గర్భిణి హత్య కేసు: ఎవరు? ఎందుకు? ఎలా?

నిందితులు మమత, అనిల్
ఫొటో క్యాప్షన్,

నిందితులు మమత, అనిల్

వ్యామోహం, పేదరికం, నిస్సహాయత, అంతుపట్టని క్రూరత్వం.. పదిహేను రోజులుగా హైదరాబాద్‌లో చర్చనీయాంశంగా మారిన హత్య వెనక ఎవరూ ఊహించని ఎన్నో కోణాలున్నాయి.

హైదరాబాద్ బొటానికల్ గార్డెన్స్ సమీపంలో జనవరి 30న ప్లాస్టిక్ సంచుల్లో గుర్తు తెలియని మహిళ శరీర భాగాలు దొరకడంతో కథ మొదలైంది. ఎవరా మహిళ? ఎవరు చంపారు? ఎందుకు చంపారు?.. లాంటి ప్రశ్నలకు సమాధానం చెబుతూ నిందితులను పోలీసులు అరెస్టు చేయడంతో ఆ మిస్టరీ వీడింది.

ఆ కేసును ఛేదించిన క్రమం హైదరాబాద్ పోలీసుల మాటల్లోనే..

హైదరాబాద్ బొటానికల్ గార్డెన్స్ దగ్గర ముక్కలై కనిపించిన శవం బింగీ అలియాస్ పింకీ అనే ఎనిమిది నెలల గర్భిణీది. బిహార్‌లోని బంకా జిల్లా రాజౌన్ ఠాణా, మోహ‌నా మ‌ల్తీ గ్రామానికి చెందిన బింగీని త‌న ఊరికే చెందిన మ‌మ‌తా ఝా, అమ‌ర్ కాంత్ ఝా, అనిల్ ఝా, వికాస్ క‌శ్య‌ప్‌లు హ‌త్య చేశారు.

వారిలో అనిల్, మమతలు సైబరాబాద్ పోలీసుల అదుపులో ఉన్నారు. అమర్‌కాంత్‌ను బిహార్‌లో అరెస్టు చేసి నగరానికి తీసుకువస్తున్నారు. వికాస్ ఇంకా పరారీలోనే ఉన్నాడు.

అస‌లేం జరిగింది

బిహార్‌కు చెందిన బింగీకి 13ఏళ్ల క్రితం దినేశ్ అనే వ్యక్తితో పెళ్లయింది. వారికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు.

కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. అదే స‌మ‌యంలో తమ ప్రాంతానికే చెందిన వికాస్ క‌శ్య‌ప్‌తో బింగీకి చ‌నువు పెరిగింది.

దాంతో ఒక కొడుకునూ, కూతుర్నీ భ‌ర్త ద‌గ్గ‌ర వ‌దిలేసి జ‌తిన్ అనే మ‌రో కొడుకును తీసుకుని, వికాస్‌తో క‌లిసి బింగీ త‌న సొంతూరైన మోహ‌నా మ‌ల్తీ గ్రామానికి వ‌చ్చేసింది. అక్క‌డే వికాస్, బింగీలు క‌లిసున్నారు.

మోహనా మల్తీ గ్రామంలోనే మ‌మ‌త అనే మరో మహిళ కుటుంబం ఉంటోంది. మ‌మ‌త‌కు 37 సంవ‌త్స‌రాలు కాగా, ఆమె భ‌ర్త అనిల్ ఝాకి 60 ఏళ్ల పైనే. వారికి అమ‌ర్ కాంత్ ఝా అనే 21 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అత‌ను హైద‌రాబాద్‌లో ఒక బార్‌లో ప‌నిచేస్తున్నాడు.

ఒకే ఊరిలో ఉంటోన్న‌ మ‌మ‌తా ఝాతో వికాస్‌కి ప‌రిచ‌యం ఏర్ప‌డింది. వారి మ‌ధ్య చ‌నువు పెరిగి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. దాంతో వికాస్‌ను పింకీకి దూరంగా హైద‌రాబాద్‌లో ఉంటోన్న త‌న కొడుకు అమర్ కాంత్ ద‌గ్గ‌ర‌కు మమత పంపించింది.

వికాస్ వెళ్లిన కొన్నాళ్లకు మ‌మ‌తా, ఆమె భ‌ర్త కూడా హైదరాబాద్‌లోని కొడుకు దగ్గరకే వ‌చ్చేశారు. ఈ నలుగురూ కల‌సి ఒకే ఇంట్లో ఉండేవారు.

