#HerChoice: నేను సింగిల్.. నేనిలాగే ఉంటాను.. ఎవరేమనుకున్నా!

నా తమ్ముడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం.. అతడికి తగిన వధువు కోసం ఒక పత్రికలో పెళ్లి సంబంధాల పేజీలో ఇచ్చిన ప్రకటన చూస్తున్నాను. మా బంధువు ఒకాయన అక్కడున్న ఒక వాక్యానికి ఎర్ర పెన్నుతో వృత్తం గీశారు. ''వరుడికి పెళ్లికాని ఒక అక్క ఉంది'' అని అందులో ఉంది.
అక్కకు ఇప్పటికీ పెళ్లి కాకపోవడమన్నది మన వాడికి వధువును వెతకడంలో పెద్ద సమస్య అవుతుందని ఆ బంధువు అన్నారు.
ఈ మాటతో నా మనసు చాలా గాయపడింది. దుఃఖం పొంగుకొచ్చింది. అతికష్టమ్మీద కన్నీళ్లను ఆపుకొన్నాను. మనసులో కోపం అంతకంతకూ పెరిగిపోతోంది. ఊపిరి తీసుకోవడం భారంగా అనిపించింది. ఎవరో నా చేతులు కట్టేసినట్లు, నా నోరు నొక్కేసినట్లు అనిపించింది.
ఇలాంటి తిరోగమన ఆలోచనలు ఆయనలో ఎందుకున్నాయి?
పెళ్లి చేసుకోకూడదన్న నా నిర్ణయం.. నా తమ్ముడికి తగిన సంబంధం చూడటంలో ఎందుకు సమస్య అవుతుందంటూ గట్టిగా అరవాలని అనిపించింది.
ఇలాంటి పరిస్థితుల్లో మౌనంగా ఉండటమే ఉత్తమమని నన్ను నేను తమాయించుకున్నా. అలా మాట్లాడొద్దని మా బంధువుకు నా తమ్ముడు, నా తండ్రి గట్టిగా చెబుతారని ఆశించా. ఇతర బంధువుల్లాగే వాళ్లిద్దరు కూడా స్పందించలేదు. వాళ్లెవరూ నా బాధను పట్టించుకోలేదు.
నన్ను మా అమ్మ ఎప్పుడూ అర్థం చేసుకొంటుంది. తను ఆ సంభాషణను ఆపడానికి ప్రయత్నించింది. కానీ ఆమె ఆపలేకపోయింది.
కొడుక్కు పెళ్లవుతోందనే సంతోషం అమ్మలో కనిపించింది. నా పెళ్లి గురించి కూడా అమ్మానాన్న ఒకప్పుడు కలలు కన్నారు. ఆ రోజులు నాకు గుర్తున్నాయి.
#HerChoice - 12 మంది భారతీయ మహిళల వాస్తవగాథలు. ఈ కథనాలు 'ఆధునిక భారతీయ మహిళ' ఇష్టాయిష్టాలు, కోరికలు, ఆకాంక్షలు, ప్రాధాన్యాల గురించి వివరిస్తూ మన భావనను విస్తృతం చేస్తాయి.
మా అమ్మానాన్నలకు ఇద్దరు సంతానం. నేను, నా తమ్ముడు. ఇద్దరిలో నేనే పెద్ద అయినందున ముందు నాకే పెళ్లి చేయాలని అమ్మానాన్న అనుకొనేవారు.
నేను పెళ్లి చేసుకోలేదు. నా నిర్ణయం అమ్మానాన్నలకు వారు కోరుకొన్న సంతోషాన్ని వారికి దక్కకుండా చేసింది. కొన్నేళ్లలో ఇది మా కుటుంబంలో తీవ్రమైన సంఘర్షణకు కారణమైంది.
నా బంధువులు, స్నేహితుల్లో కూడా నా నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే కొన్నిసార్లు వాళ్ల స్పందన ఊహించిందే. కొన్నిసార్లు పూర్తిగా అనూహ్యమైన పరిస్థితులు ఎదురయ్యాయి.
