#గమ్యం: ఎప్పటికీ వన్నె తరగని హోటల్ మేనేజ్‌మెంట్

  • అనిల్ కుమార్
  • బీబీసీ ప్రతినిధి
వీడియో క్యాప్షన్,

#గమ్యం: హోటల్ / హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ రంగంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి?

బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం. గత వారం న్యాయశాస్త్రం, న్యాయవిద్య చదివితే భవిష్యత్తులో అవకాశాలు, న్యాయశాస్త్రాన్ని అభ్యసించాలనే ఆసక్తి ఉంటే రాయాల్సిన ప్రవేశ పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాల్ని పరిశీలించాం.

ఈ సిరీస్‌లో భాగంగా ఈ వారం హోటల్ / హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ రంగంలో విద్యాసంస్థలు, అవకాశాలకు సంబంధించిన విలువైన సమాచారం అందిస్తున్నారు... Careers360.com ఛైర్మన్ మహేశ్వర్ పేరి. మీకు ఏమైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ చేయండి.

ఫుడ్ బిజినెస్, హోటల్ మేనేజ్‌మెంట్ అనేవి ఎప్పటికీ డిమాండ్ తగ్గని రంగాలు. ఆ డిమాండ్‌కు తగ్గట్లే అర్హులైన అభ్యర్థులకూ, అనుభవం ఉన్న నిపుణులకూ ఉద్యోగావకాశాలూ ఉంటాయి.

మన చుట్టూ ఉన్న ప్రపంచంలో రాన్రానూ హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్టులూ, ఫుడ్ చైన్లు, ఫుడ్ మాల్స్... ఇవన్నీ చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. అందువల్ల హాస్పిటాలిటీ రంగంలో నిపుణులకు ఎన్నో ఉపాధి అవకాశాలు ఉంటాయి.

హోటల్ మేనేజ్‌మెంట్ అంటే కేవలం హోటళ్లలో ఉద్యోగం అనుకునే రోజులు పోయాయి. ఇది అందరూ కచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దీని పరిధి రోజురోజుకూ విస్తరిస్తోంది.

హోటల్ / హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులు ముఖ్యంగా దృష్టి పెట్టాల్సిన పరీక్ష ఒకటుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఎన్‌సీహెచ్ఎంజేఈఈ

నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఎన్‌సీహెచ్ఎంజేఈఈ). దీని ద్వారా దాదాపు ఎనిమిది వేల సీట్లు భర్తీ చేస్తారు. ఎన్‌సీహెచ్ఎంజేఈఈలో సాధించే స్కోరు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 21 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో, 22 రాష్ట్ర యూనివర్శిటీల్లో, 1 పీఎస్‌యూ, 14 ప్రైవేట్ విద్యాసంస్థల్లో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులోకి ప్రవేశాలు నిర్వహిస్తారు. వీటిలో ఎక్కడ చేరినా క్యాంపస్ ప్లేస్‌మెంట్లు చాలా బాగుంటాయి.

ప్రస్తుతమున్న డిమాండ్‌కు ఎనిమిది వేల సీట్లు చాలా తక్కువ. అందువల్ల కోర్సు పూర్తైన తర్వాత మంచి ఉద్యోగం లభించేందుకు అవకాశాలెక్కువ.

దీనికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. చివరి తేదీ ఏప్రిల్ 11. అదే నెల 28న పరీక్ష జరగనుంది.

ఫొటో సోర్స్, Getty Images

ప్రైవేట్ సంస్థలు - ఉపాధి

హాస్పిటాలిటీ రంగంలో స్థిరపడాలనుకునేవారికి ప్రైవేటు రంగంలో కూడా చాలా మంచి శిక్షణ సంస్థలు అందుబాటులో ఉన్నాయి. పెద్ద హోటళ్లు ఏవి చూసినా... అవి తమకు మాత్రమే ప్రత్యేకమైన శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసుకున్నాయి. తాజ్ గ్రూప్, ఒబెరాయ్ గ్రూప్, వెల్‌కమ్ గ్రూప్, షెరటాన్ గ్రూప్, సరోవర్ గ్రూప్ ఇలా అందరికీ ప్రత్యేక శిక్షణ సంస్థలున్నాయి. వీరు అభ్యర్థులను తీసుకుని, శిక్షణనిచ్చి, తమ గ్రూపులోనే ఉద్యోగాలు కల్పిస్తున్నారు.

చాలా మంది ఓ ప్రముఖ గ్రూపులో ఐదారేళ్లు పనిచేసి సొంతంగా తామే ఓ వ్యాపారాన్ని ప్రారంభించిన ఉదాహరణలు మనం నిత్యం ఎన్నో చూస్తూనే ఉన్నాం. అందువల్ల పారిశ్రామికవేత్తగా ఎదగాలనుకునే వారికి సైతం ఈ రంగం ఎంతగానో తోడ్పాటునందిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)