'భారత్-పాక్‌ చర్చలు జరపకపోతే, మేం ఇలా చస్తూనే ఉంటాం!'

  • 7 ఫిబ్రవరి 2018
జమ్మూ కశ్మీర్ పోలీసులు Image copyright Getty Images

శ్రీనగర్‌లోని శ్రీమహారాజ హరిసింగ్ మెమోరియల్ ఆస్పత్రిపై మంగళవారం తీవ్రవాదులు చేసిన దాడిలో పోలీసు అధికారి బాబర్ అహ్మద్ చనిపోయారు.

కశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో ఉన్న బాబర్ అహ్మద్ ఇంటికి మేం వెళ్లాం.

అర కిలోమీటర్ దూరంలో ఒక కొండపై ఉన్న బాబర్ ఇంటి నుంచి ఏడుపులు వినిపించాయి.

అక్కడ రోడ్డుకు ఇరువైపులా చాలా మంది ప్రజలు కనిపించారు.

శ్రీనగర్‌లోని మహారాజా హరిసింగ్ ఆస్పత్రి వద్ద మంగళవారం తీవ్రవాదులు చేసిన దాడిలో బాబర్ అహ్మద్, అతని సహచరుడు ముస్తాఖ్ అహ్మద్‌ మరణించారు.

ఈ దాడి తర్వాత లష్కరే తోయిబా అగ్రనేత, పాకిస్తాన్‌కు చెందిన ఖైదీ నావేద్ జాట్‌ తీవ్రవాదులతో పారిపోయారు.

Image copyright J&K POLICE

2011లో బాబర్ ఆర్మీలో చేరారు. ఆయన సోదరుడు కూడా పోలీసుగా పని చేస్తున్నారు.

మేం బాబర్ ఇంటికి వెళ్లిన సమయంలో బాబర్ భార్య షకీలా గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.

'నీ కోసం నా ప్రాణం ఇస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్లావు, పువ్వు లాంటి నిన్ను చంపేసింది ఎవరు' అంటూ కన్నీరుపెట్టుకున్నారు.

షకీలా చివరిసారిగా తన భర్తను ఆదివారం చూశారు.

Image copyright majid jahangir/bbc

'మంగళవారం ఉదయం ఆయన నాతో మాట్లాడారు. మర్నాడు ఇంటికి వస్తానని చెప్పారు. కూతురితో మాట్లాడించమని అడిగారు' అని బాబర్ భార్య చెప్పారు. కానీ రాత్రి 10 గంటల తర్వాత ఫోన్ స్విచాఫ్ అయిందని కంటతడి పెట్టుకున్నారు.

'ఆయుధాలు లేకుండా పోలీసులు అక్కడెందుకున్నారు? నా ప్రశ్నకు సమాధానం చెప్పండి' అని ఆమె నిలదీశారు.

తీవ్రవాదులు ఉంటారని తెలిసి కూడా ఇద్దరు పోలీసుల్నే ఎందుకు పంపారని ఆమె ప్రశ్నించారు.

బాబర్‌కు ఇద్దరు అమ్మాయిలు. ఒకరికి మూడేళ్లు. మరొకరికి ఏడాది వయసు. ఇంట్లో ఎటు చూసినా రోదనలే.

Image copyright majid jahangir/bbc

బాబర్ మృతదేహాన్ని ఇలా చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని బాబర్ అన్న మంజూర్ అహ్మద్ అన్నారు.

'ముఖ్యమంత్రి ఏదో ఒకటి చేయాలి. తీవ్రవాదులు ముస్లింలు. ప్రజలు, పోలీసుల్లో కూడా ముస్లింలు ఉన్నారు' అని మంజూర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‌

'ఇరువైపులా ముస్లింలే చనిపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి' అని ఆయన సూచించారు.

ఇరువైపులా ఉన్న కశ్మీరీ సోదరులు చనిపోతున్నా దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదని బాబర్ బంధువు షబీర్ అహ్మద్ ఆరోపించారు.

Image copyright J&K POLICE

'భారత్-పాక్‌ చర్చలు జరపకపోతే, మేం ఇలా చస్తూనే ఉంటాం. ఇంకెంత కాలం దీన్ని భరించాలి?' అని బాబర్ మరో బంధువు అబ్దుల్ రషీద్ ప్రశ్నించారు. ఇంకెంతకాలం ఈ రక్తపాతం అని అడిగారు.

తీవ్రవాదుల ఏరివేతలో కశ్మీర్‌ పోలీసులు కొన్ని సంవత్సరాల నుంచి పాల్గొంటున్నారు. దాంతో తీవ్రవాదులు పోలీసులను టార్గెట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)