"మతాంతర వివాహం చేసుకోవడమే మేం చేసిన తప్పా?"

  • 6 ఫిబ్రవరి 2018
సురభి చౌహాన్
చిత్రం శీర్షిక సురభి చౌహాన్

మత ఘర్షణల కారణంగా ఇటీవల వార్తల్లోకెక్కిన కాస్‌గంజ్‌లో ప్రస్తుతం మతాంతర ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట వార్తల్లో నిలిచింది.

27 ఏళ్ల ముస్లిం యువకుడు రాహత్, 20 ఏళ్ల సురభి చౌహాన్‌ - వీరిద్దరూ 2017 మార్చిలో ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఉత్తర్ ప్రదేశ్‌లోని జిల్లా కేంద్రమైన కాస్‌గంజ్‌లో జనవరి 26న జరిగిన చందన్ గుప్తా హత్య ఘటన, కొనసాగిన అల్లర్ల నేపథ్యంలో ఈ జంట ఇబ్బందుల్లో పడింది.

రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా చెలరేగిన అల్లర్లలో చందన్ గుప్తాను కొందరు హత్య చేసిన విషయం తెలిసిందే.

ఆ ఘటనతో సంబంధం ఉందన్న ఆరోపణతో సురభి భర్త రాహత్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

అయితే, తన భర్తకు ఆ అల్లర్లతో సంబంధం లేదని, పోలీసులు అతన్ని అకారణంగా అరెస్టు చేశారని సురభి అంటున్నారు. "హిందువునైన నన్ను పెళ్లి చేసుకోవడమే నా భర్త రాహత్ చేసిన పాపం" అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిత్రం శీర్షిక తన భర్త రాహత్‌తో సురభి చౌహాన్

సురభి చౌహాన్.. 'అగ్ర' వర్ణ ఠాకూర్ కులానికి చెందిన మహిళ. కాలేజీ రోజుల్లోనే రాహత్‌తో సురభికి పరిచయం ఏర్పడింది. రాహత్ డ్రైవర్‌గా పని చేస్తుండేవారు. ఆయన తండ్రి కూడా ఓ డ్రైవరే.

ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిన రోజులను సురభి నెమరు వేసుకున్నారు. అప్పుడు ఆమె గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు.

''జనవరి 26న రాహత్‌తో కలిసి ఇంట్లో వార్తలు చూస్తున్నా. బలీరామ్ గేట్ వద్ద అల్లర్లు జరుగుతున్నాయని టీవీలో చెబుతున్నారు. ఆ సమయంలోనే రాహత్‌కు ఫోన్లు వచ్చాయి. తనను కూడా అక్కడికి రావాలని కొందరు ఫోన్లో పిలిచారు. తాను అక్కడకు వెళ్లకుండా నేను ఆపాను" ఆమె వివరించారు.

''మరుసటి రోజు ఉదయమే.. మేం అలీగఢ్ బయల్దేరాం. కానీ దారి మధ్యలోనే పోలీసులు మమ్మల్ని ఆపేశారు. నా భర్తను విడిచిపెట్టాలని ఎంతగానో వేడుకున్నా. కానీ వాళ్లు వినలేదు. నీకు పెళ్లి చేసుకోవడానికి నీ కులంలో ఇంకెవ్వరూ దొరకలేదా? అని ప్రశ్నించారు. నన్ను మతం మార్చుకోవాలని రాహత్ ఎప్పుడూ కోరలేదని చెప్పేందుకు ప్రయత్నించా.''

''పోలీసులు నా భర్త పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఎంత ఏడ్చినా వదల్లేదు. అసలైన నిందితులను పట్టుకోలేక రాహత్ లాంటి అమాయకులను అరెస్టు చేస్తున్నారు. నా భర్తను వెంటనే విడిచిపెట్టాలి. అతని తప్పేమైనా ఉంటే అది నన్ను పెళ్లి చేసుకోవడమే..!''

చిత్రం శీర్షిక రాహత్

"మతం మార్చుకోవాలని నాపై ఒత్తిడి చేయలేదు"

''మా పెళ్లిని మా ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. ఎప్పటికీ ఒప్పుకోలేరు కూడా. నా తల్లిదండ్రులు మాతో మాట్లాడరు. మా సంసారంలో జోక్యం చేసుకోరు కూడా. మాతో వారికి ఏ సంబంధమూ లేదు'' అని ఆమె చెప్పారు.

