ప్రెస్‌రివ్యూ: ‘పకోడీలు అమ్ముకోండి.. పారిశ్రామికవేత్తలుగా ఎదగండి’ - అమిత్‌షా

  • 6 ఫిబ్రవరి 2018
అమిత్ షా, పకోడి చిత్రాల కలయిక Image copyright Getty Images/Herbar'sKitchen

'నిరుద్యోగిగా ఉండటం కన్నా పకోడీలు అమ్ముకోవడం ఉత్తమం' అని బీజేపీ జాతీయ అధ్యక్షడు అమిత్‌షా చెప్పారు. పకోడీలు అమ్మి దేశంలో బడా పారిశ్రామికవేత్తలుగా ఎదగొచ్చని తెలిపారు.

'చాయ్ అమ్మే వ్యక్తి కొడుకు ప్రధానమంత్రి అయి ఈ సభలో కూర్చున్నప్పుడు(నరేంద్రమోడీ) పకోడీలు అమ్మేవారి కొడుకులు బడా పారిశ్రామికవేత్తలు కావొచ్చు' అని అన్నారు.

పైగా పకోడీలు అమ్ముకోవడం కూడా ఉపాధి కల్పన కిందకే వస్తుందని చెప్పారు. దేశంలో నిరుద్యోగ సమస్య ఉందని అంగీకరిస్తానన్న అమిత్‌షా.. అందుకు సమాధానం కాంగ్రెస్‌ పార్టీ చెప్పాలని అన్నారు. ఈ దేశాన్ని పాలించే అవకాశం బీజేపీకి ఎనిమిది సంవత్సరాలు లభించిందని, ఈ సమస్య తమ హయాంలో ఉత్పన్నం కాలేదని చెప్పారు.

రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో సోమవారం చర్చ జరిగింది. ఈ చర్చను బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ అమిత్‌ అనిల్‌ చంద్ర షా (అమిత్‌షా) తన మొదటి ప్రసంగంతో ప్రారంభించారు. గంటా 17 నిమిషాల 36 సెకండ్ల సుధీర్ఘ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు.

స్వాతంత్య్రం అనంతరం ఒక కాంగ్రెసేతర పార్టీకి ప్రజలు పూర్తి మెజార్టీ కట్టబెట్టారని అన్నారు. అయినప్పటికీ తాము ఎన్డీయే భాగస్వామ్యపక్షాలతో ప్రభుత్వం ఏర్పాటు చేశామని చెప్పారు.

ఈ సందర్భంగా నిరుద్యోగ సమస్యపై అమిత్‌షా మాట్లాడుతూ.. నిరుద్యోగిగా ఉండటం కన్నా పకోడీలు అమ్ముకోవడం ఉత్తమం అని చెప్పారు. 'ఈ రోజు పకోడీలు అమ్ముకునే వ్యక్తి కొడుకు భవిష్యత్తులో బడా పారిశ్రామికవేత్తగా మారతాడు' అని అన్నారు. అయితే ఈ పనిని కాంగ్రెస్‌ పార్టీ నేతలు బిచ్చమెత్తుకోవడంతో పోల్చుతున్నారని ఆరోపించారు. పకోడీలు అమ్ముకోవడాన్ని సిగ్గుతో చూడాల్సిన అవసరం లేదని అన్నారని నవ తెలంగాణ పత్రిక ఒక కథనంలో పేర్కొంది.

పకోడీలు అమ్ముకోవటం కూడా ఉపాధేనని ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ విమర్శించిన నేపథ్యంలో అమిత్‌షా ఇలా ప్రసంగించారు.

Image copyright Aarogyasri-Telangana/facebook

ఆయుష్మాన్‌ భారత్‌‌ కోసం ఆరోగ్య శ్రీపై అధ్యయనం

'ఆయుష్మాన్‌ భారత్‌' అమలు సాధ్యాసాధ్యాలపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ప్రీతీ సుడాన్‌ నేతృత్వంలోని ఓ బృందం ఆదివారం హైదరాబాద్‌కు వచ్చింది.

సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో డాక్టర్‌ మనోహర్‌తో భేటీ అయ్యింది.

'ఆరోగ్యశ్రీ' ఎలా అమలవుతోంది. ఏటా ఎంత ఖర్చు పెడుతున్నారు? పథకం అమల్లో తలెత్తుతున్న సమస్యలేంటి? ఆస్పత్రుల ఎంప్యానెల్‌మెంట్‌, రోగులకు అందుతున్న శస్త్రచికిత్సల వివరాలను ఈ బృందం అడిగి తెలుసుకుంది.

కేంద్రం ఇటీవల బడ్జెట్లో ప్రకటించిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని దేశంలోని 10కోట్ల మందికి వర్తింపజేసి, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆరోగ్యబీమాను అందించాలనుకుంటోంది. ఇలాంటి పథకాన్ని ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పేరుతో అమలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 2 లక్షల వరకు ఆరోగ్యబీమా కల్పిస్తున్నారు. ఏటా రెండున్నర లక్షల సర్జరీలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏటా 700 కోట్లు ఖర్చు పెడుతోంది.

అలాగే మోదీకేర్‌ పథకాన్ని ఆరోగ్యశ్రీతో లింకప్‌ చేయడంతోపాటు, నెట్‌వర్కింగ్‌ వ్యవస్థను ఎలా చేయాలన్న దానిపై కూడా కేంద్రబృందం అధికారులతో చర్చించినట్టు తెలుస్తోంది.

మంగళవారం ఈ బృందం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డితో భేటీ కానుంది అని ఆంధ్రజ్యోతి పత్రిక పేర్కొంది.

