పీరియడ్స్‌లో గుడికి వెళ్తే ట్వింకిల్ ఖన్నా ఏం ఆలోచిస్తారు?

  • రాహుల్ జోగ్లేకర్
  • బీబీసీ ప్రతినిధి
ట్వింకిల్ ఖన్నా, సోనమ్ కపూర్

ఫొటో సోర్స్, Getty Images

మూడేళ్ల క్రితం ట్వింకిల్ ఖన్నా ఓ పుస్తకాన్ని రాయడం మొదలుపెట్టారు. కానీ అరుణాచలం మురుగనాథం గురించి విన్నాక ఆ పుస్తక రచనను పక్కనబెట్టి అతడి గురించి తెలుసుకోవడం ప్రారంభించారు.

గ్రామీణ మహిళల కోసం తక్కువ ఖర్చుతో శానిటరీ న్యాప్‌కిన్లను తయారుచేసే అరుణాచలం కథ ట్వింకిల్‌ని కదిలించింది. దాంతో ఆయన గురించి పూర్తిగా తెలుసుకొని ఆయన కథనే ఆమె పుస్తకంగా రాశారు. నిర్మాతగా మారి దాన్నే సినిమాగా తీశారు. ఆ సినిమానే 'ప్యాడ్‌మ్యాన్'. శుక్రవారం ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది.

ఈ నేపథ్యంలో ప్యాడ్‌మ్యాన్‌లో నటించిన సోనమ్ కపూర్‌తో కలిసి ట్వింకిల్ ఖన్నా బీబీసీతో మాట్లాడారు. పీరియడ్స్, మహిళల సమస్యలతోపాటు సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

పీరియడ్స్ సమయంలో కట్టుబాట్లు మీకు అనుభవంలోకి వచ్చాయా? అసలు ఈ సినిమా ఎలా మొదలైంది?

సోనమ్: భారత్‌లో.. అదీ ముంబైలాంటి నగరాల్లో ఉంటున్న వాళ్లు కూడా ఈ రోజుకీ పీరియడ్స్ సమయంలో కొన్ని కట్టుబాట్లకు గురవుతున్నారు. మా ఇంట్లో కూడా అలాంటివి ఉన్నాయి. పచ్చడి పెట్టే సమయంలో నాకు నెలసరి వస్తే, మా నానమ్మ నన్ను దగ్గరకు రానిచ్చేది కాదు. పచ్చడి పాడవుతుందని చెప్పేది.

పూజ గదిలోకి కూడా రానిచ్చేది కాదు. అలాంటిది ఓ సంప్రదాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అరుణాచలం కథ విని నాకు చాలా ఆశ్చర్యమేసింది. మూఢ నమ్మకాలను దూరం చేయడానికీ, మహిళలు అనారోగ్యం బారిన పడకుండా కాపడటానికీ అతడు చేసిన ప్రయత్నం చాలా గొప్పది. అందుకే అతడి కథలో నాకూ భాగం పంచుకోవాలనిపించి ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నా.

ట్వింకిల్: నేను నా రెండో పుస్తకం రాసే సమయంలో అరుణాచలం గురించి తెలిసింది. దాంతో ఆ పుస్తకాన్ని మధ్యలో ఆపేసి అరుణాచలం గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టా. నేరుగా కలవకముందే అతడి గురించి చాలా తెలుసుకున్నా. ఆ కథను సినిమాగా మలిచే ప్రయత్నాలు అప్పుడే మొదలుపెట్టా.

ప్యాడ్‌మ్యాన్ పోస్టర్

ఫొటో సోర్స్, facebook/padman

మీరు అరుణాచలం వెంటబడ్డారంట.. నిజమేనా?

ట్వింకిల్: నిజమే.. చాలాకాలం పాటు అతడి వెంటబడ్డా. ఒకవేళ నేను మహిళను కాకపోయుంటే నన్ను జైల్లో కూడా పెట్టేవారేమో. నేను అతడి వెంటబడినంతగా ఎవరి వెంటా పడలేదు.

తన కథను బీబీసీ, గార్డియన్‌ లాంటి మీడియా సంస్థలతో పంచుకొని సరిపెట్టడం స్వార్థమవుతుందనీ, మొత్తం దేశ ప్రజలందరికీ ఆ కథ తెలియాలనీ అతడికి చెప్పా. అతడు ఒప్పుకోవడంతో ఈ సినిమా మొదలైంది.

మా ఇద్దరి భాషలూ, నేపథ్యాలూ వేరైనా మా మధ్య చక్కని అనుబంధం ఏర్పడింది.

సినిమాల్లో నెలసరి అంశం అంతగా ప్రస్తావనకు రాదు. మగవాళ్లు ఎక్కువగా సినిమాలు తీయడం వల్లనా?

సోనమ్: ఏ సినిమా పరిశ్రమలో అయినా చాలా అంశాలు మగవాళ్ల దృక్కోణంలో నుంచే ఉంటాయి. హాలీవుడ్ సినిమాల్లో కూడా ఈ నెలసరి అంశాన్ని ఏ సినిమాలూ ప్రస్తావించవు.

ట్వింకిల్: కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోంది.

