పెన్షన్‌కు భరోసా లేదు.. బతుక్కి భద్రత లేదు!

  • సతీష్ ఊరుగొండ
  • బీబీసీ ప్రతినిధి
సీపీఎస్

ఫొటో సోర్స్, Getty Images

'ప్రతీ నెల నా జీతంలో 10శాతం కోత పెడుతున్నారు. 30ఏళ్లు ఉద్యోగం చేసి, రిటైరైన తర్వాత నెలకు వందల్లో పెన్షన్ ఇస్తే ఎలా బతికేది? వృద్ధాప్యంలో కుటుంబాన్ని ఎలా పోషించేది?

ఇది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజు అనే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఆవేదన.

ఈ సమస్య ఒక్క రాజుదే కాదు.. అలాంటి వాళ్లు దేశవ్యాప్తంగా లక్షల మంది ఉన్నారు.

ఏపీలో సుమారు లక్షా 84వేల మంది, తెలంగాణలో సుమారు లక్షా 15వేల మంది ఉద్యోగులు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు.

వీరందరి ఆవేదనకు కారణం ఒకటే. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌-సీపీఎస్‌.

ఉద్యోగులకు ఇది మరణశాసనంగా మారిందని వారు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, VVRAJU

ఫొటో క్యాప్షన్,

సీపీఎస్ అమలుతో రిటైర్మెంట్ తర్వాత తమ పరిస్థితి ఇలా ఉంటుందంటూ ఏపీ ఉద్యోగులు నిరసన తెలిపారు.

గల్లీ నుంచి దిల్లీ వరకు పోరాటాలు

సీపీఎస్ రద్దు కోసం గల్లీ నుంచి దిల్లీ వరకు ఎక్కడికక్కడ పోరాటాలు చేస్తున్నారు.

మిలియన్ మార్చ్‌లు, సాగర హారాలు, ధర్నాలతో తమ ఆగ్రహాన్ని పాలకుల దృష్టికి తీసుకెళ్తున్నారు.

ప్రభుత్వాలు పెద్దగా స్పందించకపోవడంతో ఇప్పుడు మలిదశ ఉద్యమానికి ఉద్యోగులు సిద్ధమవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 'చలో కలెక్టరేట్‌'తో ఉద్యోగులు నిరసనలు చేపట్టబోతున్నారు.

ఈ నిరసనలకు ఏపీ ఎంప్లాయిస్‌ జేఏసీ, ఏపీసీపీఎస్ ఎంప్లాయిస్ అసోషియేషన్, ఏపీ ఎన్జీవో, పెన్షన్ సాధన సమితి, ఏపీయూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఎస్‌టీయూ, పీఆర్‌టీయూ మద్దతు పలికాయి.

ప్రభుత్వం దిగిరాకుంటే బడ్జెట్ సమావేశాల్లో ఏపీ అసెంబ్లీని ముట్టడిస్తామని ఉద్యోగ సంఘాలు సంకేతాలు ఇచ్చాయి.

ఈ నెల 11న తెలంగాణలోని హన్మకొండలో భారీ ర్యాలీకి ఆ రాష్ట్ర ఉద్యోగులు సన్నాహాలు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, VVRAJU

ఫొటో క్యాప్షన్,

సీపీఎస్ రద్దు చేయాలంటూ గతేడాది ఆగస్టులో ఉద్యోగులు మిలియన్ మార్చ్ నిర్వహించారు.

ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నారు

తమ హక్కులను పాలకులు కాలరాస్తున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

'సీపీఎస్‌లో ఉన్న ఉద్యోగి చనిపోతే అతని కుటుంబం రోడ్డున పడుతోంది. అంత్యక్రియల కోసం ఇచ్చే రూ.10వేలు మినహా ప్రభుత్వం నుంచి పైసా కూడా రావడం లేదు' అని ఏపీసీపీఎస్ ఎంప్లాయిస్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి బాజీ పఠాన్ అన్నారు.

ఏపీలో ఇప్పటి వరకు 287 మంది ఉద్యోగులు చనిపోయారని, ఐదారేళ్లు అవుతున్నా వారికి ఒక్క రూపాయి కూడా అందలేదని బాజీ పఠాన్ చెప్పారు. కనీసం జీతంలో కట్ చేసిన డబ్బులు కూడా వెనక్కి రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

'భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్లకు చంద్రన్న బీమా ద్వారా ప్రభుత్వం ఆదుకుంటోంది. మరి, ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే అతని కుటుంబం రోడ్డున పడాల్సిందేనా' అని ఆయన ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, VVRAJU

ఫొటో క్యాప్షన్,

సీపీఎస్ అంతం అయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. (వీవీరాజు, బాజీ పఠాన్, రామాంజనేయులు యాదవ్ )

ఇంతకీ సీపీఎస్‌ అంటే ఏమిటి?

