రోహిత్: ఆ మూడు బంతులు

  • 7 ఫిబ్రవరి 2018
రోహిత్ శర్మ Image copyright Getty Images

దక్షిణాఫ్రికాతో భారత్ మూడో వన్డే మొదలైంది. విదేశాల్లో తరచూ విఫలమవుతున్నాడనే విమర్శల మధ్య రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు దిగాడు.

రబాడా బౌలింగ్. తొలి ఓవర్ తొలి బంతిని రోహిత్ డిఫెండ్ చేశాడు. రెండో బంతిని వదిలేశాడు. మూడో బంతిని మళ్లీ డిఫెండ్ చేశాడు.

తొలి ఓవర్ 4వ బంతి... ఈ బంతితో మ్యాచ్‌లో ఉత్కంఠ మొదలైంది. రబాడా వేసిన లెంత్ బాల్ రోహిత్ శర్మ ఊహించిన దానికంటే ఎక్కువ బౌన్స్ అయింది. రోహిత్ దాన్ని డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు. దాంతో అది గ్లవ్స్ భాగంలో బ్యాట్‌కి తగిలి రయ్యని గాల్లోకి లేచింది.

డైవింగ్ పాయింట్‌లో ఉన్న డుమిని బంతిని అందుకోవడానికి గాల్లోకి ఎగిరాడు. అందరిలోనూ ఉత్కంఠ. కానీ అందినట్టే అంది కొద్దిలో బంతి నేలను తాకింది. దాంతో రోహిత్‌కు తొలి లైఫ్ దొరికింది.

తొలి ఓవర్ 5వ బంతి.. రబాడా మరో లెంత్ డెలివరీ సంధించాడు. బంతి బ్యాట్‌కు అతి దగ్గరగా వెళ్లి కీపర్ చేతిలో పడింది. రబాడా అవుట్‌కి అప్పీల్ చేశాడు. అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో థర్డ్ అంపైర్‌కు అప్పీల్ చేయాలా వద్దా అనే దానిపైన కాసేపు చర్చ జరిగింది. మళ్లీ అందరిలోనూ ఉత్కంఠ.. దక్షిణాఫ్రికా రివ్యూకి వెళ్తుందా లేదా అని. కానీ ఆమ్లా వద్దనడంతో ఆ జట్టు రివ్యూ అడగలేదు. రోహిత్ మళ్లీ ఊపిరి పీల్చుకున్నాడు.

తొలి ఓవర్ 6వ బంతి.. ఈసారి రబాడా లెక్క తప్పలేదు. రోహిత్‌కు లైఫ్ దొరకలేదు. రబాడా వేసిన బంతి ఆడాలా వద్దా.. ముందుకు వచ్చి ఆడాలా, బ్యాక్ ఫుట్ తీసుకోవాలా.. అనే సంశయంతో రోహిత్ అన్య మనస్కంగానే బ్యాట్‌ను కదిపినట్టు కనిపించాడు. అతడు షాట్‌ను ఎంచుకునే లోపే 135కి.మీ వేగంతో వచ్చిన బంతి రోహిత్ బ్యాట్‌ను తాకుతూ కీపర్ క్లసీన్ చేతిలోకి వెళ్లింది. అంతే.. రోహిత్ అవుట్.

అలా మూడో వన్డేలో రోహిత్ బ్యాటింగ్ ముగిసింది. ఇదే.. దక్షిణాఫ్రికా క్రికెటర్ క్లసీన్ అంతర్జాతీయ కెరీర్‌లో తొలి క్యాచ్.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు