తెలంగాణ: మోదీజీ.. తలుపులు మూస్తే తప్పేంటి?

  • ప్రవీణ్ కాసం
  • బీబీసీ ప్రతినిధి
నరేంద్ర మోదీ

''పార్లమెంట్ తలుపులు మూసి అడ్డంగా విభజించారు''... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలివి.

బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందంటూ ఏపీ ఎంపీలు బుధవారం పార్లమెంట్‌లో నిరసన తెలుపుతున్న వేళ ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

దీంతో మోదీపై ఏపీతో పాటు తెలంగాణలో సైతం రాజకీయ నేతలూ, నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

ప్రధాని వ్యాఖ్యలు తెలంగాణను అవమానించేలా ఉన్నాయని కొందరు అంటుంటే, అసలు పార్లమెంటులో బిల్లుపై ఓటింగ్ జరపాలంటే తలుపులు మూయకుండా ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు.

ఇంతకు ప్రధాని ఏమన్నారు?

బుధవారం పార్లమెంట్‌లో ఏపీ ఎంపీలు సభ జరగకుండా అడ్డుపడుతున్న సమయంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ''ఎన్నికల్లో లబ్ధి కోసం పార్లమెంటు తలుపులు మూసి ఏపీని విభజించారు. అప్పుడు సభ ఆర్డర్‌లో లేదు. ఆంధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా తెలంగాణ ఏర్పాటు చేసిన పక్షాల్లో మేమూ ఉన్నాం" అని అన్నారు.

"నాలుగేళ్ల తర్వాత కూడా ఇంకా ఇన్ని సమస్యలు ఉండడానికి కారణమదే. రాజకీయ స్వార్థంతో హడావుడిగా ఏపీ విభజన నిర్ణయం తీసుకున్నారు''అని వ్యాఖ్యానించారు.

తన ప్రసంగంలో కాంగ్రెస్ తీరుపైనే మోదీ విమర్శలు చేసినప్పటికీ ఆయన వ్యాఖ్యలపై తెలంగాణలో దాదాపు అన్ని రాజకీయ పక్షాలు నిరసన తెలుపుతున్నాయి.

చిన్నమ్మది ఒక మాట.. మోదీది మరో మాటా!

2014 ఎన్నికల ప్రచార వేళ బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా తిరుపతిలో మోదీ ప్రసంగిస్తూ ''తల్లిని చంపి బిడ్డను బతికించారు'' అని వ్యాఖ్య చేసినప్పుడూ తెలంగాణలో విమర్శలు వచ్చాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నాడు మోదీ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.

పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం సమయంలో ''రాష్ట్ర ఏర్పాటులో మా పాత్ర మరిచిపోవద్దు, ఈ చిన్నమ్మను గుర్తుపెట్టుకోండి'' అంటూ బీజేపీ నేత సుష్మా స్వరాజ్ లోక్ సభ ప్రతిపక్ష నాయకురాలుగా వ్యాఖ్యానించారు.

సోషల్ మీడియాలో మండిపాటు

ప్రధాని మోదీ పార్లమెంట్ ప్రసంగంపై సోషల్‌ మీడియలో నెటిజన్లు తీవ్రంగానే ప్రతిస్పందిస్తున్నారు.

''ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ అందరికంటే ముందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ మద్దతు తెలిపింది. ఆ పార్టీకి చెందిన ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు'' అని మోదీ పార్లమెంట్ ప్రసంగంపై ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.

''నిన్న అదే పార్లమెంట్‌ సాక్షిగా మీ గౌరవం తగ్గించుకున్నారు. తెలంగాణ.. కశ్మీరో, నోటిఫైడ్ ఏరియానో కాదు'' అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.

వివిధ పార్టీల రాజకీయ నాయకులు కూడా మోదీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో క్యాప్షన్,

రేవంత్ రెడ్డి

తెలంగాణ ఏర్పాటునే మోదీ అవహేళన చేశారు: రేవంత్ రెడ్డి

మోదీ ప్రసంగం చౌకబారుగా ఉందని, ఆయన తెలంగాణ సమాజాన్ని అవమానించేలా మాట్లాడారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు.

''విభజన చట్టం ప్రకారం నేరవేర్చాల్సిన హామీలనే కేంద్రం నెరవేర్చలేదు. ఎన్డీయే మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే, ఆ తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం అక్కడ సమస్యలు పరిష్కరించింది. ఏ రోజైనా ఇద్దరు సీఎంలతో విభజన సమస్యలపై ప్రధాని చర్చించారా?'' అని రేవంత్ ప్రశ్నించారు.

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసేనని ప్రధాని చెప్పడం హర్షణీయమే కానీ, బిల్లు పై ఓటింగ్ సమయంలో తలుపులు మూస్తారనే చిన్న విషయం ప్రధానికి తెలియకపోవడం బాధాకరమని రేవంత్ పేర్కొన్నారు.

