ప్రెస్‌రివ్యూ: కేంద్ర బడ్జెట్లో జరిగిన 'అన్యాయానికి' నిరసనగా రేపు ఏపీ బంద్‌!!

  • 7 ఫిబ్రవరి 2018
రాష్ట్ర బంద్ పోస్టర్ Image copyright ramakrishna.cpi/facebook

రేపు ఏపీ బంద్‌!!

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన ‘అన్యాయానికి’ వ్యతిరేకంగా ఈ నెల 8వ తేదీన నిర్వహించే రాష్ట్ర బంద్‌కు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి.

ఇప్పటికే వైసిపి, కాంగ్రెస్‌, పలు ప్రజాసంఘాలు ఈ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయని ప్రజాశక్తి ఒక కథనం ప్రచురించింది.

కాగా, శాంతి భద్రతలకు సంబంధించి డిజిపి మాలకొండయ్యతో పాటు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు.

బంద్‌ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘట నలూ జరగకుండా చర్యలు తీసుకోవాలని సిఎం అధికారులను ఆదేశించారు.

బంద్‌కు పిలుపు నిచ్చిన పార్టీలన్నీ ఢిల్లీలో తమ డిమాండ్లను విని పించాలని, రాష్ట్రంలో ఎటువంటి విఘాతం కలి గించవద్దని చంద్రబాబు కోరారు.

రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వం రాజీ లేకుండా అన్ని ప్రయత్నాలూ చేస్తుందని తెలిపారని మరొక కథనంలో ప్రజాశక్తి వివరించింది.

బంగారు ఆభరణాలు ధరించిన యువతి Image copyright Getty Images

భారతీయులకు బంగారం పట్ల ఉన్న మక్కువ అంతకంతకూ పెరిగిపోతోంది. 2017లో దేశీయంగా వినియోగం 9 శాతం పెరిగి 727 టన్నులుగా నమోదైంది. కానీ, అంతర్జాతీయంగా మాత్రం డిమాండ్‌ 7 శాతం పడిపోయింది.

ఈ గణాంకాలను వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) మంగళవారం విడుదల చేసింది. 2016లో దేశీయ బంగారం డిమాండ్‌ 666.1 టన్నులుగానే ఉంది. ''2017లో డిమాండ్‌ ప్రధానంగా ఆభరణాల వల్లే పెరిగింది. నూతన పన్ను చట్టం జీఎస్టీ స్థిరపడటం, స్టాక్‌ మార్కెట్ల ర్యాలీ, జీడీపీ వృద్ధి ఇవన్నీ కలసి వినియోగదారుల సెంటిమెంట్‌ను మెరుగు పరిచాయి''అని డబ్ల్యూజీసీ ఎండీ (భారత విభాగం) సోమసుందరం పీఆర్‌ తెలిపారు.

ఆభరణాల కొనుగోళ్లకు యాంటీమనీ లాండరింగ్‌ చట్టాన్ని తొలగించడం కూడా డిమాండ్‌ పెరగడానికి దోహదపడినట్టు చెప్పారు. 2016లో ఆభరణాల డిమాండ్‌ 504.5 టన్నులుగా ఉండగా, 2017లో ఇది 12 శాతం పెరిగి 562.7 టన్నులకు చేరింది. విలువ పరంగా చూస్తే గతేడాది ఆభరణాల డిమాండ్‌ 9 శాతం వృద్ధితో రూ.1,48,100 కోట్లకు చేరింది. పెట్టుబడుల డిమాండ్‌ మాత్రం 2016లో 161.6 టన్నులు కాగా, 2017లో ఇది 164.2 టన్నులుగా నమోదైంది.

రానున్న రెండేళ్ల కాలంలో కాయిన్ల వృద్ధి అధికంగా ఉంటుందని సోమసుందరం పేర్కొన్నారు. 2018లో డిమాండ్‌ విషయంలో తాము ఆశాభావంతో ఉన్నామని, 700-800 టన్నుల మధ్య ఉండొచ్చన్నారు. ఇక దిగుమతుల పరంగా చూస్తే 2017లో 888 టన్నుల బంగారం దిగుమతి అయింది. 2016లో ఉన్న 558 టన్నుల కంటే ఇది 59 శాతం అధికం.

అంతర్జాతీయంగా ప్రతికూలత

అంతర్జాతీయంగా చూస్తే 2017లో బంగారం వినియోగం గతేడాది 7 శాతం క్షీణతతో 4,071.7 టన్నులకు పరిమితమైంది. ఈటీఎఫ్‌ల్లోకి తక్కువ పెట్టుబడులు రావడమే కారణంగా డబ్ల్యూజీసీ తన నివేదికలో పేర్కొంది. 2016లో డిమాండ్‌ 4,362 టన్నులుగా ఉండటం గమనార్హం అని సాక్షి ఒక కథనం ప్రచురించింది.

