అభిప్రాయం: క్లీన్ ఎనర్జీ దిశగా తమిళనాడు పరుగులు

  • 14 ఫిబ్రవరి 2018
తమిళనాడులో రెట్టింపు కానున్న పవన విద్యుత్ Image copyright Alamy
చిత్రం శీర్షిక తమిళనాడులో రెట్టింపు కానున్న పవన విద్యుత్

భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడు పవన విద్యుత్ విషయంలో అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతోందని ఒక నివేదిక వెల్లడించింది.

అమెరికాకు చెందిన 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎనర్జీ ఎకనామిక్స్అండ్ ఫైనాన్స్ అనాలసిస్', 2027 నాటికి తమిళనాడులో సగానికి పైగా విద్యుత్ అవసరాలు 'జీరో ఎమిషన్' సాంకేతిక పరిజ్ఞానం (పవన, సౌర విద్యుత్) ద్వారా తీరతాయని తన నివేదికలో పేర్కొంది.

ప్రస్తుతం తమిళనాడులో 7.85 గిగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇది డెన్మార్క్ , స్వీడన్‌లలో ఉత్పత్తి అవుతున్న పవన్ విద్యుత్ కన్నా ఎక్కువ. రానున్న దశాబ్ద కాలంలో ఇది రెట్టింపయ్యే అవకాశం ఉందని ఈ నివేదిక పేర్కొంది. సౌర విద్యుత్ ఉత్పత్తి కూడా ఆరు రెట్లు పెరిగి 13.5 గిగావాట్లకు చేరుకుంటుందని నివేదికలో పేర్కొన్నారు.

ఇదే జరిగితే మొత్తం తమిళనాడులో మొత్తం పునరుత్పాదక విద్యుత్తు 67 శాతానికి చేరుకుంటుంది. అయితే ఇందుకోసం తమిళనాడు తన విద్యుత్ రంగాన్ని పునర్ వ్యవస్థీకరించాల్సి ఉంటుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రపంచంలో బొగ్గును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలలో భారత్ ఒకటి

తమిళనాడు జనాభా ఆస్ట్రేలియా జనాభాకన్నా మూడు రెట్లు ఎక్కువ. ఆ రాష్ట్ర తలసరి జీడీపీ శ్రీలంక, ఉక్రెయిన్‌లతో సమానం. అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలు ఏ విధంగా తమ కర్బన ఉద్గారాలను ఏ విధంగా తగ్గించుకోవచ్చు అన్నదానికి ఈ రాష్ట్రం ఉదాహరణగా నిలుస్తుంది.

తమిళనాడు జీడీపీ ఏడాదికి 7 శాతం వంతున పెరుగుతుంది అనుకుంటే, ఈ అభివృద్ధి రేటు పునరుత్పాదక విద్యుత్ ద్వారా మరింత పెరిగే అవకాశం ఉందని ఈ నివేదిక పేర్కొంది. కాలుష్యాన్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే బొగ్గుతో నడిచే ప్లాంట్‌తో పోలిస్తే, పవన, సౌర విద్యుత్ ప్లాంట్‌ల నిర్మాణ, నిర్వహణ వ్యయాలు చాలా తక్కువ.

అయితే పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిలో అనేక సవాళ్లు ఉన్నాయి. పవన్ విద్యుత్‌ను మే నుంచి అక్టోబర్ వరకు మాత్రమే ఉత్పత్తి చేయవచ్చు. ఆ నెలల్లో కూడా ఉత్పత్తి దాని అత్యధిక స్థాయికి చేరుకోలేదు. ఎందుకంటే ప్రస్తుతం తమిళనాడు వద్ద ఆ అధిక ఉత్పత్తిని ఇతర రాష్ట్రాలకు తరలించగలిగిన గ్రిడ్ లేదు.

పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిలో డిమాండ్‌లోని హెచ్చుతగ్గులకు అనుగుణంగా మారే అత్యాధునిక గ్రిడ్ అవసరం. అందువల్ల ఈ దిశగా తమిళనాడులో ఇంకా చాలా అభివృద్ధి చెందాలి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇంకా 30 కోట్ల మందికి పైగా ప్రజలు కరెంటు లేకుండానే జీవిస్తున్నారు

మరో కోణం

వాతావరణ మార్పులు, నీటిని అతి నిర్లక్ష్యంగా వాడుకోవడం, నదులు, చెరువుల కాలుష్యం కారణంగా తమిళనాడు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొనబోతోంది. భారత కేంద్ర భూగర్భ జలాల బోర్డు అంచనా ప్రకారం తమిళనాడులో 60 శాతం కన్నా ఎక్కువ భూగర్భ జలాలను అధికంగా వినియోగించుకుంటున్నారు.

ఏప్రిల్, 2017లో తమిళనాడు రైతులు ఢిల్లీలో తమ మూత్రాన్ని తామే సేవించడం లాంటి అనేక తీవ్రమైన పద్ధతుల్లో రాష్ట్రంలోని కరువును కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నించారు.

జూన్, 2017లో తమిళనాడులోని రామనాథపురం జిల్లా ప్రజలు ఒక సౌర విద్యుత్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. నీటి కరువుతో అల్లాడుతున్న జిల్లాలో సుమారు 2 లక్షల లీటర్ల నీటిని అక్రమంగా బోర్ల నుంచి తోడుకుని, దాంతో రోజూ సోలార్ మాడ్యూల్స్‌ను శుభ్రం చేస్తున్నారనేది వాళ్ల ఫిర్యాదు.

ఈ నేపథ్యంలో నీళ్లు అతి తక్కువగా ఉన్న ప్రాంతాలలో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై పునరాలోచించాలి.

రెండోది - తమిళనాడులో ఈ దశబ్దాంతానికి మొత్తం 10.3 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సౌర విద్యుత్ ప్లాంట్లు వినియోగంలోకి రానుండగా, వాటిలో కేవలం 2 గిగావాట్లు మాత్రమే రూఫ్ టాప్ ఇన్‌స్టలేషన్‌ల ద్వారా ఉత్పత్తి అవుతోంది. అందువల్ల పెద్ద సోలార్ పార్కుల కన్నా, రూఫ్ టాప్‌లపై ఎక్కువగా దృష్టి సారించాలి.

Image copyright Alamy
చిత్రం శీర్షిక కొత్త బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల ఖర్చు పవన్ విద్యుత్ కన్నా రెట్టింపు ఉంటుంది

సుస్థిరమైన పర్యావరణ భవిష్యత్తు కోసం కేవలం బొగ్గు నుంచి పవన, సౌర విద్యుత్‌కు మరలితే సరిపోదు.

అభివృద్ధి అంటే కేవలం కర్బన ఉద్గారాలను తగ్గించడమే కాదు, సుస్థిరమైన మానవాళి శ్రేయస్సు అని గుర్తించాలి.

(నిత్యానంద జయరామన్ చెన్నైకు చెందిన రచయిత, సామాజిక కార్యకర్త)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)