ఫొటో క్యాప్షన్,

వి. ప్రకాశ్

'మోదీ తెలంగాణ వ్యతిరేకి'

తెలంగాణ ప్రజల మనోభావాలు తెలియకుండా ప్రధాన మంత్రి మాట్లాడుతున్నారని, తెలంగాణ ఉద్యమ చరిత్ర, పోరాటాల గురించి తెలిసుంటే మోదీ ఇలా మాట్లాడేవారు కాదని టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు, తెలంగాణ జలవనరుల సంస్థ చైర్మన్ వి. ప్రకాశ్ అభిప్రాయపడ్డారు.

''చిన్న రాష్ట్రాలకు ఆర్ఎస్ఎస్ అనుకూలమే కానీ, అదే సంస్థ నుంచి వచ్చిన ప్రధాని మాత్రం రాజకీయ లబ్ధి కోసం చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చులకనగా మాట్లాడుతున్నారు" అని ప్రకాశ్ అన్నారు.

ప్రధాని మోదీ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను విమర్శించేలా ఉన్నాయి కానీ, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయని తాము అనుకోవడం లేదని టీఆర్ఎస్ నేత, ఎంపీ వినోద్ కుమార్ బీబీసీతో అన్నారు.

''అడ్డంగా విభజించారు, నిలువునా విభజించారు అనేది కాదు తెలంగాణ రావడం ముఖ్యం. ఇప్పుడు రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధి చేయడం మా కర్తవ్యం'' అని వినోద్ చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

రామచంద్రరావు

'ఆ ఆగ్రహం కాంగ్రెస్ ధోరణిపైనే.. తెలంగాణపై కాదు'

ప్రధాని ఏ సందర్భంలో అలా వ్యాఖ్యానించారో గమనించాలని తెలంగాణ బీజేపీ నేతలు అంటున్నారు.

బీజేపీ ఎంఎల్సీ రామచంద్రరావు దీనిపై బీబీసీతో మాట్లాడుతూ, ''పార్లమెంట్‌లో కాంగ్రెస్ తీరును మాత్రమే మోదీ విమర్శించారు కానీ, తెలంగాణకు వ్యతిరేకంగా కాదు'' అని అన్నారు.

తెలంగాణ బిల్లు సమయంలో విభజనకు సంబంధించి పార్టీలన్నింటితో చర్చించకుండా కాంగ్రెస్ ముందుకు వెళ్లిందని, అయినా కూడా తమ పార్టీ భేషరతుగా తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చిందని ఆయన గుర్తు చేశారు.

''బీజేపీ మద్దతు లేకుంటే తెలంగాణ ఏర్పాటయ్యేదే కాదు. ఆనాడే అన్ని పార్టీలతో చర్చించి తెలంగాణ బిల్లును రూపొందిస్తే పోలవరం, హైకోర్టు విభజన, ఉద్యోగాల సమస్య తదితర అంశాలపై స్పష్టత వచ్చేది. మోదీ దీనిపైనే వ్యాఖ్యానించారు. తెలంగాణపై వ్యతిరేకంగా కాదు'' అని రాంచంద్రరావు తెలిపారు.

'ప్రధాని వ్యాఖ్యలు సరికావు'

ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి తలుపులు మూసి అడ్డంగా విభజించారు అనడం సరికాదు అని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.

తెలంగాణ బిల్లు పాస్ చేసే సమయంలో తాను సభలో ఉన్నానని, సభలో ఏ బిల్లు పాస్ చేసినా హౌజ్ క్లియర్ అని స్పీకర్ ఆదేశించిన తర్వాత తలుపులు మూసేసి బిల్లు ఆమోదానికి సిద్ధమవుతారని తెలిపారు.

''ప్రధాని వ్యాఖ్యలు తెలంగాణను అవమానించేలా ఉన్నాయి. నాలుగేళ్లు ప్రధానిగా ఉన్న వ్యక్తికి సభ నియమాలు తెలియవా'' అని పొన్నం ప్రశ్నించారు.

'తలుపులు ఎందుకు మూస్తారంటే?'

బిల్లుపై ఓటింగ్ జరుగుతున్నప్పుడు పార్లమెంట్ తలుపులు మూసివేయడంలో తప్పేమీ లేదని ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాల పొలిటకల్ సైన్స్ ప్రొఫెసర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

''బిల్లు ఆమోదించే ప్రక్రియ, ఓటింగ్ అంతా సభ నియమాలను అనుసరించే జరుగుతుంది. సభ అధ్యక్షుడి ఆదేశానికి అనుగుణంగానే సభ నిర్వహణ జరుగుతుంది.

ఎన్నుకోబడిన సభ్యులు మాత్రమే బిల్లుపై ఓటింగ్ చేయడానికి అర్హులు. బిల్లుపై ఓటింగ్ జరుగుతున్నప్పుడు బయటివారు లోపలికి, లోపలివారు బయటకు వెళ్లకుండా ఉండేందుకు తలుపులు మూసివేస్తారు. ఇందులో తప్పేమీ లేదు'' అని వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)