Image copyright TDP.Official/facebook

పార్లమెంటులో పోరాటం కొనసాగించాలా? వద్దా?

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంటు వేదికగా నిరసన తెలపాలని పార్టీ నిర్ణయించిన తర్వాత కూడా తొలి రోజు ఎంపీలు తగిన విధంగా స్పందించకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంలో ఏడుగురు ఎంపీలే పాల్గొన్నారని, మిగతావారంతా ఏమయ్యారని మండిపడ్డారని ఈనాడు ఒక కథనంలో పేర్కొంది.

ఆదివారం పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి సుజనా చౌదరి విలేఖరులతో మాట్లాడుతూ... ఇది రొటీన్‌ సమావేశమే అన్నట్టుగా మాట్లాడటంపైనా ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ''ఒకపక్క ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మన పోరాట విధానం ఎలా ఉండాలో నిర్ణయించుకోడానికి పెట్టిన సమావేశం అది. ఎంతో సీరియస్‌ సమావేశాన్ని, రొటీన్‌ అని చెప్పడమేంటి? ప్రజలేమనుకుంటారు?'' అని వ్యాఖ్యానించారు.

మంగళవారం ఉదయం ఉండవల్లిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన పార్టీ సమన్వయ సమావేశం జరిగింది. ఇందులో.. రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌లపై కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలేమైనా ఇస్తే... పార్లమెంటులో పోరాటం కొనసాగించాలా? వద్దా? అన్న అంశంపై చర్చ జరిగింది. కేంద్రం సానుకూలంగా స్పందించి, స్పష్టమైన హామీ ఇచ్చినట్లైతే పోరాటానికి కొంత విరామం ఇవ్వాలన్న అభిప్రాయం వ్యక్తమైంది.

ఇప్పటికీ చూస్తాం, చేస్తామనే అంటున్నారు..!

మంగళవారం ఉదయం సుజనా చౌదరిని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ చర్చలకు పిలిచినా ఆయన వెళ్లలేదని, వెళ్లకపోవడమే మంచిదనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ప్రధాని నరేంద్ర మోదీతో తన చర్చల సారాంశాన్ని సమావేశం జరుగుతున్నప్పుడే సుజనా చౌదరి ఫోన్‌లో ముఖ్యమంత్రికి వివరించారు.

అన్నింటికీ ఇప్పటికీ చూస్తాం, చేస్తామని అంటున్నారే తప్ప... నిర్దిష్టమైన హామీ ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు.

Image copyright jayadev.galla/facebook

అసహాయ పోరు

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారంటూ మిత్రపక్షమైన తెలుగుదేశం ఎంపీలు మూకుమ్మడిగా సభామధ్యంలోకి వచ్చి నినదించారు. దీంతో లోక్‌సభ కార్యకలాపాలు వేడెక్కాయి. మరో పక్క నలుగురు వైకాపా ఎంపీలు సైతం ప్రత్యేక హోదా కావాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన కొనసాగించారు.

స్పందనగా అరుణ్‌జైట్లీ పార్లమెంటు ఉభయసభల్లో ఆంధ్రప్రదేశ్‌కు సాయంపై ప్రత్యేక ప్రకటన చేశారు. ఇదివరకు తాము చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని, కేంద్ర ప్రభుత్వం వివిధ స్థాయుల్లో ఆ రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నింటినీ కచ్చితంగా అమలుచేస్తామని పునరుద్ఘాటించారు

ప్రత్యేక ప్యాకేజీ కింద ప్రకటించిన ఈఏపీ రుణాలు రావడానికి ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున ఆ మొత్తాన్ని నాబార్డు నుంచి ఇప్పించాలని జనవరి 3న ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు లేఖరాశారని, దానిపై కసరత్తు చేస్తున్నామని ప్రకటించారు. ప్రత్యేకహోదాకు సమానమైన మొత్తాన్నే ప్యాకేజీ కింద ఇస్తామని చెప్పామని, అందులో రెండోమాటకు తావులేదన్నారు.

ప్రత్యేక ప్యాకేజీ కింద చెప్పిన మొత్తాన్ని ఈఏపీకి బదులు నాబార్డు నుంచి అందించమని రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిన నేపథ్యంలో దాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎఫ్‌ఆర్‌బీఎం కిందికి రాకుండా ఎలా అందించాలన్నదానిపై ప్రస్తుతం కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది.

కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి నలుగురు సభ్యుల బృందం దిల్లీ వెళ్లింది అని ఈనాడు మరొక కథనంలో తెలిపింది.

Image copyright galimuddukrishnama/facebook

విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఉపాధ్యాయుడు

మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు (71) మంగళవారం అర్థరాత్రి కన్నుమూశారు.

రెండ్రోజులుగా జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రాణాలు నిలిపేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో చివరికి ఆయన తనువుచాలించారు.

ప్రస్తుతం తిరుపతిలోని పద్మావతిపురంలో ఉంటున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నాయకునిగా పలు పదవులు చేపట్టారు.

గాలి ముద్దుకృష్ణమనాయుడు నేపథ్యం:

ముద్దుకృష్ణమ నాయుడు 1947 జూన్‌ 9న చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలో జి.రామానాయుడు, రాజమ్మ దంపతులకు జన్మించారు.

విద్యాభ్యాసం తర్వాత అధ్యాపక వృత్తిలోకి ప్రవేశించిన ఆయన.. 1983లో ఎన్టీఆర్‌ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు.

పుత్తూరు నుంచి ఆరుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి రికార్డులకెక్కారు. తెలుగుదేశం ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.

2004లో టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందినా.. కాంగ్రెస్‌లో విభేదాల కారణంగా తిరిగి 2008లో తెలుగుదేశంలో చేరారు. 2014 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ప్రస్తుతం తెదేపా ఎమ్మెల్సీగా సేవలందిస్తున్నారు. గాలి మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో తెలిపింది.

Image copyright cpim.telangana/facebook

తెలంగాణ సెంటిమెంటుకు కాలం చెల్లింది!

తెలంగాణ సెంటిమెంట్‌ అనే అంశానికి కాలం చెల్లిందని, రాష్ట్ర ఏర్పాటును సీపీఎం అడ్డుకుందనే అంశం ఇక మరుగున పడినట్లేనని ఆ పార్టీ భావిస్తోంది. నల్లగొండలో ఈ నెల 4 నుంచి జరుగుతున్న సీపీఎం రాష్ట్ర రెండో మహాసభల్లో భాగంగా రాజకీయ ముసాయిదాలో ఈ అంశాన్ని పేర్కొంది.

మహాసభల్లో మూడు రోజులుగా కార్యదర్శి నివేదిక, రాజకీయ ముసాయిదాపై చర్చలు జరుగుతున్నాయి.

నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ఆచరణలో విఫలమయ్యారని, దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఇక తెలంగాణ సెంటిమెంట్‌ అనేది ఒక చారిత్రక అంశమేనని పార్టీ నేతలు తేల్చారు. జనాన్ని సెంటిమెంట్‌ ఉచ్చులో పడేసి పెట్టుబడిదారులు, పాలకులు ఒక్కటై రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని రాజకీయ ముసాయిదాలో పేర్కొన్నారు.

రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్రతో తెలంగాణలో తమపై ఉన్న వ్యతిరేకత క్రమంగా తొలగిపోయిందని, టీ-మాస్‌ పేరిట చేపడుతున్న కార్యక్రమాలతో మధ్యతరగతి వర్గాలు సీపీఎంకు చేరువవుతున్నాయని అభిప్రాయపడ్డారు.

కాగా బుధవారం రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికతో ఈ మహాసభలు ముగియనున్నాయి అని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో పేర్కొంది.

Image copyright cscpaec/facebook

ఆధార్ స్మార్ట్ కార్డులు తీసుకోవద్దు: యూఐడీఏఐ

వినియోగదారులు ఆధార్ స్మార్ట్ కార్డులు (ప్లాస్టిక్ ఆధార్ కార్డు) తీసుకోవద్దని..వాటి వల్ల ఉపయోగమేమి లేదని యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)ఓ ప్రకటనలో తెలిపింది.

ప్లాస్టిక్ ఆధార్ కార్డుల వల్ల అందులో ఉన్న వ్యక్తిగత వివరాలు చోరీకి గురయే అవకాశముంటుందని యూఐడీఏఐ ప్రతినిధులు తెలిపారు.

సాధారణ కాగితంపై డౌన్‌లోడ్ చేసుకున్న ఆధార్‌కార్డు, ఎం-ఆధార్ మాత్రమే చెల్లుబాటు అవుతాయని యూఐడీఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అజయ్ భూషణ్‌పాండే పేర్కొన్నారు.

కొంతమంది షాఫుల యజమానులు రూ.50 నుంచి 300 వరకు రుసుం వసూలు చేస్తూ ప్లాస్టిక్ ఆధార్‌కార్డులు ఫ్రింట్ చేసి ఇస్తున్నారని..అటువంటి వారి నుంచి అప్రమత్తంగా ఉండాలని అజయ్ భూషణ్‌పాండే సూచించారు.

అన్ని రకాల అవసరాల కోసం వినియోగదారులు ఖచ్చితంగా సాధారణ పేపర్ ప్రింటెడ్ ఆధార్, ఎం-ఆధార్‌లనే వాడాలన్నారు.

ఒకవేళ ఎవరైనా ఆధార్‌కార్డు పోగొట్టుకుంటే..వారు https://eaadhaar.uidai.gov.in కి లాగిన్ అయి ఉచితంగా ఆధార్‌కార్డును పొందవచ్చని తెలిపారని నమస్తే తెలంగాణ ఒక కథనం ప్రచురించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)