పంజాబ్ నేషనల్ బ్యాంకు: 11,360 కోట్ల కుంభకోణం అసలెలా జరిగింది!

నీరవ్ మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ముంబయిలోని బ్రీచ్‌క్యాండీలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖలో రూ.11,360 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆ బ్యాంకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

భారత్‌లో అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) ఈ కుంభకోణంలో భాగస్వాములైన వారి పేర్లను ఇంకా వెల్లడించలేదు.

అయితే, "ఈ కుంభకోణంలో ఉద్యోగులు, ఖాతాదారులు కుమ్మక్కయ్యారు" అని మాత్రం బ్యాంకు అంగీకరించింది.

ఈ కేసుకు సంబంధించి బ్యాంకు ఎండీ సునీల్ మెహతా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, "ఈ కుంభకోణం 2011 నుంచే సాగుతోంది. కానీ ఈ ఏడాది జనవరి 3న మాత్రమే ఇది మా దృష్టికి వచ్చింది. సంబంధిత ఏజెన్సీలకు దీనికి సంబంధించిన వివరాలు అందించాం" అని తెలిపారు.

ఈ కుంభకోణం 2011 నుంచి 2018 వరకు కొనసాగింది. ఈ ఏడేళ్లలో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. ఈ కుంభకోణంలో పేరు మోసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పేరు వినిపిస్తోంది.

"ఆడిటర్‌లు, పర్యవేక్షకుల కళ్లు గప్పి వేల కోట్ల రూపాయల కుంభకోణం అసలు ఎలా జరిగింది? ఎవరైనా ఒక పెద్ద మనిషి అండదండలు ఉండడం వల్లే ఇంత పెద్ద కుంభకోణం జరిగిందని అర్థం కావడం లేదా?" అని కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించింది.

ఈ ప్రశ్నకు సమాధానం కనగొనేందుకు బీబీసీ ప్రతినిధి మోహన్‌లాల్ శర్మ బ్యాంక్ ఆఫ్ బరోడా రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్‌కే బక్షీతో మాట్లాడారు. ఇంత పెద్ద కుంభకోణం ఎలా జరిగి ఉండొచ్చని ఆయనను ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE/AFP/Getty Images

ఆర్‌కే బక్షీ అభిప్రాయం ఇదీ...

పీఎన్‌బీ కుంభకోణంలో మౌలికమైంది లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌ఓయూ). దీనిని బ్యాంకుల్లో సర్వసాధారణంగా ఉపయోగిస్తుంటారు.

బయటి దేశాల నుంచి భారతదేశానికి వస్తువులను దిగుమతి చేసుకునే వారు, సంబంధిత ఎగుమతిదారులకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

అయితే వారికి చెల్లించడానికి దిగుమతిదారు వద్ద డబ్బు లేనట్టయితే లేదా మరే కారణంవల్లనైనా క్రెడిట్ పీరియడ్ లేదా ఉద్దెర వ్యవధి ప్రయోజనం పొందాలని అనుకుంటే బ్యాంకు ఆ దిగుమతిదారు కోసం విదేశంలో ఉన్న ఏదైనా బ్యాంకుకు లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్ఓయూ) ఇస్తుంది.

సంబంధిత ఎగుమతిదారు నుంచి దిగుమతి చేసుకున్న ఆయా వస్తువులకు గాను నిర్దేశిత మొత్తం చెల్లించాలని ఈ ఎల్ఓయూలో రాసి ఉంటుంది.

దాని ప్రకారం సదరు వ్యాపారి తరఫున ఆ బ్యాంకు ఒక ఏడాది తర్వాత (నిర్ణీత తేదీన) సదరు విదేశీ బ్యాంకుకు వడ్డీతో సహా డబ్బు చెల్లిస్తానని ఆ ఎల్ఓయూలో హామీ ఇస్తుంది.

ఇందులో కొత్తేమీ లేదు. సాధారణంగా బ్యాంకుల్లో ఇలాగే జరుగుతుంది. ఈ ప్రాతిపదికనే బ్యాంకుల్లో క్రెడిట్ వ్యవహారాలు నడుస్తుంటాయి. ఇది చాలా కీలకమైంది కూడా.

