పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ.11,360 కోట్ల కుంభకోణం

  • 14 ఫిబ్రవరి 2018
కరెన్సీ Image copyright Getty Images

ముంబైలోని బ్రీచ్ కాండీ శాఖలో రూ.11,360 కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) యాజమాన్యం తెలిపింది.

బ్యాంక్ విడుదల చేసిన ప్రకటనలో, ''ఈ కుంభకోణంలో బ్యాంకు సిబ్బంది, ఖాతాదారుల హస్తం ఉంది. ఈ లావాదేవీలను ఆధారం చేసుకుని, కొన్ని బ్యాంకులు కొంతమంది ఖాతాదారులకు విదేశాలలో కూడా సొమ్మును చెల్లించినట్లు తెలుస్తోంది.'' అని పేర్కొన్నారు.

ఈ కుంభకోణంలోని వ్యక్తుల పేర్లను మాత్రం వెల్లడించలేదు.

అయితే ఆ అక్రమ లావాదేవీలపై విచారణ సంస్థలకు, పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. ఇప్పటికే కనీసం 10 మంది పీఎన్‌బీ సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది.

ఈ కుంభకోణం కోసం కొన్ని నకిలీ ఖాతాలను తెరిచినట్లు ప్రాథమిక విచారణను బట్టి తెలుస్తోంది.

సీబీఐ ఈ కేసు విచారణ చేపట్టినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Image copyright Twitter/DDNewsHindi

పీఎన్‌బీ ఇప్పటికే అనేక అక్రమ లావాదేవీల ఆరోపణలు ఎదుర్కొంటోంది.

గతవారం వ్యాపారవేత్త నీరవ్ మోదీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

నీరవ్ మోదీ, ఆయన బంధువులు కలిసి రూ.280 కోట్ల మేర మోసం చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.

బ్యాంకు సిబ్బంది సహాయంతోనే నీరవ్ మోదీ ఈ అక్రమాలకు పాల్పడినట్లు బ్యాంకు చెబుతోంది.

Image copyright Getty Images

ఒకవైపు బ్యాంకింగ్ నియంత్రణా సంస్థలు భారతీయ బ్యాంకులలో పేరుకుపోయిన మొండిబకాయిల సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుండగా, ఈ కుంభకోణం వెలుగులోకి రావడం ప్రజలకు ప్రభుత్వ బ్యాంకులపై ఉన్న నమ్మకాన్ని దెబ్బ తీస్తోంది.

ఈ వార్త తెలిసిన వెంటనే పీఎన్‌బీ షేర్లు 6.7 శాతం మేర పతనమయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు