సోషల్: 2019 ఎన్నికల తర్వాత మీ పని కూడా ‘పకోడీలు అమ్ముకోవటమే’!

  • 6 ఫిబ్రవరి 2018
అమిత్ షా, పకోడి చిత్రాల కలయిక Image copyright Getty Images/Herbar'sKitchen

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అమిత్ షా పార్లమెంటులో సోమవారంనాడు తొలిసారిగా మాట్లాడారు. ఆయన తన ప్రసంగంలో భాగంగా... "నిరుద్యోగిగా ఉండటం కన్నా పకోడీలు అమ్ముకోవడం ఉత్తమం. పకోడీలు అమ్మి దేశంలో బడా పారిశ్రామికవేత్తలుగా ఎదగొచ్చు" అని వ్యాఖ్యానించారు.

"చాయ్ అమ్ముకునే వ్యక్తి కుమారుడు ప్రధాని కాకూడదా" అంటూ నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా అన్ని మీడియాల్లో పతాక శీర్షికలయ్యాయి.

ఇప్పుడు మళ్లీ అమిత్ షా... "చాయ్ అమ్మే వ్యక్తి కొడుకు ప్రధాని అయి ఈ సభలో కూర్చున్నప్పుడు పకోడీలు అమ్మేవారి కొడుకులు బడా పారిశ్రామికవేత్తలు కావచ్చు" అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలపై బీబీసీ న్యూస్ తెలుగు సోషల్ ప్లాట్‌ఫాంలపై యూజర్లు ఫన్నీగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

"చాయ్ వాలా ప్రధానమంత్రి అంటే గొప్ప విషయం, అలాగని అందరినీ చాయ్ అమ్ముకోమనటం సరికాదు. నిన్ను గెలిపించింది దీనికా" అని ప్రశ్నించారు గడ్డం ఆనంద్ బాబు.

"అవును మరి, ప్రైమ్ మినిస్టర్ టీ అమ్ముకునేవాడు అయితే ఎలా ఆలోచిస్తాడు, ఇలానే కదా. టీ కొట్టు పెట్టుకోండి, పకోడీలు అమ్ముకోండి" అని కామెంట్ చేశారు లీరిష్ సుధాకర్ పార్ల అనే ఓ ఫేస్‌బుక్ యూజర్.

"2019 ఎన్నికల తర్వాత మీరు చేయాల్సిన పని అదే" అని అభిషేక్ అభి పోస్ట్ చేశారు.

"పకోడీలు అమ్ముకుంటేనే 16000శాతం లాభం వస్తుందా, మీ అబ్బాయికి అలానే వచ్చిందా" అని జైషా ఆస్తులపై వివాదాన్ని ఉద్దేశిస్తూ ప్రశ్నించారు మోహన్ మైనేని.

"ఇలాంటి వారి వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదు. వంటింట్లో పకోడీలు వేసుకోమనండి" అని రామ్‌ప్రసాద్‌పీఎస్‌పీకే అనే ట్విటర్ యూజర్ స్పందించారు.

"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువగా చూసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తే, ఇతర రాష్ట్రాల కంటే తక్కువగా చూస్తూ అవహేళన చేస్తున్నారు. దీనికి తగిన ఫలితం వచ్చే 2019 ఎన్నికల్లో చవిచూడాల్సి ఉంటుంది" అని వాసు కంచుబోయిన ఫేస్‌బుక్‌లో విమర్శించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)