అమ్మమ్మలూ, రాక్షసులు, అత్తయ్యల పాత్రల్లో లావుగా ఉన్నవాళ్లే ఎందుకు?

  • 7 ఫిబ్రవరి 2018
అనురాధ
చిత్రం శీర్షిక అనురాధ

'20ఏళ్ల నుంచి స్టేజీ షోల్లో నటిస్తున్నా. నాకెప్పుడూ అమ్మమ్మలూ, రాక్షసులు, అత్తయ్యల లాంటి పాత్రలే ఇస్తారు తప్ప ప్రాధాన్యమున్న పాత్రలు ఇవ్వరు. నేను లావుగా ఉండటమే దానికి కారణం’ అంటారు అనురాధ.

బెంగళూరులోని ‘బిగ్ ఫ్యాట్ కంపెనీ’ అనే సంస్థను ఆమె నెలకొల్పారు. కేవలం లావుగా ఉన్నవాళ్లనే ఎంపిక చేసుకొని వారితో స్టేజీ షోలను ప్రదర్శించే సంస్థ అది.

లావుగా ఉండటం వల్ల స్టేజీ షోలతో పాటు అనేక ఇతర సందర్భాల్లోనూ వివక్షకు గురైనట్లు ఆమె చెబుతారు. అందుకే తన లాంటి వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఆమె బీఎఫ్‌సీని మొదలుపెట్టారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionలావుగా ఉంటే నటనకు పనికిరామా?

గిరీష్ కర్నాడ్ రాసిన హాయవదన నాటకాన్ని వీళ్లు మొదట ప్రదర్శించనున్నారు.

‘గత ఇరవై ఏళ్లుగా స్టేజీ షోల్లో నాకు అత్తయ్య, రాక్షసి, పనిమనిషి లాంటి పాత్రలే దక్కాయి. లావుగా ఉండటంతో ప్రాధాన్యమున్న పాత్రలు ఎప్పుడూ రాలేదు.

ఆ వివక్షను దూరం చేసేందుకు బిగ్ ఫ్యాట్ కంపెనీని నెలకొల్పా. ఇందులో అందరూ ప్లస్ సైజ్ నటులే ఉంటారు.

లావుగా ఉండే నటులు దొరకడం అంత సులభం కాదు. చాలామంది వ్యక్తులు తాము లావుగా ఉన్నామని అనిపించుకోవడానికి ఇష్టపడరు. మరి కొందరు నిత్యం సన్నబడడానికి ప్రయత్నిస్తుంటారు.

అందుకే తమకు తాముగా ప్లస్ సైజ్ వ్యక్తులు నటించేందుకు ముందుకు రావడానికి కాస్త ఆలస్యమైంది’ అని తన సంస్థ వెనక ఉన్న కథను అనురాధ వివరిస్తారు.

‘అందరికీ అవే ఎముకలు, నరాలు ఉంటాయి. కానీ కేవలం లావుగా ఉన్న కారణంగా మాలాంటి వాళ్లను భిన్నంగా చూస్తారు. ఇక్కడికి వచ్చాక నా ఆత్మవిశ్వాసంతో పాటు నటన పైన ఆసక్తి పెరిగింది’ అంటారు షరున్. బీఎఫ్‌సీ నాటక బృందంలో షరున్ ఒకరు.

బీఎఫ్‌సీని నెలకొల్పేందుకు అనురాధ క్రౌడ్ ఫండింగ్ మార్గాన్ని ఎంచుకున్నారు. కానీ అది ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు.

‘లావుగా ఉండటం మా తప్పనీ, దానికి తామెందుకు సాయం చేయాలనీ చాలామంది భావిస్తారు. అందుకే క్రౌడ్ ఫండింగ్‌ ద్వారా ఎక్కువ డబ్బు రాలేదు’ అంటారామె.

అయినా వీళ్లు అధైర్యపడలేదు.

‘మాకు మేమే అవకాశాలు కల్పించుకుంటాం. అనేక విషయాల్లో మాపై చూపే వివక్షను మేం సవాల్ చేస్తాం. స్టేజీపైన మాలాంటి వాళ్లు నటిస్తే చూడటం ఓ కొత్త అనుభూతిని పంచుతుంది’ అని చెబుతారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు