#DreamGirls: మంచైనా.. చెడైనా.. సమాజంలో ఉన్నట్లే చిత్ర పరిశ్రమలోనూ- నందినీ రెడ్డి
సమాజం ఉన్నట్లే చిత్ర పరిశ్రమ ఉందని ప్రముఖ డైరెక్టర్ నందినీ రెడ్డి బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంటి చుట్టుపక్కల మొదలుకొని పాఠశాల వరకు మహిళలతో ఎంత మంచిగా వ్యవహరిస్తారో సినీ పరిశ్రమలోనూ అంతే మంచిగా మెలుగుతారని, అలాగే బయట ఎంత చెడుగా ప్రవర్తిస్తారో ఇక్కడా అంతే చెడుగా ప్రవర్తిస్తారని ఆమె తెలిపారు.
బీబీసీ: డైరెక్టర్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు?
నందిని: నాకు దర్శకత్వం అంటే ఆసక్తి. డైరెక్టర్ అవుతానంటే ఇంటావంటా లేని పనులు చేయడమేమిటని చుట్టాలు అడిగారు. కానీ మా అమ్మ నా కంటే చాలా ధైర్యవంతురాలు. తను నా ఆలోచనకు మద్దతిచ్చారు. తర్వాత పెద్దగా ఇబ్బందులేమీ ఎదురుకాలేదు.
మీకు వృత్తిలో సాధారణంగా ఎదురయ్యే సవాళ్లు ఏమిటి?
''ఈ అమ్మాయి కథ బానే రాసింది.. సినిమా తీయగలదా? తీస్తే హిట్ అవుతుందా? వాణిజ్యపరంగా విజయం సాధిస్తుందా? హీరో 'హీరోయిజం' చూపించగలరా-'' ఇలాంటి సందేహాలు అవతలివాళ్లలో ఉంటాయి.
సినీ పరిశ్రమలో మహిళలకు ఎలాంటి గౌరవం లభిస్తోంది?
మీ ఇంటి పక్కన, కిరాణా కొట్టు దగ్గర, పక్కింట్లో, కార్యాలయంలో, పిల్లల పాఠశాలలో ఎలా వ్యవహరిస్తారో ఇక్కడ కూడా అలాగే వ్యవహరిస్తారు. అక్కడ ఎంత మంచిగా వ్యవహరిస్తారో, ఇక్కడా అంతే మంచిగా వ్యవహరిస్తారు. అక్కడ ఎంత చెడుగా వ్యవహరిస్తారో, ఇక్కడా అంతే చెడుగా వ్యవహరిస్తారు. సినీ పరిశ్రమ సమాజం నుంచి భిన్నంగా ఏమీ లేదు. సమాజంలో భాగమే ఇది కూడా.
సాధారణంగా మహిళలు 'దర్శకత్వం' ఎంచుకోరు.. మీరు కొత్త ఒరవడిని సృష్టిస్తున్నట్లు అనిపించిందా?
ఇప్పుడు ఆలోచిస్తే కొత్త ఒరవడి అనిపిస్తుంది. కానీ చిత్ర పరిశ్రమకు వచ్చిన కొత్తలో అమ్మాయిలు ఎవరూ లేరని నాకు పెద్దగా తెలియదు. నేను రావడమన్నది తెలియకుండా చేసిన ధైర్యం. రాను రాను తెలిసింది. ఇప్పుడు అలవాటు అయిపోయింది.
మీరు దర్శకత్వం వహించిన సినిమాల్లో మీకు చాలా ఇష్టమైన సినిమా ఏది? ఎందుకు?
నా సినిమాల్లో నాకు చాలా ఇష్టమైనది- 'అలా మొదలైంది'. ఈ సినిమా తీయడానికి రెండేళ్లు చాలా కష్టపడ్డాం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఒక థియేటర్లో ప్రేక్షకుల స్పందన, ప్రేమ, ఆదరణ చూశాక, నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ క్షణంలో నాకు చాలా ఉద్వేగంగా అనిపించింది.
సినీ పరిశ్రమలో మహిళలను ఎలా చూడాలని మీరు అనుకుంటున్నారు?
