ఆంధ్రా బంద్ ప్రశాంతం.. సమాప్తం

  • 8 ఫిబ్రవరి 2018
బంద్‌లో మహిళలు

ఆంధ్ర రాష్ట్రంలో బంద్ ప్ర‌శాంతంగా ముగిసింది. బంద్ ప్ర‌భావం ఆర్టీసీపైనా, విద్యా సంస్థ‌ల‌పైనా అధికంగా ప‌డింది. ఆందోళ‌నకారులు ఆర్టీసి డిపోల ముందు బైఠాయించ‌డం, విద్యా సంస్థ‌లు ముందుగానే సెల‌వు ప్ర‌క‌టించ‌డంతో ఈ రంగాల్లో బంద్ ప్రభావం క‌నిపించింది.

వాణిజ్యంపై బంద్ ప్ర‌భావం పాక్షికం. ప్ర‌ధాన రోడ్ల‌లోని షాపులు, వ్యాపార సంస్థ‌లు మూత ప‌డ్డాయి. చాలా చోట్ల మ‌ధ్యాహ్నం నుంచి వ్యాపారం మొద‌లైంది. ఇక రాజధాని అమ‌రావ‌తిలో బంద్ ప్ర‌భావం తీవ్రంగా క‌నిపించింది. విజ‌య‌వాడ‌లో బ్యాంకులతో స‌హా చాలా వాణిజ్య స‌ముదాయాలు మూత‌బ‌డ్డాయి. ఆటోలు వంటి ప్రైవేటు ర‌వాణాపై జ‌నం ఆధార‌ప‌డ్డారు.

బంద్ సంద‌ర్భంగా అన్ని విప‌క్ష పార్టీలు పెద్ద సంఖ్య‌లో ఆందోళ‌న నిర్వ‌హించాయి. వామ‌ప‌క్ష పార్టీలూ, వాటి అనుబంధ సంస్థ‌లూ చురుగ్గా బంద్‌లో పాల్గొన్నాయి. వైఎస్సార్సీపీ, జ‌న‌సేన‌, కాంగ్రెస్ పార్టీలు కూడా బంద్‌లో పాల్గొన్నాయి. కొన్ని స్వ‌చ్ఛంద సంస్థ‌లు, సామాజిక సంస్థ‌లు, జ‌ర్న‌లిస్టు సంఘాలు బంద్ సంద‌ర్భంగా ఆందోళ‌న‌లు నిర్వ‌హించాయి.

అధికార తెలుగుదేశం పార్టీ త‌మ ఎంపీల‌కు మ‌ద్ద‌తుగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌నలు చేసింది. పార్ల‌మెంటులో ఆందోళ‌న చేస్తోన్న త‌మ ఎంపీల‌కు సంఘీభావ ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టాల‌న్న పార్టీ ఆదేశాల మేర‌కు ఈ ఆందోళ‌న‌లు జ‌రిగాయి. స్థానికంగా తెలుగుదేశం నాయ‌కులు ఆందోళ‌న‌ల్లో పాల్గొన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యే బోడె ప్ర‌సాద్ కేంద్ర తీరుకు నిర‌స‌న‌గా గుండు చేయించుకున్నారు. బిజెపి నాయకులు ఎక్క‌డా రోడ్డుపై క‌నిపించ‌లేదు.

బంద్ పిలుపు, బంద్ నిర్వ‌హ‌ణ వంటి అంశాల‌తో సంబంధం లేకుండా సామాన్యుల నుంచి ఈ బంద్‌ సానుభూతి ల‌భించింది.

బంద్ సందర్భంగా ఎవరేమన్నారు..

కాంగ్రెస్..విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలన్నీ అమలు చేయాలి. చేతగాని ఎంపీలంతా రాజీనామా చేయాలి. రాష్ర్టాన్ని మోసగించిన బీజేపీ, చంద్రబాబును రాష్ట్రం నుంచి పారదోలాలి. ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే.

కాంగ్రెస్.. రాష్ట్ర బంద్ సందర్భంగా రఘువీరా రెడ్డి హిందూపురంలో మీడియాతో మాట్లాడారు.

ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నారు. ఇప్పుడైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రజాగ్రహాన్ని గమనించాలి. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయమేదీ లేదని రఘువీరా రెడ్డి అన్నారు. విభజన హామీలు అమలయ్యుంటే రాష్ట్రం పరిస్థితి మరో రకంగా ఉండేదని అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయి. పార్లమెంట్లో జరుగుతున్న పరిణామాలు జిగుప్సాకరంగా మారాయని వ్యాఖ్యానించారు.

గత కొంతకాలంగా పార్లమెంట్లో నాటకాలాడినవారు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్లో అడుగు పెట్టగానే.. టిడిపి ఎంపీలు ప్లకార్డులు పక్కన పడేసి చాలా మర్యాదగా కూర్చున్నారని, ఇక ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఎంపీలు బయటకు వెళ్లిపోయారని, ప్రధాని పార్లమెంట్ నుంచి వెళ్లిపోయేవరకూ వాళ్లు లోపలకు రాలేదన్నారు. నరేంద్ర మోదీ అంటే మీకు ఎందుకింత భయం? అని టీడీపీ నాయకులను రఘువీరా ప్రశ్నించారు.