అలాంటి సందర్భాల్లో ఒకటి ఇది- పాఠశాలలో నాతోపాటు చదువుకున్న ఒక స్నేహితుడు ఫోన్ చేసి, ఒక 'ప్రతిపాదన' తెచ్చాడు. ''నీకు పెళ్లి చేసుకోవాలని లేదని నాకు తెలుసు. అయితే నీకూ కచ్చితంగా కొన్ని 'అవసరాలు' ఉండే ఉంటాయి. నువ్వు సరేనంటే, నీ అవసరాలు తీర్చగలను'' అన్నాడు.
నా 'అవసరాలు' తీర్చడం తనకు ఇష్టమేనని అతడు చెప్పాడు. ఈ సంగతి తన భార్యకుగాని, తన పిల్లలకుగాని తెలియనివ్వకూడదని, అదొక్కటే షరతు అని తెలిపాడు.
అతడి మాటలు నాకు దిగ్భ్రాంతి కలిగించాయి.
ఔను, నా 'అవసరాలు' నాకు తెలియనివేమీ కాదు. అవి తీరాలంటే ఒక భాగస్వామి అవసరమని కూడా తెలుసు. అంతమాత్రాన నేను 'అందుబాటులో' ఉన్నానని ఎవరైనా అనుకోవడాన్ని మాత్రం అంగీకరించలేను. అంతేగాకుండా ఒక పాత స్నేహితుడు అలాంటి ప్రతిపాదన తెస్తాడని నేను ఎన్నడూ అనుకోలేదు.
అతడి ప్రతిపాదన నాకు కోపం తెప్పించలేదు. కానీ అతడి ఆలోచనా విధానం నన్ను చాలా బాధపెట్టింది. పైగా అతడు తన ప్రతిపాదనకు సాయమనో, సేవ అనే పేరు పెట్టుకోవడం విడ్డూరంగా ఉంది.
అతడి మాటతో మా ఇద్దరి మధ్య స్నేహం కరిగిపోయింది. ఇక ఈ స్నేహంలో చిన్ననాటి అమాయకత్వం, స్వచ్ఛత లేవు. అతడిని కలవాలనే ఆలోచనే భయం కలిగిస్తోంది. అతడితో మాట్లాడటానికి కూడా వెనకాడుతున్నాను.
నేను 'సింగిల్' అని తెలిసినప్పుడు నా పట్ల ఇతరుల ఆలోచనా తీరు, మాట తీరు మారిపోతున్నాయి. కాఫీకి, భోజనానికి పిలుస్తున్నారు. వాళ్లు అలా చేయడం మామూలే.
కానీ వెళ్లాలా, వద్దా అన్నదానిపై నా నిర్ణయం నేను తీసుకొంటున్నా.
నాకు ఇప్పుడు 37 ఏళ్లు. పెళ్లి చేసుకోకూడదన్న నా నిర్ణయంపై నాకు విచారమేమీ లేదు.
పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదని నేను మొదట అమ్మకు చెప్పాను. అప్పుడు నాకు పాతికేళ్లు. అప్పుడప్పుడే సంపాదించడం మొదలుపెట్టాను. నా కలలు సాకారం చేసుకోవాలని, గొప్ప స్థాయికి చేరుకోవాలని అనుకొనేదాన్ని.
నా నిర్ణయాన్ని చెప్పినప్పుడు అమ్మ అర్థం చేసుకొంది. కానీ బంధువుల నుంచి, ఇతరుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలతో ఆమె నిస్సహాయ స్థితిలో పడిపోయేవారు.
''మీ బిడ్డకు పెళ్లి ఎప్పుడు చేస్తున్నారు? మంచి సంబంధం దొరక్కపోతే.. చెప్పండి, మేం చూసి పెడతాం'' అని ఇతరులు అనేవారు. నేను కెరీర్లో ఎదిగేకొద్దీ మాకు తెలిసినవాళ్లు నాకు సరైన జోడీ కోసం వెతకడం ఎక్కువైంది.
