ప్రెస్‌ రివ్యూ: తగ్గిన బరువు మళ్లీ పెరగడానికి కారణాలివే!

ఊబకాయం

ఫొటో సోర్స్, Getty Images

తగ్గిన బరువు మళ్లీ పెరగడానికి కారణం ఇదే

బరువు తగ్గి మళ్లీ పెరగడానికి ప్రధాన కారణాలు రెండు అని నార్వేజియన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో పేర్కొన్నారని ఈనాడు ఓ కథనంలో తెలిపింది.

ఆకలికి దారితీసే గ్రెలిన్ హార్మోన్ విడుదల స్థాయుల్లో ఉండే తేడానే దీనికి ప్రధాన కారణం అని అభిప్రాయపడుతున్నారు. ఈ హార్మోన్ సాధారణ వ్యక్తుల్లో అవసరమైన స్థాయిలోనే విడుదలవుతుంటే... ఊబకాయులుగా ఉండి, బరువుతగ్గిన వారిలో మాత్రం అధికంగా ఉత్పత్తి అవుతోంది. అందువల్లే స్థూలకాయులుగా ఉండి బరువు తగ్గినా, మళ్లీ ఆకలిని భరించలేక ఇష్టారీతిలో ఆహారం తీసుకోవడంతో పూర్వ స్థితికి వచ్చేస్తున్నారని తమ అధ్యయనంలో తెలిపారు.

అలాగే అధిక బరువున్నవారి శరీరంలో శక్తి వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారిగా బరువు తగ్గడం వల్ల ఆ క్యాలరీలన్నీ పోగుపడి మళ్లీ ఊబకాయులుగా మారిపోతున్నారు.

భారత దేశంలో 1.5 కోట్ల మంది చిన్నారులు ఊబకాయంతో బాధపడుతున్నారని ఈనాడు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఒబెసిటీ బాధితులు పెరుగుతున్నారని వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images

పట్టణాల్లో, నగరాల్లో పనిమనుషులకు డిమాండ్

మంచి పని మనిషి ఉంటే చెప్పండి... ఇది ఇప్పుడు పల్లెల నుంచి నగరాల వరకూ వినిపిస్తున్న మాట.

పిల్లలు విదేశాల్లో స్థిరపడితే ఇక్కడ ఒంటరిగా ఉన్న వృద్ధుల నుంచి జీవనశైలిలో మార్పులు, భారీ జీతాల కారణంగా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన నగర ప్రజల వరకూ అందరిదీ ఇదే మాట.

వ్యవసాయ పనుల కారణంగా పల్లెల్లో కొంతవరకూ ఉపాధి లభించడం, ప్రభుత్వాలు ఇస్తున్న పెన్షన్ల కారణంగా చేతిలో కొంత డబ్బులు కనిపిస్తున్నాయి. అదే సమయంలో వారి పిల్లలు పట్టణాల్లో చదువుకుంటుంటే వీరు పనికి వెళ్లడాన్ని కొంతమంది ఇబ్బందిగా, అవమానంగా భావిస్తున్నారు. దీంతో ఇళ్లలో పని మనుషులు దొరకడం కష్టంగా మారింది. పట్టణాల్లో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉందంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది.

దీన్ని అలుసుగా చేసుకుని పనిమనుషులను నియమించడానికి ఏజెన్సీలు, సంస్థలు పుట్టుకొస్తున్నాయి. కానీ వారి కమీషన్లు, పనిమనుషుల జీతాలు కలిపి తడిసిమోపెడవుతున్నాయని వినియోగదారులు గగ్గోలుపెడుతున్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images

అనుమతిలేని ప్రయోగాలకు అడ్డుకట్ట ఎప్పుడు?

తెలంగాణలో అనుమతి లేని క్లినికల్ ట్రయల్స్‌ ఎక్కువగా జరుగుతున్నాయని, అధికారుల పర్యవేక్షణ లోపమే దీనికి కారణమని సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఈ ప్రయోగాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం వహిస్తోందనే విమర్శలు వస్తున్నాయని, దీంతో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని కథనంలో తెలిపింది.

అయితే, ఔషధ ప్రయోగాల నియంత్రణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, అందుకే ఎలాంటి చర్యలూ తీసుకోలేకపోతున్నామని రాష్ట్ర విభాగం చెబుతోంది. ఫార్మసీ కంపెనీలు నిబంధనలను ఇష్టారాజ్యంగా ఉల్లంఘిస్తున్నా పట్టించుకునేవారే లేరని కథనంలో విమర్శించింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)