వన్డేల్లో ఆ రికార్డు భారతీయ స్టార్ ఝూలన్‌దే

జులన్ గోస్వామి

ఫొటో సోర్స్, Getty Images

అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో భారత క్రీడాకారిణి ఝూలన్ గోస్వామి కొత్త రికార్డు సృష్టించారు.

వన్డేల్లో 200 వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా ఆమె అవతరించారు.

దక్షిణాఫ్రికాతో కింబర్లీలో జరుగుతున్న ఐసీసీ వుమెన్ చాంపియన్‌షిప్‌లో ఝూలన్ ఈ మైలురాయి దాటారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 302 పరుగులు చేయగా, తర్వాత బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా .. భారత్ బౌలర్ల దాటికి 124 పరుగులకే కుప్పకూలిగింది. 178 పరుగులతో భారత్ రికార్డు విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో 135 పరుగులు చేసి స్మృతి మందన టాప్ స్కోరర్‌గా నిలవగా, 4 వికెట్లు తీసిన పూనమ్ యాదవ్ భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించారు.

అయితే, ఈ మ్యాచ్‌లో హైలెట్‌గా నిలిచింది మాత్రం ఝూలన్ 200 వికెట్ల రికార్డే.

ఫొటో సోర్స్, Getty Images

గంటకు 120 కిలోమీటర్ల వేగంతో..

బాబుల్ అని ముద్దు పేరుతో పిలిచే ఝూలన్ గోస్వామి 1982 నవంబర్ 25న పశ్చిమ బెంగాల్‌లోని నదియాలో జన్మించారు.

2002లో ఇంగ్లాండ్‌తో వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఝూలన్ ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు.

భారత్ ప్రధాన బౌలర్లలో ఒకరిగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. కొంత కాలం కెప్టెన్‌గానూ బాధ్యతలు మోశారు.

గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసే ఝూలన్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మహిళా బౌలర్‌గా పేరు తెచ్చుకున్నారు.

2007 ఐసీసీ 'వుమెన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు ఎంపికయ్యారు. ఆ ఏడాది పురుషుల జట్టు నుంచి ఒక్క భారత క్రికెటర్ కూడా ఈ అవార్డుకు ఎంపిక కాకపోవడం గమనార్హం.

ఫొటో సోర్స్, @OfficialCSA

అభినందనల వెల్లువ

ఇప్పటి వరకు 166 వన్డే మ్యాచ్‌లాడిన ఝూలన్ 200 వికెట్లు తీశారు. 10 టెస్టుల్లో 40 వికెట్లు పడగొట్టారు.

35 ఏళ్ల వయసులో 20-ట్వంటీల్లోనూ ఆడుతూ సత్తా చాటుతున్నారు. కేవలం 31 పరుగులిచ్చి 6 వికెట్లు తీయడం వన్డేలో ఆమె అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటి.

బాల్‌తోనూ కాదు, అప్పుడప్పుడు బ్యాట్‌తోనూ ఝూలన్ రాణిస్తున్నారు. ఇప్పటి వరకు 166 వన్డేలు ఆడి 1006 పరుగులు చేశారు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. 10 టెస్టు మ్యాచ్‌లలో 283 పరుగులు చేశారు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి.

ఝూలన్ 200 వికెట్ల రికార్డుపై ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తారు. ''200 వికెట్లు తీసి రికార్డు సృష్టించిన ఝూలన్‌కు, దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత్ విజయంలో కీలకపాత్ర వహించిన స్మృతి మందనకు శుభాకాంక్షలు'' అంటూ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)