అభిప్రాయం: ఏది అశ్లీలత? ఏది లైంగిక స్వేచ్ఛ?

రాంగోపాల్ వర్మ తీసిన 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్(జీఎస్టీ)' సినిమాపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సినిమా, లైంగికత పట్ల సంప్రదాయ ధోరణిని బద్దలుకొట్టి, లైంగిక విముక్తికి తోడ్పడుతుందని కొంత మంది వాదిస్తుంటే, ఇది పచ్చి వ్యాపార ధోరణితో స్త్రీ శరీరాన్ని వాడుకుని డబ్బు చేసుకునే చౌకబారు యత్నమని అనేక మంది భావిస్తున్నారు.
తమ వంశ గౌరవాన్ని కాపాడుకోవడానికి, పరాయి మగాడి(అందులోను ముస్లిం)కి దక్కకుండా ఉండటానికి మంటల్లో దూకే ఊహాత్మక రాణి పద్మిని నడుము కనిపించడం భారతీయ స్త్రీలను కించపరుస్తోందని రాజ్‌పుత్ పురుషులు, స్త్రీలు నిరసనలు వ్యక్తంచేస్తుంటే, మరోపక్క, బట్టల్లేని తెల్లజాతి స్త్రీ శరీరవాద తాత్వికత భారత దేశంలో లైంగిక విముక్తికి దారితీస్తుందని మరో వర్గం పురుషులు, స్త్రీలు వాదిస్తున్నారు.
ఈ రెండు ఘటనలూ ఒకే సమయంలో జరగడం కేవలం యాదృచ్ఛికం కాదు. అలాగని లైంగిక సంబంధాల పట్ల మన కపటత్వం(హిపోక్రసీ)కి ఇవి నిదర్శనం మాత్రమే కూడా కాదు.
ఇది లైంగికతను వ్యక్తిగత విషయంగా పరిగణించాలనే ధోరణికి, వివిధ రకాల అంతరాలున్న సమాజంలో ఇలాంటి వ్యక్తివాద లైంగిక విముక్తికి ఉన్న సాధ్యాసాధ్యాలు, పర్యవసానాలు, పరిణామాల గురించి ఆలోచించాలన్న ధోరణికి మధ్య జరుగుతున్న సంఘర్షణ.
చాలా మంది 'జీఎస్టీ'ని అశ్లీల సినిమాగా లేక నీలిచిత్రంగా చూస్తున్నారుగాని అది సరైన అంచనా కాదేమో!
సినిమాల్లో అశ్లీలత గురించి 1970ల్లో చర్చలు మొదలయినప్పుడు అవి స్త్రీ శరీరాల ప్రదర్శన గురించి మాత్రమే జరగలేదు. అత్తామామలకు, లేదా మొగుళ్లకు అణిగిమణిగి ఉండాలని, స్త్రీలు బయటకు రాకూడదు, పనిచేయకూడదు లాంటి ఫక్తు ఫ్యూడల్ పురుషాధిక్య ధోరణులకు వ్యతిరేకంగా కూడా ఆ చర్చలు నడిచేవి.
1990లకు వచ్చేసరికి ఈ విలువలన్నీ ఎదిరించలేని 'గొప్ప సాంస్కృతిక విలువలు'గా రూపుదిద్దుకోవడంతో అశ్లీలత అంటే స్త్రీల నగ్న, అర్ధనగ్న శరీరాల్లో లేదా వారు వేసుకునే బట్టల్లో మాత్రమే అందరికీ కనపడటం మొదలయింది.
ప్రపంచీకరణ వ్యాప్తి చెందాక జరిగిన సాంస్కృతిక మార్పుల్లో (ఎంత రాజపుత్‌లు వాదించినాగానీ) ఈ వాదన కూడా కష్టమైంది.
ఇంటర్నెట్ పోర్నోగ్రఫీ వెల్లువలా పొంగిన ప్రస్తుత సమయంలో, శరీర ప్రదర్శన పెద్ద విషయం కాకుండా పోయింది. ఇంకో పక్క తమను తాము తెరపై చూసుకోవాలనే యువతీ యువకులు వారి లైంగిక చర్యలను వారే చిత్రీకరించుకొంటున్నారు. సినిమా తెర మీద చూపే అర్ధ నగ్నత్వాన్ని, నగ్నత్వాన్ని అశ్లీలతగా మాత్రమే చూడటం ఇప్పుడు కొంచెం కష్టం.