Image copyright tsprisons/facebook

తగ్గుతున్న నేరస్థులు.. మూతపడుతున్న జైళ్లు

పదేపదే నేరాలకు పాల్పడే పాత నేరస్థుల సంఖ్య తగ్గడంతో రాష్ట్రంలోని ఐదు సబ్‌జైళ్లు మూసి వేయాలని తెలంగాణ జైళ్లశాఖ నిర్ణయించింది.

మూడు జిల్లాలలో ఉన్న ఐదు సబ్ జైళ్లలో ఇద్దరు, ముగ్గురు ఖైదీలే ఉన్నారని.. ఈ ఐదు సబ్‌జైళ్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణల వల్ల జైళ్లకు తరచుగా వచ్చే నేరస్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది.

రికార్డుల ప్రకారం.. జైళ్లల్లో 6848 మంది ఖైదీలు ఉండే సామర్థ్యం ఉండగా, ఇప్పుడు 5,348 మంది ఖైదీలు మాత్రమే మిగిలారు.

కొన్ని సబ్‌జైళ్లలో ఖైదీల సంఖ్య గణనీయంగా తగ్గడంతో వాటిని మూసివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. మూసివేతకు సిద్ధంగా ఉన్న జైళ్లల్లోని ఆ కొద్దిపాటి ఖైదీలను జిల్లా జైళ్లకు మార్చాలని భావిస్తున్నారు.

పదేపదే నేరాలకు పాల్పడి జైలుకు వచ్చేవారి ప్రవర్తనలో మార్పునకు అధికారులు అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. విద్య, ఉపాధిశిక్షణ ఇవ్వడే కాకుండా విడుదలైన తర్వాత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. దీంతో పాతనేరస్థులు నేరజీవితం నుంచి వైదొలుగుతున్నారు. నేరస్థుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పటింది.

సామాజిక కార్యక్రమాల్లోనూ వారిని భాగస్వాములను చేస్తూ.. ప్రజలతో కలిపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సంస్కరణలతో ఖైదీల మానసికస్థితి, పరివర్తనలో మార్పును తీసుకువస్తున్న జైళ్లశాఖ.. నేరాలు తగ్గించడంతోపాటు వచ్చే ఐదేండ్లలో ఖైదీల సంఖ్యను 2500కు తగించే లక్ష్యంతో ముందుకు వెళుతున్నదని నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ప్రచురించింది.

మూసివేయాలనుకున్న సబ్ జైళ్లు, వాటిలో ప్రస్తుతం ఉన్న ఖైదీలు.. ఆర్మూర్ (2), బోధన్ (2), నర్సంపేట (7), పరకాల (2), మధిర (10).

Image copyright Getty Images

‘యువత పెళ్లిలో.. తల్లిదండ్రుల జోక్యం చెల్లదు’

ఇద్దరు యుక్తవయస్కులైన యువతీ యువకుల (మేజర్ల) వివాహం సంపూర్ణంగా వారి వ్యక్తిగత విషయమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర స్పష్టం చేశారు.

వారి పెళ్లిలో జోక్యం చేసుకొనే హక్కు తల్లిదండ్రులకు, సమాజానికి, ఖాప్‌ పంచాయతీలకు, వ్యక్తులకు, వ్యక్తుల సమూహాలకు సైతం ఉండదని పేర్కొన్నారు. మేజర్ల వివాహానికి చట్టబద్ధమైన రక్షణ ఉంటుందన్నారు.

పరువు హత్యలను నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర ఈ వ్యాఖ్యలు చేశారు.

సామాజిక ధర్మ పరిరక్షకుల మాదిరిగా ఖాప్‌ పంచాయతీలు వ్యవహరించటం తగదన్నారు. ఖాప్‌ వంటి సంస్థలు వ్యక్తుల వైవాహిక విషయాల్లో జోక్యం చేసుకోవటాన్ని నిరోధించటానికి ఏమి చేయాలో నిర్ణయించేందుకు సీనియర్‌ పోలీస్‌ అధికారులతో ఉన్నతస్థాయి కమిటీ నియమిస్తామని తెలిపారు.

''ఒక వివాహాన్ని చట్టం నిషేధిస్తుందా లేక అనుమతిస్తుందా అనేది న్యాయ వ్యవస్థే తేల్చాలి. ఖాప్‌ వంటి సంస్థలు కాదు'' అని అన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్‌ ఏఎం ఖాన్వీల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సభ్యులుగా ఉన్నారు.

తామూ కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నామని, హిందూ వివాహ చట్టం ప్రకారం సన్నిహిత రక్తసంబంధీకుల మధ్య పెళ్లిళ్లు చెల్లవన్న నిబంధనలు ఉన్నాయి అంటూ ఖాప్‌ పంచాయతీ తరఫు న్యాయవాది ప్రస్తావించగా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.

''వివాహమనేది ఇద్దరు వయోజనుల మధ్య విషయం. వారి ఇష్టాయిష్టాల ప్రకారమే జరగాలి. చట్టాన్ని మీ (ఖాప్‌ పంచాయతీల) చేతుల్లోకి తీసుకోవటం తగదు. ఈ వ్యవహారంతో ఖాప్‌ పంచాయతీలకు ఎలాంటి సంబంధంలేదు'' అని స్పష్టం చేసింది.

పరువు హత్యలను నిరోధించాలంటూ శక్తివాహిని అనే సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ధర్మాసనం శుక్రవారానికి వాయిదా వేసింది.

కాగా, వయోజన (అడల్ట్‌) మహిళకు తాను ఎవరితో జీవించాలో ఆ భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హరియాణాకు సంబంధించిన ఓ కేసులో సుప్రీం ఈ తీర్పు చెప్పిందని ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)