పీఎన్‌బీ ఒకవేళ ఏదైనా విదేశీ బ్యాంకుకు ఎల్ఓయూ ఇచ్చినట్టయితే, సదరు విదేశీ బ్యాంకు పీఎన్‌బీ గ్యారంటీ ఆధారంగా ఎగుమతిదారుకు నిర్ణీత మొత్తం చెల్లించేస్తుంది.

ఏడాది తర్వాత దిగుమతిదారు పీఎన్‌బీకి ఆ డబ్బు చెల్లిస్తాడు. ఆ తర్వాత పీఎన్‌బీ ఆ విదేశీ బ్యాంకుకు వడ్డీ సహా నిర్ణయించిన మొత్తం చెల్లిస్తుంది.

అయితే ఇక్కడ జరిగిందేంటి?

ఈ కేసులో జరిగిందేంటంటే, ఎల్ఓ‌యూను బ్యాంకు జారీ చేయలేదు. బ్యాంకుకు చెందిన ఇద్దరు ఉద్యోగులు నకిలీ ఎల్ఓయూలు తయారు చేసి ఇచ్చారు.

స్విఫ్ట్ సిస్టమ్ కంట్రోల్ ఈ ఉద్యోగుల వద్ద ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకులను పరస్పరం జోడించే అంతర్జాతీయ కమ్యూనికేషన్ సిస్టమ్.

అత్యున్నత సాంకేతికతను ఉపయోగిస్తూ పంపించే కోడ్స్ ద్వారా ఈ స్విఫ్ట్ సిస్టమ్‌లో సందేశాలు వెళ్తుంటాయి. ఎల్ఓయూ పంపించడం, తెరవడం, వాటిలో మార్పులు చేయడం వంటి పనులన్నీ ఈ సిస్టమ్ ద్వారానే జరుగుతాయి.

అందుకే ఈ సిస్టమ్ ద్వారా ఏదైనా బ్యాంకుకు సందేశం అందినప్పుడు, ఆ బ్యాంకు దీనిని అధికారికమైన, కచ్చితమైన సందేశంగా భావిస్తుంది. దీనిని అనుమానించదు.

అయితే ఈ సిస్టమ్‌ను నడిపించేది కూడా మనుషులే. పీఎన్‌బీలో ఈ పని చేయడానికి ఇద్దరు వ్యక్తులున్నారు - ఇందులో డేటాను లోడ్ చేసే క్లర్క్ ఒకరు కాగా, సమాచారాన్ని అధికారికంగా ధ్రువీకరించే అధికారి మరొకరు.

బహుశా ఈ ఇద్దరూ అయిదారేళ్లుగా ఇదే విభాగంలో పనిచేస్తున్నట్లుగా అనిపిస్తోంది. నిజానికి ఇలా జరగకూడదు, ఈ హోదాలో పని చేసే ఉద్యోగులను ఎప్పటికప్పుడు మారుస్తుండాలి.

వీరు ప్రలోభానికి గురై ఉంటారు. అందుకే వీరు నీరవ్ మోదీ చెప్పినందుకో లేదా ఆయన కంపెనీ చెప్పిన ప్రకారమో లేదా వారి ప్రలోభాలకు లోనవడం వల్లనో నకిలీ ఎల్ఓయూలు జారీ చేశారు.

అవి స్విఫ్ట్ సిస్టమ్ ద్వారానే జారీ అయ్యాయి కాబట్టి అవి ఒరిజినల్ పత్రాలే. కానీ వాటి వెనుక బ్యాంకుల పత్రాలేవీ లేవు.

అంటే, దీనితో పాటుగా బ్యాంకు సదరు వ్యాపారికి లిమిట్ ఏదీ ఇవ్వలేదు. స్విఫ్ట్ సిస్టమ్ ద్వారా పంపించే వ్యక్తికి ఆ బ్రాంచ్ మేనేజర్ తన సంతకంతో ఒక పత్రాన్ని పంపించాల్సి ఉంటుంది. అది కూడా ఏదీ లేకుండానే స్విఫ్ట్ సిస్టమ్ ద్వారా సందేశాలు వెళ్లాయి.

