విదేశాంగ విధానం: భారత్ తోడు పెళ్లికూతురేనా?

  • జుబేర్ అహ్మద్
  • బీబీసీ ఇండియా
ప్రధానమంత్రి నరేంద్రమోదీ

ఫొటో సోర్స్, Dan Kitwood/Getty Images

విదేశాంగ విధానం విషయంలో భారతదేశం ఎప్పుడూ అసలు పెళ్లికూతురులా కాకుండా.. తోడు పెళ్లికూతురులా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంకా చెప్తే సిగ్గుపడుతున్నట్లు అభినయించే దొరసానిలా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయ వేదికపై సూపర్ పవర్‌గా ఎదగాలని, ప్రతిష్ఠాత్మక ప్రపంచ శక్తిగా అవతరించాలని భారతదేశం చాలా కాలంగా ఆకాంక్షిస్తోంది. కానీ ఆ ఆకాంక్షకు తగిన ఒక విశాల విధానం కానీ, నిర్ణయాత్మక చర్యలు కానీ లోపించాయి.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ భూగోళం నలుమూలలా పర్యటిస్తూ ఉన్నారు. దానివల్ల అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ఠ పెరుగుతోందనటంలో సందేహం లేదు. అయితే ఆయన పర్యటనలతో సమానంగా ఆయన విదేశాంగ విధానం ముందుకు సాగటం లేదని చాలా మంది భావిస్తున్నారు. భారత విదేశాంగ విధానం ఇంకా ద్వైపాక్షికత మీద, ప్రాంతీయత మీదే కేంద్రీకృతమైందని చాలా మంది నిపుణులు అంగీకరిస్తున్నారు.

భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా అవతరించే సామర్థ్యం గల దేశంగా ఇప్పుడు గుర్తిస్తున్నారు. కానీ ఆ సామర్థ్యం ఇంకా సంతరించుకోలేదు. ఐక్యరాజ్యసమితిలో విశిష్ట బృందమైన ఐదుగురు సభ్యుల భద్రతామండలిలో తనకు శాశ్వత సభ్యత్వం సాధించటం కోసం భారత్ ప్రయత్నిస్తోంది. భారత్ తన లక్ష్యాన్ని అందుకునేందుకు సాయం చేయటానికి అమెరికా, బ్రిటన్ వంటి ప్రపంచ శక్తులు ప్రయత్నించాయి కూడా. అయితే.. ప్రపంచంలో తనకు న్యాయంగా దక్కాలని నమ్ముతున్న ఆ స్థానాన్ని సొంతం చేసుకోవటంలో భారతదేశం వెనుకంజ వేసినట్లు కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశం తనను తాను ప్రపంచ శక్తిగా చాటేందుకు ఒక అవకాశముంది. ఇజ్రాయెల్ - పాలస్తీనా అథారిటీల మధ్య అమెరికా స్థానంలో మధ్యవర్తి పాత్రను తాను భర్తీ చేయటానికి భారతదేశం ప్రయత్నించాలని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జెరూసలేం భవిష్యత్ హోదా విషయంలో ఇజ్రాయెల్ పక్షం వహించిన అమెరికాతో సంప్రదింపులు జరపటానికి పాలస్తీనియన్లు తిరస్కరించటంతో ఈ అవకాశం లభిస్తోంది.

ఈ విషయంలో భారత వైఖరి స్పష్టమైనదే: 1967 ముందున్న సరిహద్దులు ప్రాతిపదికగా రెండు దేశాల పరిష్కారాన్నే భారత్ ఎప్పుడూ సమర్థిస్తోంది. ఆ విషయం ఇజ్రాయెల్‌కు తెలుసు. జెరూసలేం అంశం మీద భారత్ తనపక్షం వహించబోదని కూడా ఇజ్రాయెల్‌కు తెలుసు. ఇజ్రాయెల్‌తో బలపడుతున్న భారత సంబంధాల గురించి పాలస్తీనియన్లకు కూడా తెలుసు. భారత్ తన రక్షణ, భద్రత సామర్థ్యాలను మెరుగుపరచుకోవటానికి ఇజ్రాయెల్ మీద చాలా అధారపడిందన్న వాస్తవాన్ని పాలస్తీనా అంగీకరించింది. పశ్చిమాసియాలోని ఈ రెండు దేశాలతోనూ భారత్ పారదర్శక లావాదేవీలు నెరపటం వాటి విశ్వాసాన్ని సముపార్జించింది.

ఇప్పుడు.. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటన ముగిసిన వెంటనే నరేంద్రమోదీ మూడు అరబ్ దేశాల్లో (ఫిబ్రవరి 9 నుంచి 12 వరకు) పర్యటించనున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్‌లతో పాటు.. వెస్ట్ బ్యాంక్‌లోని రమల్లాను కూడా సందర్శించనున్నారు. ఇజ్రాయెల్‌లో పర్యటించిన తొలి భారత ప్రధానమంత్రి అయినట్లుగానే.. రమల్లాను సందర్శించనున్న తొలి భారత ప్రధాని కూడా ఆయనే.

ఫొటో సోర్స్, Getty Images

‘‘మన పాత బంధాల’’ను బలోపేతం చేయటం కోసం ప్రధానమంత్రి వెస్ట్ బ్యాంక్‌లో పర్యటిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. నిజానికి 2015లో భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వెస్ట్ బ్యాంక్‌లో పర్యటించటాన్నే చరిత్రాత్మకమని కీర్తించారు. అయితే.. ఆ ప్రాంతంలో నరేంద్రమోదీ పర్యటించబోవటం పాలస్తీనావాసుల్లో అంతకన్నా ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

బద్ధ శత్రువులైన ఈ రెండు దేశాలతోనూ ఆరోగ్యకరమైన సంబంధాలు కొనసాగించగలగటం భారత విజయం. ఇది ‘‘ఇజ్రాయెల్, పాలస్తీనాలతో మన సంబంధాలను వేర్వేరుగా నెలకెల్పుకోవటం (డీహైఫనేషన్)’’గా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు అభివర్ణించారు.

ఈ రెండు దేశాల ప్రభుత్వాల వద్ద విశ్వసనీయత కలిగివుండటంతో పాటు.. పాలస్తీనా వాసుల్లో భారత్‌కు ఎంత ప్రజాదరణ ఉందో ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా అంతే ప్రజాదరణ ఉంది. ఘర్షణ పడుతున్న ఈ రెండు పక్షాల మధ్య శాంతి కోసం నిజాయితీ గల మధ్యవర్తి పాత్రను నెరవేర్చగల అవకాశం దీనిద్వారా లభిస్తోంది. ప్రత్యేకించి పాలస్తీనియన్ల దృష్టిలో అమెరికా విశ్వసనీయత కోల్పోయిన ఈ సమయం.. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు భారత్‌కు మంచి అవకాశం కాగలదు.

ఫొటో సోర్స్, Getty Images

మరి ఈ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకుంటుందా? భారత గత చరిత్రను చూస్తే వచ్చే జవాబు ‘లేదు’.

భారతదేశం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని భావించే వారిలో జేఎన్‌యూలోని పశ్చిమాసియా అధ్యయనాల కేంద్రంలో ప్రొఫెసర్ ఎ.కె.రామకృష్ణన్ ఒకరు. ‘‘భారత్‌కి ఇదో మంచి అవకాశం. దీనిని అందుకోవాలి. ఇందులో సందేహం లేదు’’ అని ఆయన అంటారు.

భారత్ ప్రయత్నించవచ్చు కానీ.. అమెరికా విఫలమైన చోట భారత్ విజయం సాధిస్తుందని తాను భావించటం లేదని భారత మాజీ విదేశాంగ కార్యదర్శి శశాంక్ అంటారు. ‘‘ఆ ప్రయత్నం చేయవచ్చు. కానీ అది సులభం కాదు. సమస్య జటిలమైనది. చాలా పాతది. అమెరికా విఫలమైందంటే.. భారత్ ఎలా విజయవంతమవుతుందనేది చెప్పటం కష్టం. అయినా ప్రయత్నం చేయవచ్చు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images

అయితే.. భారతదేశం ముందుగా ఉన్నతంగా ఆలోచించటం, ద్వైపాక్షికతను మించి ముందుకు సాగటం చేయాల్సిన అవసరం ఉందని విదేశాంగ విధాన నిపుణులు చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య భారత్ మధ్యవర్తిత్వం నెరపాలని కోరుకుంటున్న రామకృష్ణన్.. భారత్ శాంతిదూతగా పాత్ర చేపట్టేముందు విశాలమైన వ్యూహాన్ని రచించాలని విదేశాంగ విధాన రూపకర్తలకు సూచిస్తున్నారు.

మరి.. ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య భారత్ శాంతిదూత పాత్ర పోషించటం తన శక్తికి మించిన పని అవుతుందా? ఆ పాత్ర చేపట్టే ముందు భారత్ తొలుత ఇతర పెద్ద శక్తులను సంప్రదించాల్సి ఉంటుందని శశాంక్ అంటున్నారు. ‘‘ఒకవేళ భారత్ ఇతరులను సంప్రదించకుండా ఒంటరిగా ముందుకెళితే అది శక్తికి మించిన పని అవుతుందని చెప్పొచ్చు. కానీ భద్రతామండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలను, పశ్చిమాసియాలోని ఇతర దేశాలను సంప్రదించినట్లయితే.. తను మధ్యవర్తి పాత్రను పోషించేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించగలదు. అప్పుడు భారత్ పాత్రను ముఖ్యమైనదిగా పరిగణించవచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, JACK GUEZ/AFP/Getty Images

అయితే పాలస్తీనా అధ్యక్షుడు మొహమూద్ అబ్బాస్, భారత ప్రధాని మోదీలు శనివారం నాడు మధ్యాహ్న విందు భేటీలో పాల్గొన్నపుడు.. ఈ పాత వైరి దేశాల మధ్య భారత్ కొత్త శాంతిదూత పాత్ర పోషించగల సాధ్యాసాధ్యాలపై చర్చించబోరు. కానీ ఈ ఆలోచన గురించి ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు. ప్రపంచ శక్తిగా ముందుకు రావాల్సిన భారం భారత్ మీదే ఉంది. ఇందుకోసం.. కొన్ని సంకటాలతో కూడుకుని ఉన్నప్పటికీ.. ఇజ్రాయెల్ - పాలస్తీనా అంశానికి మించిన వేదిక మరొకటి ఉండదు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)