పీరియడ్స్‌లో గుడికి వెళ్తే తప్పేంటి?
- మేఘా మోహన్
- బీబీసీ ప్రతినిధి
ఫొటో సోర్స్, Vidya Nair
అనేక భారతీయ కుటుంబాలలో రుతుస్రావం ఇంకా చాలా సున్నితమైన అంశమే. కానీ నా విషయంలో అది పెద్ద సమస్య కాలేదు. మా బంధువులతో కలిసున్నప్పుడు మాత్రం నాకు తరాల మధ్య అంతరం ఎలా ఉంటుందో తెలిసింది.
''ఎవరి దగ్గరైనా శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయా?''.. అని నేను బాత్రూంలోంచి బయటికి వస్తూ అడిగాను.
అప్పటివరకు ఏదో విషయం మీద జోరుగా చర్చిస్తున్న మా కుటుంబ సభ్యులంతా ఆ ప్రశ్నతో ఉల్లిక్కిపడి మాట్లాడటం ఆపేశారు. అప్పడు మేమంతా తమిళనాడులోని రామేశ్వరంలో ఓ హోటల్ గదిలో ఉన్నాం.
మూడు ఖండాలలో ఉంటూ కూ డా నిత్యం వాట్సాప్‌లో మాట్లాడుకుంటూ ఉండే మా కుటుంబ సభ్యుల మధ్య అలాంటి నిశ్శబ్దం చాలా అసహజంగా అనిపించింది.
బెడ్ మీద పడుకుని ఉన్నమా అత్తయ్య, తన హ్యాండ్ బాగ్‌లోంచి శానిటరీ ప్యాడ్ తీసి నా చేతికిచ్చింది.
''ఇక నువ్వు గుడిలోకి రావడానికి వీల్లేదు'' అంది.
తమిళనాడులోని మీనాక్షి ఆలయం
మేం రామేశ్వరానికి విహారయాత్రకు రాలేదు.
నాకు ఎంతో ఇష్టమైన అమ్మమ్మ చనిపోయి అప్పటికి ఏడాదైంది. మూడు వేర్వేరు ఖండాలలో ఉంటున్న మమ్మల్నందరినీ కలిపే సూత్రం మా అమ్మమ్మ.
గత డిసెంబర్లో ఆమె చనిపోయింది. భారతదేశంలో మనం ఏ ప్రాంతంలో ఉన్నామనే దాన్ని బట్టి చనిపోయిన తర్వాత కొన్ని క్రతువులుంటాయి.
ఆమె చనిపోయాక 15 రోజుల పాటు మేం మాంసం తినలేదు. 90 రోజుల తర్వాత ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాం.
ఏడాది తర్వాత మళ్లీ ఇప్పుడు రామేశ్వరంలో అందరం ఇలా కలుసుకున్నాం.
బంగాళాఖాతం పక్కనే ఉన్న రామేశ్వరం ఒక చారిత్రక ఆలయం.
నాకు మతం మీద పెద్దగా నమ్మకం లేకున్నా, చివరిసారి ఆమెను స్మరించుకోవడానికి వచ్చిన ఈ సందర్భంలో ఇలా జరగడం నాకు దిగ్భ్రాంతి కలిగించింది.
చేతిలో శానిటరీ ప్యాడ్ పట్టుకొని, ''అంటే నాకు పీరియడ్స్ రావడం వల్ల నేను గుళ్లోకి రాకూడదా? '' అని గట్టిగా ప్రశ్నించాను.
నాలాంటి యువతి తనలాంటి పెద్దవాళ్లను అలాంటి ప్రశ్నలు వేయకూడదన్నట్లు ఆమె కనుబొమలు ముడుచుకున్నాయి.
''ఇంతదూరం ప్రయాణించి వస్తే, నన్ను గుళ్లోకి రావద్దనడం అన్యాయం'' అన్నాను నేను.
''ఇది నా మాట కాదు, ఇవి ఇక్కడి పద్ధతులు'' అంది మా అత్తయ్య.
ఆమె గొంతు కఠినంగా ఉంది. ఆ గొంతులో నిర్ణయం జరిగిపోయింది, ఇక మళ్లీ దాని మాట ఎత్తొద్దనే హెచ్చరిక ఉంది.
అంటే నేను డ్రైవర్‌తో పాటు గుడి బయటే వాళ్ల కోసం ఎదురు చూస్తూ నిలబడాలన్న మాట.
ఫొటో సోర్స్, Vidya Nair
హిందువుల అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో రామేశ్వరం ఒకటి
రుతుస్రావం అపవిత్రమా?
రుతుస్రావంలో విడుదలయ్యే పదార్థాన్ని పీల్చగలిగే ఆధునిక శానిటరీ ప్యాడ్స్ ఆ రోజుల్లో లేకపోవడం వల్ల ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోందని మా అత్తయ్య వివరణ ఇచ్చింది. ఆ సమయంలో మహిళలకు ఇంటి పనులతో పాటు అన్ని పనుల నుంచి విశ్రాంతి కల్పించేవారని మా అమ్మ నాకు చెప్పింది.
అయితే ఇటీవల కొందరు విద్యావేత్తలతో మాట్లాడుతున్నపుడు, మహిళలను ఇలా పక్కన బెట్టడం మీద నేను భిన్నమైన కథనాన్ని విన్నాను. కొంతమంది హిందువుల ఆచారమైన 'చౌపది' గురించి తెలిసింది. దానిలో రుతుస్రావం అశుభం అని, ఆ మహిళలు అపవిత్రులని భావించే సంప్రదాయం ఉంది.
హిందూ ధర్మంలో మహిళల పరిస్థితిపై పరిశోధన చేసిన మాంట్రియల్‌లోని మెక్‌గిల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ అరవింద్ శర్మ, ''ఏదైనా మృతదేహాన్ని, అశుద్ధాన్ని తాకినపుడు మనుషులు అపవిత్రం అవుతారనే ఒక భావన ఉంది. రుతుస్రావం సందర్భంగా మహిళలనూ అలాగే భావిస్తారు'' అని తెలిపారు.
'స్మృతుల్లో కనిపించే స్మార్త హిందూధర్మంలో మాత్రమే ఇలా భావిస్తారు. కానీ శాక్త హిందూధర్మంలో (వీళ్లు స్త్రీలను, దేవతలను పూజిస్తారు) రుతుస్రావాన్ని అపవిత్రం అని కాకుండా, అది వాళ్లను శుద్ది చేస్తుందని భావిస్తారు'' అని డాక్టర్ అరవింద్ తెలిపారు.
ఫొటో సోర్స్, Vidya Nair
రామేశ్వరంలో ''పవిత్ర స్నానాలు''
‘ఇది రాతియుగం కాదు’
ఇటీవలి కాలంలో మన దేశంలో రుతుస్రావం అన్నది చాలా హాట్ టాపిక్‌గా మారింది. చాలామంది గ్రామీణ ప్రాంతాలలోని మహిళలకు శానిటరీ ప్యాడ్లను అందజేయడాన్ని ఒక ఉద్యమంగా చేపడుతున్నారు.
ఇటీవల #HappyToBleed అనే సోషల్ మీడియా ప్రచారం కూడా ప్రారంభమైంది. ఈమధ్య విడుదలైన బాలీవుడ్ సినిమా ప్యాడ్ మ్యాన్‌లో కూడా దీనిపై చర్చించారు.
దీనిలో నటించిన అక్షయ కుమార్ - 'మనం రాతియుగంలో లేము. రుతుస్రావం అన్నది ప్రకృతి సహజం'అన్నారు.
ఫొటో సోర్స్, Vidya Nair
గుడి బయట మా వాళ్ల కోసం ఎదురు చూస్తున్నపుడు నాకివన్నీ గుర్తుకు వచ్చాయి.
నేను ఈ విషయాన్ని ఈ అంతిమ సంస్కారాలకు రాలేకపోయిన నా బంధువుల్లోని స్నేహితురాలితో వాట్సాప్‌లో పంచుకున్నాను.
ఆమె నా మీద జాలిపడింది. కొద్ది సేపు ఆగి, ఇలా టైప్ చేసింది.
'నీకు పీరియడ్స్ వచ్చాయని నువ్వు వాళ్లకు చెప్పకుండా ఉండాల్సింది.'
'నువ్వెప్పుడైనా పీరియడ్స్ వచ్చినపుడు గుళ్లోకి వెళ్లావా?' నేనామెను ప్రశ్నించాను.
'మన వయసులో ఉన్నవాళ్లు చాలా మంది వెళ్తున్నారు. ఎవరికీ తెలీకుంటే, అదేమంత పెద్ద విషయం కాదు' అని అటువైపు నుంచి సమాధానం వచ్చింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)