'ప్యాడ్‌ మ్యాన్’ తెలుసు.. మరి ‘ప్యాడ్ వుమన్’ తెలుసా?

  • దీపల్‌ కుమార్ షా
  • బీబీసీ గుజరాతీ
మీనా మెహతా

ఫొటో సోర్స్, ATUL MEHTA

భారత్‌లో చాలా మంది చాలా రకాల వస్తువులు దానం చేస్తుంటారు. కానీ, శానిటరీ ప్యాడ్‌లు, లోదుస్తులను కూడా ఇతరులకు ఇవ్వొచ్చు అని కొద్ది మందే ఆలోచిస్తారు.

మహిళలకు ఇవి చాలా అవసరం, కానీ, వాటిని కొనలేని వారి పరిస్థితి ఏంటీ? అని ప్రశ్నిస్తున్నారు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన మీనా మెహతా (62).

ఈమెను సూరత్‌లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు 'ప్యాడ్ బామ్మ' అని పిలుస్తుంటారు. మురికివాడల్లోని అమ్మాయిలు 'ప్యాడ్లు ఇచ్చే అక్క' అని అంటుంటారు.

మీనా మురికివాడల్లోని అమ్మాయిలకు హెల్త్ కిట్లు ఇస్తుంటారు. ప్రతినెలా వివిధ పాఠశాలలకు వెళ్లి 5000 వేల వరకు ప్యాడ్లను బాలికలకు ఉచితంగా అందిస్తుంటారు.

మురికివాడల్లో ఉండే అమ్మాయిలకు ప్యాడ్లు, లోదుస్తులతో ఉండే కిట్లను పంచిపెడుతుంటారు. మురికివాడల్లో బాలికల దుస్థితిని గమనించిన మీనా, కేవలం ప్యాడ్లు ఇవ్వడం వల్లే పరిస్థితి మారదని, అన్నింటికి అదే పరిష్కార మార్గం కాదని గ్రహించారు.

అందుకే ప్యాడ్లతో పాటు హెల్త్ కిట్‌ను కూడా వాళ్లకు అందిస్తున్నారు. ఇందులో రెండు లోదుస్తులు, షాంపూ ప్యాకెట్లు, సబ్బు, 8 శానిటరీ ప్యాడ్లు ఉంటాయి.

ఫొటో సోర్స్, ATUL MEHTA

ఫొటో క్యాప్షన్,

మీనా మెహతా

సుధామూర్తి మాటలే స్ఫూర్తి

2004లో తమిళనాడును సునామీ ముంచెత్తినప్పుడు ఇన్ఫోసిస్ పౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి అక్కడి బాధిత మహిళకు ప్యాడ్లు అందించారు.

''నిరాశ్రయులకు బట్టలు, నిత్యావసర వస్తువులు అందరూ ఇస్తారు. కానీ, కూడు,గూడు కోల్పోయిన మహిళలు, అందునా నెలసరిలో ఉన్నవాళ్ల పరిస్థితి ఏంటీ అని సుధామూర్తి ఒకసారి అన్నారు. ఆమె మాటలే నన్ను పేదలకు ప్యాడ్లు పంచిపెట్టడానికి స్ఫూర్తినిచ్చాయి'' అని మీనా బీబీసీకి చెప్పారు.

''చెత్తకుప్పలో పడేసిన ప్యాడ్లను ఇద్దరు అమ్మాయిలు తీసుకోవడం చూశా. వాటిని ఏం చేసుకుంటారని అడిగా. ఉతికి మళ్లీ వాడుకుంటామని చెప్పారు. ఆ మాటల విని దిగ్భ్రాంతి చెందా.'' అని తనకు ఎదురైన ఒక అనుభవాన్ని మీనా బీబీసీతో పంచుకున్నారు.

ఫొటో సోర్స్, ATUL MEHTA

భర్త ఆర్థిక సహాయంతో ముందడుగు

తొలుత పనిమనిషికి, ఓ ఐదుగురి అమ్మాయిలకు ప్యాడ్లు ఇవ్వడం మొదలుపెట్టానని, తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు ప్యాడ్లు ఇవ్వడం ప్రారంభించానని మీనా తెలిపారు.

''ఒకసారి నేను అలా పాఠశాలలో ప్యాడ్లు పంచుతున్నప్పుడు ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి, 'బామ్మా, మీరు ప్యాడ్లు ఇస్తున్నారు సరే కానీ, వీటిని వాడటానికి మాకు లోదుస్తులు కూడా లేవు' అని చెప్పింది. దాంతో అప్పటి నుంచి వాళ్లకు లోదుస్తులు కూడా ఇవ్వడం మొదలుపెట్టా. మురికివాడల్లో ఉండే అమ్మాయిలు శుభ్రత పాటించలేక అనారోగ్యం పాలవుతుంటారు. అందుకే వారికి ప్రాథమికంగా ఉపయోగపడే హెల్త్ కిట్ అందిస్తున్నా'' అని మీనా తెలిపారు.

''నా విషయం తెలిసి సుధామూర్తి ఆశ్చర్యపోయారు. మహిళల కోసం నేను ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నా. కానీ, నాకు ఎప్పుడూ ఈ ఆలోచన రాలేదు అని ఆమె నాతో చెప్పారు. ఆ తర్వాత లక్ష రూపాయిల విలువ చేసే ప్యాడ్లను రెండుసార్లు నాకు పంపారు'' అని మీనా గుర్తు చేసుకున్నారు.

మీనా పనికి మొదట్లో ఆర్థికంగా చేయూతనందించింది ఆమె భర్త అతుల్ మెహతా ఒక్కరే. ఆయనే రూ.25 వేలు అందించి అండగా నిలిచారు. ప్రస్తుతం చాలా మంది తనకు అండగా నిలుస్తున్నారని, లండన్, ఆఫ్రికా, హాంకాంగ్ నుంచి కూడా ఆర్థిక సాయం అందిస్తున్నారని మీనా తెలిపారు.

ఫొటో సోర్స్, ATUL MEHTA

'అంటరానితనం పోవాలి!'

మీనా మెహతా మానుని పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతున్నారు.

''మేం ఇచ్చే ప్యాడ్లు ఉపయోగిస్తున్నవాళ్లు దురద, అపరిశుభ్ర సమస్యలు రావడం లేదని చెబుతున్నారు. అంటే అవి సౌకర్యవంతంగానే ఉన్నాయని అనుకుంటున్నా''నని మీనా చెప్పారు.

సమాజం ఇప్పటికీ నెలసరి వచ్చిన మహిళలను బయటకు రానివ్వకుండా వివక్షతో చూస్తోందని ఆమె పేర్కొన్నారు. ''కూరగాయలు అమ్మే మహిళలను చాలా మంది రుతుస్రావం గురించి అడిగాకే వాళ్ల దగ్గర కొంటుంటారు. నెలసరిపై ఉన్న ఇలాంటి అంటరానితనం, అపోహలు ఆమోదనీయం కాదు'' అని మీనా అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)