పీఎన్‌బీ కుంభకోణం: మోదీజీ.. ఈ ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పండి

మోదీతో భారతీయ ప్రతినిధుల బృందం
ఫొటో క్యాప్షన్,

దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో మోదీతో భారతీయ ప్రతినిధుల బృందం - చిత్రంలో నీరవ్ మోదీ కూడా ఉన్నారు

పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగు చూసిన రూ.11,500 కోట్ల కుంభకోణం దేశంలో రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈ ఉదంతంపై ఫిర్యాదు చేసిన అనంతరం వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన ఆస్తులపై అధికారులు దాడులు నిర్వహించారు.

ఈ నేపథ్యంలో దిల్లీలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో కాంగ్రెస్ తరఫున ప్రధానికి ఆయన 5 ప్రశ్నలు సంధించారు. అవేంటంటే...

1. నీరవ్ మోదీ దావోస్‌లో ప్రధాన మంత్రి మోదీతో కలిసి ఏం చేస్తున్నారు?

2. ప్రధాని కళ్ల ముందే అంత పెద్ద బ్యాంకు లూటీకి గురైంది. దానికి ఎవరు బాధ్యులు?

3. ప్రధానికి ఈ విషయంపై గత జూలైలోనే సమాచారం అందింది. మరెందుకు ఎవరిపైనా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు?

ఫొటో క్యాప్షన్,

నీరవ్ మోదీ, మోదీ

4. మొత్తం వ్యవస్థంతా ఎలా మోసపోయింది? ప్రతి ఆడిటర్, ప్రతి అధికారి కళ్ల ముందు నుంచి వేల కోట్ల రూపాయలు ఎలా దారిమళ్లాయి? దీన్ని బట్టి చూస్తే ఎవరో ఒక పెద్ద మనిషి అండ ఈ కుంభకోణం వెనక ఉందని అర్థమవుతోంది. మోదీజీ.. ఎవరా వ్యక్తి?

5. దేశానికి చెందిన మొత్తం బ్యాంకింగ్ రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ, మోసాల్ని అరికట్టే వ్యవస్థ అలా ఎలా విఫలమైంది? మోదీజీ... సమాధానం చెప్పండి.

పోస్ట్‌ Twitter స్కిప్ చేయండి, 1

పోస్ట్ of Twitter ముగిసింది, 1

మరో పక్క తమకు జనవరి మూడో వారంలో ఈ మోసం గురించి తెలిసిందనీ, బ్యాంకుకు చెందిన ఇద్దరు ఉద్యోగులు కొన్ని అనుమానస్పద లావాదేవీలు జరిపారనీ, వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామనీ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎండీ సునీల్ మెహతా అన్నారు.

పీఎన్‌బీ ఇప్పటికే అనేక అక్రమ లావాదేవీల ఆరోపణలు ఎదుర్కొంటోంది.

గతవారం వ్యాపారవేత్త నీరవ్ మోదీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

నీరవ్ మోదీ, ఆయన బంధువులు కలిసి రూ.280 కోట్ల మేర మోసం చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.

బ్యాంకు సిబ్బంది సహాయంతోనే నీరవ్ మోదీ ఈ అక్రమాలకు పాల్పడినట్లు బ్యాంకు చెబుతోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)