అభిప్రాయం: మోహన్ భాగవత్‌ ఎదురుచూపులు ఏ యుద్ధం కోసం?

  • 14 ఫిబ్రవరి 2018
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ Image copyright Getty Images

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఏ యుద్ధం కోసం ఎదురుచూస్తోంది? లౌకిక భారతదేశానికి చెందిన సైన్యం నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయానికి వెళ్లి స్వయంసేవకుల నుంచి భర్తీ దరఖాస్తులు స్వీకరించాల్సిన అవసరం ఏమొస్తుందని అది భావిస్తోంది?

"యుద్ధ సన్నాహాలు చేయాలంటే మాకైతే ఐదారు నెలలు పడుతుంది. ఇప్పుడు సంఘ్ ఒక్కటే మాకు దిక్కు. మీరు మూడు రోజులలో సైన్యాన్ని తయారుచేసి మాకు మద్దతునివ్వండి" -

అంటూ ఏదో ఒక రోజున భారతీయ సైన్యానికి చెందిన మూడు విభాగాల అధిపతులు నాగ్‌పూర్‌కు వస్తారనీ, జాతికి పెను విపత్తు వచ్చిందంటూ విన్నవించుకుంటారని సంఘ్ సర్వోన్నత నేత లేదా సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ బహుశా కల గంటున్నారేమో.

ఆ తర్వాత దేశంలోని ప్రతి గ్రామంలో, ప్రతి గల్లీలో తలపై కాషాయ పట్టీలు కట్టుకున్న బజరంగ్‌దళ్ వలంటీర్లు చేతుల్లో పక్షుల్ని వేటాడే పెల్లెట్‌ తుపాకులు, కత్తుల్లాంటి త్రిశూలాలు పట్టుకొని భారతమాతను రక్షించడం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడతారు. వారి నుంచి ప్రేరణ పొందిన భారతీయ సైన్య జవాన్లు సైతం వారి వెనుక వెనుకే పాకిస్తాన్ లేదా చైనా సరిహద్దు దాకా వెళ్లి శత్రువుల్ని చీల్చి చెండాడుతారు.

హాస్యం, అతిశయోక్తి

జాతి నిర్మాణానికి సంబంధించిన టెండర్ తమకు మాత్రమే దక్కిందనీ, తాము తప్ప మిగిలిన సంఘ్-వ్యతిరేక శక్తులన్నీ జాతి విధ్వంసానికే పాల్పడుతున్నాయని నమ్మేందుకు మోహన్ భాగవత్‌కూ, వారి స్వయంసేవకులకు పూర్తి హక్కుంది.

Image copyright Getty Images

అయితే, బారాముూలా నుంచి బొమడిలా వరకు.. సాయంత్రం వేళల్లో డ్రింక్స్ తీసుకుంటూ, మూడు రోజుల్లో స్వయంసేవకుల సైన్యాన్ని తయారు చేయొచ్చనే హాస్యోక్తులపై సైనికాధికారులు ఎలా పగలబడి నవ్వుతారో సైన్యం సంస్కృతిని దగ్గరగా పరిశీలించే వారికి బాగా తెలుసు.

ముజఫర్‌నగర్ జిల్లా స్కూలు మైదానంలో స్వయంసేవకులను ఉద్దేశించి మోహన్ భాగవత్ చేసిన ప్రసంగంలో ఉపయోగించిన పదజాలాన్ని భాషా పండితులు అతిశయోక్తి అలంకారంగా పరిగణిస్తారు.

ఉదాహరణకు, ఓ ప్రేమికుడు తన ప్రియురాలితో 'నీ కోసం ఆకాశంలో చుక్కల్ని కోసుకొచ్చేస్తాను' అని అన్నాడనుకోండి, దానిని అతిశయోక్తి అలంకారం అని అంటారు.

