వేశ్యాగృహాల్లో ప్రేమ పుడుతుందా?

  • సింధువాసిని
  • బీబీసీ ప్రతినిధి
సెక్స్ వర్కర్, జీబీ రోడ్, దిల్లీ, వాలెంటైన్స్ డే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

''ప్రేమికుల రోజు.. అంటే ప్రేమను సెలబ్రేట్ చేసుకునే రోజు. వాలెంటైన్స్ డే గురించి మీకు తెలుసా?'' నేను కొంచెం బిడియంగా, కొంచెం భయంభయంగా ఆమెను అడిగాను. సన్నని శరీరంతో, జీవితంలో ఓడిపోయినట్లున్న ఆ మహిళ కంటి కింద నల్లని చారలున్నాయి.

నా ప్రశ్న విని ఆ మహిళ ఒక పక్కన థూ అంటూ ఉమ్మేసి, ''తెలుసు.. అయితే ఏంటి?'' అని అడిగింది.

''మీ జీవితంలో ప్రేమ ఉందా? మిమ్మల్ని ఎవరైనా ప్రేమించారా..''

నా ప్రశ్న పూర్తి కాకుండానే ఆమె, ''వేశ్యలను ఎవరు ప్రేమిస్తారు మేడమ్? ఎవరైనా ప్రేమిస్తే మేం ఇక్కడెందుకు ఉండేవాళ్లం?'' అంది.

ఈ మాట అంటూనే నన్ను కూర్చోమని సైగ చేసిందామె. నేను వెంటనే ఆమె పక్కనే కూర్చుని ఆమెతో మాటలు మొదలుపెట్టాను.

ఫొటో సోర్స్, Getty Images

అది దిల్లీలోని జీబీ రోడ్‌ ప్రాంతం. పొట్టకూటి కోసం అక్కడ మహిళా సెక్స్ వర్కర్లు తమ వద్దకు వచ్చే పురుషుల కోరికలను తీరుస్తుంటారు.

ఈ సెక్స్ వర్కర్ల జీవితాలలో అసలు ప్రేమకు స్థానం ఉందా? వాలెంటైన్స్ డే ప్రస్తావన వాళ్ల కళ్లలో ఏమాత్రమైనా మెరుపును తీసుకొస్తుందా?.. ఈ ప్రశ్నలే నన్ను ఈ ప్రదేశానికి తీసుకువచ్చాయి.

కానీ, ఇక్కడికి రావడానికి ముందు నాకు 'కొంచెం భద్రం', 'జాగ్రత్తగా ఉండు' లాంటి హెచ్చరికలు చేశారు మిత్రులు.

హిందీ సినిమాల్లో చూపించినట్లుగా ఇక్కడ రంగురంగుల లైట్లు, సువాసనలు వెదజల్లే అగరుబత్తీలు ఉంటాయనుకున్నాను. కానీ నాకు అలాంటివేవీ కనిపించలేదు.

అరగంట ఎంజాయ్..

అక్కడంతా సందడి సందడిగా ఉంది. ఒక చిన్న పోలీస్ స్టేషన్, హనుమాన్ గుడి, కొన్ని దుకాణాలు, రోడ్డుపై హడావుడిగా తిరుగుతున్న జనం.

'ఆ' ప్రదేశం ఎక్కడుంది అన్న నా ప్రశ్నకు సమాధానంగా ఒకతను దూరంగా నడుం మీద చేతులు పెట్టుకుని నిలబడ్డ మహిళ వైపు చూపించాడు.

వీలైనంత స్నేహపూర్వకంగా నవ్వుతూ, నాకు ఆమె ఎన్నాళ్లుగానో పరిచయం ఉన్న వ్యక్తిలా ప్రవర్తిస్తూ ఆమె దగ్గరకు వెళ్లాను. కొంచెంసేపు మాట్లాడాక, ఆమె నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి అంగీకరించింది.

అలా నేను అక్కడ కర్ణాటకకు చెందిన ఆ మహిళను కలిశాను. ప్రేమాగీమా అంతా ట్రాష్ అని ఆమె నాతో చెప్పింది.

''ఈ మొహంలో మెరుపు ఉన్నంత వరకు తిండి దొరుకుతుంది. ఇక్కడికి వచ్చేవాళ్లంతా ఒక అరగంట ఎంజాయ్ చేయడానికి వస్తారు. పని పూర్తి చేసుకున్న తరువాత వారెవరో? మేమెవరమో'' అంది.

కోల్‌కతాకు చెందిన నిషా గత 12 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉంది.

''మగాళ్లు పెద్దపెద్ద మాటలు చెబుతారు. కానీ ఎవరూ మమ్మల్ని ప్రేమించే ధైర్యం చేయరు. ఎవరికైనా మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లే ధైర్యముంటుందా?'' అని ఆమె తిరిగి ప్రశ్నించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

36 ఏళ్ల రీమాది మరో కథ.

