డెడ్‌లైన్ పాలిటిక్స్: మూడు నెలలు.. మూడు గడువులు

  • అరుణ్ శాండిల్య
  • బీబీసీ ప్రతినిధి
ఫొటో క్యాప్షన్,

ఏపీలోని ముగ్గురు నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డెడ్‌లైన్లు విధించారు.

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేగాన్ని పెంచింది. మిత్రపక్షాలుగా అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో రెండు చోట్లా అధికారాన్ని పంచుకుంటున్నబీజేపీ, టీడీపీ మధ్య రాజకీయ పోరుకు ఇది కారణమైంది.

రాజకీయ క్రీడలో హోరాహోరీ తలపడుతున్న బీజేపీ, టీడీపీలకు మిగతా పార్టీలూ సవాల్ విసురుతున్నాయి. డెడ్‌లైన్లు పెడుతూ కేంద్ర, రాష్ట్రాల్లోని పాలక పక్షాలను నిలదీసే ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా మూడు నెలల్లో మూడు డెడ్‌లైన్లను ఎదుర్కొంటున్నాయి.

ఇందులో మొదటిది జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అడుగుతున్న నిధుల లెక్క.. దీనికి తుది గడువు ఫిబ్రవరి 15.

ఇక మార్చి 31న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో గడువు ఉంది. అది రిజర్వేషన్లకు సంబంధించి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విధించింది.

మూడోది, తాజాది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రకటించిన ప్రత్యేక హోదా డెడ్‌లైన్.

ఇందులో ప్రధానంగా గురువారం ముగియనున్న జనసేన గడువు.. ఏప్రిల్ 6 వరకు సమయం ఉన్నప్పటికీ వైఎస్సార్‌సీపీ ఇచ్చిన గడువు రాజకీయంగా చర్చనీయమవుతున్నాయి.

ఫొటో క్యాప్షన్,

కేంద్ర, రాష్ట్రాలు చెబుతున్న నిధుల లెక్క తేలుస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటున్నారు.

ఏ గడువు ఎందుకు? ఎప్పుడు?

ఫిబ్రవరి 15- జనసేన జమాబందీ: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ తెలుగుదేశం పార్టీ పార్లమెంటులో, రాష్ట్రంలో ఆందోళనలు చేసిన నేపథ్యంలో ఒక సంయుక్త నిజనిర్ధారణ కమిటీ వేసేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు.

రాజ్యాంగ, రాజకీయ, ఆర్థిక నిపుణులు ఉండే ఈ కమిటీ వాస్తవాలేమిటో తేల్చుతుందని ఆయన ఫిబ్రవరి 11న నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో వెల్లడించారు.

2014 నుంచి 2017 మధ్య కేంద్రం ఎంత నిధులిచ్చింది, రాష్ట్రం వాటినెలా ఖర్చు చేసిందన్నది నిర్ధారిస్తామని.. ఇందుకుగాను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ, రాష్ట్రంలోని పాలక పార్టీ తెలుగుదేశం కానీ తమకు వివరాలివ్వాలని ఆయన కోరారు.

ఇందుకు ఫిబ్రవరి 15 తుది గడువుగా ప్రకటించారు.

ఫొటో క్యాప్షన్,

కాపు రిజర్వేషన్లకు గడువులోగా చట్టబద్ధత కల్పించకపోతే మళ్లీ ఉద్యమిస్తానని ముద్రగడ పద్మనాభం అంటున్నారు.

మార్చి 31- ముద్రగడ గడువు: ఆంధ్రప్రదేశ్‌లో కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, దీనికి మార్చి 31లోగా చట్టబద్ధత కల్పించాలని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గడువు విధించారు.

లేదంటే మరోసారి ఉద్యమించక తప్పదని ఆయన హెచ్చరించారు. ఇంతకుముందు ఇచ్చిన హామీ ప్రకారం 10 నుంచి 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని, 5 శాతం రిజర్వేషన్‌‌కు తాము అంగీకరించమని ఆయన అంటున్నారు.

ఇంతకుముందు కూడా ఆయన ప్రభుత్వానికి డెడ్‌లైన్లు పెట్టారు. అసెంబ్లీలో కాపు రిజర్వేషన్లపై తీర్మానం చేసిన తరువాత శాంతించారు. అనంతరం దానిపై ఎలాంటి పురోగతి లేదంటూ తాజాగా మరోసారి డెడ్‌లైన్ విధించారు.

ఫొటో క్యాప్షన్,

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే తమ లోక్‌సభ సభ్యులంతా రాజీనామా చేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

ఏప్రిల్ 6- జగన్ రాజీనామాల అస్త్రం:ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి డెడ్‌లైన్ విధించారు.

