పార్లమెంటులో రేణుకా చౌదరి నవ్వు.. చిక్కుల్లో బీజేపీ!

  • 8 ఫిబ్రవరి 2018
రేణుకా చౌదరి Image copyright Getty Images

రాజ్యసభలో బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ సభ్యురాలు రేణుకా చౌదరి నవ్వడంపై వివాదం తలెత్తింది.

ప్రధాని తన ప్రసంగంలో ఆధార్ విషయంలో వివరణ ఇస్తున్న సందర్భంగా, కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి గట్టిగా చాలా సేపు నవ్వారు.

దీనిపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, "ఏమైంది మీకు, ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్లండి" అని అన్నారు.

రేణుకా చౌదరిని అడ్డుకోవడానికి వెంకయ్య నాయుడు ప్రయత్నిస్తుండగానే, "రేణుక గారిని మీరు ఏమీ అనకండి అధ్యక్షా, రామాయణం సీరియల్ తర్వాత ఇలాంటి నవ్వును చూసే అదృష్టం మళ్లీ ఇప్పుడే కలిగింది" అని మోదీ అన్నారు.

ప్రధాని ప్రసంగం

బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ప్రధాని ప్రసంగంలోని ఆ భాగాన్ని ట్వీట్ చేస్తూ, మీకు ఏ పాత్ర గుర్తుకు వచ్చిందో చెప్పండని కోరారు.

ఆ తర్వాత అమిత్ మాలవీయ రామాయణంలో శూర్పణఖ ముక్కును కోసేసిన దృశ్యాన్ని కూడా ట్వీట్ చేశారు.

ప్రధాని ప్రసంగంపై మాట్లాడుతూ రేణుకా చౌదరి, "ఆడ్వాణీ ఉన్నప్పుడే ఆధార్ కార్డుకు బీజాలు పడినాయని ఆయన చెబుతున్నారు. దీనిపై నాకు నవ్వొచ్చింది. మనుషులు ఇలా 360 డిగ్రీలు తిరగడం ఆశ్చర్యకరం" అని అన్నారు.

"ఆయన నాపై వ్యక్తిగతమైన కామెంట్ చేశారు. ప్రధానమంత్రి మాట్లాడిన ఈ మాటలకు బయటయితే చట్టం వర్తిస్తుంది. ఇది మహిళల సామాజిక స్థితిగతులను ఎద్దేవా చేయమే" అని రేణుక అన్నారు.

వ్యంగ్యమైన జవాబు

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విలేఖరులతో మాట్లాడుతూ, "నేను అక్కడే ఉన్నాను. ఆమె ప్రధానిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. వాటిని నేను విన్నాను" అని అన్నారు.

"ఆమె అలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం సమంజసమేనా? దీనికి ప్రధానమంత్రి వ్యంగ్యంగా జవాబివ్వడంతో ఆమె జెండర్‌ను ఓ కవచంగా ముందుకు తెస్తున్నారు."

ప్రధానమంత్రి వ్యాఖ్యలపై గురువారం నాడు రాజ్యసభలో దుమారం రేగింది. ప్రధాని క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

కాంగ్రెస్ అధికారిక ట్విటర్ అకౌంట్‌లో "పక్షపాత ధోరణితో వ్యవహరించగూడదని మేం రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు అపీల్ చేస్తున్నాం. పార్లమెంటులో సభ్యుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి" అని ట్వీట్ చేశారు.

Image copyright Kiren Rijiju Facebook Page
చిత్రం శీర్షిక రామాయణంలోని ఈ దృశ్యాన్ని కేంద్ర మంత్రి కిరన్ రిజిజు షేర్ చేశారు.

రాజకీయ ప్రతిస్పందనలు

ప్రధానమంత్రి ప్రసంగం తర్వాత రేణుకా చౌదరి నవ్వును రామాయణంలోని పలు పాత్రలతో పోలుస్తూ ట్వీట్లు చేయడం మొదలైంది.

కేంద్ర సహాయ మంత్రి కిరన్ రిజీజు ఫేస్‌బుక్‌పై ఒక వీడియో షేర్ చేస్తూ, రేణుకా చౌదరి నవ్వును రామయణంలోని శూర్పణఖ పాత్రతో పోల్చారు.

మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ప్రధానమంత్రి వ్యాఖ్యలను విమర్శించారు.

"రేణుకా చౌదరి నవ్వును ప్రధానమంత్రి రావణుడితో పోల్చారు. దేశంలోని అత్యున్నత సభలో మన ప్రధాన సేవకుడు ఒక మహిళపై ఇలాంటి వ్యాఖ్య చేయడం అత్యంత దురదృష్టకరం" అని సంజయ్ సింగ్ అన్నారు.

కాగా, బీజేపీ పార్లమెంటు సభ్యుడు పరేశ్ రావల్ "ప్రధానమంత్రి తన పదునైన వ్యంగ్యంతో రేణుకా చౌదరిని ఎలా దెబ్బ కొట్టారో చూడడం మర్చిపోకండి. రాజ్యసభ టీవీ చూడండి" అని ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ మద్దతుదారు తహసీన్ పూనావాలా ఇలా ట్వీట్ చేశారు, "ఒక నిజమైన కాంగ్రెస్ శ్రేయోభిలాషిగా చెప్పాలంటే రేణుకా చౌదరి, మణిశంకర్ అయ్యర్ వంటి నేతలు పార్టీకి భారంగా మారారు. వారి అహంకారానికి మూల్యం కాంగ్రెస్ పార్టీకి చెల్లించాల్సి వస్తోంది. ఇది గాంధీ, నెహ్రూ వంటి గొప్ప నేతలు నిర్మించిన పార్టీ. పార్లమెంటు ఎగువ సభలో ప్రతిధ్వనించిన ఆ నవ్వుతో నా శరీరం జలదరించింది."

మరి కొంత మంది ఈ మొత్తం ఘటనాక్రమాన్ని వ్యంగ్యంగానే చూస్తున్నారు.

చార్ లోగ్ అనే ట్విటర్ అకౌంట్‌లో, "రేణుకాజీ నవ్వును అలిఫ్ లైలాకు బదులు రామాయణంలోని పాత్రతో పోల్చి మోదీ హిందుత్వ అజెండాను ప్రోత్సహిస్తున్నారు" అని కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)