మ‌మ‌త‌, వికాస్ క‌లిసి పానీపూరీ అమ్మేవారు. వీరు హైద‌రాబాద్ వ‌చ్చి ఎనిమిది నెల‌లైంది. నలభై ఐదు రోజుల క్రితం వీరిని వెతుక్కుంటూ బింగీ కూడా హైద‌రాబాద్ వ‌చ్చి వీరితో పాటు అదే ఇంట్లో ఉండ‌సాగింది.

బింగీ 8 నెల‌ల గ‌ర్భ‌వ‌తి. హైద‌రాబాద్ సిద్దిఖీ న‌గ‌ర్‌లో వాళ్లతో కలిసి 45 రోజులు ఉన్న‌ప్ప‌టికీ, బింగీని ఎప్పుడూ ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రానిచ్చేవారు కాదు.

హ‌త్య ఎలా జ‌రిగిందంటే..

వికాస్-మమతల వివాహేత‌ర సంబంధానికి బింగీ అడ్డంగా ఉండ‌టం, ఆర్థికంగా భారం కావ‌డమే ఆమె హ‌త్య‌కు ప్ర‌ధాన కార‌ణాలుగా పోలీసులు విశ్లేషిస్తున్నారు.

బింగీని హత్య చేసేందుకు మ‌మ‌త భ‌ర్త అనిల్, కొడుకు అమ‌ర్ కాంత్ కూడా సాయం చేశారు. జ‌న‌వ‌రి 28 అర్ధరాత్రి అందరూ కలిసి బింగీతో గొడ‌వ‌ప‌డ్డారు. ఆ క్రమంలో ఆమెను మమత బ‌లంగా గోడ‌కేసి కొట్టింది. బింగీ కిందపడటంతో అంద‌రూ విచ‌క్ష‌ణా ర‌హితంగా, బ‌లంగా కొట్టారు. దాంతో ఆమె చనిపోయింది.

చ‌నిపోవ‌డానికి ముందు బింగీ గట్టిగానే పోరాడిందని పోస్టుమార్టం నివేదిక‌లు చెబుతున్నాయి. బింగీ చనిపోయాక ఒక‌రోజంతా శ‌వాన్ని ఇంట్లోనే ఉంచారు.

అందరూ కలిసి సాక్ష్యాలు లేకుండా శ‌వాన్ని మాయం చేయ‌డం కోసం ప‌థ‌కం వేశారు. రాళ్ళ‌ను కోసే క‌ట్ట‌ర్‌ని అమర్ కాంత్ కొన్నాడు. దాంతో బింగీ త‌ల‌, చేతులు, తొడ‌ల ద‌గ్గ‌ర నుంచి కాళ్ల‌ను ముక్క‌లుగా కోశారు.

ఆ భాగాల‌న్నింటినీ ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌లో చుట్టి వాటిని రెండు పెద్ద సంచుల్లో పెట్టి, ఆ రాత్రి బైక్ మీద తీసుకెళ్లారు. అమ‌ర్ బైక్ న‌డప‌గా, మ‌మ‌త సంచీని పట్టుకొని వెన‌క కూర్చుంది. ఇద్దరూ కలిసి బొటానిక‌ల్ గార్డెన్స్ ద‌గ్గ‌ర‌ ఆ మూట‌ల‌ను పారేశారు.

సీసీటీవీలే ఆధారం

జ‌న‌వ‌రి 30 ఉద‌యం పోలీసులు అక్కడ శ‌వాన్ని గుర్తించి కేసు న‌మోదు చేశారు. నిందితుల గురించి ఆరా తీయగా ఎలాంటి క్లూ దొర‌క‌లేదు. దాంతో పోలీసులు సీసీటీవీల‌ను న‌మ్ముకున్నారు.

శవం దొరికిన ఒకట్రెండు రోజుల ముందు ఆ మార్గంలో ఉన్న సీసీటీవీల్లో నమోదైన ఫుటేజీలను విశ్లేషించడం మొదలుపెట్టారు.

జ‌న‌వ‌రి 28న ఓ సీసీటీవీ ఫుటేజ్‌లో అర్ధరాత్రి సమయంలో అనుమానస్పదంగా ఓ బైక్ క‌నిపించింది. మరో రెండు సీసీటీవీల్లోనూ ఆ దృశ్యాలు నమోదయ్యాయి. దాంతో పాషా, మాజిద్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు దాదాపు 16 గంట‌ల సీసీటీవీ ఫుటేజ్‌ని పూర్తిస్థాయిలో ప‌రిశీలించి ఆ బైక్ నంబర్‌ను గుర్తించారు.

