వేధింపుల బాధితులు ‘వన్ స్టాప్’ కేంద్రాలకు వెళ్లాలి. అక్కడెవరూ లేకపోతే ఎక్కడికెళ్లాలి?

  • సర్వప్రియ సాంగ్వాన్
  • బీబీసీ ప్రతినిధి
బాధితురాలు, నిర్భయ, వన్ స్టాప్ సెంటర్

ఫొటో సోర్స్, Getty Images

''ఆమె చేయి ఫ్రాక్చర్ అయింది. భర్తను ఫోన్ చేసి పిలిపించాం. అతను వచ్చి, ఆమెను తిరిగి తీసుకెళ్లడానికి తాను సిద్దమేనని చెప్పాడు. ఆమెకు చికిత్స చేయించమని అతణ్ని హెచ్చరించాం. ఆమె ఎక్కడి నుంచి తప్పించుకు వచ్చిందో, తిరిగి అక్కడికే పంపించాం.''

హింసను ఎదుర్కొనే మహిళలకు సహాయం చేసేందుకు ఏర్పాటు చేసిన 'వన్ స్టాప్ సెంటర్‌’లో ఓ బాధితురాలికి ఎదురైన అనుభవం ఇది.

మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు మూడేళ్ల క్రితం ఈ 'వన్ స్టాప్ సెంటర్' పథకం ప్రారంభించింది. అయితే దీని గురించి చాలా కొద్ది మంది ప్రజలకే తెలుసు.

'వన్ స్టాప్ సెంటర్'ల లక్ష్యమేంటి?

నిర్భయ సంఘటన అనంతరం కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం లక్ష్యం హింసకు గురైన బాధితులకు అన్ని రకాల సహాయాన్ని ఒకే చోట అందించడం.

గృహహింస, అత్యాచారం, మానవ అక్రమ రవాణా, యాసిడ్ దాడులులాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇక్కడ ఎఫ్‌ఐఆర్, వైద్యం, న్యాయసహాయం, కౌన్సెలింగ్ లాంటి సహాయం అందిస్తారు. అవసరమైతే బాధితులు అక్కడే ఉండేందుకు ఏర్పాటు కూడా చేశారు.

దేశవ్యాప్తంగా 166 జిల్లాలలో వీటిని ప్రారంభించారు. కానీ దురదృష్టవశాత్తూ చాలా మంది మహిళలకు వీటి గురించి ఏమీ తెలియదు.

అదే సమయంలో ఈ కేంద్రాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి.

మహిళా, శిశు సంక్షేమ శాఖ

ఫొటో సోర్స్, Govt. of India

కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఇలాంటి కేంద్రాల గురించి సమాచారాన్ని బీబీసీ సేకరించింది. వాటిని పరిశీలించింది. అవి నిజంగా బాధిత మహిళలకు ఉపయోగపడుతున్నాయా?

హిసార్‌లోని వన్ స్టాప్ సెంటర్‌లో బాధితులకు ఎలాంటి సాయం అందుతుందో పరిశీలించగా, ''హోటల్ నుంచి ఆహారం తెప్పించి బాధితులకు అందిస్తుంటాం'' అని వెల్లడించారు నిర్వాహకులు.

'మల్టీ పర్పస్ స్టాఫ్'గా పని చేస్తున్న యువకుణ్ని ప్రశ్నించగా, తనకు ఎక్కువగా తెలీదని అతను బదులిచ్చాడు.

''బాధితులంతా రాత్రిళ్లు వస్తుంటారు. అయితే రాత్రి నేను అక్కడ ఉండను'' అని తెలిపాడు.

ఒక మహిళా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉన్న ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌లోని ఒక గదిని 'వన్ స్టాప్ సెంటర్'గా మార్చారు.

