#HerChoice: నా భర్త నన్ను ప్రేమించాడు, కానీ పడగ్గదిలో హింసించాడు

ఇలస్ట్రేషన్

ఆ రాత్రి ఇక ఎప్పటికీ తెల్లారదేమో అనిపించింది. ఎంత ప్రయత్నించినా ఏడుపు ఆపుకోలేకపోయా. ఎప్పుడు పడుకున్నానో గుర్తు లేదు. ఉదయం లేచేసరికి నా భర్త నా ఎదురుగా నిల్చొని ఉన్నాడు.

నేను లేవగానే అతడు అడిగిన మొదటి ప్రశ్న.. 'ఇంతకీ ఏం నిర్ణయించుకున్నావు? ఒప్పుకుంటున్నావా, లేదా?'.

నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎలాగోలా కాస్త ధైర్యం కూడదీసుకొని.. 'మీరు ఆఫీసుకు వెళ్లండి, సాయంత్రంలోగా ఫోన్ చేసి నా సమాధానమేంటో చెప్తా, ఒట్టు' అన్నా.

''సాయంత్రం 4గం.కి నేనే ఫోన్ చేస్తా. నువ్వు 'యస్' అనే సమాధానం చెప్పాలి. లేకపోతే మళ్లీ 'శిక్ష'కు సిద్ధంగా ఉండు'' అన్నాడు.

'శిక్ష' అంటే ఆయన దృష్టిలో 'యానల్ సెక్స్'. ఆ చర్య వల్ల నేనెంత బాధ పడతానో, నాకెంత నొప్పిగా ఉంటుందో ఆయనకు బాగా తెలుసు. అందుకే నన్ను హింసించడానికి యానల్ సెక్స్‌నే అతడు సాధనంగా మార్చుకున్నాడు.

నాకు వార్నింగ్ ఇచ్చాక నా భర్తా, అతడి అక్కా ఆఫీసుకి వెళ్లిపోయారు. నేను రకరకాల ఆలోచనలతో సతమతమవుతూ ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయా.

కాసేపటి తరవాత మా నాన్నకు ఫోన్ చేసి, ఇక నేను నా భర్తతో కలిసి ఉండలేనని చెప్పా.

ఆయన కోప్పడతారేమోనని భయపడ్డా. కానీ అతడి సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది. 'వెంటనే బ్యాగు సర్దుకొని అక్కడి నుంచి వచ్చేయి' అన్నారాయన.

నేను వెంటనే నా సర్టిఫికేట్లన్నీ పెట్టుకొని బస్టాండుకి బయల్దేరా.

బస్సు ఎక్కగానే 'నేను మీరు అడిగిన దానికి ఒప్పుకోవట్లేదు. నేను మా పుట్టింటికి వెళ్లిపోతున్నా' అని నా భర్తకు మెసేజ్ చేసి వెంటనే ఫోన్ స్విచాఫ్ చేశా.

కొన్ని గంటల తరవాత నేను మా ఇంట్లో, నా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నా. కేవలం పెళ్లయిన రెండు నెలల్లోనే నా భర్తను వదిలిపెట్టి మా ఇంటికి వచ్చేశా.

#హర్‌చాయిస్ - 12 మంది భారతీయ మహిళల వాస్తవగాథలు. ఈ కథనాలు 'ఆధునిక భారతీయ మహిళ' ఇష్టాయిష్టాలు, కోరికలు, ఆకాంక్షలు, ప్రాధాన్యతల గురించి వివరిస్తూ మన భావనను విస్తృతం చేస్తాయి.

నేను డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నప్పుడు నా భర్త సాహిల్‌ను తొలిసారి కలిశాను. అతడు అందరితో కలివిడిగా ఉండేవాడు. అతనితో ఉన్నప్పుడు బావుండేది. కాలం గడిచేకొద్దీ ఇద్దరం ప్రేమలో పడ్డాం.

ఇద్దరం కలిసి బాగా తిరిగేవాళ్లం. గంటలకొద్దీ ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. జీవితం చాలా సంతోషంగా గడిచేది. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు.

మా అనుబంధంలో సమానత్వం లోపించిందని నాకనిపించింది. మా అమ్మానాన్నల అనుబంధంలానే మాది కూడా మారుతుందేమోనని నాకు భయమేసింది.

చిన్నచిన్న విషయాలకే మా నాన్న అమ్మను తిట్టేవాడు. ఒక్కోసారి కొట్టేవాడు కూడా. దానికి కన్నీరే ఆమె సమాధానంగా ఉండేది.

