ప్రెస్‌రివ్యూ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసం ఎలా ఉంటుందంటే..

2016లో తన అధికారిక నివాసానికి మొదటిసారి వచ్చిన తల్లి హీరాబాతో ప్రధాని నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Narendra Modi

ఫొటో క్యాప్షన్,

2016లో తన అధికారిక నివాసానికి మొదటిసారి వచ్చిన తల్లి హీరాబాతో ప్రధాని నరేంద్ర మోదీ

అమెరికా అధ్యక్షుడు ఎక్కడ నివసిస్తాడని ఏ భారతీయుడిని అడిగినా వాషింగ్టన్‌లోని 'వైట్‌హౌస్'లో అని టక్కున సమాధానం ఇస్తారు. మరి భారత ప్రధాన మంత్రి ఎక్కడ నివసిస్తారని ప్రశ్నిస్తే టక్కున సమాధానం ఇవ్వకుండా కొంత ఆలోచనలో పడతారు. ఢిల్లీలోని 'రేస్‌ కోర్స్‌ రోడ్డులో' ఎక్కడో ఉంటారంటారు.

ప్రధాన మంత్రి భవనం ఎలా ఉంటుందంటే ఎవరికి సరిగ్గా స్ఫురణకు రాదు. ఒకటి, రెండు సార్లు మినహా టీవీలో కూడా మన పీఎం భవనాన్ని సరిగ్గా చూపలేదు. పత్రికల్లో కూడా ఇప్పటి వరకు క్లోజప్‌ ఫొటోలు, మహా అంటే భవనం ముందు భాగం ఫొటోలు మాత్రమే వచ్చాయి.

రేస్‌కోర్స్‌ రోడ్డులో పీఎం ఉండేది మొత్తం ఐదు భవనాల సముదాయం. 1, 3, 5, 7, 9 నెంబర్లతో ఆ భవనాలు ఉన్నాయి.

ఏడో నెంబర్‌ భవనంలో ప్రధాన మంత్రి కార్యాలయం పనిచేస్తుంది. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడో నెంబర్‌ భవనంలోగానీ ఐదో నెంబర్‌ భవనంలోగానీ ఉంటారు. కచ్చితంగా ఇదని తెలియదుగానీ ఆయన నివాసం ఐదో నెంబర్‌ భవనంలో అని సన్నిహితులు చెబుతారు. ఒకటి, తొమ్మిదవ నెంబర్‌ భవనాల్లో రాజీవ్‌ గాంధీ హత్యానంతరం 1985లో ఏర్పాటు చేసిన స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్‌పీజీ) కార్యాలయాలు ఉన్నాయి.

నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక అంటే 2016లో ప్రధాని కార్యాలయాన్ని సెవెన్‌ రేస్‌ కోర్స్‌ నుంచి సెవెన్, లోక్‌ కళ్యాణ్‌ మార్గ్‌గా మార్చారు.

భారత తొలి ప్రధాన మంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ తీన్‌మూర్తి రోడ్డులోని తీన్‌మూర్తి భవనంలో ఉన్నారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ సఫ్దార్‌ జంగ్‌ రోడ్డులో ఉన్నారు. ఆ తర్వాత రాజీవ్‌ గాంధీ ప్రధాన మంత్రి అయ్యాక ఆయన తన కుటుంబంతో మొట్టమొదటి సారిగా రేస్‌ కోర్స్‌ రోడ్డులోకి వచ్చారు.

ఫొటో సోర్స్, Narendra Modi

పీవీ నర్సింహారావు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఐదో నెంబర్‌ భవనంలో ఉండేందుకు ఇష్టపడకుండా మూడవ నెంబర్‌ భవనంలో ఉన్నారు. అందుకు రెండు రకాల వాదనలు ఉన్నాయి. రాజీవ్‌ గాంధీ పట్ల అమితమైన అభిమానం ఉండడంతో ఆ భవనంలో ఆయన జ్ఞాపకాలు అలాగే ఉండిపోనీయాలని మూడో నెంబర్‌ భవనానికి మారారన్నది అధికారికంగా చెప్పిన వాదన. ఐదో నెంబర్‌ భవనంలో ఉంటే అరిష్టమని ఆయన మిత్రుడైన తాంత్రిక స్వామి చంద్రస్వామి చెప్పడంతో అందులో ఉండలేదన్నది మరో వాదన. ఆ తర్వాత వచ్చిన ప్రధానులు ఏడో నెంబర్‌ భవనం నుంచి పనిచేస్తూ ఐదు లేదా మూడో నెంబర్‌ భవనాల్లో ఉంటూ వచ్చారు.

