కట్నం కోసం నా కిడ్నీ దొంగిలించి అమ్మేశాడు: ఓ భార్య ఆరోపణ

  • 8 ఫిబ్రవరి 2018
నీలి రంగు సర్జికల్ గ్లవ్స్ తొడిగిన చేతులతో సర్జికల్ కత్తెరలు పట్టుకుని ఉన్న దృశ్యం Image copyright Getty Images
చిత్రం శీర్షిక తన కిడ్నీని తనకు తెలియకుండానే తీసుకున్నారని ఆ మహిళ ఆరోపిస్తున్నారు

కట్నం చెల్లించలేదని తన కిడ్నీని భర్త దొంగిలించి అమ్ముకున్నాడని ఓ మహిళ ఆరోపించటంతో పోలీసులు సదరు భర్తను, అతడి సోదరుడిని అరెస్ట్ చేశారు.

రెండేళ్ల కిందట ఆ మహిళ కడుపు నొప్పితో బాధపడుతున్నపుడు ఆమె భర్త ’అపెండిసైటిస్ సర్జరీ’ పేరుతో ఆపరేషన్ చేయించాడని పశ్చిమ బెంగాల్ స్థానిక మీడియా కథనం పేర్కొంది.

అయితే 2017 చివర్లో ఆ మహిళ రెండు వేర్వేరు వైద్య పరీక్షలు చేయించుకున్నపుడు ఆమె రెండు కిడ్నీల్లో ఒకటి మాయమైనట్లు గుర్తించారు.

తన భర్త తరచుగా కట్నం కోసం వేధించేవాడని ఆమె ఆరోపిస్తున్నారు.

Image copyright SAM PANTHAKY/AFP/Getty Images

భారతదేశంలో వధువు కుటుంబం నుంచి కట్నం తీసుకోవటాన్ని 1961 లోనే నిషేధించారు.

చాలా ఏళ్లుగా తనను కట్నం కోసం ఇంట్లో హింసిస్తున్నారని రీటా సర్కార్ అనే సదరు బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.

‘‘నా భర్త నన్ను కోల్‌కతాలో ఓ ప్రైవేటు నర్సింగ్ హోంకు తీసుకెళ్లాడు. అపెండిక్స్ వాచిందని, దానిని సర్జరీ ద్వారా తొలగిస్తే నా ఆరోగ్యం బాగుపడుతుందని నా భర్త, వైద్యులు నాకు చెప్పారు’’ అని ఆమె పేర్కొన్నట్లు ‘హిందుస్తాన్ టైమ్స్’ దినపత్రిక కథనం చెప్పింది.

’’ఆ సర్జరీ గురించి కోల్‌కతాలో ఎవరికీ చెప్పవద్దని నా భర్త నన్ను హెచ్చరించారు’’ అని కూడా ఆమె తెలిపింది.

కొన్ని నెలల తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించటంతో ఆమె కుటుంబ సభ్యులు బాధితురాలిని డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లారు. అప్పుడు స్కాన్ చేసి పరీక్షించగా తన కుడి కిడ్నీ మాయమైనట్లు వెల్లడైందని ఆమె పేర్కొన్నారు. రెండోసారి కూడా పరీక్షించగా కిడ్నీ మాయమైన విషయం నిర్ధారణ అయింది.

Image copyright INDRANIL MUKHERJEE/AFP/Getty Images

‘‘నాటి సర్జరీ గురించి ఎక్కడా నోరు విప్పవద్దని నా భర్త నన్ను ఎందుకు బలవంతం చేశాడో అప్పుడు అర్థమైంది’’ అని ఆమె ‘హిందుస్తాన్ టైమ్స్’ పత్రికతో పేర్కొన్నారు.

‘‘నా తల్లిదండ్రులు అతడి కట్నం డిమాండ్‌ను తీర్చలేకపోవటంతో అతడు నా కిడ్నీ అమ్మేశాడు’’ అని ఆమె చెప్పారు.

‘‘ఇందులో ఒక ముఠా వ్యవస్థ పాత్ర ఉన్నట్లు మేం అనుమానిస్తున్నాం’’ అని పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఉదయ్‌శంకర్ ఘోష్ పేర్కొన్నట్లు ద టెలిగ్రాఫ్ ఇండియా వార్తాపత్రిక ఉటంకించింది.

‘‘మానవ అవయవాలు, కణజాలాల మార్పిడి చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదు చేశాం. హత్య, వధువును హింసించటం అభియోగాల కింద కూడా ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశాం’’ అని ఆయన వివరించారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)