దిల్లీలో మహిళలు మద్యం కొనడానికి వెళ్తే ఏమవుతుంది

  • 6 ఫిబ్రవరి 2018
మద్యం సీసా
చిత్రం శీర్షిక మహిళలకు దేశంలో చట్టపరంగా ఏదైనా కొనే అవకాశం ఉన్నా.. మద్యం కొనే విషయంలో మాత్రం ఇబ్బందికర అనుభవాలను ఎందుకు ఎదుర్కొంటున్నారు?

భారత్‌లో మాలాగే చాలా మంది మహిళలు షాపుకు వెళ్లి మద్యం కొనడం రోజువారీ షాపింగ్ అనుభవం ఏం కాదు. మహిళలకు దేశంలో చట్టపరంగా ఏదైనా కొనే అవకాశం ఉన్నా.. మద్యం కొనే విషయంలో మాత్రం ఇబ్బందికర అనుభవాలను ఎందుకు ఎదుర్కొంటున్నారు?

పొరుగు దేశం శ్రీలంకలో స్త్రీలు మద్యం కొనడం నేరంగా అక్కడి అధ్యక్షుడు ప్రకటించారు. గత నెలలో ఓ ర్యాలీలో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రసంగిస్తూ, ''అనుమతి లేకుండా మహిళలు బార్‌లో పని చేయడం, 18 ఏళ్ల పైబడిన మహిళలు మద్యం కొనడానికి అనుమతిస్తూ 60 ఏళ్లలో మొదటిసారిగా తీసుకొచ్చిన చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశించాను'' అని చెప్పారు.

చట్టం పేర్కొన్న వయసు దాటిన వారెవరైనా భారత్‌లో మద్యం కొనొచ్చు. కానీ, మహిళలు షాపుకు వెళ్లి మందు బాటిళ్లు తీసుకెళ్లడం సరదా విషయం కాదు.

దిల్లీలోని ఒక లిక్కర్ షాపులో మద్యం కొనడానికి మేం వరుసలో నిల్చోవాలని నిర్ణయించుకున్నాం. అలా చేస్తే అందరూ ఎలా చూస్తారో తెలుసుకోవాలనుకున్నాం. మొదట మేం మహిళలకు ప్రత్యేకంగా మద్యం అమ్మే ఈశాన్య దిల్లీలోని ఓ షాపుకు వెళ్లాం. మేం కొనడానికి పక్కనే ఓ జనరల్ వైన్ షాపు కూడా ఉంది. అక్కడ ప్రమోద్ కుమార్ యాదవ్ పని చేస్తున్నారు. ఈ రెండు షాపులకూ అతనే యజమాని. ఆ వైన్‌షాపులో మహిళలు కొనేందుకు వెళ్లడానికి ప్రత్యేకంగా ఓ డోర్ కూడా ఉంది.

లేడీస్ వైన్ షాపులో పని చేసేది కూడా మహిళే. అయితే, మేం వెళ్లిన రోజు ఆమె సెలవులో ఉన్నారు. దీంతో షాపు యజమాని ప్రమోద్ కుమార్ వెనుక డోర్ గుండా మా దగ్గరకు వచ్చారు. దేశంలో ఇదొక్కటే లేడీస్ వైన్ షాపు అని మాతో చెప్పారు.

ఆ షాపులో మేం కొన్ని ఖరీదైన బాటిళ్లను చూశాం. మొదటిసారి కదా! అందుకే వాటితో సెల్ఫీలు కూడా తీసుకున్నాం. తరచుగా అక్కడికి వచ్చే వారితో మాట కలిపాం. మహిళలకు ప్రత్యేకంగా వైన్‌షాప్ ఉండాలనే ఆలోచనకు తాను వ్యతిరేకం అని అప్పుడప్పుడు ఈ షాపుకు వచ్చే మహిళ అన్నారు. (ఆమె అభ్యర్థన మేరకు పేరు గోప్యంగా ఉంచాం.)