"దేశానికి అవసరం వచ్చినపుడు, దేశ రాజ్యాంగం చట్టం చేసినట్టయితే, సైన్యాన్ని సన్నద్ధం చేయాలంటే ఆరేడు నెలల సమయం పడుతుంది. అదే స్వయంసేవకులైతే.. మూడు రోజుల్లో రెడీ" అని మోహన్ భాగవత్ అన్నారు.

అయితే దీనికి ఆయనో డిస్‌క్లెయిమర్ కూడా ఇచ్చారు - రాజ్యాంగం అనుమతిస్తేనే!

Image copyright Getty Images

రాజ్యాంగం అనుమతించకపోతే దాన్నీ మార్చేస్తారా?

రాజ్యాంగం ఇందుకు అనుమతించదనే విషయం మోహన్ భాగవత్‌కు బాగానే తెలుసు. ప్రైవేటు సేనలను ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగం ఎవరికీ అనుమతినివ్వదు.

మత ప్రాతిపదికన విధానాల రూపకల్పన చేసేందుకు రాజ్యాంగం భారత ప్రభుత్వాన్ని కూడా అనుమతించదు. ఇది దాని లౌకిక స్వభావానికి నిదర్శనం.

రాజ్యాంగం సైన్యాన్ని కూడా రాజకీయాలకు అతీతంగా నిలబెడుతుంది. అట్లాగే న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకునేందుకు కూడా రాజకీయ నేతలకు అనుమతి లేదు.

అయితే, ఆకాశం నుంచి చుక్కల్ని కోసుకొని రావాలంటే ఉన్న అతి పెద్ద అడ్డంకి భారత రాజ్యాంగమేననే విషయం మోహన్ భాగవత్‌కు బాగా తెలుసు. అందుకే, మొత్తం రాజ్యాంగాన్నే మార్చెయ్యాలనే మాటలు సైతం సంఘ్ పరివారం నుంచి అప్పుడప్పుడు మనకు వినబడుతుంటాయి.

రాజ్యాంగాన్ని మార్చెయ్యాలనే మాటలు కొన్ని సార్లు కేఎన్ గోవిందాచార్య వంటి పాతతరం స్వయంసేవకుల నోటి నుంచి వెలువడుతాయి. మరి కొన్ని సార్లు మేం రాజ్యాంగాన్ని మార్చెయ్యడానికే వచ్చామనే అనంత్ కుమార్ హెగ్డే వంటి యువ కేంద్ర మంత్రి మాటలు కూడా వినబడుతుంటాయి.

Image copyright Getty Images

వివాదం ముదిరినపుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాళ్లు తామలా మాట్లడనే లేదని అంటూ తప్పించుకుంటారు లేదా తమ వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆరోపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. లేదంటే ఒక్క వాక్యంలో విచారం ప్రకటించి వివాదంపై నీళ్లు చల్లుతారు.

తమను తాము సైన్యంలా చిత్రీకరించే ప్రయత్నం

మోహన్ భాగవత్ భారతీయ సైన్యం విషయంలో చేసిన వ్యాఖ్యలను సైన్యానికి వ్యతిరేకమైనవని విమర్శలు వెల్లువెత్తగా, షరా మామూలుగానే సర్‌సంఘ్‌చాలక్ వ్యాఖ్యలను మీడియాలో వక్రీకరించారంటూ సంఘ్ వివరణ ఇచ్చింది.

సంఘ్ ప్రచారశాఖ అధిపతి డాక్టర్ మన్మోహన్ వైద్య ఓ ప్రకటన జారీ చేస్తూ, "భారతీయ సైన్యం సమాజాన్ని సంసిద్ధం చేయాలంటే ఆరు నెలల సమయం పడుతుందనీ, అదే సంఘ్ స్వయంసేవకులకైతే మూడు నెలలు చాలునని భాగవత్ అన్నారు. ఇద్దరికీ శిక్షణ ఇవ్వాల్సింది సైన్యమే. పౌరులలోంచి కొత్తగా తయారయ్యే వారికి కూడా సైన్యమే శిక్షణ ఇస్తుంది. స్వయంసేవకులకు కూడా సైన్యమే శిక్షణ ఇచ్చి సైనికులుగా మల్చుతుంది" అని వివరణ ఇచ్చారు.