కానీ సాహిల్ ఏమైనా అంటే నేనలా మౌనంగా ఉండలేకపోయేదాన్ని. దాంతో చిన్నచిన్న వాదనలే గొడవలుగా మారేవి. చాలాసార్లు బలవంతంగా నాతో రొమాన్స్ చేసేవాడు. నేను ఒప్పుకోకపోతే గట్టిగా అరిచేవాడు.

'నేను నిన్ను కొడితే నువ్వేం చేస్తావు?' అని సాహిల్ నన్నోసారి అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే నాకు పట్టరాని కోపమొచ్చింది. నన్ను నేను నిగ్రహించుకొని, 'ఆ రోజే నీతో తెగతెంపులు చేసుకుంటా' అని చెప్పా.

'అయితే నువ్వు నన్ను ప్రేమించట్లేదన్నమాట. ఒకవేళ ప్రేమిస్తే నువ్విలా మాట్లాడవు' అని సాహిల్ అనేసరికి మరింత షాకయ్యా. దాంతో ఓ నెలపాటు మేమిద్దరం మాట్లాడుకోలేదు.

ఆ తరవాత ఇద్దరికీ తరచూ గొడవలయ్యేవి. నేను చాలాసార్లు బ్రేకప్ చెప్పడానికి ప్రయత్నించినా, అతడు క్షమాపణ చెప్పి నన్ను బుజ్జగించేవాడు.

నిజంగా చాలాసార్లు అతడి నుంచి విడిపోవాలనుకున్నా. కానీ ఆ పని ఎందుకు చేయలేకపోయానో నాకు అర్థంకాలేదు.

చదువు పూర్తయ్యాక నేను ఓ స్కూల్లో టీచర్‌గా చేరా. ఆ సమయంలో ఇంట్లోవాళ్లు పెళ్లి చేసుకోమని ఒత్తిడి పెట్టేవారు.

స్కూల్లో పాఠాలు చెబుతుంటే అమ్మానాన్నా ఫోన్ చేసి ఇదే విషయం మాట్లాడేవారు. 'నువ్వు సాహిల్‌ని ప్రేమించావు కదా, మరి ఎందుకు అతడిని పెళ్లి చేసుకోవట్లేదు? అతడు ఇష్టం లేకపోతే మరో సంబంధం చూస్తాం. ఒకసారి నీ చెల్లెళ్ల గురించి కూడా ఆలోచించు?' అనేవారు.

ఇంట్లో ఏ గొడవ జరిగినా దాన్ని నా పెళ్లితోనే ముడిపెట్టేవారు. మా అమ్మ అనారోగ్యం బారిన పడినా, మా నాన్న వ్యాపారంలో నష్టపోయినా.. అన్నింటికీ నా పెళ్లినే కారణంగా చూపేవారు.

ఇక ఆ ఒత్తిడిని భరించలేక పెళ్లికి సరేనన్నా. ఒకప్పటిలా ఉండననీ, తన పద్ధతి మార్చుకుంటాననీ సాహిల్ మాటిచ్చాడు. కానీ నాకు నమ్మకం లేదు. అయినా తప్పక అతడిని పెళ్లి చేసుకున్నా.

పెళ్లి తరవాత నా భయమే నిజమైంది. సాహిల్ నన్నో కీలు బొమ్మలా మార్చేశాడు. తాను ఏది చెబితే అది చేయాలని శాసించడం మొదలుపెట్టాడు.

నాకు కవిత్వమంటే ఇష్టం. నా ఫేస్‌బుక్ పేజీలో కవితలు రాసేదాన్ని. కానీ సాహిల్ ఆ పని మానేయమన్నాడు. నేను ఏ బట్టలు వేసుకోవాలో తానే నిర్ణయించేవాడు.

చదవడం, రాయడం లాంటి పనులన్నీ రాత్రికల్లా ముగించుకొని తన దగ్గరకి రావాలనీ, పడగ్గదిలో తనను సంతృప్తిపరచకపోతే మరో యువతి దగ్గరకు వెళ్లాల్సి ఉంటుందనీ ఓ రోజు బెదిరించాడు.

నేను తనను సంతోషపెట్టట్లేదనీ, నీలి చిత్రాలు చూసి తనను సంతృప్తిపరిచే మెలకువలు నేర్చుకోవాలనీ చెప్పేవాడు.