''ఇక్కడ పని చేసే మహిళకు మద్యంలో బ్రాండ్‌ల గురించి అవగాహనే లేదు. అందుకే నేను ఒక్కోసారి పురుషుల వరుసలోకి వెళ్తా. అక్కడ సిబ్బందికి మద్యం గురించి మంచి అవగాహన ఉంది. వాళ్లు నాకు సహాయం చేస్తారు'' అని ఆమె చెప్పారు.

''మహిళా ప్రత్యేక వైన్‌షాపులో మనకు సురక్షిత వాతావరణం ఉండొచ్చు. కానీ, ఇక్కడి నుంచి మద్యం బాటిళ్లను చేతిలో పట్టుకొని బయటకు వెళ్తే చాలా మంది మగాళ్ల చూపులను భరించాలి. ఇలాంటి పరిస్థితిలో ఎంతమంది మహిళలు మద్యం కొనగలరు? ధైర్యంగా వాళ్లు ఎలా తాగగలరు? మనం మహిళా ప్రత్యేక వైన్‌షాప్ పక్కన నిల్చున్నా వారి చూపులను భరించాలి. మగాళ్ల మనస్తత్వం మారే వరకు ఈ వాతావరణం మారదు. మహిళల కోసం ప్రత్యేకంగా వైన్ షాపులు పెట్టే బదులుగా సురక్షిత వాతవరణం కల్పిస్తే చాలు'' అని అన్నారు.

''మహిళల మద్యం షాపులో కొనాలంటే, మహిళలతో కలిసి వస్తేనే మంచిది'' అని ఓ స్త్రీతో ఈ షాపుకు వచ్చిన అలంఖాన్ అభిప్రాయపడ్డారు. (మహిళతో వస్తే ఈ షాపులో పురుషులకు కూడా అనుమతి ఉంది.) అతనితో వచ్చిన మహిళ కూడా ఆ మాటలతో ఏకీభవించారు.

''మద్యం తాగకుండా మహిళలను ఆపలేం. కనీసం వారికి మద్యం కొనేందుకు సురక్షిత వాతావరణం కల్పిస్తే చాలు. మద్యం తాగే మహిళ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది కాబట్టి ఇలాంటి షాపులు మరిన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది'' అని అతను అభిప్రాయపడ్డారు.

మా సంభాషణలు వింటూ అంతసేపు వేచి చూసిన ప్రమోద్ వెంటనే జోక్యం చేసుకుంటూ, ''మా షాపులో ఇప్పటి వరకు మహిళలు ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోలేదు. ఇక్కడ వాళ్లకు ఇష్టమైన మద్యాన్ని కొనే సురక్షిత వాతావరణం ఉంది'' అని చెప్పారు.

ఇక్కడ మహిళలను మద్యం తాగనిస్తారా? అని అడగ్గా.. చెప్పడానికి ఆయన కాస్త సంశయించారు. ''అలా కాదు, లేడీస్ షాపు నుంచి మద్యం కొనుక్కోవాలని వాళ్లకు చెబుతాం. జనరల్ షాపు కొనుగోళ్లతో సందడిగా ఉంటుంది. అక్కడ వరుసలో నిలబడి మహిళలు కొనడం ఎందుకు? ఇక్కడైతే సురక్షిత వాతవరణం ఉంటుంది'' అని చెప్పారు.

లేడీస్ స్పెషల్ షాపు మాత్రమే కాకుండా జనరల్ వైన్ షాపులోకి కూడా వెళ్లాలని మేం నిర్ణయించుకున్నాం. కానీ, మాతో ఉన్న స్నేహితులు (మగవారు) మాత్రం కాస్త హెచ్చరించారు. దీంతో మొదట వాళ్లు మద్యం షాపు లోపలికి వెళ్లి అక్కడ పరిస్థితి చూసి అంతా బాగానే ఉందని చెబితే మేం వెళ్లాలనుకున్నాం.

తూర్పు దిల్లీలోని మయూర్ విహార్‌లో ఉన్న ఓ చిన్న వైన్ షాపుకు మేం వెళ్లాం. అక్కడ మద్యం అమ్ముతున్న వ్యక్తి పేరు పప్పు సింగ్. ''మీ షాపులో మహిళలు మద్యం కొంటారా? '' అని అతడ్ని అడిగాం. దాంతో మేమేదో గ్రహాంతర జీవులమన్నట్లుగా మా వైపు చూశారు.