ఆ బైక్‌పై ఉన్న చ‌లాన్లను ప‌రీశీలించ‌గా, అది మమత కొడుకు అమ‌ర్ కాంత్ ప‌నిచేస్తోన్న బార్ మేనేజ‌ర్ బైక్ అని తేలింది. వాడుకోవడానికి ఆ బైక్ తీసుకున్న అమర్‌కాంత్, దానిపైనే బింగీ శ‌వాన్ని తరలించాడు.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు మమత, అనిల్‌లను అరెస్టు చేశారు. తాను వికాస్‌ని కోరుకున్న‌ట్టు, త‌న‌కు అడ్డంకిగా మారింద‌నే బింగీని చంపినట్టు పోలీసుల ముందు మ‌మత ఒప్పుకుంది.

మ‌రోవైపు నిందితులు నివసించే సిద్దిఖీన‌గ‌ర్‌లో పోలీసులు విప‌రీతంగా ప్ర‌చారం చేయడం, ఆ బైక్ కోసం కార్డ‌న్ సెర్చ్ నిర్వహించడంతో భ‌య‌ప‌డ్డ అమ‌ర్ కాంత్ బిహార్ పారిపోయాడు. అమ‌ర్ కాంత్‌ని వెతుక్కుంటూ, బిహార్ వెళ్లిన సైబరాబాద్ పోలీసులు అతడిని పట్టుకొని హైదరాబాద్ తీసుకొస్తున్నారు. వికాస్ ఇంకా ప‌రారీలోనే ఉన్నాడు.

బింగీ కొడుకు జ‌తిన్‌ను ప్ర‌భుత్వ గృహానికి త‌ర‌లించారు. బింగీ కుటుంబం అంత్య‌క్రియ‌లు కూడా నిర్వ‌హించే ప‌రిస్థితుల్లో లేక‌పోవ‌డం వ‌ల్ల ఆ ప‌నిని ప్ర‌భుత్వం తర‌ఫున చేయ‌నున్నారు.

ఫొటో క్యాప్షన్,

కేసు పరిశీలనలో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుళ్లు పాషా, మాజిద్

ఎవ‌రి క‌థ వారిది..

'మా విచార‌ణ‌లో ఎన్నో విష‌యాలు తెలిశాయి. మ‌మ‌త‌కు త‌మ సొంతూళ్లో 3 ఎక‌రాల పొలం ఉంది. దాన్ని విడిపించుకోవ‌డానికి ఆమెకు డ‌బ్బు కావాలి. వికాస్ స‌హాయంతో విడిపించుకోవ‌చ్చని ఆమె అనుకుంది. దానికి బింగీని అడ్డంకిగా భావించింది. పైగా మ‌మ‌త‌కూ ఆమె భ‌ర్త‌కూ వ‌య‌సు తేడా చాలా ఎక్కువ.

మరోపక్క బింగీ చాలా పేద‌రికంలో ఉంది. ఆమె తండ్రి రాజ‌స్థాన్‌లోని ఇటుక బ‌ట్టీల్లో ప‌నికి వెళ్లి ఏడాదికోసారి ఇంటికి వ‌స్తుంటాడు. ఆమె త‌ల్లి ద‌గ్గ‌ర క‌నీసం కూతురి శ‌వం ద‌గ్గ‌ర‌కు రావ‌డానికి కూడా డ‌బ్బుల్లేవు.

ఇక్క‌డ ఎవ‌రి క‌థ, ఎవరి సమస్యలు వారికి ఉన్నాయి. కానీ, అలా (హ‌త్య‌) చేసుండాల్సింది కాదు' అని సైబరాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ సందీప్ శాండిల్య‌ అభిప్రాయపడ్డారు.

బింగీ కొడుకు - 8 ఏళ్ల జ‌తిన్‌కు ఇంకా తన తల్లి చనిపోయినట్టు తెలీదు. ప్ర‌స్తుతానికి అతడిని స్టేట్‌ హోంకు పంపిస్తున్నారు. అతడి తండ్రి వస్తే అతడితో పంపిస్తామనీ, లేకపోతే ఏం చేయాలో ఆలోచిస్తామనీ సైబరాబాద్ డీసీపీ అనసూయ అన్నారు. బింగీని హత్య చేసిన మమతే, ఆ తరవాత ఆమె కొడుకు జతిన్ బాగోగులను చూసుకోవడం ఇక్కడ కొసమెరుపు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)