టీడీపీ మరో శివసేన అవుతుందా?

  • బీఎస్ఎన్ మల్లేశ్వర రావు
  • బీబీసీ ప్రతినిధి
ఉద్ధవ్ ఠాక్రే, నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

‘ఒకరినొకరు విశ్వసించట్లేదు’

బీజేపీకి దాదాపు మూడు దశాబ్దాలుగా మిత్రపక్షంగా ఉంటున్న పార్టీ శివసేన. కానీ, ఈ రెండు పార్టీల మధ్య గిల్లికజ్జాలు, బెదిరింపులు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర బడ్జెట్‌లో చేసిన కేటాయింపులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ.. పార్లమెంటు వేదికగా నిరసన తెలుపుతోంది.

ఉభయ సభల్లో ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేస్తున్నారు. అయితే, ప్రభుత్వంలో భాగమైన మిత్రపక్షాలు కేంద్రంపై అసంతృప్తి ప్రకటించటం, ప్రధాన అధికార పక్షంపై విమర్శలు చేయటం ఇదే తొలిసారి కాదు.

ఎన్డీఏలో భాగస్వామి అయిన శివసేన కూడా బీజేపీతో గొడవలు పడుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో కలసి పోటీ చేసిన ఈ రెండు పార్టీలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వేర్వేరుగా బరిలోకి దిగాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో శివసేన కంటే బీజేపీ బలమైన పార్టీగా అవతరించింది.

తాజాగా బీజేపీపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ఏపీ బీజేపీ నాయకులు సైతం టీడీపీ, చంద్రబాబును టార్గెట్ చేసుకుని విమర్శలకు దిగుతున్నారు.

ఈ నేపథ్యంలో.. శివసేనపై బీజేపీ ఎలాంటి వ్యూహం అనుసరించింది? ప్రస్తుతం టీడీపీ-బీజేపీ విభేదాల్లో అలాంటి వ్యూహాలు ఏమైనా ఉన్నాయా? అన్న అంశాలపై బీబీసీ మరాఠీ ఎడిటర్ ఆశిష్ దీక్షిత్, ఆంధ్రజ్యోతి, మహాన్యూస్ తదితర మీడియా సంస్థలకు ఎడిటర్‌గా పనిచేసిన ఐ వెంకట్రావుల విశ్లేషణ.. వారి మాటల్లోనే.

ఫొటో సోర్స్, TDP/BJP/ShivSena

పొత్తులు ఎలా ఏర్పడ్డాయి?

శివసేన-బీజేపీ: దాదాపు మూడు దశాబ్దాల కిందటే ఈ పొత్తు చిగురించింది. 1989 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలసి పోటీ చేశాయి. అప్పట్లో వాజ్‌పేయి, బాల్ ఠాక్రే, మనోహర్ జోషిలు దీనికి ఆద్యులు కాగా తర్వాతి కాలంలో ప్రమోద్ మహాజన్, ముండే లాంటి వాళ్లు ఆ స్ఫూర్తిని కొనసాగించారు.

టీడీపీ-బీజేపీ:చంద్రబాబు కన్వీనర్‌గా ఉన్న యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం పడిపోయాక కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని వామపక్షాలు సూచించాయి. గతంలో కాంగ్రెస్ యునైటెడ్ ఫ్రంట్‌కు మద్దతు ఇచ్చినందువల్ల అలా చేయటమే సరైనదని భావించాయి. కానీ, ఏపీలో కాంగ్రెస్‌తో పోరాడుతున్న తాను కేంద్రంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వలేనని చంద్రబాబు ఆ కూటమి నుంచి బయటికొచ్చారు. అదే సమయంలో ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వాన్ని కోల్పోయిన వాజ్‌పేయికి దేశవ్యాప్తంగా సానుభూతి పెరిగింది. దీంతో బీజేపీతో జత కట్టాలని చంద్రబాబు భావించగా.. వెంకయ్య నాయుడు, తదితరులు ఈ పొత్తుకు కారకులయ్యారు.

సంబంధాలు ఎలా ఉండేవి?

