేసే అబ్బాయి అంకిత్ స్నేహితుడు. అతను 'ఆవారా బాయ్స్' అనే అంకిత్ యూట్యూబ్ ఛానెల్‌లో పని చేశాడు.

ఆ షాపు యజమానికి కూడా అంకిత్ బాగా తెలుసు.

''ఆ రోజు అంకిత్ ల్యాప్ టాప్‌తో షాపు దగ్గరకు వచ్చాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో ఎడిటింగ్ చేసుకుంటూ గంటసేపు ఇక్కడే ఉన్నాడు. దాడి జరగడానికి గంట ముందు నా షాపు ముందే ఫోన్‌లో చాటింగ్ చేశాడు'' అని ఆయన తెలిపారు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజి కూడా ఆయన మాకు చూపించారు.

''ఆ యువతి రెండ్రోజుల నుంచి కనిపించడం లేదని మీడియా చెబుతోంది. కానీ అది నిజం కాదు. ఆ రోజు సాయంత్రమే ఆమె బయటకు వెళ్లింది. అయితే ఆమె సమయానికి ఇంటికి రాకపోవడంతో అతని మామయ్య, సోదరుడు అంకిత్‌ను పట్టుకున్నారు''

''షెహజాదీ కుటుంబసభ్యులు అంకిత్‌ను కొట్టడం ప్రారంభించడంతో అతని కుటుంబసభ్యులు వచ్చి సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. 'మీరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వండి' అని అంకిత్ షెహజాదీ కటుంబసభ్యులకు చెప్పాడు. కొద్ది సేపటి తర్వాత పరిస్థితి శాంతించింది. నేను అంకిత్‌ను షాపులోనికి తీసుకెళ్లాను'' అని ఆయన తెలిపారు.

చిత్రం శీర్షిక అంకిత్ ఇంటి బయట గుమికూడిన ఇరుగుపొరుగు

ఇరుగుపొరుగు చెప్పినదాన్ని బట్టి - షెహజాదీ తల్లి, తన తల్లిని తోసేసిందని ఎవరో అంకిత్‌కు చెప్పారు. అతను అక్కడికి వెళ్లి ఆమెను రక్షించేందుకు ప్రయత్నించాడు.

దీంతో అక్కడే ఉన్న యువతి మేనమామ, సోదరుడు అతని చేతుల్ని వెనకకు విరిచి పట్టుకోగా, ఆ యువతి తండ్రి అంకిత్ మెడపై కత్తితో పొడిచాడు. దీంతో అంకిత్‌కు తీవ్ర రక్తస్త్రావం జరిగింది.

ప్రస్తుతం షెహజాదీ కుటుంబసభ్యులు పోలీసు కస్టడీలో ఉండగా, ఆమెను నారీ నికేతన్‌కు పంపామని డీసీపీ (పశ్చిమ దిల్లీ) తెలిపారు.

చిత్రం శీర్షిక అంకిత్ దాడికి గురైంది ఇక్కడే

షెహజాదీ ఇరుగుపొరుగు ఏమంటున్నారు?

షెహజాదీ ఇల్లు అంకిత్ ఇంటికి దగ్గర్లోనే ఉంది. ఆమె వీధి చివరన ఉన్న భవనం మూడో అంతస్తులో ఉంటోంది. ఆమె ఇంటిపై ఆకుపచ్చ జెండా ఎగురుతోంది. ఇంటికి తాళం వేసి ఉంది.

''వాళ్లు చాలా మంచివాళ్లు. మేం కొద్ది రోజుల క్రిందటే ఇక్కడికి వచ్చాం. వాళ్లు మాకు చాలా సాయం చేశారు. అలాంటి వాళ్లు హత్య చేశారంటే నమ్మడం కష్టం'' అని ఇంటి పైభాగంలో నిలబడి ఉన్న ఓ యువతి చెప్పింది.

''అంకిత్, షెహజాదీలు ప్రేమించుకుంటున్న విషయం నిజమే. వాళ్లిద్దరూ చాలా మంచివాళ్లు. వాళ్లిద్దరికీ పెళ్లి జరిగుంటే బాగుండేది. ఈ సంఘటనతో ఇద్దరికీ నష్టం జరిగింది. ఇకపై షెహజాదీ కుటుంబాన్ని ఇక్కడ ఉండనిస్తే ప్రమాదం'' అని మరో మహిళ అన్నారు.

చిత్రం శీర్షిక యువతి ఇరుగుపొరుగు ఇప్పటికీ అంకిత్ హత్యను నమ్మలేకపోతున్నారు

మేం ఆ ప్రదేశం నుంచి తిరిగి వస్తుండగా, భవనం పైభాగాన ఉన్న ఆకుపచ్చ జెండా మా దృష్టిని ఆకర్షించింది. ఆ ఇంటి బాల్కనీకి ఉన్న తాడు మీద ఒక యువకుని కుర్తా, ఒక యువతి దుపట్టా ఆరేసి ఉన్నాయి.

వాటిని చూస్తుంటే మాకు అంకిత్ బంధువుల మాటలు గుర్తుకు వచ్చాయి, ''ఇది హిందూ-ముస్లింలకు సంబంధించిన విషయం కాదు, న్యాయాన్యాయాలకు సంబంధించిన విషయం..''

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)