అభిప్రాయం: మోదీ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లరు?

  • 8 ఫిబ్రవరి 2018
నరేంద్ర మోదీ Image copyright Getty Images

ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభను రద్దు చేస్తారని, 2019 సాధారణ ఎన్నికలను ముందే నిర్వహిస్తారని అనేక వార్తలు వెలువడుతున్నాయి.

ఛత్తీస్‌గడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు డిసెంబర్ 2018లో ఇది జరగొచ్చని కొందరు అంటున్నారు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను, సాధారణ ఎన్నికలను కలిపి నిర్వహించాలన్న ప్రధాని అభీష్టం మేరకు ఈ అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వచ్చే 100 రోజుల్లోనే ఇది జరగొచ్చన్న మరో వార్త కూడా చక్కర్లు కొడుతోంది.

బీజేపీ సీట్లు 2014 నుంచి తగ్గుతూ వస్తున్నాయన్న రాజేశ్ జైన్ (2014లో మోదీ ప్రచారంలో సహాయపడిన టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్) అంచనాలు ఆ ఊహాగానాలను బలపరుస్తున్నాయి.

అందువల్ల సాధారణ ఎన్నికల కోసం మోదీ ఎంతగా ఎదురు చూడాల్సి వస్తే, దాని వల్ల ఆయనకు అంత నష్టం. ఇక ప్రభుత్వ వ్యతిరేక భావన ఎలాగూ ఉండనే ఉంది. నిరుద్యోగం, గ్రామీణ సమస్యలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. దానికి తోడు ముడిచమురు ధరల కారణంగా ద్రవ్యోల్బణం పెరిగి, దానికి వర్షాభావం తోడైతే ఇక అంతే సంగతి.

ఇవన్నీ పక్కన బెడితే, ముందస్తు ఎన్నికలకు బలమైన కారణం - అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాలనుకోవడం. మోదీకి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తడం ఇష్టమని మనందరికీ తెలుసు. ముందస్తు ఎన్నికల వల్ల ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడడానికి సమయం లభించకపోగా, ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంలో ఒక వ్యూహాన్ని రూపొందించుకునే సమయం వాటికి ఉండదు.

Image copyright Getty Images

ప్రతికూల పరిస్థితులు

అయితే వాస్తవం ఏమిటంటే, మోదీ ప్రభుత్వం ప్రస్తుతం గ్రామీణ ఆర్థికవ్యవస్థ రూపేణా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇక దేశ ఆర్థికవ్యవస్థ పరిస్థితీ అంత బాగా లేదు. ప్రైవేట్ పెట్టుబడులు ఆశించినంతగా లేవు.

జాతీయ ఆరోగ్య పథకాన్ని ప్రారంభించి, పాత పథకాలను బలోపేతం చేసుకోవడానికి, ఈ లోపు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రభుత్వానికి చాలా సమయం అవసరం.

మోదీ ప్రభుత్వానికి అనేక అంశాలు ప్రతికూలంగా ఉన్నాయని రాజేశ్ జైన్ వాదన చెబుతుండగా, ప్రభుత్వం మరో రకంగా ఆలోచిస్తోంది. గుజరాత్, రాజస్థాన్‌లలోని గ్రామీణ ప్రాంతాలలో కనిపిస్తున్నట్లు పరిస్థితులు అంత బాగా లేవు.

Image copyright MONEY SHARMA/AFP/Getty Images

‘ముందస్తు’ కారణాలు

అందువల్ల ముందస్తు ఎన్నికలకు వెళ్లడం చాలా పెద్ద రిస్కే. అటల్ బిహారీ వాజ్‌పేయి అక్టోబర్, 1999లో మూడోసారి ప్రధాని అయ్యారు. తర్వాత ఎన్నికలు అక్టోబర్, 2004లో ఉన్నాయి. 2003 డిసెంబర్‌లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో లభించిన విజయాల ఉత్సాహంతో బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావించింది. అందువల్ల సెప్టెంబర్-అక్టోబర్ 2004లో జరగాల్సిన ఎన్నికలకు ఆ ఏడాది ఏప్రిల్-మేలలో నిర్వహించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది.

ప్రధాని మోదీ వాజ్‌పేయి చేసిన తప్పే చేస్తే అది ఆశ్చర్యకరమే. అధికారంలో ఉన్న ప్రతి రోజూ రాజకీయవేత్తకు ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లే. అదే ముందస్తు ఎన్నికలకు వెళితే ఆ అవకాశం కోల్పోయినట్లే.

అధికారంలో ఉన్న రాజకీయవేత్త ముందస్తు ఎన్నికలకు వెళ్లే సందర్భం ఒకే ఒకసారి ఉంటుంది. అది వాళ్ల ఆత్మవిశ్వాసం అత్యున్నత స్థాయిలో ఉన్నపుడు - ఎంత ఎక్కువగా అంటే, దానికి మించిన స్థాయికి వాళ్లు వెళ్లలేని సందర్భం వచ్చినపుడు.

Image copyright PUNIT PARANJPE/AFP/Getty Images

2016లో పాకిస్తాన్‌పై సర్జికల్ దాడులు అలాంటి ఉచ్ఛ దశ కావచ్చు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వానికి అలాంటి సందర్భం ఒకటి లభించే వరకు ముందస్తు ఎన్నికలు రాకపోవచ్చు.

దీంతో జమిలి ఎన్నికల ప్రశ్న మరోసారి మన ముందుకొస్తుంది. ఇతర రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2019 సాధారణ ఎన్నికలను ముందుగా నిర్వహించడానికి బదులు, బీజేపీ మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలనే ముందుకు తెచ్చి ఏప్రిల్-మే 2019లో సాధారణ ఎన్నికలతో పాటు నిర్వహించే అవకాశం ఉంది.

ప్రస్తుతం బీజేపీ 19 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న నేపథ్యంలో, తమకు ఇష్టం వచ్చినన్ని రాష్ట్రాలలో అసెంబ్లీలను రద్దు చేసి, వాటికి ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. అందువల్ల 2019 సాధారణ ఎన్నికల తర్వాత ఎన్నికలకు వెళ్లాల్సిన మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానాలాంటి రాష్ట్రాలలో లోక్‌సభ ఎన్నికలతో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)