రష్యాలో కుప్పకూలిన విమానం, 71మంది మృతి

విమానం కూలిన ప్రాంతం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

విమానం కూలిన ప్రాంతంలో అత్యవసర సేవల సిబ్బంది

71మంది ప్రయాణికులు, సిబ్బందితో మాస్కో నుంచి బయల్దేరిన రష్యా విమానం కూలిపోయింది.

మాస్కో నుంచి ఆర్స్క్ నగరానికి పయనమైన ఈ విమానం రాడార్ తెరలపై నుంచి కనుమరుగైన కాసేపటికే కూలిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది.

సారటోవ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం కూలిపోయినట్లు, ఇందులో ప్రయాణిస్తున్న 71మందీ చనిపోయినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

మాస్కోకు 80కిమీ దూరంలోని ఆర్గునోవో ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,

కూలిపోయింది ఇలాంటి విమానమే

డొమోడెడోవో విమానాశ్రయం నుంచి బయల్దేరిన రెండు నిమిషాల్లోనే ఏఎన్-148 విమానం రాడార్ తెరలమీద నుంచి అదృశ్యమైంది. నిమిషానికి వెయ్యి మీటర్ల చొప్పున విమానం గగనతలం నుంచి కిందకు జారినట్లు ‘ఫ్లైట్ రాడార్ 24’ సంస్థ తెలిపింది.

ప్రమాదం జరిగిందని భావిస్తున్న ప్రాంతంలో విమాన శకలాలు లభ్యమయ్యాయి.

ప్రమాదాలు కొత్త కాదు

ఇటీవలి కాలంలో రష్యన్ ఎయిర్‌లైన్స్‌లో రెండు భారీ ప్రమాదాలు సంభవించాయి.

  • 2016 డిసెంబర్‌ 25న ‘టీయూ-154 మిలిటరీ ఎయిర్‌లైనర్’ నల్ల సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 92మంది చనిపోయారు.
  • 2015 అక్టోబర్ 31న ‘రష్యన్ ఎయిర్‌బస్ ఏ321’ విమానం ఈజిప్ట్‌‌లో కూలిపోయింది. ఈ ఘటనలో 224మంది చనిపోయారు. ఈ ప్రమాదానికి కారణం తామేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ పేర్కొంది.

ఫొటో సోర్స్, Flighradar24

ఫొటో క్యాప్షన్,

విమానం ప్రయాణిస్తున్న మార్గం

నిషేధానికి గురైన ఎయిర్‌లైన్స్

ఆదివారంనాడు కూలిన విమానం సారటోవ్ సంస్థకు చెందింది.

2015లో ఈ విమానయాన సంస్థ అంతర్జాతీయ సర్వీసులు నిర్వహించకుండా నిషేధానికి గురైంది. కాక్‌పిట్‌లో విమాన సిబ్బంది కాకుండా బయటి వ్యక్తులు ఉన్నట్లు తనిఖీ సిబ్బంది గుర్తించడమే దీనికి కారణం.

2016లో సారటోవ్ ఎయిర్‌లైన్స్ తమ పాలసీని మార్చుకొని ప్రభుత్వ అనుమతితో అంతర్జాతీయ సర్వీసులను తిరిగి ప్రారంభించింది.

ఈ సంస్థ విమానాలు ప్రధానంగా రష్యన్ నగరాల్లోనే ప్రయాణిస్తాయి. అర్మేనియా, జార్జియా లాంటి దేశాలకూ సేవలందిస్తాయి.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.