ఆ గదిలో రెండు కుర్చీలు, రెండు టేబుల్స్ ఉన్నాయి. నాలుగైదు పరుపులున్నాయి. వాటిలో ఒకదానిపై వైద్య సిబ్బందికి చెందిన ఓ మహిళ నిద్ర పోతోంది.

మార్గదర్శకాల ప్రకారం, అక్కడో అడ్మినిస్ట్రేటర్ ఉండాలి. కానీ ఆమె అక్కడ లేరు.

మేనకా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images/MONEY SHARMA

ఫొటో క్యాప్షన్,

మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ (మధ్య)

వన్ స్టాప్ సెంటర్‌లో పనులు చేయడానికి ఇద్దరు సిబ్బంది (మల్టీపర్పస్ స్టాఫ్)ని నియమించారు.

అడ్మినిస్ట్రేటర్ సునీతా యాదవ్‌తో ఫోన్‌లో మాట్లాడినపుడు, తను రెడ్ క్రాస్ ఆఫీస్‌లో ఉన్నట్లు చెప్పారు.

నిజానికి ఆమె అలాంటి మూడు కేంద్రాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అందువల్ల ఒకేసారి అన్ని చోట్లా ఉండడం సాధ్యం కాదు.

రెడ్ క్రాస్ ఆఫీస్ వద్ద ఆమెను కలవగా, ''ఇక్కడ సుశిక్షితులైన సిబ్బంది లేరు. అందువల్ల అంతా మేమే చూసుకోవాలి. మా వద్ద కేవలం ఒకే ఒక మహిళా సిబ్బంది ఉన్నారు. ఆమెను పగలు డ్యూటీకి రమ్మని కోరితే, మరి రాత్రిళ్లు ఎవరు ఉంటారు? ఎవరైనా బాధితురాలు రాత్రిళ్లు వస్తే, ఆమె బాధ్యతను ఎవరికి అప్పగించాలి. మా వద్ద కేస్ వర్కర్ కానీ, కౌన్సెలర్ కానీ, పారా లీగల్ కానీ, పారా మెడికల్ కానీ ఎవరూ లేరు'' అని తెలిపారు.

పేరుకు ఆ కేంద్రం డిసెంబర్ 30, 2016న ప్రారంభమైంది కానీ, ఇప్పటివరకు అక్కడ కేవలం 39 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

వాటిలో ఎక్కువగా గృహ హింస, కుటుంబ కలహాల కేసులే ఉన్నాయి.

ఈ వన్ స్టాప్ సెంటర్ నగరం శివార్లలో ఉన్నందువల్ల, బాధితులు ఇక్కడికి రావడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు.

పూనమ్, వన్ స్టాప్ సెంటర్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,

బీబీసీని తన అనుభవాన్ని వివరించిన పూనమ్

ఇదా కేసులను పరిష్కరించే పద్ధతి?

హిసార్‌లోని 'ప్రగతి లీగల్ ఎయిడ్ సెంటర్' అన్న స్వచ్ఛంద సంస్థ చాలా చురుకుగా పని చేస్తోంది.

ఈ సంస్థకు సహకారం అందిస్తున్న నీలమ్ భుటానీ అనే న్యాయవాది, ఈ వన్ స్టాప్ సెంటర్లు దళారులు, మధ్యవర్తులు చేసే పని చేస్తున్నాయని, నిజానికి వాటి లక్ష్యం అది కాదని అభిప్రాయపడ్డారు.

ప్రగతి లీగల్ ఎయిడ్ సెంటర్ వద్ద మేం గృహహింస బాధితురాలు పూనమ్‌ను కలిసాం. తను గత మూడు రోజులుగా సరసుధ్ గ్రామం నుంచి హిసార్ మహిళా పోలీస్ స్టేషన్‌కు వస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

35 ఏళ్ల పూనమ్‌కు 2002లో వివాహమైంది. ఆమెకు ఇద్దరు కూతుళ్లున్నారు.

గృహహింస కారణంగా తను తన కూతుళ్లతో కలిసి చాలా ఏళ్లుగా తన తల్లిదండ్రుల వద్దే ఉంటున్నట్లు ఆమె వెల్లడించారు.

''ఏడాది క్రితం నేను మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. నేను కోర్టుకు వెళ్లాలని వాళ్లు సూచించారు. ఇప్పుడు నేను మూడు రోజులుగా అక్కడికి వెళుతున్నా పట్టించుకునేవారు లేరు'' అన్నారామె.

ఆ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే ఉన్న వన్ స్టాప్ సెంటర్ గురించి ఆమెకు తెలీదా?

దాని గురించి తనకేమీ తెలీదని, ఎవరూ చెప్పలేదని ఆమె సమాధానం ఇచ్చారు.

ప్రగతి లీగల్ ఎయిడ్ సెంటర్‌లో పని చేసే శకుంతల జాఖడ్ మాట్లాడుతూ, "నిరక్షరాస్యులకు, పేదలకు న్యాయం జరగడం చాలా కష్టం" అని అన్నారు.

''పోలీసులూ, అధికారుల్లో నిర్లిప్తత కారణంగా ఇలాంటి పథకాలు నీరు గారుతున్నాయి. వాటి గురించి సరైన ప్రచారమే చేయనపుడు మహిళలకు ఎలా తెలుస్తుంది?'' అని ప్రశ్నించారు శకుంతల.

హిసార్ వన్ స్టాప్ సెంటర్

అలంకారప్రాయంగా వన్ స్టాప్ సెంటర్లు

మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఉన్న కేంద్రం పరిస్థితి కూడా హిసార్ కన్నా భిన్నంగా ఏమీ లేదు.

సాగర్‌లో ఆ కేంద్రాన్ని నిర్వహిస్తున్న రాజేశ్వరీ శ్రీవాస్తవను బాధితులకు ఎలా సాయం చేస్తారని ప్రశ్నించగా, ''ఒక యువతి ఇంటి నుంచి బయటకు వచ్చేసి తన బంధువుల వద్ద ఉంటోంది. తనకు మెయింటెనెన్స్ కావాలని ఆమె మా వద్దకు వచ్చింది. మేం ఆమె భర్తను పిలవగా, అతను వచ్చి భార్యను తీసుకెళ్లడానికి సిద్ధమని తెలిపాడు. ఆమె తన భర్త ఇంట్లోనే ఉండి, పిల్లల బాగోగులు చూసుకోవాలని మేం సలహా ఇచ్చాం'' అని ఆమె జవాబిచ్చారు.

కొడుకు పుట్టలేదని వేధింపులు ఎదుర్కొంటున్న నలుగురు కూతుళ్లు ఉన్న తల్లికి చట్టపరమైన, వైద్యపరమైన సహాయం, కౌన్సెలింగ్ ఇవ్వాల్సి ఉండగా, వెళ్లి అత్తగారింట్లోనే ఉండాలని ఆమెకు సలహా ఇవ్వడం ఏ మేరకు న్యాయం?

సాగర్‌లోని వన్ స్టాప్ సెంటర్
ఫొటో క్యాప్షన్,

సాగర్‌లోని వన్ స్టాప్ సెంటర్

సాగర్‌లోని వన్ స్టాప్ సెంటర్‌కు ఉన్న మూడు గదుల్లో రెండింటికి తాళం వేశారు. మిగిలిన గది రాజేశ్వరి తన కార్యాలయంగా మార్చుకున్నారు.

మహిళలకు ఈ కేంద్రం గురించి తెలియజేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించగా - 'శౌర్య దళ్', మధ్యప్రదేశ్ ప్రభుత్వ అంగన్ వాడీ కార్యకర్తలకు బాధితులను ఇక్కడికి తీసుకురమ్మని చెప్పామని అన్నారు.

