ప్రెస్‌రివ్యూ: 'నిధుల లెక్కలిస్తే.. నిజం తేలుస్తాం'

పవన్‌కల్యాణ్

ఫొటో సోర్స్, janasena/whatsaap

''నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్రం ఎన్ని నిధులిచ్చింది, వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఖర్చు పెట్టిందీ ఈ నెల 15లోగా లెక్క చెప్పాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు'' అని ఈనాడు పేర్కొంది.

నిధులు, ఖర్చులతో నివేదిక ఇస్తే ఐక్య నిజనిర్ధాకరణ కమిటీకి అప్పగించి అసలు దోషి ఎవరనేది తేలుస్తామని చెప్పారు. నివేదిక ఇవ్వడానికి నిరాకరిస్తే తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఇది తిరుగుబాటు కాదని, ప్రజలకు న్యాయం జరగడం కోసం చేసే ప్రయత్నమని స్పష్టం చేశారు.

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌తో ఆదివారం ఉదయం జనసేన పరిపాలన కార్యాలయంలో గంటన్నరపాటు పవన్‌ కల్యాణ్‌ సమావేశమయ్యారు. అనంతరం వారిద్దరూ విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. పవన్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మేలు జరుగుతుందనే 2014 ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతునిచ్చి భాజపా, తెదేపాల విజయానికి కృషి చేసిందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో అందరిలానే తనలోనూ అసంతృప్తి ఉందన్నారు.

తనను రాజకీయాల్లోకి రమ్మని ఎవరూ ఆహ్వానించలేదని, ప్రజలకు న్యాయం చేయాలని వచ్చానని చెప్పారు. ఇప్పుడు న్యాయం చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టే రాజకీయ నాయకులు, మేధావులు, ఆర్థికవేత్తలతో కలిసి ఐక్య నిజనిర్ధారణ కమిటీ (జాయింట్‌ ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ) ఏర్పాటు చేసినట్లు పవన్ వివరించారని ఈనాడు తెలిపింది.

ఫొటో సోర్స్, facebook/chandrababu

'అబద్ధాలు చెబితే ఊరుకోవద్దు'

''రాష్ట్రానికి సాయం విషయంలో అబద్ధాలు చెబితే ఊరుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ నేతలు, ఎంపీలకు స్పష్టం చేశారు. వాస్తవాలేమిటో లెక్కలతో సహా ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు'' అని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

చేసిన సాయం విషయంలో అబద్ధాలు అవసరం లేదు. రాజకీయాలు కూడా అక్కర్లేదు. అసలేం జరిగిందన్న వాస్తవాలు మాత్రం ప్రజలకు తెలియాలి. అదే సమయంలో అనవసరమైన, నిరాధారమైన ఆరోపణలు మాత్రం చేయొద్దు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. అప్పుడు ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు.

ఆయన ఆదివారం టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. పార్టీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాష్ట్రానికి చేసిన సాయంపై బీజేపీ నాయకత్వం విడుదల చేసిన నివేదికపై చర్చ జరిగింది. అవన్నీ తప్పుడు లెక్కలని పార్టీ ఎంపీలు, నేతలు ఆయన దృష్టికి తెచ్చారు. జాతీయ రహదారుల ప్రాజెక్టుల కోసం రూ.లక్ష కోట్లు రాష్ట్రానికి ఇచ్చామనడం హాస్యాస్పదమన్నారు. బీజేపీ నేతల అసత్య ప్రచారానికి తెరదించాలన్నారని ఆంధ్యజ్యోతి తెలిపింది.

ఫొటో సోర్స్, facebook/hyderabadroads

'సొమ్మున్నా సోయి లేదు'

''లక్షల మంది ప్రజలు నిత్యం అవస్థలు పడుతుండటంతో ప్రభుత్వం హైదరాబాద్‌ రోడ్ల అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించింది. అయితే ఇందులో సగం నిధులైనా ఖర్చు పెట్టలేదు'' అని ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించింది.

రాజధాని హైదరాబాదే కాదు రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలన్నింటా ఇంచుమించుగా ఇదే పరిస్థితి. అభివృద్ధి పనులకు కోట్ల రూపాయల నిధులున్నా ఖర్చు చేయడంలో యంత్రాంగం నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

మంచినీటి కల్పన, మురుగు నీటిపారుదల, రోడ్లు, వీధిదీపాలు.. ఇలా మౌలిక సదుపాయాలేవీ సరిగా లేక ప్రజలు నిత్యం సతమతమవుతుంటే.. పరిష్కరించడానికి చేతిలో కోట్ల రూపాయల నిధులుండీ ఖర్చు పెట్టడంలో అంతులేని అలసత్వం ప్రదర్శిస్తున్నారు.

పురపాలక ప్రజాప్రతినిధులు సైతం నిధుల వ్యయంపై దృష్టి సారించ‌కపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో పురపాలనకు ప్రగతి పద్దు కింద ప్రభుత్వం రూ.4,800 కోట్లు కేటాయించింది. ఇందులో 60 శాతం నిధులు విడుదలయ్యాయి. కొన్ని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తోంది.

ఈ నిధుల్లో వేటినీ పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నాయి. రాష్ట్రంలోని నగరపాలక సంస్థలకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించినా వీటి ద్వారా జరుగుతున్న పనులు నామమాత్రమే. స్వచ్ఛభారత్‌ వంటి ప్రాధాన్య కార్యక్రమాలకు కేటాయించిన నిధులను ఖర్చు చేయడంలోనూ అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది అని ఈనాడు తెలిపింది.

ఫొటో సోర్స్, facebook/yasin

'ధూళి'వీస్తోంది జాగ్రత్త!

''ఓవైపు ఫ్యాక్టరీ పొగగొట్టాల నుంచి విష వాయువులు.. మరోవైపు రోడ్లపై నిత్యం 50 లక్షల వాహనాలు వెదజల్లుతున్న కాలుష్యం.. వెరసి భాగ్యనగరం పొల్యూషన్‌కు కేరాఫ్‌గా మారుతోంది'' అని సాక్షి కథనం పేర్కొంది.

ప్రతి ఘనపు మీటరు గాలిలో సూక్ష్మ, స్థూల ధూళికణాల మోతాదు 60 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ నగరంలో అనేక ప్రాంతాల్లో 90 నుంచి 100 మైక్రోగ్రాములు నమోదవుతోంది. బెంజీన్, టొలీన్, అమ్మోనియా, నైట్రోజన్, సల్ఫర్‌ డయాక్సైడ్, కార్బన్‌ డయాక్సైడ్, కార్బన్‌ మోనాక్సైడ్‌ మోతాదులు కూడా పరిమితులను మించిపోతున్నాయి.

ప్రధానంగా పారిశ్రామికవాడలకు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికితోడు లక్షల వాహనాల నుంచి వస్తున్న పొగ, ధూళితో శ్వాసకోశాలు దెబ్బతిని బ్రాంకైటిస్, ఆస్తమా, న్యుమోనియా తదితర వ్యాధులబారిన పడుతున్నారు. వాయుకాలుష్యంలో దేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ నాలుగోస్థానంలో నిలిచింది. తొలిస్థానంలో దిల్లీ, తర్వాతి స్థానంలో ముంబయి, కోల్‌కతా ఉన్నాయి అని సాక్షి పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)