- #BollywoodSexism నేను ఫెమినిస్టునని చెప్పగానే అంతా అదిరిపడ్డారు: సోనమ్ కపూర్
- #HerChoice: నేను సింగిల్.. పెళ్లి చేసుకోనంటే అందరూ తప్పుబట్టారు
నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలు
అసలు అశ్లీలత, మారని సమాజ విలువల నుంచి వస్తోంది. అది స్త్రీలను వారి శరీరాలకు, ఇంకా ముఖ్యంగా వారి లైంగిక అవయవాలకు కుదించే దృష్టిలో ఉంటుంది. అది వారి సౌందర్యాన్ని పొగిడేది కావచ్చు, అత్యాచారం జరిగితే తెగిడేది కావచ్చు. రెండూ కూడా వారి జీవిత సారాన్ని శరీరానికే కుదిస్తాయి. ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలు.
తమ స్త్రీలు, పరాయి స్త్రీలకు మధ్య గీతలు గీసే ధోరణి కూడా ఇందులో భాగమే.
తమ స్త్రీలు, శరీర పవిత్రతను కాపాడుకుని, కుటుంబం, జాతి, మతం, కుల సమూహం నిర్ణయించిన మగవాడికి తమను తాము సమర్పించుకుని, కుటుంబ సభ్యుల కోసమే తమను తాము అంకితం చేసుకోవడమనే ఆలోచనలో, అలాగే సన్నీలియోని లేదా మియా మాల్కోవా లాంటి 'ఇతర' స్త్రీల పట్ల బాహాటంగా వ్యక్తం చేసే వాంఛలో అశ్లీలత ఉంది.
తమ కుల, వర్గ, పురుషాధిక్య ప్రయోజనాలకు ఏ కష్టం రానీయకుండా స్నేహితురాళ్ళను, ప్రియురాళ్లను, భార్యలను కూడా స్వప్రయోజనాల కోసం వాడుకునే 'స్వేచ్ఛ'ను కోరుకోవడంలో అశ్లీలత ఉంది.
కట్నం కావాలి, ఉద్యోగం చెయ్యాలి, డబ్బు తన చేతిలో పెట్టాలి, తన అనుమతి లేకుండా ఏమీ చెయ్యకూడదు, ఎవరితోనూ స్నేహం చెయ్యకూడదు- ఇలా తమ అనంతమైన కోరికలను తమ భార్యలు, స్నేహితురాళ్ళు, ప్రియురాలు విని, తాము చెప్పినట్లే జీవించాలని కోరుకోవడంలో ఉంది.
ఇలాంటి అశ్లీలత జీఎస్టీలో ఉంది, 'పద్మావత్'లో ఉంది, వాటిపై చేస్తున్న నిరసనల్లో ఉంది.
అదెట్లా?
జీఎస్టీలో 'ఇతర' స్త్రీనే కావచ్చుగాక, నగ్నంగా, తన శరీరవాద తాత్వికతను స్వేచ్ఛగా కెమెరా ముందు చెప్పడం విముక్తికి తోడ్పడదా అని అడగొచ్చు.
ప్రపంచవ్యాప్తంగా తెల్లజాతి స్త్రీలు (మిగిలినవారితోపాటు) పనిస్థలాల్లో ఇలాంటి లైంగిక విముక్తి కోరుకునే స్వేచ్ఛాతత్పర పురుషుల నుంచి ఎదుర్కొన్న వేధింపులకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలను కాసేపు పక్కన పెడదాం.
వర్మ సినిమా పేరులో ఉన్న ఆసక్తికర వ్యంగ్యం కూడా పక్కన పెడదాం.
జీఎస్టీ: ఈ తాత్వికత మియా మాల్కోవాది కాదు, వర్మది
జీఎస్టీ మియా మాల్కోవా జీవిత కథ కాదు, ఆవిడ తాత్వికత కూడా కాదు. వర్మ రూపొందించిన సినిమా. సినిమాలో ఉన్నది ఆయన తాత్వికత. దాని ప్రకారం- అందమైన స్త్రీలు నగ్నంగా కెమెరా ముందు లైంగిక కోరిక గురించి మాట్లాడితే అందరిలో ఉండే అసలు సిసలు సత్యాలు, వాంఛలు బయట పడతాయి; అలాగే, ప్రతి స్త్రీకి (పురుషుడికి) ఎక్కువసార్లు, ఎక్కువ మందితో సెక్స్‌లో పాల్గొనాలని ఉంటుందనే 'సత్యం' కూడా ఈ సినిమా ద్వారా అయన 'బహిర్గతం' చేశారు.
మన సమాజంలో సెక్స్ చుట్టూ వుండే కపటత్వాన్ని ఈ సత్యాలు బయటపెట్టి, బద్దలు చేస్తున్నాయని వర్మ అనుకుని ఉండొచ్చు.