''మీ రెండు పార్టీలకు మోదీ నుంచి మోదీ నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటే మీకు అండగా మేం ఉంటాం. కానీ మోదీకి భయపడి రాష్ట్ర ప్రయోజనాలను దయచేసి తాకట్టు పెట్టవద్దు'' అని రఘువీరా అన్నారు.

విభజన హామీలు నెరవేర్చే వరకూ పోరాడుతాం. మోదీ గారికి లొంగిపోతే.. ప్రతిపక్ష నేతలు కూడా ద్రోహులుగా మిగిలిపోతారని రఘువీరా అన్నారు.

Image copyright Bharat Balivada
చిత్రం శీర్షిక బంద్ కారణంగా బోసిపోయిన శ్రీకాకుళం పట్టణం. నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసీ బస్ స్టాండ్, కోర్టు ప్రాంతం బంద్ కారణంగా నిర్మానుష్యమైంది.

టీడీపీ..బంధాలు తెంచుకోవడం ముఖ్యం కాదు, చిత్తశుద్ధితో పోరాడడం ముఖ్యం అని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. మోదీ ప్రసంగం సమయంలో నిరసన తెలుపుతుంటే.. రాజ్ నాథ్, అమిత్ షా ఫోన్ చేసి మోదీ మాట్లాడుతున్నంతసేపు నిరసన తెలపొద్దని రిక్వెస్ట్ చేయడంతో మా ఎంపీలు నిరసన ఆపారు. మోదీ ప్రసంగం తరువాత మళ్లీ నిరసన తెలిపారు.. అని అన్నారు.

లెఫ్ట్..వామపక్షాలు పిలుపునిచ్చాయి. జనసేన, వైసీపీ మద్దతిచ్చాయి. టీడీపీ సొంతంగా నిరసన ప్రదర్శనలు చేస్తోంది. కేంద్రం ఆంధ్రకు మోసం చేసింది. మోదీ బడ్జెట్ ఏపీని విస్మరించింది. విభజన చట్టంలోని ఏ అంశాన్నీ పట్టించుకోలేదు. ఏపీని నట్టనడి సంద్రంలో వదిలేశారు. - సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి శంకర్

వైసీపీ.. జగన్మోహనరెడ్డి ఆదేశాలతో పోరాడుతున్నామని వైసీపీ నేత, ఏపీ మాజీమంత్రి పార్థసారథి అన్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతామని తెలిపారు.

సిగ్గులేని ప్రభుత్వం ఏపీని ఏలుతోంది .. చట్టరూపంలో ఇచ్చినవి కూడా ప్రభుత్వం సాధించుకోలేకపోయింది. నాలుగేళ్లలో ఏమీ సాధించలేకపోయారు. ఓటుకు నోటు కేసులో చిక్కుకుని, అవినీతి బయటపడుతుందన్న భయంతో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ హక్కులను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారు అని విమర్శించారు.

జనసేన.. జేఏసీగా ఏర్పడి పవన్ పోరాడుతామన్నారు. రాష్ఱ్ట ప్రయోజనాల కోసం పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకాడరు. కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేరలేదు కాబట్టి పవన్ బయటకొస్తున్నారు.

1.30 ఏపీ ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలి. విభజన హామీలను అమలు చేయడం లేదు. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మించాలి.

ప్రత్యేక రైల్వే జోన్, రాజధాని నిర్మాణానికి సహాయం చేయాలి. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.

కడపలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మించాలి. ఇప్పటికే ఏర్పాటు చేసిన విద్యాసంస్థలకు నిధులు కేటాయించాలి. - కేంద్రానికి కేవీపీ డిమాండ్లు

12.30 త్వరలో డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్‌ను కలవనున్న పవన్

11.23 విశాఖ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నర్సీపట్నం, మద్దిలపాలెం డిపోల ఎదుట విపక్షాల ఆందోళనకు దిగాయి. అటు పాడేరులో వామపక్ష నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. భారీగా పోలీసుల మోహరించారు.

11.18 టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ.. ఇతర నేతలతో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌పై వీడియోలో చూడొచ్చు

11.11 పార్లమెంట్‌లో ఏపీ ఎంపీలు ఆందోళన చేశారు. లోక్ సభలో స్పీకర్ పోడియాన్ని చుట్టు ముట్టారు. ఏపీని రక్షించాలంటూ నినాదాలు చేశారు.