Image copyright Getty Images

మోహన్ భాగవత్, డాక్టర్ మన్మోహన్ వైద్యల ప్రకటనలను జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమయ్యేదేంటంటే, జనం దృష్టిలో భారతీయ సైన్యానికీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు మధ్య విభజనరేఖను మసకబార్చాలన్న ప్రయత్నమే వీరిద్దరూ చేస్తున్నారు.

సామాన్య ప్రజలంతా సైన్యం, సంఘ్; సైనికులు, స్వయంసేవకులను పర్యాయ పదాలుగా భావించాలని వారు ఆశిస్తున్నారు. రెండూ కూడా క్రమశిక్షణాయుతమైనవని, దేశం కోసం ప్రాణాలర్పించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయని జనం విశ్వసించాలని వారు కోరుకుంటున్నారు.

సైనికులు యూనిఫాం వేసుకొని ప్రతి ఉదయం వ్యాయామం, డ్రిల్లులు చేస్తుంటారు. స్వయంసేవకులు కూడా తమదైన వస్త్రధారణతో కాలనీల్లోని పార్కుల్లో శాఖలు నడిపిస్తుంటారు. ఖో-ఖో, కబడ్డీ వంటి ఆటలు ఆడుతారు. సైనికులు హుందాగా మార్చింగ్ చేస్తే, స్వయంసేవకులు కూడా కర్రలు, జెండాలు ప్టటుకొని పురవీధుల్లో కవాతులు జరుపుతుంటారు.

Image copyright Getty/MANJUNATH KIRAN

ఇరువురి పద్ధతులు, ఆలోచన, లక్ష్యాల్లో తేడా ఎక్కడుంది?

దీనిని నిరూపించుకోవడం కోసం, తామే సైన్యానికి బలమైన మద్దతుదారులుగా ప్రశంసలు పొందేందుకు హిందుత్వవాద సంస్థలు ఒక కశ్మీరీ వ్యక్తిని జీపు బానెట్‌పై కట్టేసి ఊరేగించడాన్ని సమర్థిస్తాయి. అందుకే, దేశ రాజకీయాలపై, విదేశాంగ విధానంపై సైనిక అధికారులు బాహాటంగా వ్యాఖ్యలు చేసినా అవి అభ్యంతరం చెప్పవు.

Image copyright Twitter
చిత్రం శీర్షిక ఫారుక్ అహ్మద్ డార్ అనే యువకుణ్ని జీపుపై బానెట్‌కు కట్టేసి ఊరేగించారు.

హిందువుల సైన్యీకరణ

సంఘ్‌కూ, సైన్యానికి మధ్య అంతరం ఏదీ లేకుండా చేయడమన్నది ఆర్ఎస్ఎస్ ముందున్న అతి పెద్ద సవాలు. సంఘ్ ఒకవేళ ఇందులో జయప్రదమైతే వినాయక్ దామోదర్ సావర్కర్ కల సాకారమైనట్టే.

ఎందుకంటే, హిందుత్వ భావజాలాన్ని పదునుదేర్చి, దానికి ఉగ్ర రూపాన్నిచ్చిన సావర్కర్ మొట్టమొదట అన్న మాట - "రాజకీయాలను హిందూకరిద్దాం, హిందువులను సైన్యీకరిద్దాం".

గత నాలుగేళ్ల నరేంద్ర మోదీ పాలనలో భారత రాజకీయాలు ఎంత వేగంగా హిందూకరణ చెందాయంటే, ఇంతగా జరుగొచ్చనే అంచనా బహుశా సంఘ్‌కు కూడా లేదేమో.