''ఇక్కడికి వాళ్లు ఎందుకు వస్తారు? వాళ్లు వచ్చే స్థలం ఇది కాదు'' అని కాస్త నిర్లిప్తంగా చెప్పారు.''అమ్మాయిలు మందు తాగుతారు కదా! వాళ్లు కొనడానికి ఇక్కడికి రారా?'' అంటూ మేం అతనిపై ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నాం.''అవును, ఈ రోజుల్లో తాగుతున్నారు కదా!'' అని సింగ్ చెప్పారు.

అయితే, వాళ్లకు మందు ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్లు మీ షాపుకు వచ్చే కొంటారా? అని అడిగాం. దీనికి అతను 'కాదు' అని చెప్పారు. ''అమ్మాయిలు దుకాణానికి రారు. అంతమాత్రాన వాళ్లు మద్యం కొనరని కాదు'' అని అన్నారు.

''సాధారణంగా వాళ్లు తమ స్నేహితులను ఇక్కడికి పంపిస్తారు. అలా కాకపోతే ఇక్కడున్న మగవాళ్లకు తమకు ఏం కావాలో చెప్పి షాపు బయట వేచి చూస్తారు'' అని పేర్కొన్నారు.

మా సంభాషణ అంతా చూస్తున్న ఓ రిక్షావాలా మధ్యలో కలగజేసుకుంటూ ''ఒక రోజు ఒకావిడ నా రిక్షాలో వచ్చారు. నాకు కొంచెం మద్యం తీసుకురా, నేను నీకు మంచి టిప్ ఇస్తా'' అని చెప్పారని తన అనుభవాన్ని వివరించారు.

అవన్నీ పాత నమ్మకాలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సర్వే ప్రకారం భారత్‌లో సుమారు ఐదు శాతం మంది మహిళలు మద్యం తాగుతున్నారు. అయితే, మద్యం సేవించే పురుషుల సంఖ్య (26 శాతం)తో పోల్చితే ఇది తక్కువే. గతకొంత కాలంగా అప్పుడప్పుడూ లేదా తరచుగా మందు తాగే మహిళల సంఖ్య బాగా పెరుగుతోంది.

మద్యం సేవించే మహిళలను పురుషులు చులకన భావంతో, లైంగికేచ్ఛతో చూడటం భారత్‌లో పురాతన కాలం నుంచి ఉంది. ''మహిళలు మద్యం సేవిస్తే పాపం చేసినట్లే. స్త్రీ అనే అర్హత కోల్పోడానికి గల ఆరు కారణాల్లో మద్యం సేవించడం ఒకటి'' అని మనుస్మృతి పేర్కొంటుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు

టర్కీలోని హయా సోఫియా చారిత్రక కట్టడాన్ని మసీదుగా మార్చేస్తారా?

రష్యా రాజ్యాంగ సవరణలకు భారీ మద్దతు... పుతిన్ 2036 దాకా కొనసాగే అవకాశం

టీచర్లు స్కూళ్లకు రావాలంటూ ఉత్తర్వులు... ఎలా సాధ్యం అంటున్న ఉపాధ్యాయ సంఘాలు

Chingari, Roposo: టిక్‌టాక్ స్థానాన్ని ఈ దేశీయ యాప్‌లు దక్కించుకుంటాయా?

కరోనావైరస్: ఫేక్ న్యూస్ వల్ల ఈ ఆరు నెలల్లో ఏమేం జరిగిందో తెలుసా...

కూరగాయలు పండించడం నేర్పుతున్న బామ్మగారు

చైనా దూకుడుకు బ్రేకులు పడ్డట్లేనా.. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న కల నెరవేరేనా

ముంబయి ఎయిర్‌పోర్ట్ కుంభకోణం కేసు: జీవీకే రెడ్డి, కుమారుడిపై సీబీఐ ఎఫ్ఐఆర్

భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దు వివాదం: భూటాన్ పేరు ఎందుకు వినిపిస్తోంది?