అటల్‌ బిహారి వాజపేయి ప్రధాన మంత్రి అయ్యాక ఏడో నెంబర్‌ భవనానికి సమీపంలో సినిమా థియేటర్, కాన్ఫరెన్స్‌ రూములతో కూడిన అతి పెద్ద ఆడిటోరియం నిర్మించారు. దానికి పంచవటి అని పేరు పెట్టారు. ఓ హెలిపాడ్‌ను కూడా నిర్మించారు. అప్పట్లో ఈ నిర్మాణాలకు 2,658 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి.

12 ఎకరాల్లో విస్తరించిన ప్రధాని కార్యాలయ సముదాయంలోకి సాధారణ పౌరులనే కాదు, మీడియాను కూడా అనుమతించరు. అతికొద్ది సందర్భాల్లో కాన్ఫరెన్స్‌ రూమ్‌ల వరకే మీడియా ప్రతినిధులను అనుమతిస్తారు. ఎక్కడా ఎవరినీ ఫొటోలు తీయనీయరు. అసలు ఈ భవనాలే బయటకు కనిపించవు. అదే ప్రధాని ఆదేశం ఉంటే ఎస్‌పీజీలు ఎవరినైనా ఎలాంటి విజిటింగ్‌ పాస్‌లు ఇవ్వకుండా, కనీసం రాకపోకలను నమోదు చేయకుండా, తనిఖీలు కూడా చేయకుండా పంపిస్తారు.

ప్రముఖ జర్నలిస్ట్‌ సీమా గోస్వామి 'రేస్‌ కోర్స్‌ రోడ్డు' పేరిట రాసిన పుస్తకం కోసం ఆ రోడ్డులో పరిశోధన చేయడం వల్ల కొన్ని అదనపు విషయాలు వెలుగులోకి వచ్చాయని సాక్షి పత్రిక ఒక కథనం ప్రచురించింది.

ఫొటో సోర్స్, Govt of AP/Telangana

ఆరోగ్యకర రాష్ట్రాల్లో ఆంధ్రాది 8, తెలంగాణది 11వ స్థానం

దేశంలో ఆరోగ్య రంగంలో కేరళ మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకొంది. ఆ తర్వాత స్థానాలను పంజాబ్‌, తమిళనాడు, గుజరాత్‌ దక్కించుకున్నాయి.

తక్కువ బరువున్న నవజాత శిశువుల సంఖ్యను తగ్గించే విషయంలో తెలంగాణకు మొదటి స్థానం, ఏపీకి మూడో స్థానం వచ్చాయి. శిశు జననాలను నమోదు చేయించే విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రథమ ర్యాంకు లభించగా, తెలంగాణ 12వ ర్యాంకు సాధించింది.

ఆడ-మగ శిశువుల నిష్పత్తి అనే ప్రామాణికంలో తెలుగు రాష్ట్రాలు రెండింటికీ సమానంగా 8వ ర్యాంకు లభించింది. మొత్తంమీద 30 ప్రామాణికాల్లో పెద్ద రాష్ట్రాల విభాగంలో పనితీరును మదింపు చేస్తే ఏపీ 8వ స్థానంలో, తెలంగాణ 11వ స్థానంలో నిలిచాయి.

2014-15 సంవత్సర గణాంకాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఆ ఏడాదితో పోలిస్తే 2015-16లో ఏపీ 2.41 పాయింట్లు, తెలంగాణ 0.45 పాయింట్లు పెంచుకోగలిగాయి. కేరళ 3.45 పాయింట్లను కోల్పోయినా మొదటి స్థానంలోనే నిలిచింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు 5.55 పాయింట్లు పెరిగినా 21వ స్థానంలో అట్టడుగున ఉంది.

29 రాష్ట్రాలను, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరును నీతిఆయోగ్‌ పరిశీలించి ర్యాంకులు కేటాయించింది. 'ఆయుష్మాన్‌' పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యాన్ని సంతరించుకొంది. ఈ ర్యాంకుల ఆధారంగానే 'జాతీయ ఆరోగ్య మిషన్‌' (ఎన్‌హెచ్‌ఎం) కింద కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు అందనున్నాయి.

ఫొటో సోర్స్, iStock

పరిగణించిన అంశాలు ఇవే:

నవజాత శిశు మరణాలు, అయిదేళ్లలోపు పిల్లలో మరణాల శాతం, ఆడ-మగశిశువుల నిష్పత్తి, వ్యాధి నిరోధక టీకాలు తీసుకుంటున్నవారి సంఖ్య, ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల సంఖ్య, క్షయవ్యాధి తీవ్రత, హెచ్‌ఐవీ కేసులు, ప్రసవానికి సగటు ఖర్చు వంటి అంశాలను ప్రామాణికాలుగా పరిగణించారు.

ఆరోగ్య విభాగంలో ఖాళీలు, జననాల నమోదు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో 24 గంటల వైద్య సేవలు వంటి ఇతర అంశాలనూ విశ్లేషించినట్లు నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ వెల్లడించారు.

'ఆరోగ్యకర రాష్ట్రాలు... పురోగమన భారత్‌... రాష్ట్రాలు-కేంద్రపాలిత ప్రాంతాల ర్యాంకులు' పేరుతో శుక్రవారం దిల్లీలో ఈ నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ ఏడాది జూన్‌ నాటికి 730 జిల్లా ఆసుపత్రులకూ ర్యాంకులు కేటాయిస్తామని చెప్పారని ఈనాడు పత్రిక తెలిపింది.

ఫొటో సోర్స్, iStock

భారత్‌కు కచ్చిత సమయం!

భారత ప్రామాణిక కాలమానం (ఐఎస్‌టీ).. భారతీయులంతా పాటించే సమయం. కానీ, ఏది కచ్చిత సమయమో ఇప్పటికీ సరిగా తెలీదు. రైల్వే స్టేషన్‌కు వెళితే ఒకలా.. బ్యాంకులకు వెళితే మరోలా.. వాతావరణ శాఖకు వెళితే ఇంకోలా.. టీవీ చానళ్లలో వేరేలా ఉంటాయి. వాటిని పోల్చి చూస్తే కనీసం ఐదు నుంచి పది నిముషాల వ్యత్యాసం ఉంటుంది.

దీని వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని భావించిన కేంద్రం ఐఎస్‌టీ కచ్చిత సమయాన్ని దేశవ్యాప్తంగా ఒకేలా చేసేందుకు రూ.100కోట్లతో ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. త్వరలోనే ప్రారంభించనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఐదు ప్రాంతీయ ల్యాబ్‌ (అహ్మదాబాద్‌, బెంగళూరు, భువనేశ్వర్‌, ఫరీదాబాద్‌, గువహటి)లలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చనుంది.

కొత్తగా మరో రెండు ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం తాజా బడ్జెట్‌లో రూ.20 కోట్లు కేటాయించారని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి అవినాశ్‌ శ్రీవాస్తవ తెలిపారు. ఈ నిర్ణయం దేశభద్రతకు, సైబర్‌ నేరాల దర్యాప్తునకు ఉపయోగపడుతుందని చెప్పారని ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Arab News/You Tube

హైదరాబాద్‌కు రోబో 'సోఫియా'

మానవరూప రోబో సోఫియా భారత్‌కు రెండోసారి రాబోతున్నది. దేశంలో మొదటిసారిగా హైదరాబాద్‌లో జరగనున్న వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(డబ్ల్యూసీఐటీ)కి సోఫియా రానున్నది.

ఈ నెల 19నుంచి 21వరకు జరగనున్న ఈ కార్యక్రమానికి పుల్లెల గోపీచంద్‌, జగ్గీ వాసుదేవ్‌, పీడబ్ల్యూసీ ఇండియా చైర్మెన్‌ శ్యామల్‌ ముఖర్జీ, అడాబ్‌ సిస్టమ్‌ సీఈవో శాంతాను నారాయణ్‌ హాజరుకానున్నారు. దాదాపు 150మంది అంతర్జా తీయ నాయకులు ఇందులో పాల్గొనబోతున్నారు.

ఈ కార్యక్రమానికి సోఫియా హాజరై ప్రసంగించనున్నదని డబ్ల్యూసీఐటీ హైదరాబాద్‌ అంబాసి డర్‌ సుమన్‌ రెడ్డి తెలిపారు. ఈ రోబో సృష్టికర్తలూ హాజరు కానున్నారని వెల్లడించారు. సౌదీ అరేబియా పౌరసత్వాన్ని పొందిన ఈ రోబోను హాంగ్‌కాంగ్‌లోని హాన్సన్‌ రోబోటిక్స్‌ రూపొందించింది. కెమెరాలు, మైక్రోఫోన్‌లను అమర్చిన ఈ రోబో కండ్లతో గుర్తించి మాట్లాడగలిగే కృత్రిమ మేధా(ఏఐ) సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తుందని నవ తెలంగాణ పత్రిక వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)