''ప్రేమా?.. ఉంది. నా కస్టమర్లలోనే ఒకతను నన్ను ప్రేమించాడు. పెళ్లి చేసుకున్నాడు. మాకు ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. అని చెబుతూనే కథను మలుపు తిప్పుతూ ఆ తరువాత జరిగిందంతా చెప్పడం మొదలుపెట్టింది రీమా.

అతను రోజూ తాగి వచ్చి నన్ను కొట్టేవాడు. చాలా రోజులు అది ఓర్చుకున్నా. కానీ ఓ రోజు పిల్లల మీద చేయెత్తేసరికి, అతని నుంచి విడిపోయా'' అంటూ చెప్పుకొచ్చింది.

మా సంభాషణ సాగుతుండగానే ఓ మహిళ మమ్మల్ని భవనం పై భాగానికి వెళ్లమంది. అక్కడ చాలామంది ఆడపిల్లలు ఉంటారని చెప్పింది.

నేను రెండో అంతస్తుకు వెళ్లేసరికి అక్కడ చాలా చీకటిగా ఉంది. నాకు భయమేసి అరిచే లోపల ఎవరో మొబైల్ లైట్ వేసుకోమని సూచించారు.

నేను మొబైల్ ఫోన్ వెలుగులోనే నాలుగో ఫ్లోర్ చేరుకున్నాను. అక్కడ 10 నుంచి 12 మంది అమ్మాయిలున్నారు. కొందరు టీ షర్ట్‌లు వేసుకుంటే, కొందరు చీరలు, మరికొందరు కేవలం పైవస్త్రాలు, టవల్స్ మాత్రం కప్పుకొన్నారు.

''ఫోన్‌లో ఏమీ రికార్డు చేయడం లేదుగా? ఎక్కడా సీక్రెట్ కెమెరా లేదు కదా?'' ఇలా అనేక ప్రశ్నలు వేశారు.

ఫొటో సోర్స్, Getty Images

మినీ భారతం

అక్కడ కొన్ని గదుల్లో మగవాళ్లు కూడా ఉన్నారు. ఒక వ్యక్తి తన ఎదురుగా ఉన్న లక్ష్మీ, గణపతి ఫొటోలకు అగరుబత్తీలు వెలిగిస్తున్నాడు.

అక్కడ ఓ యువతి రాజస్థాన్ నుంచి వస్తే, మరో యువతి పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చింది. ఒకరు మధ్య ప్రదేశ్ నుంచి, మరొకరు కర్ణాటక నుంచి వచ్చారు. ఆ చిన్నచిన్న గదుల్లో నాకు మినీ భారతం కనిపించింది.

నేను చలి కాచుకుంటున్న ఓ అమ్మాయి దగ్గరకు వెళ్లి ఆమె జీవితంలో కూడా ఏదైనా 'స్పెషల్' ఉందా అని అడిగాను.

ఆమె నవ్వింది. ''ఇప్పుడు ఎవరైనా ప్రేమ గురించి చెప్పినా నేను నమ్మను. డబ్బు చేతిలో పెట్టు.. కొంచెం సేపు గడుపు, వెళ్లిపో. అంతే. ఈ కపట ప్రేమలు మాతో చెప్పొద్దు'' అన్నది ఆమె సమాధానం.

దగ్గరగా నిలబడ్డ ఇంకో యువతి , ''నాకో కొడుకు ఉన్నాడు. నేను వాణ్ని ప్రేమిస్తాను. సల్మాన్ ఖాన్‌ను కూడా ప్రేమిస్తాను. కొత్త సినిమా ఏమైనా వస్తోందా సల్మాన్‌ది?'' అని ప్రశ్నించింది.

ఓ మూలగా నిలబడి ఉన్న మరో యువతితో మాట్లాడాలనుకున్నా కానీ ఆ యువతి ''బాత్ రూం ఖాళీ అయింది. నేను వెళ్లి స్నానం చేసుకోవాలి, శివరాత్రి పూజలు చేయాలి'' అంటూ వెళ్లిపోయింది.

ఇలా మాట్లాడుతుండగానే చాలా సమయం గడిచిపోయింది.

నేను బరువెక్కిన హృదయంతో మెట్లు దిగడం ప్రారంభించాను. ఇంత మంది సెక్స్ వర్కర్లలో ఎవరికీ జీవితంలో ప్రేమ లభించలేదు.

ఆ ఆలోచనల్లో మునిగి నేను మరోసారి జనసమ్మర్థంతో నిండిన వీధుల్లోకొచ్చాను. దగ్గరలో ఓ దుకాణంలో ''బన్ జా తు మేరి రాణీ.. తెను మహల్ దవా దూంగా'' అన్న పాట వినిపిస్తోంది.

(దిల్లీలోని వేశ్యావాటికల్లో పర్యటించిన మా ప్రతినిధి, వారి జీవితాల్లో ప్రేమ ఉందా అన్న విషయంపై ఆరా తీసి చేసిన కథనం ఇది.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)