ప్రెస్ రివ్యూ: ‘కేసీఆరే’ మా ఎన్నికల నినాదం: కేటీఆర్

  • 8 ఫిబ్రవరి 2018
కేసీఆర్‌తో కేటీఆర్ Image copyright Telangana CMO/Facebook

మరో పదిహేనేళ్లకుపైగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసే సత్తా కేసీఆర్‌కు ఉందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ స్పష్టంచేసినట్లు ‘ఈనాడు’ దినపత్రిక కథనం పేర్కొంది. తెలంగాణను ఇంతగా అభివృద్ధి చేసిన కేసీఆర్‌నే మళ్లీ సీఎం చేయాలని కోరుతూ 2019 ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని చెప్పారు.

2014 కంటే తెరాస బాగా బలపడిందని, ఈ సారీ ఒంటరిగానే పోటీచేసి మరిన్ని ఎక్కువ స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. బుధవారం హైదరాబాద్‌లో తన నివాసంలో కేటీఆర్‌ విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. గత నాలుగేళ్లలో రాష్ట్రానికి పన్నుల వాటా మినహాయిస్తే పైసా సాయం కేంద్రం నుంచి అందలేదన్నారు. మిత్రపక్షాలకు సైతం ఎన్డీఏ సర్కారు మొండిచేయి చూపిందని.. తమకు నిధులు ఇస్తుందనే నమ్మకం లేదని కేటీఆర్‌ అనుమానం వ్యక్తంచేశారు. కేంద్రం వైఖరిపై ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.

వచ్చే ఎన్నికల్లో తెరాస అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాననే సవాల్‌కు కట్టుబడి ఉన్నానని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వైదొలగాలని కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. దేశంలోనే దౌర్భాగ్య పార్టీ కాంగ్రెస్‌ అని, రాహుల్‌గాంధీ కంటే పెద్ద పప్పు ఎవరూ లేరని, సొంత నియోజకవర్గంలో పురపాలక సంఘాలను గెలిపించుకోలేని అసమర్థుడని విమర్శించారు.

‘‘ఈ సారి కేంద్ర బడ్జెట్‌ చప్పగా ఉంది. దీంతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. మనం ఎన్ని చెప్పినా మోదీ వినరు. మాది అరణ్య రోదనే. రాష్ట్రం నుంచి రూ. 40 వేల కోట్ల ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లాయి. అయితే, బాహుబలి సినిమా వసూళ్లంత కూడా కేంద్రం రాష్ట్రానికి ఇవ్వలేదు. అయినా మళ్లీ గురువారం దిల్లీకి వెళ్లి కేంద్రమంత్రులను కలుస్తా. భాజపా రాష్ట్ర నేతలు లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి నియోజకవర్గాలు దాటరు.. వారు దిల్లీకి వెళ్లి తెలంగాణ గురించి మాట్లాడితే బాగుంటుంది’’ అని కేటీఆర్ పేర్కొన్నట్లు ’ఈనాడు’ కథనం వివరించింది.

Image copyright Telugu Desam Party (TDP)/Facebook

నేడు ఆంధ్రప్రదేశ్ బంద్‌: టీడీపీ అనధికారిక మద్దతు

నవ్యాంధ్రకు జరిగిన అన్యాయంపై రాష్ట్రవ్యాప్తంగా గురువారం బంద్‌, నిరసనలు జరగనున్నాయని ‘ఆంధ్రజ్యోతి’ కథనం పేర్కొంది. కాంగ్రెస్‌, వామపక్షాల బంద్‌ పిలుపునకు విపక్ష వైసీపీ మద్దతు ఇచ్చింది. ఇక.. అధికార తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు తెలియచేయాలని పిలుపునిచ్చింది. ఇందుకు జనసేన కూడా మద్దతు పలికింది.

ఏపీ ప్రజల ఆగ్రహం, అభిప్రాయాలు ఢిల్లీకి తెలియాలనే ఉద్దేశంతో ఈ బంద్‌కు టీడీపీ అనధికారికంగా మద్దతు పలుకుతున్నట్లు తెలిసింది. నేరుగా బంద్‌కు మద్దతివ్వకుండా... ప్రతిచోటా నిరసన ప్రదర్శనలు జరపాలని నిర్ణయించింది. ముందు జాగ్రత్తగా విద్యాశాఖ విద్యాసంస్థలకు గురువారం సెలవు ప్రకటించింది. గురువారం జరగాల్సిన ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ను 22వ తేదీకి వాయిదా వేశారు. ఆర్టీసీ బస్సులను నడపడంపై పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటారు.

రాష్ట్ర బంద్‌కు సంపూర్ణ మద్దతిస్తున్నట్టు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ బంద్‌లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా చేస్తున్న అన్యాయంతోపాటు బడ్జెట్‌ కేటాయింపుల్లో మొండిచేయిపై అందరం కలిసి పోరాడుదామని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీపీఐ లేఖ రాసింది.