రాహత్‌తో పోలీసులు దురుసుగా ప్రవర్తించి వుంటే.. వారిపై సురభి ఫిర్యాదు చేయాలని కాస్‌గంజ్ ఎస్పీ పియూష్ శ్రీవాస్తవ అన్నారు.

"ఆమె ఫిర్యాదు చేస్తే.. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. దర్యాప్తు పూర్తయితేనే రాహత్ దోషి అవునో, కాదో తేలుతుంది'' అని ఎస్పీ అన్నారు.

చిత్రం శీర్షిక కాస్‌గంజ్ ఎస్పీ పీయూష్ శ్రీవాస్తవ

''మా ఇంట్లో హిందూ దేవతల ఫోటోలుంటాయి. నేను వాటిని పూజిస్తాను. హిందూ పండగల్లో రాహత్ నాతో పాటు పాల్గొంటాడు. అలాగే నమాజ్ కూడా చేస్తాడు''

సురభి అత్తమామలు కూడా ఇదే విషయం చెప్పారు. ''మేం సురభిని మతం మారమని ఎప్పుడూ అడగలేదు'' అని రాహత్ తండ్రి జాఫర్ కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నారు.

కానీ సురభి పెళ్లి సర్టిఫికేట్‌లో ఆమె పేరు హ్యూమా సురభి చౌహాన్ అనే రాసుంది.

''మా పెళ్లి ఆర్యసమాజ్‌లో జరిగేలా రాహత్ ప్రయత్నించాడు. కానీ అది వీలు పడలేదు. అందుకే.. నేను హ్యూమాను నా పేరు ముందు జోడించుకుని ఇద్దరం నిఖా చేసుకున్నాం. నేను పేరు మాత్రమే మార్చుకున్నాను. మతాన్ని కాదు'' అని సురభి వివరించారు.

చిత్రం శీర్షిక అత్తా మామలతో సురభి

రాహత్ లేకుండా సురభి పరిస్థితి ఏంటి?

"ముస్లిముల గురించి నాకు చాలామంది చాలా రకాలుగా చెప్పేవారు. ముస్లింలలో బహుభార్యాత్వం ఎక్కువ అని నేను విన్నాను. కానీ నా భర్తకు నేనంటే చాలా ఇష్టం. నన్ను ఎంతగానో ప్రేమిస్తాడు'' అని సురభి అంటున్నారు.

సురభి విషయంలో ఆమె అత్త కూడా బాధ పడుతున్నారు.

''ఇప్పుడు సురభి ఎక్కడికి వెళుతుంది? తల్లిదండ్రులు ఎప్పుడూ ఆమెను చేరదీయరు. రాహత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ముస్లిం మతం తీసుకోలేదు కాబట్టి.. వీరిద్దరూ విడిగానే జీవిస్తున్నారు. ఒంటరిగా ఉండొద్దని, మాతో పాటు వచ్చేయమని ఆమెను అడుగుతున్నాం'' అని ఆమె అత్త రేష్మ చెబుతున్నారు.

చిత్రం శీర్షిక సురభి

సురభికి ఊరట లభిస్తుందా?

మేం సురభి ఇంట్లో ఉన్నపుడు చుట్టుపక్కల వాళ్లు ఇంటి బయట గుమిగూడారు.

వీరు కొత్తగా పెళ్లి చేసుకున్నపుడు లవ్ జిహాద్ పేరిట కొన్ని బెదిరింపులొచ్చాయి. కానీ ఏమీ జరగలేదు.

ఉత్తర్‌ప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో లవ్ జిహాద్ అంశాన్ని పెద్ద ఇష్యూ చేసేందుకు అధికార బీజేపీ ప్రయత్నించింది.

సురభి, రాహత్‌ల ప్రేమే వారికి తమకెదురయ్యే కష్టాలను అధిగమించేందుకు వారికి బలాన్ని ఇచ్చింది.

తన కొడుకు కేసులో న్యాయం కోసం ఎదురు చూస్తోన్న చందన్ గుప్తా తండ్రి లాగానే.. సురభి కూడా తన భర్త కోసం ఎదురు చూస్తున్నారు.

అసలు దోషులకు శిక్ష పడాలని, తాము మళ్లీ సాధారణ జీవితాన్ని గడపే పరిస్థితులు రావాలని సురభి కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)