నేను దీని గురించి సాగర్‌లోని మకరోనియా ప్రాంతానికి చెందిన అంగన్ వాడీ కార్యకర్తతో సంభాషించాను.

ఆమె తనకు వన్ స్టాప్ సెంటర్ గురించి కానీ, సఖి కేంద్రం గురించి తెలీదని సమాధానం ఇచ్చింది. కేవలం ఎవరైనా బాధితులను ప్రాజెక్ట్ ఆఫీసుకు తీసుకురమ్మని ఆమెకు సూచనలు ఇచ్చారంతే.

ఒకవేళ ఎవరైనా బాధితురాలు తిరిగి తన ఇంటికి వెళ్లకూడదు అనుకుంటే ఏం చేస్తున్నారు? అలాంటి సందర్భంలో వాళ్ల ఏర్పాట్లేవో వాళ్లే చేసుకోవాలని అంగన్‌వాడీ కార్యకర్త సమాధానం ఇచ్చింది.

అంగన్‌వాడీ కార్యకర్తలు మహిళా, శిశు సంక్షేమ శాఖ కిందికి వస్తారు. అంటే ఆ శాఖ తన పథకాల కోసం తన సిబ్బంది సేవలనే వినియోగించుకోలేని స్థితిలో ఉందన్న మాట.

గృహ హింస బాధితురాలు సావిత్రి
ఫొటో క్యాప్షన్,

గృహ హింస బాధితురాలు సావిత్రి

సాగర్‌కు చెందిన సావిత్రి సేన్ 2013 నుంచి గృహహింసను ఎదుర్కొంటున్నారు.

''ఇప్పటివరకు నాకు ఎలాంటి సాయమూ అందలేదు. నా భర్త నన్ను తీవ్రంగా కొట్టినపుడు, నేను ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళితే, రాత్రి 10.30 వరకు వేచి ఉండాల్సి వచ్చింది. నా భర్త కొట్టడంతో నా బిడ్డ కడుపులోనే మరణించింది. ఆ మరుసటి రోజు ఒక లాయర్ సాయంతో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు'' అని తెలిపారు సావిత్రి.

తనకు సఖి కేంద్రం గురించి తెలీదు కానీ ఇటీవలే తాను రాజేశ్వరితో మాట్లాడినట్లు ఆమె చెప్పారు.

సావిత్రి గత 3-4 రోజుల నుంచి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా, రాజేశ్వరీ మాత్రం ఫోన్ ఎత్తడం లేదు.

బీబీసీ సిబ్బందిని చూడడంతో సావిత్రికి కొంచెం ధైర్యం వచ్చింది. ఆమె దగ్గరలో ఉన్న మరికొంత మంది బాధితులను కూడగట్టేందుకు ప్రయత్నించారు. కానీ మేం ఏం చేయగలం? ప్రభుత్వం ఆ బాధ్యతను మరొకరికి అప్పగించిందాయె.

అత్యాచారం, నిర్భయ, వన్ స్టాప్ సెంటర్

ఫొటో సోర్స్, Getty Images

సమాధానం ఇవ్వని మంత్రిత్వ శాఖ

కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్ సైట్ ప్రకారం వన్ స్టాప్ సెంటర్ పథకాన్ని 2015లో ప్రారంభించారు. దీని వార్షిక బడ్జెట్ రూ.18 కోట్లు.

2016-17లో దీనికి 75 కోట్లు కేటాయిస్తే, 2018-19లో 105 కోట్లు కేటాయించారు.

అయితే క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోవడానికి మేం ఫిబ్రవరి 5న ఆ శాఖకు ఈ రెండు కేంద్రాలకు ఎంత బడ్జెట్‌ను కేటాయించారు, ఇంకా ఎంత మిగిలింది అన్న వివరాలు తెలపాలని ఈమెయిల్ పెట్టాం. కానీ ఈ వార్త ప్రచురితమయ్యే నాటికి ఇంకా దానికి సమాధానం రాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)