ఓసారి అతడికి ముంబై వెళ్లి హీరో అవ్వాలనే కోరిక కలిగింది.

నేను ఇంటి దగ్గరే ఉండి ఉద్యోగం చేసి అతడికి నెలానెలా డబ్బు పంపించాలనీ, కొన్నాళ్ల తరవాత లోన్ తీసుకొని ఆ డబ్బు తనకు ఇవ్వాలని నాపై ఒత్తిడి చేశాడు. నేను 'యస్' చెప్పాల్సింది దీనికే. ఈ పనికి ఒప్పుకోవడం కోసమే ఆ రాత్రి బలవంతంగా నాతో యానల్ సెక్స్ చేయడానికి ప్రయత్నించాడు.

అప్పటికే నాలో ఓపిక నశించిపోయింది. దాంతో మరుసటి రోజే అతడిని వదలి వచ్చేశా.

నేను బాగా చదువుకున్నాను. ఉద్యోగం చేసి నా కాళ్ల మీద నేను నిలబడగలను. అయినా కూడా సాహిల్ ఇంటిని వదిలి వచ్చేప్పుడు ఏదో కలవరపాటు నన్ను వేధించింది.

నా కుటుంబం, సమాజం నన్ను తప్పుగా చూస్తుందేమోనని భయమేసింది. చెదిరిన జుట్టుతో, ఏడ్చి ఏడ్చి ఉబ్బిన కళ్లతో నేను ఇంటికి వెళ్లా.

సాధారణంగా కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు పుట్టింటికి ఎంతో సంతోషంగా వెళ్తారు. కానీ నేను అలా దీనంగా వెళ్లేసరికి చుట్టుపక్కల వారందరి చూపు నాపైనే పడింది. నెమ్మదిగా ఒక్కొక్కరు ఇంటికి రావడం మొదలుపెట్టారు.

కొందరు నా పరిస్థితి చూసి బాధపడ్డారు. ఇంకొందరు సాహిల్ వచ్చి క్షమాపణ చెప్పి నన్ను తీసుకెళ్తాడని సర్దిచెప్పారు. మరికొందరైతే అమ్మాయిలు చిన్నచిన్న విషయాలను అలా సీరియస్‌గా తీసుకోకూడదని సలహా ఇచ్చారు.

అందరూ ఏదో ఒకటి చెబుతున్నా, వాళ్ల మాటలేవీ నా నిర్ణయాన్ని మార్చలేకపోయాయి.

నేను సాహిల్ ఇంటిని వదిలొచ్చి ఏడు నెలలు దాటింది. ప్రస్తుతం నా దారి నేను చూసుకుంటున్నా. నేను ఉద్యోగం చేస్తూనే పైచదువుల్ని కొనసాగిస్తున్నా.

విడాకులు తీసుకోవడానికి ఇంకా చట్టపరమైన ప్రక్రియ మొదలుకాకపోవడంతో తరచూ పోలీస్ స్టేషన్, కోర్టులకు వెళ్లాల్సి వస్తోంది.

ఇప్పటికీ ఆ రోజులు గుర్తు చేసుకుంటే రాత్రులు నిద్రపట్టదు. ఆ జ్ఞాపకాల నుంచి వీలైనంత త్వరగా బయటపడే ప్రయత్నం చేస్తున్నా.

ప్రేమ, అనుబంధాలపైన నాకు నమ్మకం బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం నన్ను నేను దృఢంగా మలచుకునే ప్రయత్నాల్లో ఉన్నా.

చాలామందిలా మౌనంగా ఉండిపోకుండా ఆ హింసాత్మక బంధం నుంచి త్వరగా బయట పడగలిగినందకు నాకు చాలా గర్వంగా ఉంటుంది.

అందుకే గతం, వర్తమానంతో పోలిస్తే నా భవిష్యత్తు అందంగా ఉంటుందని నేను నమ్ముతున్నా.

(పశ్చిమ భారతదేశానికి చెందిన ఒక మహిళ తన నిజ జీవిత గాథను బీబీసీ ప్రతినిధి సింధువాసిని త్రిపాఠితో పంచుకోగా, సీనియర్ ప్రతినిధి దివ్య ఆర్య దీనిని అక్షరబద్ధం చేశారు. ఆ మహిళ విజ్ఞప్తి మేరకు ఆమె పేరును రహస్యంగా ఉంచుతున్నాం.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)