వ్యక్తివాదానికి పరాకాష్టగా జీవించే వర్మ అభిప్రాయాలను ఎంత మంది పరిగణనలోకి తీసుకుంటారో తెలియదుగానీ, ఈ సినిమా ద్వారా ఆయన చెప్తున్న విషయాన్ని జీవిత సత్యంగానో, తాత్వికతగానో ఒప్పుకోవడం ఆలోచనాపరులకు కొంచెం కష్టమే.
లైంగిక ప్రక్రియ, లైంగికత రెండూ ఒకటి కావు
లైంగిక ప్రక్రియ, లైంగికత రెండింటి గురించి సాధారణీకరించే సత్యాలు ఉండవనేది మానవ పరిణామశాస్త్రం(ఆంథ్రోపాలజీ) చదివినవాళ్ళు ఎవరైనా చెప్పగలరు.
ప్రతి సమాజం అనేక రకాలుగా లైంగిక కోరికలను, సౌందర్యాన్ని, కామోద్రేకాన్ని, శరీరంలో ఏది అందమైనది, ఏది మోహం కలిగిస్తుంది అని ప్రత్యేకంగా గుర్తిస్తూ వచ్చింది. అందులో భాగమే స్త్రీల లైంగికతను పురుషుల ఆశలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవడం.
'ఆడదానికి సిగ్గే అందం' అంటూ కులీన స్త్రీల లైంగికతను నియంత్రించడం లేక 'కింది జాతి స్త్రీలకు క్యారెక్టర్ ఉండదు' అని వారిపై లైంగిక దోపిడీకి మార్గం ఏర్పరచుకోవడం రెండూ ఇందులో భాగమే.
ఇప్పుడు మనందరం చాలా సహజం అని భావించే స్త్రీ పురుషుల మధ్య లైంగిక చర్య మానవ లైంగికతలో ఒక భాగమే. స్త్రీలకు, పురుషులకు మధ్య మాత్రమే మోహం ఉంటుందని భావించడం 'హెటెరోసెక్సిజం' అనే భావజాలంలో భాగం.
- పోర్న్ స్టార్ మియా మాల్కోవా సన్నీ లియోనిని మించి పోతారా!
- #BollywoodSexism: బాలీవుడ్, టాలీవుడ్‌లలో లైంగిక వేధింపులపై కథనాలు
లైంగికతనే సరిగ్గా అర్థం చేసుకోలేదు అనుకుంటుంటే ఇప్పుడు ఇలాంటి సినిమాల వల్ల లైంగిక స్వేచ్ఛ, స్వతంత్రం, విముక్తి వస్తాయని కొంత మంది ప్రచారం చేస్తుంటే నవ్వాలో, ఏడ్వాలో తెలియట్లేదు. లైంగికత శరీరం నుంచి, లైంగిక చర్య నుంచి ఉద్భవిస్తుందా అన్నది ఇంకో పెద్ద ప్రశ్న.
ఎక్కడ, ఎలా, ఎవరితో సంభోగించాలనే బాహ్య, అంతర్గత సామాజిక కట్టుబాట్లు తీవ్రంగా ఉన్న మన సమాజంలో కులం, మతం, ప్రాంతం పరిమితులు దాటి పెళ్లి చేసుకోవడమే పెద్ద తిరుగుబాటుగా పరిణమించిందనేది ఒక పెద్ద సత్యం. ఇది లైంగిక స్వతంత్రం వైపు తీసుకెళ్లే చర్యే కదా!
లైంగిక విద్య వద్దనే నైతిక పోలీసులు, శరీరం అంటే సెక్స్ కోసం మాత్రమే అన్న పోర్నోగ్రఫీ ఇచ్చే చదువు మధ్యలో ఇరుక్కున్న అనేక మంది యువతకు సెక్స్‌తో పిల్లలు పుడతారనే కనీస జ్ఞానం కొరవడిన సందర్భంలో, లైంగిక స్వేచ్ఛకు అర్థం ఏముంటుంది? లైంగిక విద్య, గర్భనిరోధం కూడా లైంగిక స్వేచ్ఛ ప్రసాదించేవే కదా!
ఇంకా ముందుకెళ్తే, ఇప్పుడు మన కోరికలు స్వతంత్రమైనవా?
కాస్మటిక్స్ నుంచి సినిమాల వరకు, మన కోరికలను, శరీరాలను, వాటి గురించిన మన ఆలోచనలను, మనమెవరికీ చెప్పుకోలేని విషయాలను కూడా ఆద్యంతం నియంత్రిస్తున్న సమయంలో శరీరాల గురించి, కోరికల గురించి స్వతంత్రంగా ఎవరు ఆలోచించగలుగుతున్నారు?