11.10 కృష్ణా జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపోల ఎదుట విపక్షాల ఆందోళనకు దిగాయి. దీంతో పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.11.06 కడప బస్టాండ్‌ ఎదుట బస్సులను విపక్ష నేతలు అడ్డుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా డిపోలకే పరిమితమయ్యాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విభజన హమీలను అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

చిత్రం శీర్షిక విజయవాడలో బోసిపోయిన బస్టాండు

11.03 కర్నూలు కొత్త బస్టాండ్ దగ్గర సీపీఐ నాయకులు ఆందోళన దిగాయి. సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆందోళనలో పాల్గొన్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

11:01  అనంతపురం జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆందోళనకారులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. పుట్టపర్తి ఆర్టీసీ డిపో ఎదుట సీపీఐ, సీపీఎం కార్యకర్తలు ఆందోళనకు దిగాయి. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

10:58 కాకినాడ ఆర్టీసీ డిపో ఎదుట విపక్షాలు ఆందోళనకు దిగాయి. బంద్ సందర్భంగా ఆర్టీసీ స్వచ్ఛందంగా బస్సులను నిలిపివేసింది. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి

విజయవాడలో బంద్ లైవ్‌ కవరేజీని బీబీసీ న్యూస్ తెలుగు ఫేజ్‌బుక్ ఫీడ్‌లో చూడొచ్చు..

చిత్రం శీర్షిక విజయవాడలో ఆగిన బస్సులు

10.50: తెలంగాణ నుంచి యూసఫ్ గూడ ఒకటవ బెటాలియన్ నుండి 6ప్లాటూన్ బలగాలు విజయవాడకి వచ్చాయి. సుమారు 150 మంది తెలంగాణ పోలిసులను కూడా పంపారు.

10.36 ఏలూరులో గడ్డి తిన్నజనసేన కార్యకర్తలు... మోడీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఆంధ్ర ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేనందున తెలుగు ప్రజలు గడ్డి తిని బ్రతకాలి అంటూ ఏలూరు బిర్లా భవన్ సెంటర్లో జనసేన కార్యకర్తలు గడ్డిని తింటూ నిరసన తెలిపారు.

అంతకు ముందు..

ఆంధ్ర ప్రదేశ్‌లో బంద్ ప్రశాంతంగా ప్రారంభమైంది.

విజ‌య‌వాడ‌లోని పండిట్ నెహ్రూ బస్ స్టాండు స‌హా, రాష్ట్రంలోని అన్ని బస్ డిపోల ద‌గ్గ‌రా వివిధ రాజ‌కీయ ప‌క్షాలు ఆందోళ‌న నిర్వ‌హించాయి.

దీంతో ఉద‌యం బస్సు స‌ర్వీసులు బ‌య‌ట‌కు రాలేదు. ముందు జాగ్ర‌త్తగా ఆర్టీసీ అధికారులు చాలా బ‌స్సులు నిలిపివేశారు.

విద్యాసంస్థ‌ల‌న్నీ ముందుగానే సెల‌వు ప్ర‌క‌టించాయి. ప‌లు యూనివ‌ర్సిటీలు త‌మ ప‌రిధిలోని ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేశాయి.

చిత్రం శీర్షిక విజయవాడలో పోలీసుల బందోబస్తు

వాణిజ్య స‌ముదాయాల‌పై కూడా బంద్ ప్ర‌భావం ప‌డింది. ముఖ్యంగా అమ‌రావ‌తి ప‌రిధిలో రీటైల్ వ్యాపారం సంస్థ‌లు ఉద‌యం తెరుచుకునే అవ‌కాశం లేదు.

పోలీసుల భారీ బందోబస్తు

బంద్ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున పోలీసులు రోడ్ల‌పై మోహ‌రించారు. ఒక‌టి రెండు చోట్లు ఆందోళ‌న చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. విజ‌య‌వాడ న‌గ‌రంలో తెలంగాణ ఫ‌స్ట్ బెటాలియ‌న్ రిజ‌ర్వ్ పోలీసులు కూడా విధుల్లో పాల్గొన్నారు.

రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌తీ చోటా సిపిఐ, సిపిఎం, వైయ‌స్సార్సీపీ, జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు, ప్ర‌ద‌ర్శ‌న‌లు ఉద‌యం నుంచీ జ‌రుగుతున్నాయి.

Image copyright హనుమంతు
చిత్రం శీర్షిక గురువారం అనంతపురంలో లారీ అద్దాల ధ్వంసం

వామ‌ప‌క్షాలు బంద్ పిలుపు ఇవ్వ‌గా వైయ‌స్సార్సీపీ, కాంగ్రెస్ లు బంద్ కి సంపూర్ణ‌ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. జ‌న‌సేన శాంతియుత ఆందోళ‌న‌కు పిలుపునిచ్చింది. తెలుగుదేశం పార్టీ మాత్రం పార్ల‌మెంటులో త‌మ ఎంపీల పోరాటానికి మ‌ద్ద‌తుగా సంఘీభావ ప్ర‌ద‌ర్శ‌న‌లు చేయాల‌ని పిలుపునిచ్చింది.

ఇవికూడా చూడండి

ఆంధ్రప్రదేశ్‌పై స్పందించారు.. హామీలపై మాత్రం మౌనం వహించారు

టీడీపీ-బీజేపీ ‘యుద్ధం’ జరగకపోవటానికి కారణాలివే!!

టీడీపీ - బీజేపీ: కలహాలున్నా.. కాపురం తప్పదు!

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు