ప్రెస్ రివ్యూ: రూ.500లకే 4జీ స్మార్ట్‌ఫోన్‌

ఫోన్ వాడుతున్న చైనా అమ్మాయిలు

ఫొటో సోర్స్, Getty Images

రూ.500లకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందించేందుకు టెలికం సంస్థలు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ ప్రయత్నాలు చేస్తున్నాయి.

అందుకోసం మొబైల్ తయారీ కంపెనీలతో చర్చిస్తున్నాయని నమస్తే తెలంగాణ పత్రిక ఓ కథనం ప్రచురించింది.

దీంతో పాటు అధిక వాయిస్, డేటాను కేవలం నెలకు రూ.60-70కే ఈ సంస్థలు ఆఫర్ చేయనున్నాయి.

రూ.1500 సెక్యూరిటీ బాండ్‌తో జియోఫోన్ పేరుతో ఫీచర్ ఫోన్లను జియో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వినియోగదారులకు సరికొత్త బొనాంజా అందించేందుకు మిగతా సంస్థలు వస్తున్నాయని విశ్లేషకులు తెలిపారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు

ఫొటో సోర్స్, facebook/chandrababunaidu

వెనకడుగు వద్దు.. పోరాడండి

ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీల అమలుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ లోక్‌సభలో గురువారం చేసిన ప్రకటనపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

దుబాయ్‌ పర్యటనలో ఉన్న ఆయన టీడీపీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 'నాకేమో అన్నీ చేసేస్తామని చెబుతారు. మన అధికారులను ఢిల్లీలో కూర్చోపెట్టుకుని మూడు రోజులుగా మాట్లాడుతున్నారు. చివరకు ఏం చెప్పారు? ఆ ప్రకటనలో ఏముంది? దీని కోసమేనా మనం ఎదురు చూసింది' అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఇక వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. మన పోరాటం కొనసాగుతుంది. ఆపేది లేదు' అని తేల్చిచెప్పారు. రాష్ట్రానికి సాయం చేయడానికి నిధుల్లేవన్న జైట్లీ వ్యాఖ్యలను సీఎం తప్పుబట్టారు. రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఈ లెక్కలు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఇచ్చిన హామీల గురించి అడిగినప్పుడే లెక్కలు చెప్పడం సరికాదన్నారు.

'వారి ప్రవర్తన ఘోరంగా ఉంది. మీరు నిరసన తీవ్రతరం చేయండి.. ఏమాత్రం రాజీపడొద్దు' అని తేల్చిచెప్పారు.

ఆధార్ కార్డు

ఫొటో సోర్స్, Getty Images

ఆధార్‌తో రూ.75,000 కోట్లు ఆదా!

ఆధార్‌ ప్రాతిపదికగా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) చేస్తున్నందువల్ల కేంద్ర ప్రభుత్వం రూ.75,000 కోట్లు ఆదా చేయగలిగిందంటూ ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

యూపీఏ సర్కారు హయాంలోనే ఆధార్‌ మొదలైనా ఇటీవలి ఏళ్లలో ఇది అనేక రెట్లు విస్తరించింది. 2014 ఏప్రిల్‌ 1 నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే ఇంత భారీ మొత్తం ప్రభుత్వానికి మిగిలిందని తేలింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే డీబీటీ ద్వారా బుధవారం వరకు రూ.లక్ష కోట్ల పైచిలుకు మొత్తాన్ని పంపిణీ చేశారు. మార్చి ఆఖరు నాటికి ఇది రూ.1.20 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా.

మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 60% పెరిగింది. 2013-14లో రూ.7367 కోట్లు బట్వాడా అయితే, 2016-17లో అది రూ.74,707 కోట్లకు చేరిందని ఈనాడు వివరించింది.

కన్నుపై గూగుల్

ఫొటో సోర్స్, Getty Images

గూగుల్‌కు రూ.136 కోట్ల జరిమానా

ఆన్‌లైన్‌ సెర్చ్‌‌లో అక్రమ వ్యాపార విధానాలను అవలంభించినందుకు గూగుల్ సంస్థకు 'కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా' (సీసీఐ) రూ.136 కోట్ల జరిమానా విధించిందని ప్రజాశక్తి పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

మ్యాట్రిమొని డాట్‌ కామ్‌, కన్జూమర్‌ యూనిటీ అండ్‌ ట్రస్ట్‌ సొసైటీలు 2012లో గూగుల్‌ ఎల్‌ఎల్‌సీ, గూగుల్‌ ఇండియా, గూగుల్‌ ఐర్లాండ్‌ సంస్థలపై ఫిర్యాదు చేశాయి.

ఈ ఫిర్యాదును విచారణకు తీసుకున్న సీసీఐ, గూగుల్‌ నమ్మకానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం అనే నిబంధనను ఉల్లంఘించినందుకు గాను జరిమానా విధించాలని నిర్ణయిస్తూ ఆదేశాలను జారీ చేసింది.

వివిధ అంశాలపై సెర్చ్ ఫలితాలను కొన్ని సంస్థలకు కొమ్ముకాసే విధంగా ఇస్తూ గూగుల్ అక్రమాలకు పాల్పడినట్టు సీసీఐ పేర్కొంది. అందుకు 2013 నుంచి 2015 వరకు భారత్‌లోని కార్యకలాపాల ద్వారా గూగుల్‌ ఆర్జించిన ఆదాయంలో 5 శాతాన్ని జరిమానాగా విధించినట్టుగా వెల్లడించింది.

Tiger

ఫొటో సోర్స్, Other

తెలంగాణలో ఉన్నది 17 పులులే

తెలంగాణలోని అడవుల్లో మొత్తం 17 పులులు, 125 చిరుతలు ఉన్నాయని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. జాతీయ జంతు గణనలో భాగంగా సేకరించిన పాదముద్రల ఆధారంగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారని సాక్షి ఓ కథనంలో పేర్కొంది.

అత్యధికంగా నల్లమల అడవుల్లో 21 పెద్ద పులులు, 57 చిరుతల అడుగు జాడలను సేకరించగా.. అవి 13 పులులు, 45 చిరుతల పాదముద్రలని భావిస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కవ్వాల్‌ టైగర్‌ ప్రాజెక్టు పరిధిలో 4 పులులు, 25 చిరుతల అడుగుజాడలను గుర్తించారు. కచ్చితమైన నిరూపణ కోసం పాదముద్రలను డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు, పెంటిక (మలం) నమూనాలను సీసీఎంబీ హైదరాబాద్‌కు పంపించారు.

రూ.కోట్లకు కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేసిన జన్నారం అభయారణ్యంలో ఒక్క పులి జాడ కూడా దొరకలేదు.

నల్లగొండ జిల్లాలో 22 నుంచి 25 వరకు, ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 14 నుంచి 16 వరకు చిరుత పులుల జాడలు దొరికాయి. కరీంనగర్‌ జిల్లాలో కేవలం ఒకే ఒక చిరుత పాదముద్రలు లభించాయి.

హైదరాబాద్‌ మహానగరం పరిసరాల్లో రెండు చిరుతల అడుగు జాడలు కనిపించాయి.

వీడియో క్యాప్షన్,

చిరుత పులి బలహీనత ఏంటో తెలుసా?

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)