ఫొటో సోర్స్, PUNIT PARANJPE/AFP/Getty Images

ఫొటో క్యాప్షన్,

నీరవ్ మోదీ కంపెనీ యాడ్‌లో ప్రియాంకా చోప్రా

మరో లోపం

పీఎన్‌బీలో జరిగిన మరో లోపం ఏంటంటే, పంపించిన సందేశాలు ధ్రువీకరించినవిగా అనిపించదు. అంటే స్విఫ్ట్ సిస్టమ్‌తో కోర్ బ్యాంకింగ్ జోడించినట్టుగా లేదు.

మొదట ఎల్ఓయూని కోర్ బ్యాంకింగ్‌లో రూపొందిస్తారు. ఆ తర్వాతే దాన్ని స్విఫ్ట్ సందేశం ద్వారా పంపిస్తారు. దీని ఫలితంగా కోర్ బ్యాంకింగ్‌లో ఒక కాంట్రా ఎంట్రీ నమోదవుతుంది. ఫలానా రోజున, ఫలానా మొత్తం రుణంగా ఇవ్వడానికి ఆమోదించినట్టుగా అందులో ఉంటుంది.

కాబట్టి మరుసటి రోజున బ్యాంక్ మేనేజర్ తన ఫైల్స్, అంటే బ్యాలెన్స్ షీట్‌ను చూసినప్పుడు క్రితం రోజున బ్యాంకు ఎంత మొత్తం రుణాలకు ఆమోదం తెలిపిందనే వివరాలు తెలుస్తాయి.

కానీ పీఎన్‌బీలో స్విఫ్ట్ సిస్టామ్‌కు కోర్ బ్యాంకింగ్‌తో సంబంధం లేదనేది స్పష్టం. వారిద్దరూ నకిలీ సందేశాలను స్విఫ్ట్ ద్వారా పంపించారు. ఆ సందేశాలను కూడా మాయం చేశారు. కోర్ బ్యాంకింగ్‌లో ఎంట్రీ కాలేదు కాబట్టి దానికి గురించి ఎవరికీ తెలియను కూడా తెలియలేదు.

ఫొటో సోర్స్, Jamie McCarthy/Getty Images

ఫొటో క్యాప్షన్,

అమెరికాలో తన బూటిక్ ప్రారంభోత్సవం సందర్భంగా బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్‌తో నీరవ్ మోదీ

బ్యాంక్ వ్యవస్థనంతా ఎలా బైపాస్ చేశారు?

ఎవరైనా దొంగతనానికి పాల్పడి ఎలాంటి చిహ్నాలను గానీ, సాక్ష్యాలను గానీ లేకుండా చేసినప్పుడు దొంగను పట్టుకోవడం చాలా కష్టం. అసలు ఎవరికీ అనుమానమే రానప్పుడు ఇంకా కష్టం.

ఎవరికైనా అనుమానాలు కలిగితేనే వ్యవహారంపై విచారణ జరుగుతుంది. కానీ ఇక్కడ అసలు ఎవరికీ అనుమానాలే కలుగలేదు. వారు ఒక బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేస్తూ వేరే వాళ్లకు చెల్లిస్తూ వచ్చారు.

నేడు 5 కోట్లకు ఎల్ఓయూలు తెరిచారు. మరుసటి సంవత్సరం వాటిని చెల్లించాల్సిన సమయం వచ్చే సరికి వారు మరో 10 కోట్లకు ఎల్ఓయూలు జారీ చేశారు.

దీంతో వాళ్లు ముందు తీసుకున్న 5 కోట్ల రుణం చెల్లించారు. మరో బ్యాంకులో తదుపరి రుణం తీసుకున్నారు. ఇలా ఈ వ్యవహారం నెలల పాటు కొనసాగుతూ వచ్చింది.

అందుకే రుణాల మొత్తం ఏటా పెరుగుతూ పోయింది.

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE/AFP/Getty Images

ఫొటో క్యాప్షన్,

నీరవ్ మోదీ కంపెనీ యాడ్

ఇలా చేస్తే కుంభకోణం గుట్టు ముందే రట్టయ్యేదా?

పీఎన్‌బీలో ప్రతి ట్రాన్సాక్షన్ ఎంట్రీ కేవలం ఒకే ఒక్క చోట నమోదై ఉంది - అదే స్విఫ్ట్ సిస్టమ్. అయితే అందులోంచి ఈ సందేశం అప్పటికే జారీ అయ్యింది.