పెళ్లి అయితే అమ్మాయికి భద్రత ఉంటుందని అందరూ అమ్మానాన్నలకు చెప్పేవారు. కేవలం భద్రత కోసం పెళ్లి చేసుకోవాలని నాకు లేదు.
తమ కుమార్తెకు త్వరలోనే పెళ్లి వయసు దాటిపోతోందనే ఆలోచన నా తల్లిదండ్రుల్లో చాలా ఒత్తిడిని కలిగించేది. నేను జీవితంలో 'సెటిల్' కావాలని మా నాన్న గట్టిగా అనుకొనేవారు. ఇద్దరూ, ముగ్గురూ కాదు, ఏకంగా 15 సంబంధాలు చూశారు.
నా భవిష్యత్తు గురించి మా నాన్నకున్న ఆందోళనను దృష్టిలో ఉంచుకొని ఆయన తీసుకొచ్చిన సంబంధాలన్నీ చూశాను. కానీ నేను ఎవరినీ ఒప్పుకోలేదు. నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదో వివరించేందుకు ఈ పరిణామాలు నాకు అవకాశం కల్పించాయి.
మా అమ్మానాన్నలు నన్ను అర్థం చేసుకున్నారు.
మిగతావాళ్లు మాత్రం ఎవరికివాళ్లు నా నిర్ణయంపై ఇప్పటికీ తీర్పులు ఇస్తుంటారు. నాకు పొగరు అని, మరీ స్వతంత్రంగా ఉంటానని, తల్లిదండ్రుల మాట లెక్కచేయనని అంటుంటారు. అవివేకిని అని, సంస్కృతి, సంప్రదాయాలంటే గౌరవం లేదని, భ్రమల్లో బతుకుతుంటానని కూడా విమర్శిస్తుంటారు.
ఇలా అనడం వల్ల వాళ్లకు కలిగే సంతోషమేంటో నాకైతే అర్థం కాదు.
ఆఖరుకు నా వ్యక్తిత్వంపైనా చర్చిస్తారు. నేనేంటో నా అంతరాత్మకు తెలుసు.
ప్రపంచం ఎంతగానో పురోగమించింది. ఎవరితోనైనా సహజీవనం చేయడం లేదా అఫైర్ కలిగి ఉండటంలో తప్పు కూడా ఏమీ లేదు. నాకు 'సంతోషం కలిగించేవి' నాకు నచ్చినప్పుడు, నాకు నచ్చినట్టు చేస్తాను. మహిళలు తమకు తాము బందీలుగా ఉండాలనుకోవడం లేదు.
నాకు కావాల్సింది ఒక్కటే- స్వేచ్ఛ. పెళ్లి నా వరకు ఒక విధమైన 'బంధనం'లాగా అనిపిస్తుంది.
పక్షిలాగా స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాను. నాకు నచ్చినట్టు జీవించాలనుకుంటున్నాను.
ఉండాలనిపిస్తే పగలంతా ఇంట్లోనే ఉంటాను, లేదా రాత్రంతా బయటే అయినా ఉంటాను. క్లబ్‌కు వెళ్తాను. డిస్కోకు వెళ్తాను. గుడికి వెళ్తాను. పార్కుకు వెళ్తాను. ఎక్కడికి వెళ్లానిపిస్తే అక్కడకు వెళ్తాను. చేయాలనిపిస్తే ఇంటి పనులు చేసుకుంటాను. లేదంటే వంట కూడా వండుకోను.
పొద్దున్నే అత్తగారికి టీ చేసి ఇవ్వడం గురించో, నా భర్తకు అల్పాహారం వండటం గురించో, పిల్లలను బడికి పంపడం గురించో నేను ఆలోచించక్కర్లేదు.
