ప్రెస్ రివ్యూ: ఆంధ్రప్రదేశ్‌లో కాపు కోటాకు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ అభ్యంతరం

  • 15 ఫిబ్రవరి 2018
విద్యార్థులతో కూడిన ప్రతీకాత్మక చిత్రం Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

కాపుల రిజర్వేషన్లకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) అభ్యంతరం వ్యక్తం చేసిందని 'ఈనాడు' తెలిపింది.

కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఒక బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపింది. దీనిపై కేంద్ర హోంశాఖ వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల అభిప్రాయాన్ని కోరింది. వాటిలో ఒకటైన డీవోపీటీ తాజాగా కేంద్ర హోంశాఖకు తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ లేఖ రాసింది. రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పును ఇందులో ప్రస్తావించింది.

''1992 నవంబరు 16న ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం- రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. ఒకవేళ అంతకుమించి కల్పించాలంటే అందుకు బలమైన ప్రాతిపదికగానీ, అసాధారణ పరిస్థితులుగానీ ఉండాలి. అయితే తాజా బిల్లు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అలాంటి బలమైన ప్రాతిపాదికలు ఏమిటో స్పష్టం చేయలేదు'' అని డీవోపీటీ లేఖలో చెప్పింది.

రిజర్వేషన్లనేవి ఆయా వర్గాలకు 'సముచిత రీతిలో' కల్పించాలే తప్ప జనాభా ప్రాతిపదికన కాదన్న రాజ్యాంగ నిబంధనను సుప్రీంకోర్టు ప్రస్తావించిన అంశాన్నీ డీవోపీటీ గుర్తుచేసిందని, ఈ నేపథ్యంలో కాపుల రిజర్వేషన్ల బిల్లుపై ఆమోదముద్ర వేయాల్సిన అవసరం లేదని హోం శాఖ రాష్ట్రపతికి సూచించొచ్చని అభిప్రాయపడిందని 'ఈనాడు' రాసింది.

ఇదే లేఖలో- ఓబీసీల్లో ఉపవర్గీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో ఒక కమిషన్‌ను నియమించిన విషయాన్ని డీవోపీటీ గుర్తు చేసింది. ఆ కమిషన్‌ ఓబీసీల ఉపవర్గీకరణ శాస్త్రీయంగా చేయటానికి అవసరమైన విధివిధానాలను, ఇతర ఏర్పాట్లను ఖరారు చేసే పనిలో ఉందని పేర్కొంది.

కాపుల రిజర్వేషన్‌కు సంబంధించిన ఈ లేఖలో 'ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం' అని ఉండాల్సిన చోట 'తెలంగాణ ప్రభుత్వం' అని అచ్చు కావటంతో కొంత గందరగోళం నెలకొంది.

తెలంగాణ ప్రభుత్వం గత ఏప్రిల్‌లో ముస్లిం రిజర్వేషన్లను 4 శాతం నుంచి 12 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచే బిల్లును శాసనసభలో ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. ఇంతవరకు దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి సమాచారం తెలంగాణ ప్రభుత్వానికి అందలేదు.

''ఏపీలో కాపు కోటాపై డీవోపీటీ లేఖ నేపథ్యంలో, తెలంగాణలో ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుదలకు సంబంధించి కేంద్రం ఆమోదంపైనా అనిశ్చితి నెలకొంది. ఈ లేఖలో రిజర్వేషన్లు 50 శాతానికి పెంచకూడదన్న సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించడం, రిజర్వేషన్లకు జనాభా ప్రాతిపదిక కాదని అభిప్రాయపడడంతో ఇవే అంశాలు తెలంగాణ విన్నపానికి కూడా విఘాతంగా మారొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి'' అని ఈనాడు పేర్కొంది.

తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు పరచడం.. ఆ రాష్ట్రాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూలులో చేర్చడం వంటి అంశాలను కూడా తాము కేంద్రానికి పంపిన లేఖలో వివరించామని తెలంగాణ అధికార వర్గాలు చెప్పాయి.