కానీ ప్రతి బ్యాంకులోనూ ప్రతి స్విఫ్ట్ ట్రాన్సాక్షన్‌కు (వెళ్లినవీ, వచ్చినవీ రెండు రకాలవీ) సంబంధించిన ఓ కాపీని దానికి సంబంధించిన ఇతర పత్రాలతో కలిపి ఫైల్‌లో పెడుతారు.

అంతే కాదు, బ్యాంకు స్విఫ్ట్ సిస్టమ్ నుంచి ఒక రోజులో ఎన్ని సందేశాలు వెళ్లాయి అనేది కూడా లాగ్‌లో నమోదై ఉంటుంది. ప్రతి సిస్టమ్‌ ఇలాంటి లాగ్ రిపోర్టును రూపొందిస్తుంది.

బహుశా పీఎన్‌బీ సిస్టమ్‌లో రెండు లోపాలున్నట్టున్నాయి.

మొదటిది ఇది కోర్ బ్యాంకింగ్‌తో జోడించిలేకపోవడం. రెండోది, ప్రతి రోజూ పనులు పూర్తి కాగానే ఎవరైనా ఒక అధికారి పొద్దంతా జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏమేం ఉన్నాయో చూడాల్సి ఉంటుంది. ఈ లావాదేవీలకు ఆమోదం ఉందా లేదా కూడా తనిఖీ చేయాలి. కానీ పీఎన్‌బీలో ఇది కూడా జరిగినట్టు లేదు.

ఫొటో సోర్స్, WORLD ECONOMIC FORUM

ఫొటో క్యాప్షన్,

2018 ఫిబ్రవరిలో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు భారతీయ ప్రతినిధివర్గం... వీరిలో నీరవ్ మోదీ కనిపిస్తారు.

స్విఫ్ట్ సిస్టమ్ కోర్ బ్యాంకింగ్‌తో జోడించకున్నా, కనీసం ప్రతి రోజూ లాగ్ తనిఖీ పద్ధతిని అనుసరించి ఉంటే ఈ కుంభకోణం మొట్టమొదటి రోజునే బట్టబయలయ్యేది.

ఇక ఎదుటి బ్యాంకు విషయానికొస్తే, భారతీయ బ్యాంకు పంపించిన సందేశం స్విఫ్ట్ సిస్టమ్ ద్వారా అందింది కాబట్టి అనుమానించే ప్రశ్నే తలెత్తదు. కోరినంత డబ్బు ఎగుమతిదారుకు ఇచ్చేస్తుంది.

భారతీయ బ్యాంకు ఇచ్చిన గ్యారంటీ మేరకు విదేశీ బ్యాంకు డబ్బు చెల్లిస్తుంది. తిరిగి ఆ డబ్బు కోసం నిర్ణీత తేదీ వరకు నిరీక్షిస్తుంది. డబ్బులు వచ్చేస్తే సమస్య లేదు. ఒకవేళ దానికి డబ్బులు ముట్టకపోతేనే అది భారతీయ బ్యాంకును సంప్రదిస్తుంది.

దీనర్థం ఏంటంటే, కొన్ని సంవత్సరాలు పాటు డబ్బులు తిరిగి చెల్లించాల్సిన రోజున లేదా అంతకన్నా ఒకటి, రెండు రోజుల ముందే చెల్లింపులు జరిగి ఉండొచ్చు. అందుకే ఇందులో కుంభకోణం జరుగుతోందనే అనుమానం గానీ, దాన్ని ఛేదించే ప్రయత్నం గానీ జరగలేదు.

ఫొటో సోర్స్, REUTERS/Adnan Abidi

పీఎన్‌బీపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

ఇప్పటి వరకు జరిగిన ట్రాన్సాక్షన్లకు సంబంధించి బ్యాంకు వద్ద ఎలాంటి సెక్యూరిటీ (బ్యాంకు రక్షణ) లేదన్నది స్పష్టం. ఎందుకంటే ఇందులో పీఎన్‌బీ భాగస్వామ్యం లేదు కాబట్టి.

అత్యంత సున్నితమైన సిస్టమ్ తాళంచెవులు కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులు అనధికారికంగానే ఈ లావాదేవీలు నడిపారు.