2003లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం-సీపీఎస్‌ తీసుకొచ్చింది. దీన్నే నేషనల్ పెన్షన్ స్కీమ్-ఎన్‌పీఎస్‌ అని కూడా పిలుస్తారు.

ఆ తర్వాత త్రిపుర, పశ్చిమ బెంగాల్ మినహా ఏపీ, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు ఈ స్కీమ్‌లో చేరాయి.

కొత్త పెన్షన్ స్కీమ్ ప్రకారం 2004, జనవరి 1 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరే వారందరూ సీపీఎస్‌ కిందికి వస్తారు.

అప్పటి వరకు రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వమే ఉద్యోగులకు పెన్షన్ ఇచ్చేది.

కానీ కొత్త స్కీమ్ ప్రకారం పెన్షన్ కోసం ప్రతీనెల ఉద్యోగి జీతం నుంచి 10శాతం కట్ చేస్తారు. ప్రభుత్వం మరో 10శాతం నిధులు ఇస్తుంది.

ఈ పెన్షన్‌ నిధిని నేషనల్‌ పెన్షన్‌ స్కీం-ఎన్‌పీఎస్‌ ట్రస్టు, నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్‌-ఎన్‌ఎస్‌డీఎల్‌ ద్వారా షేర్‌ మార్కెట్‌లో మదుపు చేస్తారు.

పదవీ విరమణ సమయంలో సర్వీసు మొత్తంలో ఉద్యోగి, ప్రభుత్వ వాటా మొత్తం నిధిలో నిర్ణీత శాతంలో యాన్యుటీ ప్లాన్‌లలో ఉంచి నెలవారీ పెన్షన్ చెల్లిస్తారు.

దీనికోసం 2013లో యూపీఏ ప్రభుత్వం, విపక్ష ఎన్డీఏ మద్దతుతో 'పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ యాక్ట్‌' -పీఎఫ్‌ఆర్‌డీఏ తెచ్చింది.

ఫొటో సోర్స్, VVRAJU / BAZI PATAN

సీపీఎస్‌ను ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

ఇది వరకు పెన్షన్ కోసం ఉద్యోగి జీతం కట్ చేసేవారు కాదు. ఇప్పుడు జీతంలో 10శాతం కోత పెడుతున్నారు.

పాత విధానం ప్రకారం.. పెన్షన్‌కు గ్యారెంటీ ఉండేది. పదవి విరమణకి ముందు ఉద్యోగి జీతం ఆధారంగా అతని పెన్షన్ ఖరారు చేసేవారు.

ఉదాహరణకు పాత పెన్షన్‌ విధానంలో ఒక ఉద్యోగి బేసిక్‌ వేతనం రిటైరయ్యే నాటికి రూ. 50వేలు ఉందనుకుంటే పదవీ విరమణ తరువాత అతడికి రూ. 25వేలు పెన్షన్‌గా అందుతుంది.

40 శాతం కమ్యూటేషన్‌ చేసినా డీఏ, మెడికల్‌ అలవెన్సులు కలిపితే కుటుంబ అవసరాలకు తగినంత పెన్షన్‌గా వచ్చేది.

కొత్త విధానంలో పెన్షన్‌కు ఎలాంటి భరోసా ఉండదు. స్టాక్ మార్కెట్ పెరిగితే పెన్షన్ పెరుగుతుంది. సెన్సెక్స్ కుప్పకూలితే పెన్షన్ కూడా కరిగిపోతుంది.

ఫొటో సోర్స్, VVRAJU / BAZI PATAN

ఫొటో క్యాప్షన్,

గల్లీ నుంచి దిల్లీ వరకు సీపీఎస్ రద్దు కోసం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి

పాత విధానంలో పెన్షన్ ముందుగానే సరెండర్ చేయవచ్చు. దీన్నే కమ్యూటేషన్ అంటారు. సీపీఎస్‌లో ఆ సౌకర్యం లేదు.

పాత విధానంలో పెన్షన్‌తో సంబంధం లేకుండా గరిష్ఠంగా 12 లక్షల వరకు గ్రాట్యూటీ వచ్చేది. ఇప్పుడు గ్రాట్యూటీ లేదు.

పాత పెన్షన్ విధానం ప్రకారం ఉద్యోగి చనిపోయిన తర్వాత అతని కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్‌ వస్తుంది.

ఉద్యోగి చివరి బేసిక్‌లో సగం, దానిపై డీఏను పెన్షన్‌గా ఇచ్చేవారు.

కొత్త పెన్షన్ విధానంలో ఉద్యోగి చనిపోతే షేర్‌ మార్కెట్లో ఉన్న సొమ్ము మొత్తం ఆ కుటుంబానికి చెల్లిస్తారు. తరువాత ఆ ఎలాంటి పెన్షన్ ఉండదు.