'సింగిల్'గా ఉండటం నాకిష్టం. నా స్వాతంత్ర్యాన్ని నేను ప్రేమిస్తాను. అవతలివాళ్లకు అర్థం అవడం కోసం ఈ మాట ఎన్నిసార్లు చెప్పాలన్నా చెబుతాను.
పెళ్లై పిల్లలున్నా, పెద్ద కుటుంబం ఉన్నా ఒంటరితనంతో బాధపడే ఆడవాళ్లను నేను ఎంతో మందిని చూశాను.
పెళ్లి కాకున్నా నాకు ఒంటరితనమనే బాధ లేదు. నాకు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉన్నారు. నాకు సంతోషాన్ని ఇచ్చే రిలేషన్షిప్స్కు విలువ ఇస్తాను.
పెళ్లికాని మహిళను సమాజానికి భారంగా చూస్తారు. కానీ నేనెన్నడూ ఎవరికీ భారం కాలేదు. ప్రపంచమంతా తిరుగుతాను. నా డబ్బు నేను సంపాదించుకుంటాను. అది ఎలా ఖర్చు పెట్టాలనేది నేనొక్కదాన్నే నిర్ణయిస్తాను.
నేను చేసే పనితో నేను గుర్తింపు తెచ్చుకున్నాను. నన్ను ప్రశంసిస్తూ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. పెళ్లి చేసుకోనందుకు ఒకప్పుడు నన్ను హేళన చేసిన కొన్ని పత్రికలు ఇప్పుడు 'సింగిల్'గా ఉండటంలో నా ధైర్యాన్ని అభినందిస్తున్నాయి.
ఒకప్పుడు నేను పెళ్లి చేసుకోనన్నందుకు ఎంతో బాధపడిన నా తల్లిదండ్రులు.. ఇప్పుడు నన్ను చూసి గర్వపడుతుంటారు.
వాళ్ల స్నేహితులు తమ కుమార్తెలకు నన్ను ఒక ఉదాహరణగా చూపిస్తూ, జీవితంలో నాలా విజయవంతమవ్వాలని చెబుతుంటారు.
అంతిమంగా చూస్తే, నా నిర్ణయం గురించి ఎవరు ఏమనుకున్నారన్నది నాకు ముఖ్యం కాదు.
నా కోసం నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం సరైనదేనని నాకు నేను నిరూపించుకున్నాను.
(వాయువ్య భారత్‌కు చెందిన ఒక మహిళ తన గాథను బీబీసీ ప్రతినిధి అర్చనా సింగ్‌తో పంచుకోగా, సీనియర్ ప్రతినిధి దివ్య ఆర్య దీనిని అక్షరబద్ధం చేశారు. ఆ మహిళ విజ్ఞప్తి మేరకు ఆమె పేరును రహస్యంగా ఉంచుతున్నాం.)
ఇవి కూడా చదవండి:
- #HerChoice: 'నేను సోషల్ మీడియాలో పరాయి మగాళ్లతో చాట్ చేస్తాను!'
- #HerChoice: నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!
- #HerChoice: 'ఒక మహిళతో కలసి జీవించాలని నేనెందుకు నిర్ణయించుకున్నానంటే..'
- వీకెండ్లో విశ్రాంతి కోసం ఓ పది విషయాలు
- మహిళలూ మెదడును మీ దారికి తెచ్చుకోండి ఇలా..
- మహిళా ఉద్యోగులతో కంపెనీలకు మేలేనా?
- పలక, బలపం పడుతున్న చిన్నారి పెళ్లికూతుళ్లు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
#HerChoice: మహిళలు తమకు నచ్చినట్లు ఉంటే ఏం జరుగుతుంది?
సాధారణ ప్రజాభిప్రాయానికి భిన్నంగా దేశంలోని మహిళలు తమ తమ బంధాలలో, జీవితంలో నిశ్శబ్దంగా తిరుగబడుతున్నారు.