'మనం ఎదుటి వాళ్లకు ఎంత మర్యాద ఇస్తే అవతలి వాళ్ళు అంతే మర్యాద ఇస్తారు' అని నమ్ముతాను.
మన ఇళ్లల్లో కూడా ఒక తాత బాగుంటారు, ఒక బాబాయి చిరాకుగా ఉంటారు, ఒక మామయ్య స్నేహంగా ఉంటాడు, ఒక అత్త కసురుతుంది. అలాగే బయట కూడా ఉంటారు. కొంత మంది చిరాకుగా ఉండే బాబాయిలు ఉంటారు. వాళ్ల గురించి నేను పట్టించుకోను. ప్రతి రంగమూ ఎంత సురక్షితమో, సినీ రంగం కూడా అంతే సురక్షితం. ఎంత సురక్షితం కాదో అంతే సురక్షితం కాదు.
నేను బయటకు వెళ్లేటప్పుడు ఎక్కడికి వెళుతున్నదీ ఇంట్లో వివరంగా చెబుతాను. నా జాగ్రత్తలో నేను ఉంటాను. హోటల్ రూమ్‌లో కాకుండా కాఫీ షాప్‌లో కలుస్తాను. 'నేను డైరెక్టర్' అని ప్రత్యేక జాగ్రత్తలు ఏమీ తీసుకోవడం లేదు. డాక్టర్ లేదా టీచర్ అయ్యుంటే లేదా గృహిణిగా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొనేదాన్నో ఇప్పుడూ అలాంటి జాగ్రత్తలే తీసుకొంటున్నా.
సినీ పరిశ్రమలో పని చేయడానికి ఎక్కువ మంది మహిళలు రావాలంటారా?
ఔను, మహిళలు రావాలి. వారు మరింత మంది సినీ పరిశ్రమలోకి వస్తే భిన్నమైన కథలు సినిమాలుగా తీసే వీలుంటుంది. మన అమ్మ, అమ్మమ్మ, పిన్ని - వీళ్ళే కదా.. చిన్నప్పటి నుంచి ఇంట్లో కథలు చెబుతుంటారు. మొదటి కథకులు మహిళలే. అలాంటి మహిళలే వచ్చి సినిమా తీస్తే తప్పకుండా బాగుంటుంది.
అమ్మాయిలను సినీ రంగంలోకి వచ్చేలా ప్రోత్సహించేందుకు ఏం చేయాలి?
పని వాతావరణం మెరుగుపడాలి. అమ్మాయిలతో మాట్లాడే విధానం, ప్రవర్తించే విధానం, వారి భద్రత పరంగా ఒక సున్నితమైన సంస్కృతి చిత్ర పరిశ్రమలో వస్తే బాగుంటుంది. ఎక్కువ మంది మహిళలు ఈ రంగంలోకి వస్తే వారితో ప్రవర్తించే తీరు దానంతటదే మెరుగుపడుతుంది.
(ఈ కథనం ప్రొడ్యూసర్: ప్రతీక్షా గీల్డియాల్; రిపోర్టింగ్: సంగీతం ప్రభాకర్; షూట్ ఎడిట్: నవీన్ కుమార్.)
ఇవి కూడా చదవండి:
- అనుపమా పరమేశ్వరన్ : కాలేజీ రోజుల్లో నన్నూ వేధించారు
- అభిప్రాయం: మహిళలతో బాలీవుడ్ బంధం ఎలాంటిది?
- #BollywoodSexism: బాలీవుడ్, టాలీవుడ్‌లలో లైంగిక వేధింపులపై కథనాలు
- #HerChoice: మహిళలు తమకు నచ్చినట్లు ఉంటే ఏం జరుగుతుంది?
- #HerChoice: 'తమ ప్రేమ వ్యవహారాల కోసం అమ్మా నాన్నా నన్నొదిలేశారు'
- ‘వ్యభిచారంలోకి మమ్మల్నిలా తోసేసినారు..’
- అభిప్రాయం: మహిళలతో బాలీవుడ్ బంధం ఎలాంటిది?
- పోర్న్ స్టార్ మియా మాల్కోవా సన్నీ లియోనిని మించి పోతారా!
- సల్మా హయెక్: ఒప్పుకోకపోతే చంపేస్తానన్నాడు!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)