వర్మ సినిమా మన కోరికలను నియంత్రించే వ్యవస్థలో భాగం కాక మరేంటి?
అవయవ పుష్టి వున్న తెల్లజాతి స్త్రీలకు చాలా కోరికలుంటాయి, మీరు కూడా వారినే కోరుకోండి, వారు కూడా ఈ అవకాశాల కోసం చూస్తుంటారు అనే 'సత్యాన్ని' చాటి చెప్పే ఈ సినిమా తెల్లజాతి స్త్రీల గురించి మన సమాజంలో ఉన్న అన్ని మూసపోసిన ఆలోచనలను క్రోడీకరించట్లేదూ?
కెమెరాకు అందంగా కనిపిస్తేనే సౌందర్యమని ఈ సినిమా చెప్పట్లేదూ? హెటెరోసెక్సువల్ మగవాళ్ల చూపు దేనికోసం చూడ్డానికి అలవాటు పడిందో, దాన్నే పదే పదే చూపట్లేదూ? దీనిలో కొత్తేముంది, పూర్తి నగ్నత్వం తప్ప? (బట్టలేసుకోకుండా ఏమి చెయ్యగలం అని నా స్నేహితురాళ్ళను అడిగితే, మూడే విషయాలు చెప్పారు: స్నానం, డెలివరీ, సెక్స్. నిద్ర పోలేమని, తిండి కూడా తినలేమని చెప్పారు. మరి బట్టలేసుకోని మియా మాల్కోవాకు వంట ఎవరు చేస్తారు, తిండి ఎవరు పెడతారు, చలెయ్యదా, నెలసరి వస్తే ప్యాడ్ ఎలా పెట్టుకుంటుంది, ఇంటికి ఎవరూ రారా లాంటి చెత్త ప్రశ్నలు కూడా వేశారు!)
- రివెంజ్ పోర్న్: అసభ్యకర చిత్రాలకు చెక్ పెట్టనున్న ఫేస్బుక్
- #HerChoice: 'నేను సోషల్ మీడియాలో పరాయి మగాళ్లతో చాట్ చేస్తాను!'
ఫ్యుకో విశ్లేషణ ఏమిటంటే...
మిచెల్ ఫ్యుకో అనే ఫ్రెంచి తత్వవేత్త 1960ల్లో పాశాత్య దేశాల్లో పెల్లుబికిన 'లైంగిక స్వేచ్ఛ' వాదుల ఉద్యమాన్ని విశ్లేషిస్తూ చెప్పిన మాటలు ఈ సందర్భంలో గుర్తొస్తున్నాయి.
17, 18, 19 శతాబ్దాల్లో లైంగికతను అణగదొక్కారని, దాన్ని ఛేదించి విముక్తి పొందాలని ఈ లైంగిక స్వేచ్ఛ వాదులు వాదించారు.
ఫ్యుకో అప్పటి వైద్య, పరిపాలన వ్యవహారాలూ, జీవశాస్త్ర, న్యాయశాస్త్ర పత్రాలు పరిశీలించి, లైంగికత అణచివేతకు గురికాలేదని, అప్పుడే లైంగికతపై విపరీతమైన ఆసక్తి పెరిగిందని, లైంగికతను ఒక క్రమంలోకి నియంత్రించారని చెప్పారు. అప్పుడు సమలైంగికులు, వివాహం బయటి సెక్స్, వివిధ వర్గాల స్త్రీ, పురుషుల మధ్య సెక్స్ లాంటివి నేరపూరితం, అసాధ్యం చేసి లేదా బలవంతంగా అణిచివేసి, కేవలం బూర్జువా కుటుంబంలో భార్యాభర్తల మధ్య మాత్రమే సెక్స్ జరిగేలా చూశారు అని ఫ్యుకో విశ్లేషించారు.
20వ శతాబ్దపు లైంగిక స్వేచ్ఛావాదులు వివాహం బయటి స్త్రీ పురుషుల మధ్య సెక్స్ మాత్రమే లైంగిక స్వేచ్ఛగా నిర్ధరించి మరో నమూనాను తయారు చేశారు.
ఫ్యూకో చెప్పినట్లు, సెక్స్ అప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు కూడా మార్కెట్, స్టేట్ వాదాలనుండి విడిగా లేదు.
కట్టుబాట్లతో నియంత్రణకు గురైన సెక్స్ ఒక రకమైన పురుషాధిక్యాన్ని సూచిస్తే, 'విముక్తి' చెందిన సెక్స్ మరొక రకమైన పురుషాధిక్యాన్ని సూచిస్తుంది.
