'ఆరోగ్య శ్రీ' కేంద్ర ఆరోగ్య బీమా పథకంలో కలిసిపోతుందా?
- దీప్తి బత్తిని
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
2007 ఏప్రిల్ 1న ప్రయోగాత్మకంగా మహబూబ్ నగర్, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ నెల 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతూ, దేశంలోని ఆర్థికంగా వెనుకబడిన 10 కోట్ల కుటుంబాల కోసం జాతీయ ఆరోగ్య పథకాన్ని ప్రకటించారు.
ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబం ప్రతి సంవత్సరంలో ఐదు లక్షల రూపాయల వరకు వైద్యం చేయించుకోవచ్చని తెలిపారు.
ఈ పథకం అమలు, విధి విధానాలు చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ వైద్య కార్యదర్శులతో సమావేశం కానున్నట్లు వార్తలు వెలువడ్డాయి.
ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాలలో వైద్య బీమా పథకాలు అమలులో ఉన్నాయి.
'ఆరోగ్యభాగ్య' పేరుతో కర్ణాటకలో, గుజరాత్‌లో 'ముఖ్యమంత్రి అమృతం', తమిళనాడులో 'ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా' అన్న పేర్లతో అమలవుతున్న పథకాలు ఇందుకు కొన్ని ఉదాహరణలు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007 ఏప్రిల్ 1న వైఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఓ 'కీలక' పథకంగా 'రాజీవ్ ఆరోగ్యశ్రీ'ని ప్రారంభించారు.
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం అదే పేరుతో ఆరోగ్యశ్రీని కొనసాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని 'ఎన్‌టిఆర్ వైద్య సేవ' అనే పేరుతో అమలు చేస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి 1000 కోట్ల రూపాయలు కేటాయించింది.

ఫొటో సోర్స్, Getty Images
పథకం అమలు తీరు
ఏపీలో ఈ పథకం కింద 600 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు నెట్‌వర్క్ హాస్పిటల్స్‌గా నమోదై ఉన్నాయి.
ఈ పథకం ద్వారా 29 వివిధ వైద్య విభాగాల కింద 1044 రకాల చికిత్సలకు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు వైద్యం అందుతుంది. కార్డియాలజీ, నెఫ్రాలజీ, గైనకాలజీ తదితర విభాగాలలో వైద్యం లభిస్తుంది.
ఆధార్‌తో అనుసంధానమై తెలుపు రేషన్ కార్డు ఉన్నప్రతి ఒక్కరూ ఆరోగ్య శ్రీ పథకానికి అర్హులు. దీని ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాది 2.5 లక్షల రూపాయిల వరకు వైద్య బీమా లభిస్తుంది.
లబ్ధిదారులు ఎవరైనా అవసరం వచ్చినపుడు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కానీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలలో కానీ, వివిధ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో కానీ వైద్య సహాయం పొందవచ్చు.
లబ్ధిదారుల వివరాలను బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ ద్వారా పొందు పరుస్తారు. ప్రభుత్వం పొందు పరిచిన చికిత్సల కింద ఉన్న వైద్యానికి అయ్యే ఖర్చుకై నెట్‌వర్క్ ఆస్పత్రులు ఆన్‌లైన్‌లో ముందుగానే అనుమతి కోసం అర్జీ పెడతాయి. అనుమతులు వచ్చిన తరువాతే చికిత్స ప్రారంభిస్తారు.
వైద్యానికి అయ్యే మొత్తం ఖర్చు నగదు రహితంగా అందిస్తారు. చికిత్స తరువాత డిశ్చార్జ్ చేసిన పది రోజుల తరువాత నెట్‌వర్క్ హాస్పిటల్ ప్రభుత్వానికి ఆర్జీ పెట్టుకుంటుంది.
అదే ఎమర్జెన్సీ కింద అయితే ఫోన్ ద్వారా కావాల్సిన అనుమతులు తీసుకొని చికిత్స మొదలు పెడతారు.

ఫొటో సోర్స్, ntrvaidyaseva.ap.gov.in/
2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వివరాలు (ఆంధ్ర ప్రదేశ్)
- మొత్తం లబ్ధిదారులు: 2,50,288
- చికిత్సల సంఖ్య: 3,96,384
- చెల్లించిన మొత్తం: 1085.42 కోట్ల రూపాయలు
- పరిష్కరించిన క్లెయిమ్‌లు: 3,77,726
- క్లెయిమ్‌లకు చెల్లించిన మొత్తం: 969.60 కోట్ల రూపాయలు.
ఆధారం: చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎన్‌టిఆర్ వైద్య సేవ
ప్రభుత్వ నెట్‌వర్క్ హాస్పిటల్ క్లెయిమ్ చేసుకొని వచ్చే ఆదాయంలో నుంచి 20 శాతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరిచేందుకు ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి గాను 2017-18 సంవత్సరంలో దాదాపు 750 కోట్లు రూపాయిలు కేటాయించారు. ఈ పథకం కింద 78 లక్షల కుటుంబాలకు చికిత్సను అందిస్తునట్టు ఆరోగ్యశ్రీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డా. మనోహర్ పేర్కొన్నారు.
తెలంగాణలో 40 శాతం ప్రభుత్వ, 60 శాతం ప్రైవేట్ ఆసుపత్రులు నెట్‌వర్క్ ఆస్పత్రులుగా నమోయ్యాయి. ఇప్పటికే దాదాపు 2,80,000 లబ్ధిదారులకు ఈ పథకం కింద వైద్య సేవలు అందించినట్టు అధికారులు వెల్లడించారు.
ఈ పథకం ద్వారా లబ్ది పొందిన వనపర్తికి చెందిన శాంతయ్య అనే డ్రైవర్ బీబీసీతో మాట్లాడుతూ, తనకి 2015లో ఉదర సంబంధ సమస్య తలెత్తినప్పుడు, ఒక్క రూపాయి సొంత ఖర్చు లేకుండా చికిత్స లభించిందని చెప్పారు.