రాష్ట్ర బంద్‌ నేపథ్యంలో బుధవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మన ఎంపీలు ఢిల్లీలో పోరాడుతున్నారని, రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపులపై మన పోరాటం ఢిల్లీలో చేయాలని అన్నారు. అయితే ఎవ్వరూ హింసకు పాల్పడవద్దని ప్రజల్ని కోరారు.

Image copyright DCP NORTH HYD/Facebook

సంబంధం లేని విషయాలు మీకెందుకు?: హైకోర్టు

తెలంగాణ రాష్ట్రంలో సకల నేరస్తుల సర్వే పేరుతో పోలీసులు అవసరం లేని విషయాలను అడుగుతుండటాన్ని హైకోర్టు తప్పుపట్టినట్లు ‘సాక్షి’ దినపత్రిక కథనం తెలిపింది. ఆ కథనం ప్రకారం.. సర్వే పేరుతో ఓ వ్యక్తి వద్దకు వెళ్లి అతనికి ఓ నమూనా పత్రం ఇచ్చి, అందులో నీ న్యాయవాది ఎవరు? నీకు తాకట్టుపై అప్పు ఇచ్చే వ్యక్తి ఎవరు? నీ ఉంపుడుగత్తె ఎవరు? తదితర వివరాలను భర్తీ చేయాలని కోరుతుండటంపై విస్మయం వ్యక్తం చేసింది. ఇలా సంబంధం లేని విషయాలను అడగడం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడమే అవుతుందని, ఏం సాధిద్దామని సంబంధం లేని విషయాలను అడుగుతున్నారని ప్రశ్నించింది.

ఈ వివరాలను అసలు ఎందుకు కోరుతున్నారని ప్రభుత్వ న్యాయవాదిని నిలదీసింది. న్యాయవాది ఎవరో చెప్పాలని బలవంతం చేయడం న్యాయవాద చట్ట నిబంధనలకు విరుద్ధమని పోలీసులకు గుర్తు చేసింది. న్యాయవాదులనో, న్యాయాధికారులనో సంప్రదించి నమూనా పత్రాలను సిద్ధంచేసి ఉంటే, ఇటువంటి ప్రశ్నలకు తావు ఉండేది కాదంది. ఇలా బలవంతంగా వివరాలు కోరుతుండటంపై పోలీసుల నుంచి వివరణ తీసుకుని, తమకు తెలియజేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకటశేషసాయి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సకల నేరస్తుల సర్వే పేరుతో మారేడ్‌పల్లి ఎస్‌హెచ్‌వో, నార్త్‌ జోన్‌ డీసీపీలు తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ మాజీ కార్పొరేటర్, హైదరాబాద్‌ టీడీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు చిర్రబోన బద్రీనాథ్‌ యాదవ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసినట్లు ‘సాక్షి’ కథనం తెలిపింది.

Image copyright ARUN SANKAR/AFP/Getty Images

వైదిక బ్రాహ్మణులకు మైనార్టీ హోదా ఇవ్వలేం

వైదిక బ్రాహ్మణులు, సింధీలు, కొదవ సామాజికవర్గాలకు మైనార్టీ హోదా ఇవ్వలేమని జాతీయ మైనార్టీ కమిషన్ (ఎన్‌సీఎం) స్పష్టంచేసినట్లు ‘నమస్తే తెలంగాణ’ పత్రిక కథనం తెలిపింది. ఆయా వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ఎన్‌సీఎం తిరస్కరించినట్లు ఆ కథనం పేర్కొంది.

ఈ వర్గాలకు మైనార్టీ హోదా ఇస్తే అది హిందూ మతంలో చీలికలకు దారి తీస్తుందని ఎన్‌షీఎం పేర్కొన్నది. ఈ మేరకు 2016-17 వార్షిక నివేదికలో ఎన్‌సీఎం తన అభిప్రాయాలను పొందుపర్చింది.

‘వైదిక బ్రాహ్మణులు హిందూసమాజంలో విడదీయరాని భాగం. కొద్దిమందిమి మాత్రమే ఉన్నామనే వాదన.. మైనార్టీ హోదా ఇవ్వడానికి సరిపోదు. వేదాలను, వైదిక సంస్కృతిని పరిరక్షించాలని యునెస్కో చేసిన సూచనను పరిగణలోకి తీసుకొని.. తమ సంస్కృతిని కాపాడుకోవడానికైనా మైనార్టీ హోదా ఇవ్వాలని వైదిక బ్రాహ్మణులు కోరటం కూడా సమంజం కాదు.’

’ఒకవేళ మైనార్టీ హోదా ఇస్తే రాజ్‌పుత్, వైశ్య తదితర సామాజికవర్గాలు కూడా హోదా డిమాండ్ చేస్తాయి’ అని మైనార్టీ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. భాషాపరంగా అల్పసంఖ్యాకులం కాబట్టి తమకు మైనార్టీ హోదా ఇవ్వాలన్న సింధీల, కొదవ వర్గాల వాదనను కూడా కమిషన్ అంగీకరించలేదు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)