పంజాబ్ నేషనల్ బ్యాంక్: స్వదేశీ ఉద్యమం సాక్షిగా మొదలు

లాలా లాజ్‌పత్ రాయ్

ఫొటో సోర్స్, pibindia

ఫొటో క్యాప్షన్,

లాలా లాజ్‌పత్ రాయ్

రోజురోజుకూ పంజాబ్ నేషనల్ బ్యాంకు షేర్లు పడిపోతున్నాయి. మరో పక్క ఆ బ్యాంకులో చోటు చేసుకున్న రూ.11,360కోట్ల రూపాయల కుంభకోణం తాలూకు వార్తలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడిలా వివాదాస్పదంగా మారిన ఆ బ్యాంకు 123ఏళ్ల క్రితం స్వాతంత్ర్య సమరయోధుల స్వదేశీ నినాదం మూలంగా ప్రారంభమైంది.

దాదాపు 7వేల శాఖలు, సుమారు 10వేల ఏటీఎంలు, 70వేలకు పైగా ఉద్యోగులతో ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా పీఎన్‌బీ నిలిచింది. కానీ 1894 మే 19న కేవలం 14మంది షేర్ హోల్డర్లు, ఏడుగురు అధికారులతో ఇది మొదలైంది.

భారత స్వాతంత్ర్య సమరయోధుల్లో ఒకరైన లాలా లాజ్‌పత్ రాయ్ ఆలోచనలే పీఎన్‌బీ స్థాపనకు బీజం వేశాయి.

బ్రిటిష్ సంస్థలను, వ్యాపారాలను నడిపించడానికి భారతీయుల డబ్బును ఉపయోగిస్తున్నారనే ఆలోచన లాజ్‌పత్ రాయ్‌ను కలవరపెట్టేది. పైగా ఆ సంస్థల ద్వారా అందే ఫలాలన్నీ ఆంగ్లేయులకే దక్కేవి తప్ప భారతీయులకు ఎలాంటి లాభం ఉండేది కాదు.

ఫొటో సోర్స్, Getty Images

ఆర్య సమాజానికి చెందిన రాయ్ బహదూర్ ముల్ రాజ్‌‌కు రాసిన ఓ లేఖలో లాజ్‌పత్ రాయ్ ఈ ఆలోచనను పంచుకున్నారు. రాయ్ బహదూర్ కూడా అప్పటికే భారతీయులకు ఓ స్వదేశీ బ్యాంకు కావాలనే ఆలోచనతో ఉండేవారు.

రాయ్ బహదూర్ సూచన మేరకు కొంత మంది ఎంపిక చేసిన మిత్రులకు లాజ్‌పత్ రాయ్ ఒక లేఖ రాశారు. దాన్ని అందుకున్న వారు కూడా సానుకూలంగా స్పందించారు. స్వదేశీ భారతీయ జాయింట్ బ్యాంకు స్థాపనకు అదే తొలి అడుగు.

వెంటనే చకచకా పనులు మొదలయ్యాయి. దాంతో భారతీయ కంపెనీ యాక్ట్ 1882 నియమ నిబంధనలకు అనుగుణంగా 19మే, 1894న పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రారంభమైంది.

మే 23న లాహోర్‌లోని పీఎన్‌బీ తొలి అధ్యక్షుడు సర్దార్ దయాల్ సింగ్ మజీతియా ఇంట్లో బ్యాంకు వ్యవస్థాపకులు సమావేశం నిర్వహించారు. అక్కడే బ్యాంకును ముందుకు తీసుకెళ్లడానికి అనువైన కార్యాచరణ రూపొందించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

హాలీవుడ్ నటీమణులతో నీరవ్ మోదీ - పీఎన్‌బీ కుంభకోణం నిందితుడు

లాహోర్‌లోని ప్రఖ్యాత అనార్కలీ బజార్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని బ్యాంకు కార్యాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.

1895, ఏప్రిల్ 12న పంజాబీల ప్రముఖ పండగ బైసాఖీకి సరిగ్గా ఒక్క రోజు ముందు లాహోర్‌లో పీఎన్‌బీ కార్యకలాపాలు మొదలయ్యాయి.

తొలి రోజుల్లో లాలా లాజ్‌పత్ రాయ్, దయాల్ సింగ్ మజీతియా, లాలా హర్‌కిషన్ లాల్, లాలా లాల్ చంద్, కాలీ ప్రొసన్నా, ప్రభు దయాల్, లాలా డోల్నా దాస్‌లు బ్యాంకు నిర్వహణ బాధ్యతలు చూసుకునేవారు.

అలా ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చిన బ్యాంకు ప్రతిష్ట, ప్రస్తుతం వెలుగు చూసిన భారీ కుంభకోణంతో మసకబారింది. గత మూడ్రోజులుగా దాన్ని షేర్ల విలువ పడిపోతూ వస్తోంది.

ఈ కుంభకోణం ప్రభావం బ్యాంకుపై ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)