ఫొటో సోర్స్, Aarogyasri-Telangana/FACEBOOK
హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ప్రధాన కార్యాలయం
'అవినీతికి తావు లేదు'
ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలులో జరిగిన లోటుపాట్ల కారణంగా అప్పటి ప్రభుత్వానికి 81.53 లక్షల రూపాయిల నష్టం వాటిల్లినట్లు విజిలెన్స్ విభాగం 2013 నివేదికలో పేర్కొంది.
అయితే, ఇప్పుడు అలాంటి అవినీతి జరిగే ప్రసక్తే లేదని చెబుతున్నారు తెలుగు రాష్ట్రాల అధికారులు.
"ఆరోగ్య క్యాంపులు నిర్వహించటం నుంచి రోగ నిర్ధారణ, వైద్యం, హాస్పిటల్ ఖర్చులు, ఆ తరువాత చెల్లింపుల వరకు అన్ని వివరాలూ ఆన్‌లైన్‌లో ఉంటుండటంతో పారదర్శకత ఎక్కువ. అందులో ఎలాంటి మోసానికి తావు లేదు" అని ఆంధ్ర ప్రదేశ్ ఎన్‌టీఆర్ వైద్య సేవ ట్రస్టు సీఈఓ డా. రవి శంకర్ వివరించారు.
"ఆన్‌లైన్‌లో వచ్చే పత్రాలను పరిశీలించేందుకు గట్టి మెడికల్ ఆడిట్ టీంను ఏర్పాటు చేశాము" అని తెలంగాణ ఆరోగ్యశ్రీ సీఈఓ డా.మనోహర్ తెలిపారు.

'పూర్తి పారదర్శకత అసాధ్యం'
అయితే ఆరోగ్య బీమా పథకాలను అవినీతి జరగకుండా అమలు చేయటం కష్టమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మాజీ సెక్రటరీ కే సుజాత రావు అభిప్రాయపడుతున్నారు.
"ఈ పథకం ప్రధానంగా వైద్య ఖర్చులకై బీమా పధ్ధతిపై ఆధారపడి పనిచేస్తోంది. ఈ విధానంలో కూడా అవినీతికి తావు ఉందని, కచ్చితమైన నియమాలు, పర్యవేక్షణ, కార్యాచరణ ద్వారా ఈ పథకం సక్రమంగా అమలయ్యేలా చూడవచ్చని అన్నారు"
ఈ పథకాలు తెలుగు రాష్ట్రాల్లో అమలులో ఉండగా కేంద్రం ప్రకటించిన జాతీయ ఆరోగ్య భద్రత పథకం ఎలా అమలులోకి వస్తుంది? అనే విషయంపై అధికారులకు ఇంకా స్పష్టత లేదు.
ఈ పథకం కేంద్రం ప్రకటించిన జాతీయ ఆరోగ్య పథకంలో రాష్ట్ర పథకాలను విలీనం చేస్తారా? ఇలాగే కొనసాగిస్తారా? అనేది ఇంకా తేలని ప్రశ్న.
"జాతీయ ఆరోగ్య పథకం ద్వారా రాష్ట్రంలోని పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం" అని రవి శంకర్ అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో మాత్రం ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగిస్తామని అంటున్నారు.
"కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పథకాన్ని ఆరోగ్య శ్రీ పద్ధతిలోనే అమలు చేసే అవకాశం ఉంది. కాకపోతే కేంద్ర పథకం ద్వారా కేవలం 30 నుంచి 40 లక్షల కుటుంబాలు మాత్రమే లబ్ధి పొందే అవకాశం ఉంది. తెలంగాణలో ఇప్పటికే 80 లక్షల కుటుంబాలకు ఆరోగ్య శ్రీ పథకం అందుబాటులో ఉంది. కేంద్ర పథకం కింద మిగిలిన కుటుంబాలకూ అందించాలని అభ్యర్థిస్తాం. కుదరకపోతే రాష్ట్ర ప్రభుత్వ పథకం ద్వారా ఆ సేవలు అందిస్తాం" అని మనోహర్ తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters
ఆస్పత్రుల వాణిజ్య అవసరాలు వైద్య విధానాలను ప్రభావితం చేయకుండా ఉండే చర్యలను చేపట్టడం ద్వారా ఈ పథకం సక్రమంగా అమలయ్యేలా చూడవచ్చని కె. సుజాత రావు అన్నారు.
ప్రభుత్వం మాత్రమే ప్రధాన పాత్రదారుడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)