ఈ 38 మందికి హెచ్ఐవీ ఎలా సోకింది?

హెచ్‌ఐవీ

ఫొటో సోర్స్, Getty Images

ఒకే గ్రామంలో 38 మందికి హెచ్‌ఐవీ ఉన్నట్టు తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో బయటపడం ఉత్తరప్రదేశ్‌లో సంచలనంగా మారింది.

ఉన్నావ్ జిల్లాలో ఉన్న ప్రేమ్‌గంజ్, ఉత్తర భారతంలోని ఇతర గ్రామాల్లాగే కనిపిస్తుంది.

అయితే ఈ గ్రామంలో ప్రభుత్వం ఇటీవల అకస్మాత్తుగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో ప్రేమ్‌గంజ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని 38 మందికి హెచ్ఐవీ ఉందని తేలింది.

అంతమందికి హెచ్ఐవీ ఎలా సోకిందో అక్కడ ఎవరికీ అంతుపట్టడం లేదు.

ఈ విషయమై రాజేంద్ర యాదవ్ అనే స్థానిక వైద్యుడిని అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.

రాజేంద్ర యాదవ్ 10 రూపాయలకే జనాలకు చికిత్స చేసేవారు. అతను వాడిన సిరంజీ/ఇంజక్షన్ ద్వారానే హెచ్ఐవీ సోకి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

అయితే, అతను వాడిన సూది ఒక్కటే కారణం కాకపోవచ్చని, ఇతర కారణాలు ఉండొచ్చని ఉన్నావ్ జిల్లా మెజిస్ట్రేట్ రవి కుమార్ అన్నారు.

లారీ డ్రైవర్లు లేదా నగరాలకు వెళ్లివచ్చేవారి వల్ల కూడా వ్యాపించి ఉండొచ్చన్నది ఆయన అభిప్రాయం.

ఫొటో సోర్స్, Rohit ghosh/bbc

ఫొటో క్యాప్షన్,

గ్రామ కౌన్సిలర్ సునీల్ కుమార్

ఎన్నో అనుమానాలు

గ్రామ శివారులోని ఇంట్లో కూర్చున్న ఒక మహిళను హెచ్ఐవీ గురించి అడిగితే చాలా కోపంగా "మాకేమీ తెలియదు, వెళ్ళి ఊళ్లో అడగండి" అని అన్నారు.

ఈ గ్రామంలో ఏ ఒక్కరూ దీని గురించి మాట్లాడడానికి ఇష్టపడలేదు.

ఆ గ్రామ కౌన్సిలర్ సునీల్ కుమార్ మాత్రం.. "ఈ మధ్యనే మా ఊరిలో ఒక క్యాంపు పెట్టి, అందరికీ రక్త పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో 38 మంది హెచ్ఐవీ బాధితులని తేలింది" అని తెలిపారు.

పైన పేర్కొన్న రెండు కారణాలపైనా ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

"ప్రేమ్‌గంజ్‌కు పక్కనే ఉన్న నసీమ్‌గంజ్ గ్రామంలోనూ రాజేంద్ర యాదవ్ వైద్యం చేశారు. కానీ అక్కడివాళ్లకు ఈ వ్యాధి ఎందుకు సోకలేదు?" అని అన్నారు.

ట్రక్కు డ్రైవర్లు అన్ని ప్రాంతాల్లోనూ ఉంటారని, వాళ్ళే కారణమైతే ఆయా ప్రాంతాలన్నిటిలోనూ హెచ్ఐవీ సంక్రమించాలి కదా? మరి అలా జరగట్లేదే! అని సునీల్ కుమార్ సందేహం వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

'మళ్లీ పరీక్షలు నిర్వహించాలి'

"హెచ్ఐవీ సంక్రమణకు అనేక కారణాలుండొచ్చు. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తాం" అని ఉత్తరప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింహ అన్నారు.

గ్రామంలో అందరికీ మళ్ళీ రక్త పరీక్షలు నిర్వహించాలని గ్రామ కౌన్సిలర్ సునీల్ కుమార్ అధికారులను కోరారు.

"ఊరిలో క్యాంపు పెట్టి ఆదరబాదరగా పరీక్షలు నిర్వహించారు. సాయంత్రం ఏడు గంటల వరకూ.. మొబైల్ ఫోన్ల టార్చ్‌లైట్ వెలుతురులో పరీక్షలు చేశారు" అని ఆయన వివరించారు.

18 ఏళ్ల యువకుడికి

18 యేళ్ల ఓ యువకుడికి క్యాంపులో నిర్వహించిన పరీక్షల్లో హెచ్ఐవీ ఉందని తేలింది. కానీ అతను ఉన్నావ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో మళ్ళీ పరీక్ష చేయించుకుంటే నెగెటివ్ అని వచ్చింది.

ఈ క్యాంపు పరీక్షల ఫలితాలతో గ్రామస్తులు షాక్‌కు గురయ్యారని కౌన్సిలర్ సునీల్ తెలిపారు. అయితే బాధితులెవరినీ ఊరి నుంచి బహిష్కరించలేదని ఆయన వెల్లడించారు.

"బాధితులు చికిత్స చేయించుకోవడం ప్రారంభించారు. మా ఊరిలో కాపురాలు కూలిపోతున్నాయని, నిశ్చయించిన పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయంటూ వస్తున్న వార్తలన్నీ పుకార్లే" అని ఆయన స్పష్టం చేసారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)