ఒక్కసారి కన్ను గీటి కోట్ల హృదయాలను దోచేసిన అమ్మాయి కథ ఇదీ!
- తాహిరా భసీన్, ఇందూ పాండే
- బీబీసీ ప్రతినిధులు

ఫొటో సోర్స్, Muzik247/video grab
చిలిపితనాన్నీ, అమాయకత్వాన్నీ, ప్రేమనూ ఒకేసారి.. అదీ కేవలం 26 సెకన్ల నిడివిలో కలబోసి చూపే ఓ వీడియో క్లిప్ వైరల్ కావడంతో కేరళకు చెందిన ప్రియా ప్రకాశ్ రాత్రికిరాత్రే కోట్లాది యువకుల కలలరాణి అయ్యారు.
అయితే దేశవ్యాప్తంగా కోట్ల మంది ఇంతలా మనసు పారేసుకుంటున్న ఆ వీడియోను అసలు ఎలా రూపొందించారు? దాన్ని షూట్ చేయడానికి ఎంత సమయం పట్టింది?
దీనికి స్వయంగా ప్రియానే జవాబిచ్చారు.
బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆమె, "ఇలా చేయాల్సి ఉంటుందని డైరెక్టర్ స్పాట్లోనే వివరించారు. నువ్వు ఏదైనా క్యూట్‌గా చేయాలని అన్నారంతే" అని తెలిపారు.
ఫొటో సోర్స్, Instagram
ఎన్ని టేక్‌లు పట్టాయి?
ఇలా చేయడానికి ఎన్ని సార్లు ప్రయత్నించి ఉంటారు అని అడగగా, "నేను ఒకే ఒక్కసారి ట్రై చేశానంతే. ఒక్క షాట్‌లోనే ఓకే అయిపోయింది. అయితే ఇది ఇంతలా వైరల్ అవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు" అని ప్రియా చెప్పారు.
ఈ షాట్‌కు గాను క్రెడిట్ ఎవరికి ఇస్తారు అన్న ప్రశ్నకు ఆమె "దీని క్రెడిట్ అంతా డైరెక్టర్‌కే దక్కుతుంది. ఇదంతా ఆయన చేసిన మాయే. నేనెలా స్టైల్ కొట్టాలో ఆయనే నాకు చెప్పారు" అని అన్నారు.
"ఇందుకోసం నేను ప్రాక్టీస్ చేసిందేమీ లేదు. అంతా అక్కడికక్కడే జరిగిపోయిందంతే. షాట్ తర్వాత అందరూ బాగా వచ్చిందని ప్రశంసించారు. అయితే దానికి ఇంతలా రెస్పాన్స్ వస్తుందని మాత్రం అనుకోలేదు."
ప్రియకు స్పూఫ్‌లు ఓకేనా?
ప్రియా ప్రకాశ్ వీడియోకు ఎన్నో స్పూఫ్‌లు ఇంటర్నెట్లో పుట్టుకొచ్చాయి. వీటిని చూశారా అని అడిగినపుడు ప్రియ, "చాలా ట్రోలింగ్ జరిగింది. ఇదంతా బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది" అని అన్నారు.
ప్రియా ప్రకాశ్‌ది కేరళలోని త్రిసూర్. ఆమె తండ్రి కేంద్ర ఎక్సైజ్ విభాగంలో పని చేస్తారు. ప్రియ తల్లి గృహిణిగా ఉన్నారు. ఆమెకు ఓ తమ్ముడు, బామ్మ, తాతయ్య ఉన్నారు.
ప్రస్తుతం ఆమె త్రిసూర్‌లో బీకామ్ చదువుతున్నారు. ఇది ప్రియకు మొట్టమొదటి సినిమా. ఇంతకు ముందు ఆమె మూడు షార్ట్ ఫిల్ములలో నటించారు. నటన పట్ల ఆసక్తి ఆమెకు ఎప్పటి నుంచో ఉంది.
ఫొటో సోర్స్, Instagram
బాలీవుడ్లో ఎవరంటే ఇష్టం?
"ఈ మూవీ నాకో మంచి ఛాన్స్. నేను దీన్ని బాగా ఉపయోగించుకున్నా. మూవీ విడుదలయ్యాక కూడా ఇలాంటి సపోర్ట్ దొరుకుతుందని ఆశిస్తా" అని ప్రియ అన్నారు.
ముంబయిలో అడుగు పెట్టాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు, "అన్ని భాషల్లోనూ ట్రై చేయాలని ఉంది. బాలీవుడ్లో అయితే తప్పక ఎంట్రీ ఇవ్వాలని ఉంది" అని అన్నారు.
సంజయ్ లీలా భన్సాలీ సినిమాలో నటించాలనీ, దీపికా పదుకోణ్ను కలవాలనీ ఉన్నట్టు ప్రియ చెప్పారు.
ఒకవేళ హిందీ సినిమాల్లోకి వస్తే ఏ హీరో సరసన నటించాలని ఉంది అని అడిగినపుడు, తనకు రణవీర్ సింగ్, షారూఖ్ ఖాన్ లేదా సిద్ధార్థ్ మల్హోత్రాతో నటించాలని ఉందని ప్రియ అన్నారు.
ఫొటో సోర్స్, Instagram
మీ వాలెంటైన్ ఎవరు?
వాలెంటైన్స్ డే వస్తున్న సందర్భంగా ఈ వీడియో వైరల్ కావడంపై ప్రస్తావిస్తూ, ప్రస్తుతం ఆమె వాలెంటైన్ ఎవరు అడిగినప్పుడు 'రోషన్' అని జవాబిచ్చారు.
రోషన్ అంటే రోషన్ అబ్దుల్ రహూఫ్. ఈ వీడియోలో ప్రియా ప్రకాశ్‌తో కలిసి నటించే అబ్బాయి. అయితే రియల్ లైఫ్‌లో తనకు వాలెంటైన్ ఎవరూ లేదని ఆమె అన్నారు.
18 ఏళ్ల ప్రియ క్లాసికల్ డాన్స్‌లో శిక్షణ పొందారు. ప్రస్తుతం సంగీతం నేర్చుకుంటున్నారు.
సినిమాలు చేస్తూనే చదువును కూడా కొనసాగిస్తానని ఆమె అన్నారు. అయితే తన అద్భుతమైన ఎక్స్ప్రెషన్తో అందరినీ ఆకట్టుకున్న ప్రియ తానింత వరకూ యాక్టింగ్‌లో ఎలాంటి శిక్షణ తీసుకోలేదనీ, క్లాసులేవీ అటెండ్ కాలేదని చెప్పినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది.
ఫొటో సోర్స్, Instagram
రియల్ లైఫ్‌లో ప్రియ ఎలా ఉంటారు?
"నా ఫిల్మ్ కెరీర్ ఇలా ప్రారంభం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎలా వ్యక్తం చేయాలో తెలియట్లేదు. నా ఫ్రెండ్స్ కూడా చాలా సంతోషించారు" అని ప్రియ అన్నారు.
ప్రియకు కొత్త ప్రదేశాలకు వెళ్లడం అన్నా, పాటలన్నా చాలా ఇష్టం.
తెరపై సరే, అసలు జీవితంలో ప్రియ ఎలా ఉంటారు? ఈ ప్రశ్నకు జవాబు చెబుతూ, ''ఇద్దరు ప్రియలు దాదాపు ఒకలాంటి వారే. సహజంగా నేను అల్లరి పిల్లనే. చాలా చాలా చిలిపిపనులు చేస్తుంటాను" అని అన్నారు.
తన తల్లిదండ్రుల రెస్పాన్స్ కూడా బాగుందని ప్రియ చెప్పారు. ఇంత ఉత్సాహాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్లకూ తెలియడం లేదని ప్రియ అంటారు.
ఫొటో సోర్స్, Youtube
పార్ట్నర్ ఎలా ఉండాలి?
హిందీ బెల్ట్‌లో తనకు ఇంత రెస్పాన్స్ రావడం ఆనందంగా, ఆశ్చర్యంగా ఉందని ప్రియ అన్నారు. తాను బాలీవుడ్లో అడుగు పెట్టినప్పుడు కూడా ఇలాంటి రెస్పాన్సే వస్తుందని ఆశిస్తున్నట్టు ఆమె చెప్పారు.
మలయాళం, తమిళంలతో పాటు ప్రియ మంచి హిందీ మాట్లాడుతారు. దీనికి కారణం ముంబయి నగరం అని ప్రియ అంటారు.
"నేను ముంబయిలో ఉన్నాను. మా నాన్నగారు అక్కడ పని చేసేవారు. మేం ఐదేళ్లు అక్కడున్నాం. అప్పుడు నేర్చుకున్న హిందీ ఇప్పుడు పనికొస్తోంది" అని ప్రియ చెప్పారు.
మంచి అబ్బాయిలో ఉండాల్సిన లక్షణాలేంటని అనుకుంటున్నారు అని అడిగినపుడు, వెంటనే ప్రియ "లవింగ్, కేరింగ్ అండ్ సపోర్టింగ్" అని జవాబిచ్చారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)