సరిగ్గా ఎనిమిదేళ్ల కిందట.. వేలంటైన్స్‌డే ముందు రోజు..

జర్మన్ బేకరీ

ఫిబ్రవరి 13, 2010న ఆమ్రపాలి చవాన్ పుణెలోని జర్మన్ బేకరీకి కాఫీ తాగడానికి వెళ్లారు. అప్పటికి 25 ఏళ్ల వయసున్న ఆమె నర్సు ఉద్యోగం వదిలిపెట్టి, పై చదువులకు సిద్ధమవుతున్నారు.

పుణెలోని విశ్రాంతవాడిలో నివసించే ఆమ్రపాలి, తరచుగా ఆ రెస్టారెంట్‌కు వెళ్లేవారు. అక్కడికి చాలా మంది విదేశీయులు కూడా వస్తుంటారు.

తన స్నేహితులను కలవడానికి ఆమ్రపాలి అక్కడికి వెళ్లినపుడు జర్మన్ బేకరీలో భారీ పేలుడు జరిగింది.

నవంబర్ 2008 ముంబై దాడుల తర్వాత భారతదేశంలో జరిగిన అతి పెద్ద దాడి అది.

సాధారణంగా ప్రశాంతంగా ఉండే పుణెలో జరిగిన ఆ బాంబు పేలుడులో ఐదుగురు విదేశీయులతో పాటు 17 మంది మరణించారు.

ఆమ్రపాలితో పాటు మొత్తం 64 మంది గాయపడ్డారు.

ఆ పేలుడు జరిగి ఎనిమిదేళ్లు గడిచినా, ఆనాటి సంఘటనలు ఆమెకింకా గుర్తున్నాయి.

ఫొటో క్యాప్షన్,

చికిత్స సందర్భంగా ఆమ్రపాలి చవాన్

''ఆ రోజు వాలంటైన్స్ డే కు ముందు రోజు. జర్మనీ బేకరీ మొత్తం జనం ఉన్నారు. నా ఫ్రెండ్ తినడానికి ఏదైనా ఆర్డర్ చేయడానికి కౌంటర్ వద్దకు వెళ్లింది. నేను నా టేబుల్ వద్ద వేచి చూస్తుండగా బాంబు పేలింది.''

ఆ పేలుడు ధాటికి ఆమె వెంటనే కిందపడిపోయింది. ''కొంచెం సేపటి వరకు నేను స్పృహలో లేను. నాకు గుర్తు వచ్చేసరికి నా చెవుల్లో ఇంకా ఆ పేలుడు శబ్దం ప్రతిధ్వనిస్తోంది.’’

‘‘నా నడుం కింది భాగమంతా శిధిలాల కింద ఉండిపోయింది. చాలామంది మగవాళ్లు, ఆడవాళ్లు సహాయం కోసం కేకలు పెట్టడం వినిపించింది. చుట్టూ అనేక మృతదేహాలు, శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కొంతమంది కాలిపోయి, ప్రాణాలు కోల్పోయారు.''

ఆమ్రపాలి నాటి సంఘటనలు చెబుతుంటే వినేవాళ్లలో వణుకు పుడుతుంది.

''బాంబు పేలడానికి కొన్ని క్షణాల ముందు, ఒక యువతి నా పక్కనున్న టేబుల్ వద్ద కూర్చుంది. పేలుడుకు ఆ యువతి మంటల్లో కాలిపోయింది. ఆమె ముఖంలో ఉన్న అమాయకత్వం, సహాయం కోసం ఆ యువతి బాయ్ ఫ్రెండ్ చేసిన ఆక్రందనలు నేను మర్చిపోలేను.''

''వైద్యశిక్షణ పొందిన నాకు అలాంటి సమయంలో మనం తీవ్రమైన షాక్‌కు గురవకూడదని తెలుసు. అందువల్లే నేను మెలకువగానే ఉంటూ, చుట్టూ ఉన్న రక్తపాతాన్ని చూసి భయపడకుండా నిలువరించుకున్నాను.''

''కొంతసేపటికి, జనం సహాయం చేయడానికి రావడం ప్రారంభించారు. దగ్గరలో ఉన్న ఆసుపత్రి గురించి వాళ్లకు చెప్పాను. దాంతో నాతో పాటు మరో నలుగురిని ఆటోలో అక్కడికి తీసుకెళ్లారు.''

పేలుడులో ఆమ్రపాలి ఎడమ తొడ ఎముక ముక్కలైంది. ఆమె ముఖం, రెండు అరిచేతులు తీవ్రంగా కాలిపోయాయి.

ఫొటో క్యాప్షన్,

పేలుడుకు ముందు ఆమ్రపాలి చవాన్

నేరస్తుల్లా చూసేవారు..

ఆ మరుసటి రెండు నెలలు ఆమ్రపాలి ఆసుపత్రిలోనే గడపాల్సి వచ్చింది. ఆమె ఎడమ కాలికి ఐదు మేజర్ సర్జరీలు జరిగాయి. ఆమె వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంది. చివరికి గాంగ్రిన్‌ను కూడా.

''నా కాలును తొలగించొద్దు, నేను అన్నిటినీ భరిస్తాననని డాక్టర్లకు చెప్పాను.''

కాలిన గాయాలకు ఆమె 200 నాన్ సర్జికల్ స్కిన్ ట్రీట్‌మెంట్లు తీసుకుంది. అయితే ఆమె పోరాటం ఇంకా ముగియలేదు.

ఆ పేలుడు కారణంగా ఏర్పడిన శారీరక, మానసికమైన గాయాలు - సమాజం ఆమె పట్ల చూపించిన ప్రతిస్పందన కన్నా పెద్దవి కావు.

''ఆరోజు బేకరీలో ఉన్న ప్రతి ఒక్కరినీ పోలీసులు విచారించారు. మా ఫోన్ రికార్డులన్నీ పరిశీలించారు. జనం మా వైపు ఏదో నేరం చేసినట్లు చూసేవాళ్లు. ఈ సంఘటనతో మా కుటుంబం చాలా బాధలు పడింది.''

''నా చికిత్స కోసం చాలా ఖర్చు చేయాల్సి వచ్చింది. కొంతమంది రాజకీయవేత్తలు నాకు సహాయం చేస్తామన్నారు. కానీ వాళ్ల సాయం పెద్దగా అందలేదు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం పొందడానికి కూడా నేను చాలా తిప్పలు పడాల్సి వచ్చింది.''

''చికిత్సకన్నా, సంఘటన తర్వాత చాలామంది నాతో వ్యవహరించిన విధానం నన్ను ఎక్కువ బాధ పెట్టింది. నాకు ధైర్యం చెప్పాల్సింది పోయి, వాళ్లు ఈ పిల్లకు పెళ్లవుతుందా? అని ప్రశ్నలతో నన్ను బాధించేవాళ్లు.''

ఈ పేలుడుతో ఆమ్రపాలి అంగవికలురాలిగా మారినా, ఆమె తన కాళ్లపై తాను నిలబడగలిగారు. ఒక గాఢవాంఛ ఆమె జీవితానికి వెలుగిచ్చింది.

''నాకు గనుక జీవితంలో రెండో అవకాశం వస్తే, దాన్ని ఈ సమాజాన్ని సంస్కరించేందుకు ఉపయోగిస్తాననని నన్ను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లే రోజున నేను ప్రార్థించాను.''

యుద్ధమంటే కత్తులు, తుపాకులతోనే జరగదు..

ఆమ్రపాలి ఇప్పుడు ఆ రోజు చేసిన ప్రార్థనను అమలు చేసే పనిలో ఉన్నారు. నెహ్రూ యువ కేంద్రం నుంచి ఆమె ప్రయత్నాలకు మద్దతు లభిస్తోంది.

పీస్ అసోసియేషన్ అనే పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించిన ఆమె.. ఆ సంస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాలలోని యువత, మహిళల్లో ప్రేరణ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. వివిధ ప్రభుత్వ పథకాల గురించి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా వారికి జీవనోపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నారు.

ఇతరులకు ప్రేరణగా నిలవడం కోసం ఆమె పర్వతారోహణ నేర్చుకున్నారు. 2015లో ఆమె లద్దాక్ పర్యటనకు వెళ్లి స్టోక్ కంగారి (20,187 అడుగులు/ 6,153 మీటర్లు) పర్వతాన్ని అధిరోహించారు.

''ఉగ్రవాదులకు నా సమాధానం ఇదే. వాళ్లు మాకు ఎంత హాని చేసినా మేం మాత్రం మా పోరాటాన్ని ఆపం''

ఎనిమిదేళ్లు గడిచిపోయినా తనతో పాటు ఇతర జర్మన్ బేకరీ పేలుడు బాధితుల పోరాటం ఇంకా ముగియలేదని ఆమె భావిస్తున్నారు.

''ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని భావిస్తారు. కానీ మనం ఒక ఉగ్రవాదిని ఉరి తీస్తే, మనం కేవలం అతని శరీరాన్ని మాత్రమే అంతమొందిస్తున్నాం. అతని ఆలోచనల మాటేంటి?''

''ప్రతి యుద్ధం కత్తులు, తుపాకులతోనే జరగదు. మలాలా యూసుఫ్ జాయ్ అన్నట్లు -ఒక బుల్లెట్ ఒక ఉగ్రవాదిని హతమారుస్తుంది. కానీ విద్య మొత్తం ఉగ్రవాదాన్నే హతమారుస్తుంది''.

''జరిగిన ఘటనలో నాకు ఎవరి పైనా కోపం లేదు. కానీ నేను నిశబ్దంగా ఉండను, నా పోరాటాన్ని కొనసాగిస్తాను.''

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)