ఈ కుంభకోణానికి పాల్పడ్డ కంపెనీల ఆస్తులను మన ఏజెన్సీలు స్వాధీనం చేసుకోవచ్చు. వాటి నుంచి ఏ మేరకు వసూలు చేయగలిగితే ఆ మేరకు మాత్రమే పీఎన్‌బీకి అందే అవకాశం ఉంది.

నీరవ్ మోదీ ఓ లేఖ రాశారనీ, తాను ఐదారు వేల కోట్ల రూపాయలు చెల్లించడానికి సిద్ధమేనని ఆ లేఖలో తెలిపారని అంటున్నారు.

కానీ అతనికి అలాంటి ఉద్దేశమే ఉన్నట్టయితే, అసలు ఇలాంటి పనికి ఎందుకు ఒడిగడతాడు? ఆయన మామూలు పద్ధతుల్లోనే తన లావాదేవీలు జరుపుకోవాలి కదా.

ఆయన చాలా పెద్ద వ్యాపారి. ఓ గ్లోబల్ సిటిజన్. ఆయన ఆస్తులు ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. వాటిని వెతికి పట్టుకోవడం, వాటి ద్వారా డబ్బు రాబట్టడం చాలా కష్టమైన పని.

ఏదో మేరకు వసూలైతే మంచిదే. వసూలు కానిదంతా ఆ తర్వాత ఎన్‌పీఏ (నాన్ పర్‌ఫార్మింగ్ అసెట్ - నిరర్థక ఆస్తులు)గా మారిపోతుంది. సూటిగా చెప్పాలంటే బ్యాంకుకు నష్టం జరగక తప్పదు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

నీరవ్ మోదీ, ఆయన భాగస్వాములపై సీబీఐకి జనవరి 31న తొలిసారి ఫిర్యాదు చేసింది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం- 10 కీలకాంశాలు

  • సుమారు రూ.280 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ పీఎన్‌బీ - వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన భాగస్వాములపై సీబీఐకి జనవరి 31న తొలిసారి ఫిర్యాదు చేసింది.
  • వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన భార్య, సోదరుడు, వ్యాపార భాగస్వామి కలిసి నేరపూరిత కుట్ర పన్నినట్లు సీబీఐ కేసు నమోదు చేసింది.
  • అంతర్గత విచారణ అనంతరం బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో జరిగిన కుట్రపూరిత లావాదేవీలను ఫిబ్రవరి 14న పీఎన్‌బీ వెల్లడించింది.
  • పీఎన్‌బీ ఇతర బ్యాంకులను హెచ్చరిస్తూ లేఖ రాసింది. దానిలో కుంభకోణం జరిగిన తీరును వివరించింది. మొత్తం కుంభకోణం రూ.11 వేల కోట్ల మేర ఉండవచ్చని లేఖలో పేర్కొంది.
  • మోదీ, ఓ జ్యువెలరీ కంపెనీపై పీఎన్‌బీ మరోసారి సీబీఐకి రెండు ఫిర్యాదులు చేసింది.
  • ఫిబ్రవరి 15న ముంబై, సూరత్, దిల్లీలలో నీరవ్ మోదీకి చెందిన అనేక కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేసింది.
  • తమ జవాబుదారీ ప్రకారం ఇతర బ్యాంకులకు బకాయిలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు పీఎన్‌బీ ఎండీ తెలిపారు. తీసుకున్న రుణాలలో కొంత భాగాన్ని తిరిగి చెల్లించేందుకు నీరవ్ మోదీ పీఎన్‌బీతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.
  • భారతీయ పాస్‌పోర్ట్ కలిగిన నీరవ్ మోదీ, బెల్జియం పౌరుడైన ఆయన సోదరుడు నిషాల్ జనవరి 1న దేశాన్ని వదిలి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అమెరికా పౌరురాలు అయిన ఆయన భార్య జనవరి 6న భారతదేశాన్ని వదిలి వెళ్లారు.
  • నీరవ్ మోదీ, ఆయన వ్యాపార భాగస్వామి మెహుల్ చోక్సీల భారతీయ పాస్‌పోర్టులను రద్దు చేయాలని సీబీఐ, ఈడీలు విదేశాంగ మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశాయి.
  • పీఎన్‌బీ తమ ఇద్దరు ఉద్యోగులపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేసింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)