శివసేన-బీజేపీ: శివసేనను బాల్ ఠాక్రే శాసించినంతకాలం ఈ రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు ఉండేవి. కొన్ని అంశాలపై భేదాభిప్రాయాలు తలెత్తినా అవి విభేదాల స్థాయికి చేరలేదు. రాష్ట్రంలో ఎన్నడూ అధికారం చేపట్టనందున కేంద్ర ప్రభుత్వంపై శివసేనకు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం విషయాల్లో గొడవలు పెద్దగా లేవు. బీజేపీ నేత‌ృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో శివసేన భాగస్వామి అయినప్పటికీ.. నిధుల్ని తెచ్చుకోవాల్సిన బాధ్యత, ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్రం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలపైనే ఉంది.

టీడీపీ-బీజేపీ: వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు శంషాబాద్‌లో విమానాశ్రయ ఏర్పాటు విషయంలో కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని మిథాని సంస్థ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే, చంద్రబాబు నాయుడు దానికోసం పట్టుబట్టడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వాజ్‌పేయి ఆదేశించారు. చంద్రబాబు నాయుడు ప్రత్యామ్నాయ స్థలాన్ని సూచించటంతో రక్షణ శాఖ శంషాబాద్ విమానాశ్రయ నిర్మాణానికి తలూపింది. అప్పట్లో చంద్రబాబు ఎప్పుడు అపాయింట్‌మెంట్ కోరితే అప్పుడు వాజ్‌పేయి కాదనకుండా ఇచ్చేవారు. జయలలితకు మాత్రం ఇచ్చేవారు కాదు. ఆమెపై వాజ్‌పేయికి నమ్మకం లేకపోవటమే అందుకు కారణం.

ఫొటో సోర్స్, Shivsena/Facebook

ఫొటో క్యాప్షన్,

‘శివసేనను బాల్ ఠాక్రే శాసించినంతకాలం ఈ రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు ఉండేవి’

విభేదాలు ఎప్పుడొచ్చాయి?

శివసేన-బీజేపీ: 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మోదీని, ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్షుడిగా అమిత్‌షాను నియమించగానే రెండు పార్టీల మధ్య పొరపొచ్చాలు ఏర్పడ్డాయి. రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం పెరుగుతూ వచ్చింది. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేశాయి. కానీ, తర్వాత బీజేపీ ప్రభుత్వంలో శివసేన కూడా చేరింది. ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని తరచూ బెదిరిస్తుంటుంది. శివసేన నాయకులు తీవ్ర స్థాయిలో బీజేపీని విమర్శించటం సాధారణమైపోయింది.

టీడీపీ-బీజేపీ: వాస్తవానికి గుజరాత్‌ అల్లర్ల తర్వాత కూడా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు చెదరలేదు. తర్వాతి కాలంలో చంద్రబాబు విమర్శలు చేసినప్పటికీ, ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ రెండు పార్టీలూ విడిపోయాయి. రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. తాజాగా రాష్ట్రానికి చేయాల్సినంత సాయం కేంద్రం చేయటంలేదని టీడీపీ భావిస్తోంది. దీంతో విభేదాలు తలెత్తాయి.

విభేదాలకు రాజకీయ కారణాలేంటి?

శివసేన-బీజేపీ: మహారాష్ట్రలోని హిందూ ఓటు బ్యాంకునే ఈ రెండు పార్టీలూ పంచుకుంటున్నాయి. మోదీ, అమిత్‌షాల నేతృత్వంలోని బీజేపీ ప్రస్తుతం హిందుత్వ ఓటర్లను ఎక్కువగా ఆకర్షిస్తోందని శివసేన భావిస్తోంది. అలాగే, పొత్తును గౌరవించకుండా, రాష్ట్రవ్యాప్తంగా బలపడాలనే విస్తరణ కాంక్ష బీజేపీకి ఉన్నదని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని కొనసాగితే తమకే నష్టం జరుగుతుందని శివసేన భావిస్తోంది. తాము బలపడాలంటే పోరాడాల్సింది బీజేపీతోనేనని శివసేన అనుకుంటోంది.

టీడీపీ-బీజేపీ: ఏపీలో కూడా బలపడాలని బీజేపీ నిర్ణయించుకుంది. అవసరమైతే జగన్‌తో పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. తొలుత టీడీపీని దెబ్బకొట్టాలన్నదే కమలం పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. దీనిని చంద్రబాబు కూడా గ్రహించినట్లున్నారు. దానికి అనుగుణంగానే ఈయన కూడా రాజకీయ ఎత్తుగడ వేస్తున్నారు.

