ప్రెస్ రివ్యూ: మార్చి 10న కోదండరాం పార్టీ ప్రకటన?

  • 14 ఫిబ్రవరి 2018
Image copyright NOAH SEELAM/Getty Images
చిత్రం శీర్షిక కోదండరామ్

తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టమైన 'మిలియన్‌ మార్చ్‌' జరిగిన మార్చి 10న భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీ ఏర్పాటును ప్రకటించాలని తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి(జేఏసీ) కన్వీనర్ కోదండరామ్ నిర్ణయించారని 'సాక్షి' కథనం తెలిపింది.

ఈ నెల రెండో వారంలోనే పార్టీ ప్రకటన, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాలని ముందు భావించినా జేఏసీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'మిలియన్‌ మార్చ్‌' రోజునే ప్రకటన చేయడం బాగుంటుందని కోదండరామ్ ఈ నిర్ణయం తీసుకున్నారని పత్రిక పేర్కొంది.

కోదండరామ్ అధ్యక్షుడుగా పార్టీ నమోదు ప్రక్రియ దాదాపు పూర్తయిందని, తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) పేరును ఆయన ఖరారు చేసినట్లు జేఏసీ నేతలు తెలిపారు.

సాంకేతిక అవరోధాలు, ఇతర సమస్యలొచ్చినా అధిగమించేందుకు మరో మూడు పేర్లనూ వివిధ నాయకుల పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. తెలంగాణ సకల జనుల పార్టీ, తెలంగాణ ప్రజా పార్టీ, ప్రజా తెలంగాణ పార్టీ లాంటి పేర్లూ రిజిస్టర్‌ చేసినట్లు జేఏసీ నేతలు పేర్కొంటున్నారు.

పార్టీకి సారథ్యం వహించాల్సిన సమయంలో జేఏసీ బాధ్యతలు మరొకరికి అప్పగించాలని కోదండరామ్ నిర్ణయించినట్లు తెలిసిందని 'సాక్షి' చెప్పింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ముకేశ్ అంబానీ

ముకేశ్ అంబానీ ఆస్తితో ప్రభుత్వాన్ని 20 రోజులు నడపొచ్చు!

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ వద్ద ఉన్న సంపదతో భారత్‌లో ప్రభుత్వాన్ని 20 రోజుల పాటు నడిపించొచ్చని 'బ్లూమ్‌బర్గ్‌'ను ఉటంకిస్తూ 'నవతెలంగాణ' పత్రిక ఓ కథనం రాసింది.

అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) అంచనాల మేరకు- భారత్‌లో ప్రభుత్వం ఒక్క రోజుకు 198.72 కోట్ల డాలర్ల మేర ఖర్చు చేస్తోందని, ఈ లెక్కన అంబానీ వద్ద ఉన్న మొత్తం 4,030 కోట్ల డాలర్ల సంపద 20 రోజులకు మాత్రమే సరిపోగలదని ఆ సంస్థ విశ్లేషించింది.

ప్రపంచవ్యాప్తంగా 49 దేశాల్లో మేటి కుబేరుడి ఆస్తిని ఆ దేశ సర్కారు రోజువారీ నిర్వహణ ఖర్చులతో బేరీజు వేస్తూ, ఆ సంపదతో ఎన్ని రోజులు పాలన సాగించవచ్చనే అంశంపై బ్లూమ్‌బర్గ్‌ సంస్థ 'రాబిన్‌హుడ్ ఇండెక్స్‌' విడుదల చేసింది.

సైప్రస్‌కు చెందిన జాన్‌ ఫ్రెడ్రిక్‌సన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఆయన తన ఆస్తితో తమ దేశంలోని సర్కారు ఖర్చులను 441 రోజుల పాటు భరించగలరని ఈ సూచీ తెలిపింది.

సంపన్నుల జాబితాలో 16వ స్థానంలో ఉన్న 'అలీబాబా' జాక్‌మా.. తన సంపదతో మాతృదేశం చైనా పాలనా ఖర్చులను నాలుగు రోజులే భరించగలరని ఈ సూచీ చెప్పింది.

9,990 కోట్ల డాలర్ల సంపద ఉన్న జెఫ్‌ బెజోస్‌ తన ఆస్తితో అమెరికా ప్రభుత్వాన్ని ఐదు రోజులు నడిపించగలరని 'నవ తెలంగాణ' కథనం వివరిస్తోంది.

జాబితాలో కేవలం నలుగురు మహిళలే చోటు సంపాదించారు. వీరిలో అంగోలా, ఆస్ట్రేలియా, చిలీ, నెదర్లాండ్స్‌ వారు ఉన్నారు.

Image copyright Getty Images

ఏపీ: రెవెన్యూ లోటుపై అనివార్యమైతే సుప్రీంకోర్టుకు ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రాష్ట్ర రెవెన్యూ లోటును కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించడానికీ వెనకాడకూడదని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని 'ఈనాడు' ఒక కథనంలో రాసింది.

అన్ని మార్గాల్లోనూ ప్రయత్నించిన తర్వాత ఏ ఫలితమూ లేకపోతే ఈ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

రాష్ట్ర విభజన సమయంలో రెవెన్యూ లోటును రూ.16,078 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఆ తర్వాత కేంద్రం కొంత భాగం విడుదల చేసింది.

''తాజాగా రాష్ట్ర అధికారులు కేంద్రంతో మాట్లాడిన అనంతరం రూ.7,070 కోట్ల రుణ మాఫీ సొమ్మును మినహాయించుకున్న తర్వాత కేంద్ర, రాష్ట్ర అధికారులు కలిసి లెక్కించగా... రెవెన్యూ లోటు రూ.7,509 కోట్లుగా తేలింది. రూ.3520.50 కోట్లు ఇంకా రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉందని అంగీకరించినా ఆ మొత్తం ఇచ్చేందుకు కేంద్ర అధికారులు ససేమిరా అంటున్నారని అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ లోటు ఇక కేవలం రూ.138.38 కోట్లే ఇస్తామంటున్నారని వారంటున్నారు. ఇంకా దీనిపై ప్రయత్నాలు సాగుతున్నాయి'' అని 'ఈనాడు' కథనం తెలిపింది.

ఉద్యోగాలు Image copyright Getty Images

ఏపీ టెట్: ఈ మూల అభ్యర్థిని ఆ మూలకు విసిరేశారు

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) కేంద్రాల కేటాయింపుల్లో చోటుచేసుకున్న తప్పిదాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని 'ఈనాడు' ఒక కథనంలో పేర్కొంది.

అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధికారులు అయోమయానికి గురవుతున్నారని చెప్పింది.

పరీక్ష కేంద్రాలను మార్చుకునేందుకు అంతర్రాష్ట్ర విద్యార్థులకు అవకాశం కల్పించిన పాఠశాల విద్యాశాఖ.. రాష్ట్రంలోనే దూర ప్రాంతాలకు వేసిన వారిని మాత్రం పట్టించుకోవడం లేదని పత్రిక తెలిపింది.

శ్రీకాకుళం రణస్థలం మండలానికి చెందిన సంతోషికుమారి అనే అభ్యర్థికి కృష్ణా జిల్లాలోని పెడనలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. ఈ అభ్యర్థికి ఇక్కడికి వచ్చి పరీక్ష రాసేందుకే దాదాపు రూ.2,500 వరకు వ్యయమవుతుంది. ఇలాంటి అభ్యర్థులు రాష్ట్రంలో వేల మంది ఉన్నారు.

అనంతపురానికి చెందిన మరో అభ్యర్థికి నెల్లూరులో కేంద్రాన్ని ఇచ్చారు. కొందరు ఐచ్ఛికం ఇవ్వకపోయినా ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహణ సంస్థకు అనుకూలంగా ఉన్న జిల్లాల్లో కేంద్రాలను కేటాయించేశారు.

టెట్‌ దరఖాస్తు సమయంలో పరీక్ష కేంద్రాల ఎంపికకు అధికారులు ఐదు ఐచ్ఛికాలను ఇచ్చారు. రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండగా ఐదు జిల్లాలను ఎంచుకోవాలని సూచించారు. రాయలసీమకు చెందిన వారు అక్కడి నాలుగు జిల్లాలతోపాటు నెల్లూరు, గుంటూరులను ఎంపిక చేసుకున్నారు.

అభ్యర్థులే ఐచ్ఛికం ఇచ్చారంటూ ఆ జిల్లాలకు చెందిన వందల మందికి గుంటూరు, నెల్లూరుల్లో కేంద్రాలను కేటాయించారు.

అభ్యర్థి ఇచ్చిన ప్రథమ, ద్వితీయ, తృతీయ ఐచ్ఛికాలను పట్టించుకోకుండా చివరిలో ఇచ్చిన ఐచ్ఛికాన్ని ప్రామాణికంగా తీసుకున్నారని ‘ఈనాడు’ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)