లౌకికవాదానికి బాసటగా నిలుస్తామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ సైతం ఇప్పుడు మందిరంలో మొక్కు చెల్లించకుండా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం లేదు.

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కూడా సంఘ్ ధ్రువీకరణ రాజకీయాలను ఎదుర్కొనేందుకు మరే వ్యూహం తోచకపోవడంతో, బ్రాహ్మణ సమ్మేళనాలను నిర్వహించేందుకు సిద్ధపడింది. భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేయడం ప్రారంభించింది.

Image copyright Getty/SAM PANTHAKY

కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌లు అనుసరిస్తున్న హిందుత్వ విధానాలు భారతీయ జనతా పార్టీకి నచ్చకపోవచ్చేమో గానీ, సంఘ్‌కు మాత్రం ఇంతకన్నా కావాల్సింది మరేముంటుంది?

బజరంగ్‌దళ్ శిక్షణ

ఇక ఇప్పుడు హిందువుల సైన్యీకరణ గురించి, వారిని క్రమశిక్షణాపరులుగా చేయడానికి, వారిలో ఆవేశ తీవ్రతను, దూకుడుతనాన్ని పెంచడానికి చేస్తున్న ప్రయత్నాల విషయం చూద్దాం.

Image copyright AFP

బజరంగ్‌దళ్ ఇందుకోసమే ప్రత్యేకించి ఎన్నో ఏళ్లుగా పని చేస్తోంది.

బజరంగ్‌దళ్ నిర్వహించే ఆత్మరక్షణా శిబిరాల్లో కిషోరప్రాయపు నవయువకులకు లాఠీలు, త్రిశూలాలు, పెల్లెట్ల తుపాకులిచ్చి 'ఇస్తుంటారు. ఈ శిక్షణ శిబిరాలలో బజరంగ్‌దళ్‌కే చెందిన కొంత మంది గడ్డాలున్న కార్యకర్తల తలలకు ముస్లింల వంటి టోపీలు తగిలించి 'ఉగ్రవాదుల' పాత్ర పోషించేలా చేస్తారు.

దేశానికి శత్రువులెవరో, వారిని ఎలా ఎదుర్కోవాలో ఈ వేషభూషలతోనే నిర్ణయమైపోతుంది.

సైన్యీకరణ ప్రక్రియ పూర్తవడంతోనే సమాజంలో ఓ పెద్ద విస్తరణ జరుగుతుందనీ, భారత పార్లమెంటు, న్యాయవ్యవస్థ, విద్యా సంస్థలు, పోలీసులు, పారామిలిటరీ, చివరకు సైన్యంలోని మూడు విభాగాలు సైతం తమ ఎదుట చేతులు కట్టుకొని వినమ్రంగా నిలబడతాయని సంఘ్ నమ్ముతోంది.

అయితే భారతీయ సైన్యం ప్రస్తుతం ఒక లౌకికవాద, ప్రొఫెషనల్ సంస్థగా ఉంది. దానిపై ఈ దేశంలోని హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు సహా అత్యధిక ప్రజానీకానికి విశ్వాసం ఉంది.

అందుకే, మతకల్లోలాలు తలెత్తినప్పుడు వాటిని అరికట్టడంలో పౌర పరిపాలనా వ్యవస్థ విఫలమైనప్పుడు సైన్యాన్నే పిలుస్తుంటారు. కల్లోలిత ప్రాంతాల్లో మోహరించే భారత లౌకికవాద సైన్యం ఫ్లాగ్ మార్చ్‌లు చేపడితే అల్లరి మూకలు బెంబేలెత్తుతాయి. అల్లర్లు ఆగిపోతాయి.

మరి సంఘ్‌ స్వయంసేవకులకు భారతీయ సైన్యం శిక్షణ ఇస్తుందని మోహన్ భాగవత్, డాక్టర్ మన్మోహన్ వైద్యలిద్దరూ ఎలా ఆశిస్తున్నారు? దాని వెనుకున్న ఆలోచనేంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)