ఫొటో సోర్స్, RAVEENDRAN/AFP/Getty Images

ఫొటో క్యాప్షన్,

‘చంద్రబాబు ఎప్పుడు కోరితే అప్పుడు వాజ్‌పేయి కాదనకుండా అపాయింట్‌మెంట్ ఇచ్చేవారు’

ఇంకేమైనా కారణాలు ఉన్నాయా?

ఆశిష్ దీక్షిత్: వాజ్‌పేయి-బాల్ ఠాక్రేల మధ్య ఉన్నంత అవగాహన, సత్సంబంధాలు మోదీ-ఉద్ధవ్ ఠాక్రేల మధ్య లేవు. ఒకరినొకరు విశ్వసించట్లేదు. ఇరు పార్టీలూ మహారాష్ట్రలో బలపడాలని, నిలదొక్కుకోవాలని భావిస్తున్నాయి. హిందుత్వ ఓటు బ్యాంకునే రెండూ పంచుకోవాల్సి రావటంతో పరస్పరం పోటీ పడటం అనివార్యమైంది.

ఐ వెంకట్రావు: వాజ్‌పేయిది ప్రజాస్వామ్య పద్ధతి అనుకుంటే.. మోదీది సామ్రాజ్యవాదంగా భావించాల్సి ఉంటుంది. భాగస్వామ్య పక్షాలకు వాజ్‌పేయి ఇచ్చినంత గౌరవం మోదీ ఇవ్వట్లేదని అంతా భావిస్తున్నారు. వాజ్‌పేయిలాగా సర్దుబాట్లకు మోదీ అంగీకరించట్లేదు. ప్రాంతీయ పార్టీలు ఉండరాదన్నదే వారి సిద్ధాంతం. పవన్ కల్యాణ్‌ జనసేనను కూడా బీజేపీలో కలిపేయాలని అమిత్‌షా కోరటాన్ని ఈ కోణంలోనే చూడాలి. వాజ్‌పేయి హయాంలో రాష్ట్రానికి చేసుకున్నంత మేలు మోదీ హయాంలో చేసుకోలేకపోయానని చంద్రబాబు భావిస్తున్నారు.

టీడీపీ మరో శివసేన అవుతుందా?

ఆశిష్ దీక్షిత్: రాష్ట్ర నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవటం, 2014లో మోదీకి లభించిన ఆదరణ, హిందూ ఓటు బ్యాంకును ఆకర్షించటం ద్వారా రాష్ట్రంలో శివసేనను వెనక్కు నెట్టి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మహారాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగుతూ శివసేన ఆందోళన చేసినట్లుగానే కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతూ తెలుగుదేశం పార్టీ ఆందోళనలు, నిరసనలు చేయొచ్చు. ఆ విధంగా ఎన్డీఏలో టీడీపీ మరో శివసేన అవుతుంది. అయితే, మహారాష్ట్రలో శివసేనను వెనక్కు నెట్టి బీజేపీ విజయం సాధించిన ఫార్ములా ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయటం అంత సులభం కాదు. ఆ విధంగా టీడీపీ మరో శివసేన కాకపోవచ్చు.

ఐ వెంకట్రావు: ఆంధ్రప్రదేశ్‌లో మహారాష్ట్ర ఫార్ములాను అమలు చేయటం అంత సులభం కాదు. ఇక్కడ తెలుగుదేశమే అతిపెద్ద పార్టీ. పైగా, మోదీకి, బీజేపీకి ఆదరణ తగ్గుతోందే తప్ప పెరగటం లేదు. కర్ణాటకలో జయాపజయాలను బట్టే బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో వ్యూహాల గురించి ఆలోచిస్తుంది. ఆశించినంత మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ, సహకారాలు అందకపోతే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పొత్తు నుంచి బయటకు రావొచ్చు. అలా రాకుండా బీజేపీతో కలిసే ఎన్నికలకు వెళితే.. అది టీడీపీకి ఆత్మహత్యాసదృశమే అవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)