సోనమ్ కపూర్

ఫొటో సోర్స్, Getty Images

మహిళల ఆలోచనపైన ఈ సినిమా ప్రభావం చూపిస్తుందంటారా?

ట్వింకిల్: సాధారణంగా మహిళలు నెలసరి గురించి మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడతారు. అంతెందుకు.. ఈ అంశంపైన రీసెర్చ్ చేసి, పుస్తకం రాసి, సినిమా తీశాక కూడా నెలసరి సమయంలో గుడికి వెళ్లినప్పుడు తెలీకుండా నాలో ఏదో ఇబ్బందికర భావన మొదలవుతుంది.

'నేను తప్పు చేస్తున్నానా? ఇది దైవ నింద కిందకు వస్తుందా?' లాంటి ఆలోచనలు నన్ను తొలిచేస్తాయి. నాకే ఇలా ఉంటే, అసలు ఈ అంశంపై ఎక్కువ అవగాహన లేని మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అలాంటి వారిని ఈ సినిమా ఎంతోకొంత ప్రభావితం చేసే అవకాశం ఉంది.

సోనమ్: మహిళల జీవితంలో నెలసరి ఓ భాగం. అది సహజసిద్ధంగా జరిగే ప్రక్రియ. కొందరికి మాత్రం అది సజావుగా సాగుతుంది. చాలామంది మహిళలు నెలసరి సమయంలో ఎంతో బాధను అనుభవిస్తారు. అలాంటి వాళ్లలో నేను కూడా ఉన్నాను. దీని గురించి మాట్లాడటంలో ఎలాంటి తప్పూ లేదు. మహిళలు చాలా గర్వంగా చర్చించాల్సిన విషయం ఇది.

ట్వింకిల్: ఉద్యోగం చేసే మహిళలు కూడా ఆఫీసులో తమ శానిటరీ ప్యాడ్ మార్చుకోవాల్సి వస్తే మొత్తం హ్యాండ్ బ్యాగ్‌ని తమతో తీసుకెళ్తారు. తమకు నెలసరి అవుతున్న విషయం బయటకు తెలియడానికి ఇష్టపడరు. అందుకే శానిటరీ ప్యాడ్‌ను చేత్తో తీసుకెళ్లరు.

ఒక్కోసారి దుస్తులకు మరకలవుతుంటాయి. అది అందరు మహిళలకూ అనుభవమే. కానీ దాన్ని చాలా ఇబ్బందిగా భావిస్తారు. అది మహిళల సహజసిద్ధ జీవనశైలిలో ఓ భాగమనే విషయాన్ని గుర్తుచేసుకుంటే దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.

ట్వింకిల్ ఖన్నా

ఫొటో సోర్స్, Getty Images

శానిటరీ ప్యాడ్‌లపై విధించిన జీఎస్‌టీ గురించి చర్చ లేవనెత్తారు. ప్రభుత్వం మీ మాటలు వింటుందంటారా?

ట్వింకిల్: జీఎస్‌టీ వల్ల వస్తువుల ధర ఎలా తగ్గుతుందనే దానిపై ఆర్థిక మంత్రి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. నేనూ, అరుణాచలం కలిసి దీనిపై చర్చించాం. జీఎస్‌టీ ఉన్నా కూడా శానిటరీ ప్యాడ్‌ల ధర తక్కువగానే ఉంటుందని మాకు అనిపించింది.

సినిమా పరిశ్రమలో వివక్ష ఉందా?

సోనమ్: మనం ఇప్పటికీ పురుషాధిక్య సమాజంలోనే ఉన్నాం. పారితోషికం విషయంలో ఇప్పటికీ వివక్ష కొనసాగుతోంది.

ఈ సినిమాకు అక్షయ్ కుమార్‌కీ, సోనమ్ కపూర్‌కీ ఒకే పారితోషికం దక్కిందా?

సోనమ్: అసలు మా ఇద్దరినీ పోల్చడం కరెక్టు కాదు. ఒకవేళ నాకు సమాన స్థాయిలో ఉండే హీరోతో నేను పనిచేసినప్పుడు, అతడికి ఎక్కువ.. నాకు తక్కువ డబ్బు చెల్లిస్తే అది వివక్ష కిందకు వస్తుంది.

ఉదాహరణకు నేను ఆయుష్మాన్ ఖురానాతో సినిమా చేస్తే నాకు ఎక్కువ డబ్బులివ్వాలి. అదే నేను సిద్ధార్థ్ మల్హోత్రాతో పనిచేస్తే నాకు సమానంగా పారితోషికం చెల్లించాలి.

ట్వింకిల్: లింగ భేదాల కంటే సినిమా వసూళ్ల లాంటి ఆంశాలపైనే సినిమా పారితోషికాలు ఎక్కువ ఆధారపడి ఉంటాయి. పరిశ్రమల్లో హీరోలు నటనతో సరిపెట్టకుండా సినిమా విడుదలకు సంబంధించిన విషయాల్లోనూ భాగమవుతారు.

నేరుగా డిస్ట్రిబ్యూటర్లతో చర్చిస్తారు. వ్యాపార పరమైన నిర్ణయాల్లోనూ చొరవ చూపిస్తారు. ఆ కారణంగా వారికి కాస్త ఎక్కువ పారితోషికమే అందుతుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)