సెక్స్ జరగటం అటుంచి, జరిగిందని అనుమానం వస్తే చంపుతున్న అసమ సమాజంలో ఉంటున్న మనం కొంత మంది స్త్రీ-పురుషులు ఇష్టంగా లైంగిక చర్యలో పాల్గొన్నంత మాత్రాన లైంగిక విముక్తి జరుగుతుందని ఏ ప్రాతిపదికన నమ్మగలం?
ఇష్టమైన వ్యక్తుల మధ్య సెక్స్ అన్నది ఆనందకరమైన చర్య. ఫ్రాయిడ్ అన్నట్లు, ఇది కేవలం అవసరమే కాదు జీవితాన్ని ప్రేరేపించే శక్తి కూడా. అయితే అది స్త్రీల శరీరంలో, ఎంత అందమయిన స్త్రీలయినా సరే, ఇమిడి ఉండేది కాదు.
ఆయా స్త్రీల శరీరాలు ఉండేది పురుషుల ఆనందం కోసమూ కాదు. వారి అంగీకారం, ఆనందం, ఇష్టంతో ప్రమేయం లేకుండా వారి శరీరాల్ని వాడుకునే స్వేచ్ఛ చట్టపరంగా కలిగున్న భర్తలు, అలాగే ప్రవర్తించే ప్రియులు, విటులు ఉన్న
మన సమాజంలో సెక్స్ అందరికీ ఆనందప్రాయమని సాధారణీకరణ చెయ్యటం చాలా కష్టం.
స్త్రీలకు, స్త్రీలకు మధ్య, పురుషులకు, పురుషులకు మధ్య, స్త్రీలకు, పురుషులకు మధ్య, ఇంకా ఇతర జెండర్ బంధాల్లో ఇమడని వ్యక్తుల లైంగిక సంబంధాలు వర్ధిల్లాలంటే తప్పకుండా లైంగిక స్వేచ్ఛ చాలా అవసరం.
దాన్ని సాధించటానికి చాలా స్థాయుల్లో చాలా మార్పులు రావాలి. సమలైంగికత నేరపూరితం కాకూడదు. వైవాహిక బంధంలోనూ అత్యాచారం జరుగుతుందని గుర్తించి, ఈ అత్యాచారాన్ని నిషేధించాలి.
సెక్స్‌కు అవతలి వ్యక్తి అంగీకారం అత్యంత ముఖ్యమని గుర్తించే సంస్కృతి రావాలి. ఇంకా ఇలా ఎన్నో మార్పులు రావాలి.
లైంగిక కోరికను ఇంత సంప్రదాయ రీతిలో, సంకుచితంగా వ్యక్తీకరించే వర్మ సినిమా లైంగిక స్వేచ్ఛకు దారితీయట్లేదు సరికదా, అన్ని సినిమాల్లాగే లైంగిక ఫెటిషిజం(ఒక రకమైన శరీరాల పట్ల మోజు)కు దారి తీస్తోంది.
అంతే కాదు, పద్మావత్ సినిమా గురించి స్వర భాస్కర్ అన్నట్లు - ఈ చిత్రం స్త్రీలను వారి యోని స్థానానికి కుదిస్తోంది.
పెత్తందారీ ఫ్యూడల్ పితృస్వామ్యం నుంచి ఉదారవాద పితృస్వామ్యం వైపు పయనిస్తున్న మన సమాజంలో అక్కడ చావు, ఇక్కడ సెక్స్, రెంటినీ స్త్రీలే స్వేచ్ఛగా ఎంచుకుంటున్నట్లు కనిపిస్తారు. ఆ ఎంపికలో వారి ప్రమేయం ఎంతన్నదే మనం చర్చించాల్సిన కీలక ప్రశ్న.
ఇవి కూడా చదవండి:
- #HerChoice: నా భర్త నన్ను ప్రేమించాడు, కానీ పడగ్గదిలో హింసించాడు
- తొలిరాత్రి 'కన్యత్వ పరీక్ష'లను ఆపాలంటూ ఉద్యమం
- #HerChoice: 'ఒక మహిళతో కలసి జీవించాలని నేనెందుకు నిర్ణయించుకున్నానంటే..'
- వీకెండ్లో విశ్రాంతి కోసం ఓ పది విషయాలు
- మహిళలూ మెదడును మీ దారికి తెచ్చుకోండి ఇలా..
- మహిళా ఉద్యోగులతో కంపెనీలకు మేలేనా?
- పలక, బలపం పడుతున్న చిన్నారి పెళ్లికూతుళ్లు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)