Image copyright EPA
చిత్రం శీర్షిక ట్రంప్

మా బైకులపై పన్ను వేస్తే, మీ బైకులపైనా వేస్తాం: ట్రంప్

అమెరికాకు చెందిన హార్లీ డేవిడ్‌సన్ బైకుల మీద భారత్ భారీగా పన్ను వేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారని 'నమస్తే తెలంగాణ' తెలిపింది. ''మీరు మా బైకులపై పన్నులు వేస్తే.. మా దేశానికి వచ్చే మీ బైకులపై మేమూ పన్నులు వేస్తాం'' అని ఆయన అన్నారని చెప్పింది.

బుధవారం అమెరికా కాంగ్రెస్ సభ్యులతో చర్చ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతో సంభాషణను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

''మోదీ మొన్న ఫోన్ చేసి మీ బైకులపై ఉన్న పన్నును 75 నుంచి 50 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. కానీ వాళ్ల బైకులపై మనం ఎంత పన్ను వేస్తున్నామో తెలుసా- సున్నా. అసలు పన్నే లేదు. ఇలాంటి దేశాలతో కఠినంగా ఉండాలి. ఇండియా కూడా ఈ జాబితాలో ఉండటం విచారకరం'' అని ట్రంప్ అన్నారని నమస్తే తెలంగాణ పేర్కొంది.

ఇంటింటికీ తెలంగాణ చరిత్ర పుస్తకాలు

తెలంగాణ చరిత్రను ప్రతి కుటుంబానికీ తెలియజేసేందుకు 'మన తెలంగాణ-మన చరిత్ర' పేరుతో ప్రత్యేక పుస్తకాన్ని రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి తెలిపారని 'ఆంధ్రజ్యోతి' పేర్కొంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఈ పుస్తకాన్ని తెస్తున్నామని ఆయన చెప్పారు.

ఉగాది పర్వదినం సందర్భంగా మార్చి 18 నుంచి ఈ పుస్తకాలను ఇంటింటికీ పంపిణీ చేస్తామని రమణాచారి తెలిపారు.

రెండున్నర కోట్ల పుస్తకాలను ముద్రిస్తున్నామని, ఇందులో తెలంగాణ భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలతోపాటు కవులు, కళాకారులు, రచనలు, రాజులు, రాజరికాలు, కోటలు, తెలంగాణ సామెతలు ఇలా అన్ని అంశాలనూ పొందుపరుస్తున్నట్లు ఆయన వివరించారు.

తెలంగాణలో జరిగే జాతీయ, అంతర్జాతీయ సమావేశాల్లోనూ తెలుగు వినిపించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

Image copyright Facebook/MaheshBabu
చిత్రం శీర్షిక మహేశ్ బాబు

మంజుల డైరెక్షన్ చేస్తుందని ఊహించలేదు: మహేశ్ బాబు

తన సోదరి మంజుల డైరెక్షన్‌ చేస్తుందని ఊహించలేదని ప్రముఖ నటుడు మహేశ్ బాబు ఆశ్చర్యం వ్యక్తంచేశారని 'సాక్షి' తెలిపింది.

''హాలిడేస్‌ సమయంలో మంజుల ఏదో రాసుకొంటుంటే కవిత రాస్తోందేమో అనుకున్నా, కానీ సినిమా కథ రాసుకుంటోందని అనుకోలేదు'' అని ఆయన చెప్పారు.

మంజుల దర్శకత్వం వహించిన 'మనసుకు నచ్చింది' సినిమాకు సంబంధించి బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

''మంజుల కథ ప్రిపేర్‌ చేసుకొని, సినిమా చేయబోతున్నానని చెప్పినప్పుడు షాక్‌ అయ్యా. ఒకరకంగా గర్వంగా ఫీలయ్యాను. భవిష్యత్తులో మా అక్క(మంజుల)తో సినిమా చేస్తానేమో'' అని మహేశ్ బాబు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)