సోషల్: ఈ కాటుక కళ్ల పిల్లకు కుర్రకారంతా ఫిదా

ప్రియా ప్రకాశ్

నిన్న మొన్నటిదాకా ‘జిమ్మి కీ కమ్మ‌ల్’ పాటలోని షెరిల్ అనే యువతి దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. ఇప్పుడు ఆ స్థానాన్ని ప్రియా వారియర్ ఆక్రమించేసింది.

చెప్పాలంటే ప్రేమకు ఒక రోజంటూ ఉంటుందా? కానీ ప్రేమలో ఉన్నవాళ్లకు మాత్రం ఫిబ్రవరి 14 అంటే ఓ పండుగ రోజే.

ప్రేమికుల రోజుకు ఇంకొన్ని గంటల వ్యవధే ఉంది. కానీ సోషల్ మీడియాకు వేలంటైన్స్ డే కాస్త ముందే వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టీనేజ్ పిల్లల ప్రేమ వీడియో యువతను కుదురుగా కూర్చోనీయడం లేదు.

ప్రేమకు భాష లేదని ఒకరంటే, ప్రేమ కళ్లతోనే మాట్లాడుకుంటుంది అని మరికొందరు అంటుంటారు. ఈ వీడియోలో ప్రేమికులు అక్షరాలా అలా కళ్లతోనే మాట్లాడుకున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ‘మాణిక్య మలరయ పూవి’ అనే ఓ పాటలో చిన్న భాగం. ఈ పాటలో కనిపించేది మలయాళీ నటి ప్రియా ప్రకాశ్ వారియర్.

ప్రస్తుతం ప్రియ ఫొటోతో పాటు ఆ వీడియో కూడా ఫేస్ బుక్, ట్విటర్, వాట్సాప్‌లలో విస్తృతంగా షేర్ అవుతోంది.

ఈ పాట 'ఒరు అదర లవ్' అనే సినిమాలోనిది. ఇది స్కూలు పిల్లల మధ్య పుట్టే ప్రేమ నేపథ్యంలో సాగే కథ. సినిమా మార్చిలో విడుదల కానుంది. ఒమర్ లులు దీని దర్శకులు. సంగీతం షాన్ రెహమాన్.

తన వీడియోకు సోషల్ మీడియాలో వస్తున్న స్పందనపై ప్రియా ప్రకాశ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.

కేరళకు చెందిన ప్రియ ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. ప్రియ నటి మాత్రమే కాదు, మంచి గాయని కూడా. తన సోషల్ మీడియా పేజీల్లో ఎప్పటికప్పుడు తాను పాటలు పాడే వీడియోలను పోస్టు చేస్తుంటుంది. ఈ వీడియో కూడా అలాంటి వాటిల్లో ఒకటి.

నిజజీవితంలో ప్రియా ప్రకాశ్ ఇలా ఉంటుంది

ఆ వీడియోపై సోషల్ మీడియా కామెంట్స్

  • ప్రియా ప్రకాశ్ లాంటి వీడియో వారానికి ఒకటి వస్తే చాలు.. ఎవరికీ పదిహేను లక్షలు గుర్తుకు రావు, పకోడీలూ గుర్తుకు రావు.
  • ఫిబ్రవరి 14 లోపు ఈ వీడియో కనుక వైరల్ అయితే అది దేశానికి చాలా ప్రమాదకరం.
  • ‘ప్రియా ప్రకాశ్‌కు వ్యతిరేకంగా బజ్ రంగ్ దళ్ ఫత్వా జారీ చేసింది. వేలంటైన్స్ డే సమయంలో తమ వాలంటీర్ల దృష్టిని మరల్చే ప్రయత్నం ఆమె చేస్తోంది’ అంటూ లైమ్స్ ఆఫ్ ఇండియా అనే పేజీ సరదాగా వ్యాఖ్యానించింది.
  • ప్రియా ప్రకాశ్ చూపులకు యువకులంతా అమరులైపోయారు అని మరో పేజీ పేర్కొంది.

మొత్తానికి కుర్రకారును గమ్మున కూసోనీయకుండా, కుదురుగా నిలుసోనీయకుండా చేస్తున్న ప్రియా ప్రకాశ్ ఒక్క రోజులోనే సెన్సేషన్‌గా మారిపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)