అమెరికా సంక్షోభం: బడ్జెట్ బిల్లుపై ట్రంప్ సంతకంతో ప్రభుత్వ సేవలు పేనరుద్ధరణ

డొనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రభుత్వాన్ని పున:ప్రారంభిస్తూ తాను బడ్జెట్ మీద సంతకం చేశానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గురువారం రాత్రి కొన్ని గంటల పాటు మరోసారి స్తంభించింది. అయితే.. బడ్జెట్‌కు కాంగ్రెస్ (పార్లమెంటు) ఆమోదం తెలిపి, అధ్యక్షుడు సంతకం చేయటంతో ప్రభుత్వ సేవలు శుక్రవారం పున:ప్రారంభమయ్యాయి.

అమెరికా ప్రభుత్వ సేవలకు నిధులు అందించే గడువు గురువారం రాత్రి పూర్తవగా.. కొత్తగా నిధులు అందించటానికి ఉద్దేశించిన బిల్లును సెనేట్ ఆమోదించటం జాప్యం కావటంతో ఈ పరిస్థితి తలెత్తింది.

రక్షణ, అంతర్గత సేవల వ్యయాన్ని 30,000 కోట్ల డాలర్లు పెంచాలని 650 పేజీల ఈ బడ్జెట్ ప్రణాళిక ప్రతిపాదించింది.

కాంగ్రెస్‌లో అధికార రిపబ్లికన్ పార్టీ మెజారిటీ ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ఇలా స్తంభించిపోవటం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి.

అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం ఉదయం బిల్లుపై సంతకం చేశారు. ఇప్పుడిక సైన్యం ’’మునుపెన్నటికన్నా శక్తివంతం అవుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు.

నిజానికి ఈ బిల్లును గురువారం అర్థరాత్రి లోపు ఆమోదించాల్సి ఉంది. అయితే చివరి క్షణంలో రిపబ్లికన్ సెనేటర్ రాండ్ పాల్ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తటంతో బిల్లుపై ఓటింగ్ నిర్వహించటం ఆలస్యమైంది.

దీంతో మూడు వారాల వ్యవధిలో అమెరికా ప్రభుత్వం మరోసారి మూతపడింది. ఈసారి కేవలం ఐదు గంటల పాటు కొనసాగింది.

కాంగ్రెస్ లోని ప్రతినిధుల సభ బిల్లును 240-186 ఓట్లతో ఆమోదించగా.. మూడు గంటల తర్వాత సెనేట్ 71-28 ఓట్ల తేడాతో ఆమోదించింది.

ఈ బిల్లు ద్వారా సైన్యానికి మరిన్ని వనరులు లభిస్తాయని, కాబట్టి సైనికులకు ఇది గొప్ప విజయమని ప్రతినిధుల సభ స్పీకర్, రిపబ్లికన్ పార్టీ అగ్ర నేతల్లో ఒకరు అయిన పాల్ ర్యాన్ పేర్కొన్నారు.

ఈ బిల్లు జాప్యం కావటానికి తద్వారా అమెరికా ప్రభుత్వం స్తంభించటానికి కారణం సెనెటర్ రాండ్ పాల్ అని అధికార, ప్రతిపక్షాల రాజకీయ నాయకులు విమర్శించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

రిపబ్లికన్ సెనెటర్ రాండ్ పాల్ (మధ్యలో) సొంత పార్టీ నేతలపై మండిపడ్డారు

‘దుబారా చేస్తున్నారు’

బడ్జెట్ వ్యయంలో పెంటగన్‌కు కేటాయించిన నిధుల పట్ల రిపబ్లికన్ పార్టీ జాతీయ భద్రత విభాగం హర్షం వ్యక్తం చేస్తే.. దేశ అప్పుల పర్యవసానాలపై ఖజానాను పొదుపుగా ఉపయోగించాలనే వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

‘‘అధ్యక్షుడు ఒబామా ట్రిలియన్ డాలర్ల లోటును నేను చాలా తీవ్రంగా తప్పుపట్టాను కనుక నేను ఎన్నికల్లో పోటీ చేశాను. ఇప్పుడు రిపబ్లికన్లు సైతం డెమొక్రాట్లతో చేతులు కలిపి ట్రిలియన్ డాలర్ల లోటు అందిస్తున్నారు’’ అని ఆయన మండిపడ్డారు.

బిల్లులో ఏముంది?

సెనేట్ నాయకులు బుధవారం ప్రతిపాదించిన ఈ రెండేళ్ల బడ్జెట్ ఒప్పందం.. వ్యయాన్ని ‘‘అతి స్వల్పంగా’’ పెంచి 30,000 కోట్ల డాలర్లు చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు అధ్యక్ష భవనం లెజిస్లేటివ్ వ్యవహారాల డైరెక్టర్ మార్క్ షార్ట్ పేర్కొన్నారు.

ఈ బిల్లులో రక్షణ వ్యయం కోసం అదనంగా మరో 16,500 కోట్ల డాలర్లు, ఆరోగ్య సేవలు, మౌలిక సదుపాయాలు తదితర అంతర్గత వ్యయం కోసం 131 కోట్ల డాలర్లు కేటాయించినట్లు రాయటర్స్ వార్తా సంస్థ చెప్తోంది.

ఈ ద్వైపాక్షిక ఒప్పందం అమెరికా ప్రభుత్వం.. మార్చి 23వ తేదీ వరకూ నడిచేందుకు వీలు కల్పిస్తుంది. అమెరికా ప్రభుత్వ సంస్థలకు నిధులు సమకూర్చటం కోసం పూర్తి ఏడాది బడ్జెట్‌ను రూపొందించటానికి అవసరమైన సమయం లభిస్తుంది.

అమెరికా అప్పు పరిమితిని 2019 మార్చి వరకూ పెంచటానికి ఈ బిల్లు అనుమతిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)