మార్చి 5 నుంచి మొదలయ్యే పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాల్లో దీనిపై ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాకాని పక్షంలో సమావేశాల చివరి రోజైన ఏప్రిల్ 6 వరకు చూసి ఆ రోజున తమ పార్టీ లోక్‌సభ సభ్యులు రాజీనామాలు చేస్తారని ఆయన ప్రకటించారు. దీంతో ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఆయన డెడ్‌లైన్ పెట్టినట్లయింది.

జగన్ డెడ్‌లైన్ కేవలం కేంద్ర ప్రభుత్వానికి విధించిందే అయినప్పటికీ రాజకీయంగా అది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న తెలుగుదేశాన్ని ఇరుకున పెట్టేదేనని ఆ పార్టీ అంటోంది.

డెడ్‌లైన్‌లోగా కేంద్రం దిగి వస్తే సరేసరి, లేదంటే రాజీనామాలు తప్పనిసరి అని చెప్తోంది.

ఫొటో క్యాప్షన్,

ఏప్రిల్ 6న విపక్ష వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పడం హాస్యాస్పదమని ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు.

మూడు గడువులపై తెలుగుదేశం మాటేంటి?

ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ 6న విపక్ష వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పడం హాస్యాస్పదమని ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు 'బీబీసీ'తో అన్నారు.

బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పార్లమెంటు సాక్షిగా నిలదీయడంలో, కేంద్రంపై ఒత్తిడి పెంచడంలో తెలుగుదేశం పార్టీ సఫలమవడంతో ఉనికి కోసమే జగన్ ఈ డెడ్‌లైన్ ప్రకటించారని ఆయన అన్నారు.

ఇంతకుముందు కూడా ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేస్తామన్న ఆయన ఆ తరవాత ఆ ఊసే ఎత్తలేదని, ఇప్పుడు మళ్లీ తెలుగు దేశం పార్టీ దీనిపై గట్టిగా పోరాడుతుండడంతో ఈ డెడ్‌లైన్ పెట్టారని.. ముగిసిపోయిన పాత నాటకానికి జగన్ మళ్లీ మరోసారి కొత్తగా రంగు వేసుకుంటున్నారని అన్నారు.

మరోవైపు కేంద్రం ఇచ్చిన నిధులు, ఆ ఖర్చుల వివరాలు ఫిబ్రవరి 15లోగా చెప్పాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కోరిన విషయాన్ని 'బీబీసీ' ప్రస్తావించగా.. ''ఇంతవరకు జనసేన నుంచి ఎవరూ ఈ వివరాల కోసం సంప్రదించలేదు'' అన్నారు. వాస్తవాలేంటో రాష్ట్ర ప్రభుత్వమే ప్రజలకు వివరిస్తోందని, పోలవరం నిధుల వ్యయం వివరాలు కూడా జలవనరుల శాఖ వెబ్‌సైట్లో ఉన్నాయని ఆయన చెప్పారు.

ఇక కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విధించిన మార్చి 31 డెడ్‌లైన్ విషయంపై ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందంతా చేసిందని, ఇక నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు.

ఫొటో క్యాప్షన్,

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ ఆందోళన చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

‘హోదా’ ముగిసిన అధ్యాయం కాదు: వైసీపీ

ప్రత్యేక హోదా విషయంలో చిత్తశుద్ధితో పోరాడుతున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని ఆ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు 'బీబీసీ'తో అన్నారు.

తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నట్లు గతంలోనూ తాము ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేస్తామనడం వాస్తవమేనన్నారు. అయితే, తామేమీ గతంలో డెడ్‌లైన్లు పెట్టలేదని.. ఇప్పుడు చివరి బడ్జెట్ కావడంతో ఈ సమావేశాలు ముగిసేనాటికి ఎలాగైనా సాధించుకోవాలనే తపనతో ఇప్పుడు డెడ్‌లైన్ విధించి కేంద్రంపై మరింత ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు.

బడ్జెట్ సమావేశాల చివరి రోజైన ఏప్రిల్ 6 నాటికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ ఎంపీలు రాజీనామాలు చేయడం ఖాయమన్నారు.

ప్రత్యేక హోదా ఏమీ ముగిసిపోయిన అధ్యాయం కాదని, ప్రత్యేక ప్యాకేజీ ప్రతిపాదన వచ్చిన తరవాత కూడా సుజనా చౌదరి వంటి టీడీపీ నేతలు హోదా అంశాన్ని ప్రస్తావించిన దాఖలాలున్నాయని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.

మొత్తానికి ఈ మూడు గడువుల తరువాత పార్టీలు ఏం చేస్తాయో, నేతలు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)