ఫొటో సోర్స్, TSCPSEU / Facebook

ఫొటో క్యాప్షన్,

తెలంగాణ ఉద్యోగులు సీపీఎస్‌కు వ్యతిరేకంగా ధర్మ దీక్ష చేపట్టారు.

సీపీఎస్‌ ఉద్యోగులకు ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతా సౌకర్యం కూడా ఉండదు. వాణిజ్య బ్యాంకుల్లో నగదు దాచుకుంటే వడ్డీపై ఇన్‌కంట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది.

సీపీఎస్‌ కింద మదుపు చేసిన మొత్తంపై అప్పు తీసుకునే అవకాశమూ ఉండదు.

కుటుంబ పెన్షన్‌ లేకపోవడం, కమ్యూటేషన్‌ తొలగించటం, ఇతర ప్రయోజనాలను కూడా లేకుండా చేయడంతో వృద్ధాప్యంలో తమ పరిస్థితి ఏమిటని ఉద్యోగులు నిలదీస్తున్నారు.

అందుకే సీపీఎస్‌ అంతానికి ఉద్యోగులు పంతం పట్టారు. సీపీఎస్‌తో తమ కుటుంబాలు ఎలా బతకాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

అయితే, దీర్ఘకాలంలో ఉద్యోగుల సంపద వృద్ధికి సీపీఎస్ ఎంతో ఉపయోగపడుతుందని పీఎఫ్‌ఆర్‌డీఏ చెబుతోంది.

ఫొటో సోర్స్, VVRAJU / BAZI PATAN

'కార్పొరెట్ శక్తులకు మా సొమ్ము దోచిపెట్టేందుకే సీపీఎస్'

'సీపీఎస్‌ చాలా దుర్మార్గమైన వ్యవస్థ' అని ఏపీసీపీఎస్ ఎంప్లాయిస్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి బాజీ పఠాన్ అన్నారు. కార్పొరెట్ శక్తులకు జనం, ఉద్యోగుల సొమ్ము దోచిపెట్టేందుకే దీన్ని తీసుకొచ్చారని ఆరోపించారు.

కేంద్రంపై నెపం నెట్టేసి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని కూడా ఆయన అన్నారు. అన్ని పార్టీలు కలిసి ఉద్యోగుల గొంతు కోశాయని బాజీ పఠాన్ అన్నారు.

'ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదు'

సీపీఎస్ అమలు చేస్తే.. ఉద్యోగులు, ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ఏపీసీపీఎస్ ఎంప్లాయిస్ అసోషియేషన్ శ్రీకాకుళం జిల్లా అసోసియేటెడ్ ప్రెసిడెంట్ వీవీరాజు అన్నారు.

30ఏళ్ల పాటు ప్రభుత్వానికి సేవ చేసే ఉద్యోగిని చివరి దశలో ఇంతగా కష్టపెట్టడం ప్రభుత్వాలకు సరికాదని రాజు సూచించారు. తమ కుటుంబం రోడ్డున పడితే ఆక్రోషం రాకుండా ఏమొస్తుందని అన్నారు.

ఫొటో సోర్స్, Naveen

ఫొటో క్యాప్షన్,

సీపీఎస్‌పై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

'సీపీఎస్‌పై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి'

సీపీఎస్‌పై కేంద్రమే ఒక నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నాయి. అయితే, ఈ వాదనతో ఉద్యోగ సంఘాల నాయకులు విబేధిస్తున్నారు.

సీపీఎస్ నుంచి బయటకి వస్తామని ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే సమస్య పరిష్కారం అవుతుందని వీవీరాజు అన్నారు.

ఈ వివాదాన్ని రాష్ట్రంలోనే తేల్చుకోవాలని సమాచార హక్కు చట్టం ద్వారా కేంద్రం స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

సీపీఎస్ విధానం నుంచి బయటికొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్వచ్ఛ ఉందని ఏపీసీపీఎస్ ఎంప్లాయిస్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు యాదవ్ అన్నారు. ఎందుకంటే పెన్షన్ చెల్లింపు రాష్ట్ర జాబితాలోని అంశమని, ఉద్యోగికి ఇచ్చే జీతం, పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆయన చెబుతున్నారు.

పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని, కాకపోతే ఇప్పటి వరకు పీఆర్ఏఎన్ ఖాతాలో ఉన్న డబ్బులు వెనక్కి తీసుకునే విషయంలోనే కాస్త సంక్షిష్టత ఉందని ఆయన తెలిపారు. అందుకే తాము రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని రామాంజనేయులు యాదవ్ చెప్పారు.

పాత పెన్షన్ విధానం అమలు చేసే వరకు పోరాటం ఆగదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు.

సమస్య పరిష్కరించాలని కేరళ ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపిందని ఆయన గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.